Mental disabilities
-
అవగాహనే ప్రధానం
ఏడీహెచ్‌డీ, సెరిబ్రల్ పాల్సీ, ఇతర మనోవైకల్యాలు ఉన్న పిల్లల మానసిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు హైదరాబాద్ వాసి ఫరీదా రాజ్.స్పెషల్ చిల్డ్రన్కు శిక్షణ ఎలా ఇవ్వాలనే అంశాల మీద టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సెంటర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, టీచర్ ట్రైనర్, రెమెడియల్ ఎడ్యుకేటర్, రైటర్ అయిన ఫరీదా రాజ్ తన రచనల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా ప్రజలలో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పిల్లల్లో వచ్చే డిస్లెక్సియాపై పుస్తకాలు రాసిన ఫరీదా రాజ్ ఇటీవల ‘అన్బ్రేకబుల్ స్పిరిట్ – నావిగేటింగ్ లైఫ్ విత్ ఎమ్మెస్ పేరుతో మల్టిపుల్ స్కెర్లోసిస్పై పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది భారతదేశంలో వైద్య లేదా వైద్యేతర వ్యక్తి రాసిన మొట్టమొదటి పుస్తకంగా పేరొందింది. సరైన రోగ నిర్ధారణ, సకాలంలో చికిత్స, సంరక్షణ, కుటుంబ మద్దతుతో వ్యక్తులు సుదీర్ఘమైన, చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాలను గడపవచ్చని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా చెబుతారు ఆమె. ‘‘ఇటీవల చాలా కుటుంబాల్లో తెలియని అలజడిని సృష్టిస్తున్న సమస్య మల్టిపుల్ స్కెర్లోసిస్. దీనిని ఒక జబ్బుగా కాకుండా అవగాహనతో సరిదిద్దాల్సిన అంశంగా గుర్తించాలి. సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిని నేరుగా కలిసి, వారి వేదనను, చికిత్సా విధానాలను ఇందులో పొందుపరించాను. స్పెషల్ కిడ్స్ సామర్థ్యాలకు.. నేను స్కూల్ టీచర్‌గా ఉన్న మొదటి రోజులవి. ట్రైనింగ్ పీరియడ్. క్లాస్‌రూమ్‌లో ఉన్నప్పుడు మొదటి రోజే అక్కడి ఓ సంఘటన నన్ను అమితంగా కదిలించింది. ముగ్గురు, నలుగురు పిల్లలు టీచర్ చెబుతున్న విషయంపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. వారిలో అసహనం స్థాయులు దాటడాన్ని, టీచర్ సహనం కోల్పోవడాన్నీ గమనించాను. ఎదిగే వయసు పిల్లల్లో సహజంగానే చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ సమస్య యువతలో మరింత ఎక్కువగా ఉండటాన్ని చూస్తుంటాం. వారిలో ఆందోళన కూడా ఒకింత ఎక్కువే. ఇలాంటప్పుడు వారికి మెంటల్ వెల్బీయింగ్ అవసరం. ఇక మానసిక వైకల్యాలు ఉన్న పిల్లల్లోనైతే అందరికీ వీరి పట్ల నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఇలాంటి పిల్లలను చూసుకునేవారికి సరైన గైడెన్స్ ఉండటం లేదని ఆ రోజే అనిపించింది. మనోవైకల్యాలు ఉన్న పిల్లల్లో సామర్థ్యాలను వెలికితీయడానికి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రతిరోజూ కృషి చేయాల్సి ఉంటుంది. అభ్యాసంలో వారిని నిమగ్నం చేయడానికి కొత్త కొత్త మార్గాలను కనుక్కోవాలి. దానిపైనే కృషి చేయాలనుకున్నాను. ఆ తర్వాత అందుకు తగిన పరిష్కారాలనూ కనుక్కున్నాను. వందల మంది టీచర్లకు శిక్షణ స్పెషల్ చిల్డ్రన్కు ఎలాంటి శిక్షణ అవసరమో, అందుకు టీచర్ల నైపుణ్యత ఎలా ఉండాలనే దానిపై రెగ్యులర్ సెషన్స్ నిర్వహించాను. ఇది రాష్ట్రస్థాయిలో మంచి మార్పులు తీసుకువచ్చింది. ఉపాధ్యాయులు, నేర్చుకునే ఇబ్బందులు ఉన్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఒక హ్యాండ్–బుక్ తీసుకువచ్చాను. జన్యులోపాలపై అవగాహన ముంబైలో పుట్టి పెరిగిన నేను, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కి వెళుతున్న తొలినాళ్లలో ఒక రోజు, మానసిక వికలాంగురాలైన పాపతో ఉన్న ఒక మహిళను అక్కడ చూశాను. ఆమెతో మాటలు కలిపితే ఆ పాప ఆమెకు ఏడవ సంతానం అని తెలిసింది. ఆమె ఇతర పిల్లలందరికీ కూడా అదే సమస్య ఉంది. జన్యుపరమైన లోపాల వల్ల పిల్లలకు అలాంటి సమస్య వచ్చిందని ఆ మహిళకు తెలియదు. ఆ విషయం తెలియక జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం ఆమె ఎప్పుడూ వెళ్లలేదని తెలుసుకున్నాను. దీంతో ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇలాంటి మహిళలకు అవగాహన కల్పించాలని. అప్పటి నుంచి మహిళలకు జన్యుపరమైన కౌన్సెలింగ్స్ చేస్తూ ఉండేదాన్ని. ఈ అంశంపై ఉర్దూ పత్రికతో పాటు జాతీయ స్థాయి పత్రికలలోనూ వీటికి సంబంధించిన కథనాలపై వ్యాసాలు ఇచ్చాను. ఒక్కో అడుగు.. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేయడం నుంచి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకునే వరకు చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు ఎన్నో. క్యాన్సర్ పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఆంకాలజిస్టులచే కార్యక్రమాల నిర్వహణ నన్ను ఎంతోమందికి చేరువ చేసింది. మల్టిపుల్ స్కెర్లోసిస్తో బాధపడుతున్న వ్యక్తులను చూసినప్పుడు ప్రజలకు ఈ విషయం పట్ల అవగాహన లేదని అర్థ్ధమైంది. దీంతో సమస్యను ఎదుర్కొంటున్నవారిని కలిసి, కదిలించే కథనాలను పాఠకుల ముందుకు తీసుకువచ్చాను’’ అని వివరించే ఫరీదా రాజ్ మల్టిపుల్ స్కెర్లోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్‌కి కార్యనిర్వాహక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. లాభాపేక్ష లేని ఈ సంస్థ ద్వారా మల్టిపుల్ స్కెర్లోసిస్ బారిన పడిన వ్యక్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
Alina Alam: అద్భుతదీపం
దొరికితే అద్భుతాలు సృష్టించవచ్చు. అది కథల్లో తప్ప బయట దొరకదని మనకు తెలుసు! అయితే అలీన అలమ్‌కు ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ రూపంలో అద్భుతదీపం దొరికింది. ఆ అద్భుతదీపంతో వ్యాపారంలో ఓనమాలు తెలియని అలీన సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది. నిస్సహాయత తప్ప ఏమీ లేని వారికి అండగా ఉండి ముందుకు నడిపిస్తోంది... అలీన అద్భుతదీపం కోల్‌కత్తాకు చెందిన అలీన అలమ్‌కు హైస్కూల్ రోజుల్లో బాగా నచ్చిన మాట... పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్. రోడ్డు దాటుతున్న వృద్ధురాలికి సహాయపడినప్పుడు, ఆకలి తో అలమటిస్తూ దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తికి తన పాకెట్‌మనీతో కడుపు నిండా భోజనం పెట్టించినప్పుడు, పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టలేక సతమతమవుతున్న ఆటోడ్రైవరుకు తన వంతుగా సహాయం చేసినప్పుడు.. ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ అనేది తన అనుభవంలోకి వచ్చింది. ‘ఒక మంచి పని చేస్తే అది ఊరకే పోదు. సానుకూల శక్తిగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది’ అనే మాట ఎంత నిజమో తెలిసి వచ్చింది. అలీన తల్లి గృహిణి. తండ్రి ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. ‘డబ్బే ప్రధానం’ అనే ధోరణిలో వారు పిల్లల్ని పెంచలేదు. బెంగళూరులోని అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో మాస్టర్స్ చేసింది అలమ్. అక్కడ చదుకునే రోజుల్లో ఎన్నో డాక్యుమెంటరీలను చూసింది. తన ఆలోచనలు విశాలం కావడానికి, కొత్తగా ఆలోచించడానికి, కొత్తమార్గాన్ని అన్వేషించడానికి అవి కారణం అయ్యాయి. ‘రోమన్ చక్రవర్తి నీరోపై తీసిన ఒక డాక్యుమెంటరీ చూసి చలించిపోయాను. యుద్ధఖైదీల పట్ల అతడు క్రూరంగా వ్యవహరిస్తాడు. అయితే ఆ క్రూరత్వం అనేది ఆ చక్రవర్తికి మాత్రమే పరిమితమై లేదు. అతడితో అంతం కాలేదు. రకరకాల రూపాల్లో అది కొనసాగుతూనే ఉంది. క్రూరత్వంపై మానవత్వం విజయం సాధించాలి’ అంటుంది అలీన. 23 సంవత్సరాల వయసులో ‘మిట్టీ’ పేరుతో కేఫ్ ప్రారంభించింది అలీన.‘ఏదైనా మంచి ఉద్యోగం చేయకుండా ఇదెందుకమ్మా’ అని తల్లిదండ్రులు నిట్టూర్చలేదు. ఆశీర్వదించారు తప్ప అభ్యంతర పెట్టలేదు. ఇది లాభాల కోసం ఏర్పాటు చేసిన కేఫ్ కాదు. మానసిక వికలాంగులు, దివ్యాంగులకు ధైర్యం ఇచ్చే కేఫ్. ‘మిట్టీ’ అనే పేరును ఎంచుకోవడానికి కారణం అలమ్ మాటల్లో... ‘మనం ఈ నేల మీదే పుట్టాం. చనిపోయిన తరువాత ఈ నేలలోనే కలుస్తాం. నేలకు ప్రతి ఒక్కరూ సమానమే’ నిజానికి ‘మిట్టీ’ మొదలు పెట్టడానికి ముందు తన దగ్గర పెద్దగా డబ్బులు లేవు. దీంతో ఒక ఆలోచన చేసింది. ‘దివ్యాంగులకు మిట్టీ కేఫ్ ద్వారా సహాయ పడాలనుకుంటున్నాను. నాకు అండగా నిలవండి’ అంటూ కరపత్రాలు అచ్చువేసి కర్నాటకలోని కొన్ని పట్టణాల్లో పంచింది. అయితే పెద్దగా స్పందన లభించలేదు. ఒక అమ్మాయి మాత్రం అలీనకు సహాయం గా నిలవడానికి ముందుకు వచ్చింది. ‘ఒక్కరేనా! అనుకోలేదు. ఈ ఒక్కరు చాలు అనుకొని ప్రయాణం మొదలుపెట్టాను’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది అలీన. కొందరు ఆత్మీయుల ఆర్థిక సహకారంతో హుబ్లీ(కర్నాటక)లోని బీవిబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాం్యపస్లో ‘మిట్టీ’ తొలి బ్రాంచ్ ప్రారంభించింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. నాలుగు సంవత్సరాలలో బెంగళూరు, కర్నాటకాలలో 17 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ధైర్యం ఇచ్చి, తగిన శిక్షణ ఇచ్చి ఈ కేఫ్‌లలో ఉపాధి కల్పించడం ప్రారంభించింది అలీన. ‘మిట్టీ’ సక్సెస్ఫుల్ కేఫ్గానే కాదు దివ్యాంగుల హక్కులకు సంబంధించి అవగాహన కేంద్రంగా కూడా ఎదిగింది. ‘మిట్టీ కేఫ్‌లోకి అడుగుపెడితే చాలు చెప్పలేనంత ధైర్యం వస్తుంది’ అంటుంది కోల్‌కతాకు చెందిన 22 సంవత్సరాల కీర్తి. దివ్యాంగురాలిగా కీర్తి అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. అయితే మిట్టీ కేఫ్ తనలో ఎంతో ధైర్యాన్ని నింపింది. ఇలాంటి ‘కీర్తి’లు ఎంతో మందికి అండగా నిలుస్తోంది మిట్టీ కేఫ్. -
Mental Health: ఒత్తిడిని అణిచేస్తే... అంతే సంగతులు! జర భద్రం..
కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాల మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఊహించని మార్పులు తీసుకొచ్చింది. వేడుకలు దూరమయ్యాయి. ఇల్లే ఆఫీసయ్యింది. సినిమాలు .. షికార్లు లేవు. జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంటి కే పరిమితం కావడం.. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం వంటి సంఘటనలతో ఒత్తిడి, ఆందోళన పెరిగాయి. మన ఎమోషన్స్‌ని కావాలని అణచి వేసే పరిస్థితులన్నిటినీ ఎదుర్కొన్నాం. అయితే ఇలా ఫీలింగ్స్‌ని అణ చుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అవసరానికి తగ్గట్లు ప్రస్తుతం మన భావాల్ని అణచివేసుకుంటూ పోతే భవిష్యత్తులో అది మన మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫీలింగ్స్ ని అణ చి వేసుకోవడం వల్ల మైగ్రేన్, హై బీపీ వంటి అనారోగ్యాల బారిన పడతామని, ఈ క్రమంలో డ్రగ్స్, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు బానిసవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక దగ్గరి వాళ్లతో మన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడం.. లేదంటే ఓ పేపర్ మీద రాసుకుని.. ఆ పరిస్థితుల గురించి మనమే విశ్లేషించుకోవడం మేలంటున్నారు నిపుణులు. ఇవేవి కాదంటే థెరపిస్ట్‌ని కలవమని సూచిస్తున్నారు. భరించడం కన్నా... సగం అనారోగ్యాలకి మూల కారణం ఒత్తిడికి గురవడం. ఆందోళనని బయటకు వెల్లడించడం మంచిది. ఇక మన బుర్రలో నడిచే విషయాల గురించి పట్టించుకోకపోతే.. వాటిని విశ్లేషించి ఓ కొలిక్కి రాకపోతే.. ఒత్తిడి పీక్స్‌కి వెళ్తుంది. దాంతో మన మెదడు కార్టిసాల్ అనే ఒక హార్మోన్‌ను విడుదల చేస్తుంది. కార్టిసాల్ అనేది మన జీవక్రియ రోగనిరోధక ప్రతిస్పందనతో సహా విస్తృతమైన ప్రక్రియలను నియంత్రిస్తుంది. ఇది ఎక్కువ మొత్తంలో విడుదల అయితే.. మెదడు పని తీరు కుంటు పడుతుంది. దాంతో రోజువారి జీవన విధానం దెబ్బ తింటుంది. కనుక ఒత్తిడి పెరిగినప్పుడు బ్రేక్ తీసుకోవడం, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవడంతోపాటు మనసుకు నచ్చే పనులు చేయడం మంచిదంటున్నారు మానసిక నిపుణులు. చదవండి: బ్లాక్ పెప్పర్ వాటర్ ప్రతి ఉదయం తాగారంటే.. నెలరోజుల్లోనే.. -
‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా.. డిప్రెషన్‌తో పాటు..
భారతీయుల జీవనశైలిలో తులసి కూడా ఒక భాగమే. ఆయుర్వేద సుగుణాల పుట్ట తులసి. అందుకే తులసిని ‘క్వీన్ ఆఫ్ హెర్బ్స్’ అని కూడా అంటారు. దీనిలో ‘ఎ, సి’ విటమిన్లు, కాల్షియం, ఐరన్, క్లోరోఫిల్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంతవరకు తులసి శారీరక ఆరోగ్యానికి మేలుచేసే ఔషధంగా మాత్రమే మనందరికీ తెలుసు. మునుపెన్నడూ ఎరుకలోలేని మరొక రహస్యం తులసిలో దాగుంది. అదేంటంటే.. మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచే అడాప్టోజెన్ను తులసి కలిగి ఉంటుందని మీకు తెలుసా! అంతేకాకుండా మెంటల్ హెల్త్‌కు ఉపకరిస్తుందని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి. నమ్మబుద్ధి కావడం లేదా? ఈ కింది పరిశోధనలే అందుకు సాక్షాలు!! మనరోజువారీ జీవనవిధానంలో రకరకాల ఒత్తిడులకు గురౌతుంటాము. శారీరకంగా, ఎమోషనల్‌గా, కెమికల్ ఇలా ఎన్నో. ది క్లినికల్ ఎఫికెసి అండ్ సేఫ్టీ ఆఫ్ తులసి ఇన్ హ్యూమన్స్ పేర విడుదలైన అధ్యయన నివేదిక ప్రకారం పర్యావరణం కారణంగా ఒత్తిడులకు గురైనప్పుడు తులసి సహనాన్ని పెంచడానికి సహాయపడుతుందని వెల్లడించింది. నిద్ర, మతిమరుపు, లైంగిక సంబంధిత సమస్యలకు కూడా దివ్యౌషధంగా పనిచేస్తుందని నివేదికలో తెల్పింది. యాంటీడిప్రెషన్, యాంటీ యాంగ్జైటీ కారకాలు కూడా.. అంతేకాకుండా ది జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రకారం తులసిలో యాంటీడిప్రెషన్, యాంటీ యాంగ్జైటీ కారకాలు ఉంటాయని పేర్కొంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ 5 వందల మిల్లీ గ్రాముల తులసి ఆకుల రసాన్ని తాగినవారిలో యాంగ్జైటీ (వ్యాకులత), ఒత్తిడి గణనీయంగా తగ్గినట్టు తేలింది. న్యూరో కాగ్నిటివ్ ప్రభావాలను.. పీర్-రివ్యూడ్ జర్నల్ 2017లో ప్రచురించిన ఎవిడెన్స్-బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. మానసిక స్థితిని మెరుగుపరిచే న్యూరో కాగ్నిటివ్ ప్రభావాలను తులసి చూపగలుగుతుంది. తులసి టీ యోగా మాదిరి.. అంతేకాకుండా తులసి టీలో కెఫిన్ ఉండదు కాబట్టి ప్రతిరోజూ దీనిని తాగడం వల్ల యోగా మాదిరి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచగలుగుతుందని కొన్ని అధ్యనాలు తేల్చాయి. కార్టిసాల్ హార్మోన్ల నిర్వహణ మన శరీరంలో ప్రతి ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కార్టిసాల్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. అందువల్లనే మామూలుగా నిద్రలేవగలుగుతున్నాం. కార్టిసాల్ ను స్ట్రెస్ హార్మోన్ అనికూడా అంటారు. ఎప్పుడైతే అధిక ఒత్తిడికి గురౌతారో మీ శరీరంలో ఇది ముందుగానే విడుదలవుతుంది. ఇది అధికమోతాదులో విడుదలైతే నిద్ర లేమి సమస్యలు తలెత్తుతాయి. తులసి మన శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగుమోతాదులో విడుదలయ్యేలా చేస్తుంది. తద్వారా మీరు రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు. చదవండి: Home Remedies: వాంతికి వచ్చినట్లు ఉందా? వీటిని తిన్నారంటే వెంటనే.. -
షెల్టర్ హోంలో ఇద్దరు మహిళల మృతి
పట్నా: బిహార్ రాజధాని పట్నాలోని ఓ మానసిక వికలాంగుల కేంద్రంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. నేపాలినగర్లోని ‘ఆసరా’ అనే షెల్టర్‌హోంలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వం వేర్వేరు కారణాలు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. 17, 40 ఏళ్లున్న ఇద్దరు మహిళలను ఆగస్టు 10 అర్ధరాత్రి దాటిన తరువాత ఆసుపత్రి తీసుకెళ్లగా, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంగతిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైన షెల్టర్ హోం, ఆసుపత్రి వర్గాలపై పట్నా ఐజీ ఎన్‌హెచ్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, వారికి చికిత్స జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలోనే చనిపోయారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. ఆ హోం లో వారిని పారిపోవాలంటూ బహుమతులు ఆశచూపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన తరువాతి రోజే ఇద్దరు మృతిచెందారు. -
ఘోరం: కవల పిల్లల్ని చంపి ఆపై కారులో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఇద్దరి మానసిక దివ్యాంగులను మేనమామే హత్యచేశాడు. ఇద్దరు కూడా 12 ఏళ్లలోపు కవలలు కావడం గమనార్హం. ఈ ఘటన చైతన్యపురి పోలీసు పరిధిలోని సత్యనారాయణపురం జరిగింది. మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సృజన(12), విష్ణువర్దన్ రెడ్డి(12)లుగా గుర్తించారు. మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస రెడ్డి, లక్ష్మీ దంపతుల పిల్లలుగా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం లక్ష్మీ తమ్ముడు మల్లికార్జున రెడ్డి మిర్యాలగూడకు వెళ్లారు. పిల్లలకు స్విమింగ్ నేర్పిస్తా అని చెప్పి ఆ కలలను తన కారులో హైదరాబాద్‌లోని సత్యనారయణపురంలో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లొకి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి పిల్లలిద్దరిని గొంతు నులిపి చంపేశారు. అనంతరం మరో ఇద్దరితో కలిసి మృత దేహాలను కారులో తరలించడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చి ఇంటి యజమాని బయటకు వచ్చి చూడగా కారులో మృతదేహాలు కనిపించాయి. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారితో చెప్పి వారిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులను చైతన్యపురి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా పిల్లల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులకు తెలిసే ఈ హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
పశ్చిమగోదావరి జిల్లా : టి. నర్సాపురం మండలం జగ్గవరంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మాససిక వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన కుమ్మరి రమేష్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బాధితురాలి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు టి.నరసాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమ్మరి రమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
వర్ధన్నపేట టౌన్ : మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు మానసిక రుగ్మతతో ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆతహత్య చేసుకున్న సంఘటన శనివారం జరిగిది. ఎస్సై రవిరాజు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఆలకుంట రాకేష్(18) గత కొంత కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. తన కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని ఉదయం తెలుపగా స్థానికంగా వైద్యుడికి చూపించి మందులు ఇప్పించారు. వారు వ్యవసాయ పనులకు వెళ్లగా శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని రాకేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఎల్లస్వామి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవిరాజు తెలిపారు. -
ఆపన్నులకు.. అమృతమూర్తి
* దివ్యాంగుల పాలిట దైవం గాయత్రి * మానసిక వికలాంగుల సేవే ఆమె లోకం పలమనేరు రూరల్: ఇంట్లో ఇద్దరు పిల్లలను చూసుకోవడం తల్లికి కష్టమైన రోజులివి. అలాంటిది 73 మంది పిల్లలను చూసుకుంటూ వారితో మమేమకైపోయిన తల్లి కాని తల్లి ఆమె. కుటుంబాన్ని వదలి మానసిక వికలాంగుల కోసం 16 ఏళ్లుగా అవిశ్రాం తం గా కృషిచేస్తోంది. వారికి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలు చేరేందుకు సాయపడుతోంది ఆ తల్లికానీ తల్లి. ఆమే పలమనేరు పట్టణంలోని రిమ్మర్స్ బుద్ధిమాంద్యం పాఠశాల ప్రిన్సిపాల్ గాయత్రి. బుద్ధిమాంద్యం పిల్లలే ఆమెకు ప్రపంచం.. బెరైడ్డిపల్లె మండలం నెల్లిపట్లకు చెందిన గాయత్రి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గతంలో టీచర్‌గా పనిచేస్తుండేది. స్కూల్ అయిపోగానే అందరూ టీచర్లు ఇళ్లకు వె ళ్లిపోయినా ఈమె మాత్రం వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు చెప్పేది. సామాజిక సేవను నర నరానా జీర్ణించుకున్న గాయత్రి ఈ క్రమంలో ఆమె 1999లో డాక్టర్ సుధాకర్ నడు పుతున్న రూరల్ ఇండియా మెడికల్ అండ్ రిలీఫ్ సొసైటీ( రిమ్మర్స్) అనే స్వచ్ఛంద సంస్థలో చేరింది. ఇందులో భాగం గా గ్రామాల్లోకి వెళ్లి పేద రోగులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించే క్యాంపులను చేపట్టేది. తర్వాత బుద్ధిమాంద్యం పిల్లల కోసం నిర్వహించిన సర్వే నిమిత్తం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కర్ణాటకకు చెందిన శాంతి అనే సిస్టర్ను స్ఫూర్తిగా తీసుకుని పూర్తిగా సమాజసేవకు అంకితమయ్యారు. ఇదిలా ఉండగా 2014లో ఈమె భర్త నటరాజరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈమెకు పిల్లలు లేరు. దీంతో దివ్యాంగులనే తన పిల్లలుగా భావించి సేవ చేస్తోంది. ఐదుగురితో మొదలై... పలమనేరులోని పెంకుల మిషన్ సమీపంలో ఓ అద్దె భవనంలో రిమ్మర్స్ సంస్థ నడుస్తోంది. 1999లో ఐదుగురు పిల్లతో మొదలైన వీరి సేవలు ప్రస్తుతం 73 మంది పిల్లలకు అందుతున్నాయి. ఇక్కడ మానసిక వికలాంగులు(ఎంఆర్) పక్షవాతంతో మతిస్థిమితం కోల్పోయిన పిల్లలు(సెలి బిరల్ పాలసీ) వికలాంగులు(పీహెచ్సీ) తదితర 14 సంవత్సరాలలోపు పిల్లలున్నారు. వీరికి ఉదయం లేచింది మొదలు పడుకునేదాక అన్ని పనులు ఇక్కడి సిబ్బందే చూస్తారు. పిల్లలకు హాస్టల్ ఉంది. ఇక్కడ పలు రకాల వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. పలువురు విద్యార్థులు ఎన్ఐవోసీలో టెన్త్ పాసయ్యారు. ఇప్పటి వరకు 50 మంది కి ఈ సంస్థ కొత్తజీవితం ఇచ్చింది. ఇక్కడున్నవారంతా నా పిల్లలే.. 16 ఏళ్లుగా ఈ పిల్లలను నా బిడ్డలుగానే చూసుకుంటున్నా, వారంతా అమ్మా అని పిలుస్తుంటే అంతకు మించిన ఆనందమేముంటుంది. ఈ పిల్లల కోసం త్వరలో నా సొంత డబ్బుతో ఓ టైలరింగ్ సెంటర్‌ను పెట్టాలి. అలాగే సొంత భవనం ఏర్పాటు చేసుకోవాలి. దీంతోపాటు ఓల్డేజ్ హోమ్ ను పెట్టాలనే ఆలోచన ఉంది. సమాజంలో వీరు స్వశక్తితో బతకగలగాలన్నదే నా లక్ష్యం. నా లక్ష్యానికి దాతలు సహకరిస్తే బాగుంటుంది. - గాయత్రి, ప్రిన్సిపాల్, రిమ్మర్స్ బుద్ధిమాంద్యం పాఠశాల, పలమనేరు -
మానవత్వం చెంతన.. మనోచేతన
110 మంది మానసిక వికలాంగులకు బాసట యోగా, కుట్లు, అల్లికల్లో శిక్షణ చుక్కా వెంకటేశ్వర్లు సేవానిరతి నేడు ప్రపంచ బుద్ధిమాంద్యం దినం జనగామ : అందరిలా నడవలేరు.. ఎదుటివారితో స్పష్టంగా మాట్లాడలేరు.. తమ అవసరాలను తా ము తీర్చుకోలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు మానసిక వికలాంగులు. ఇటువంటి వా రికి సాయం చేయూలనే దయూర్ద హృదయం చుక్కా వెంకటేశ్వర్లుది. ‘ప్రార్థించేపెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అంటారు పెద్దలు. దీన్ని అక్షరా లా నిజంచేసి చూపారాయన. చేర్యాలలో ‘మనో చేతన’ మానసిక వికలాంగుల పునరావాస కేంద్రా న్ని నెలకొల్పి బుద్ధిమాంద్యం కలిగిన బాలలకు చేదోడుగా నిలుస్తున్న యువ కెరటంపై ‘నేటి ప్రపం చ బుద్ధి మాంద్యం దినం’ సందర్భంగా కథనమిది. 1998 సంవత్సరానికి ముందువరకు చుక్కా వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వికలాంగుల సంక్షేమ విభాగంలో స్పెషల్ ఎడ్యుకేటర్ పర్సన్ పనిచేసేవారు. పరిమిత పరిధి కలిగిన ఉద్యోగ జీవితం కంటే.. పది మందికి సాయం చేసి, దీవెనలు పొందే అవకాశాన్ని కల్పించే సమాజ సేవ మేలని భావించేవారు వెంకటేశ్వర్లు. అనుకున్నదే తడవుగా కష్టపడి చదివి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం తన స్వస్థలమైన చేర్యాలకు చేరుకొని 1998లో ‘మనో చేతన’ పేరుతో మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నెలకొల్పారు. మానసిక అనారోగ్యంతో దీనస్థితిలో ఉన్న బాల,బాలికలను చేరదీసి, లాభాపేక్ష లేకుండా ఎంతో ఓపికతో సేవలు అందించారు. అమ్మలా లాలన.. నాన్నలా ప్రేమను పంచారు. ఈ ఏడాది(2016)తో ‘మనో చేతన’ సంస్థ 18వ పడిలోకి విజయవంతంగా అడుగుపెడుతోంది. ప్రస్తుతం 110 మంది మానసిక వికలాంగులు ఇందులో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. యోగాలోనూ బాలలకు శిక్షణ అందిస్తుండటం గమనార్హం. ఆసక్తి ఉన్నవారికి కుట్లు, అల్లికల్లోనూ శిక్షణ అందిస్తున్నారు. క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు వెంకటేశ్వర్లు. ఈ సేవలకుగానూ రాష్ట్ర, జాతీయ స్థారుు అవార్డులు ఆయనను వరించారుు. డౌన్ సిండ్రోమ్ లక్షణాలివీ.. బుద్ధిమాంద్యాన్ని ఆంగ్లంలో డౌన్ సిండ్రోమ్ అంటారు. ఈ అనారోగ్య సమస్యను కలిగిన పిల్లలు భౌతికంగా మంగోలియన్ జాతి లక్షణాలను కలిగి ఉంటారు. ప్రతి సంవత్సరం జన్మించే వందలాది మంది శిశువుల్లో ఒక్కరిద్దరే ఇటువంటి సమస్యను కలిగి ఉండే అవకాశాలు ఉన్నారుు. ఇది జన్యు సంబంధమైన అసాధారణ అనారోగ్య పరిస్థితే కానీ వంశపారంపర్యంగా వచ్చేది మాత్రం కాదు. మనోచేతన పునరావాస కేంద్రంలో వారికి యోగా నేర్పిస్తున్నారు. కుట్లు, అల్లికల్లోనూ బాలలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇతరులకు సాయం చేయడంలోనే సంతోషం మానసిక వికలాంగులకు అండగా ఉండాలనే నా లక్ష్యాన్ని ‘మనోచేతన’ స్థాపించడం ద్వారా నెరవేర్చుకున్నా. తాము ఏం చేస్తున్నామో తమకే తెలియని స్థితిలో ఉన్న బుద్ధిమాంద్యం కలిగిన బాలలకు సాయం చేయడంలో ఉన్న సంతోషం నాకు ఎక్కడా కనిపించలేదు. వారికి మానసిక స్థితిని వృద్ధిపర్చే బాధ్యత మా కేంద్రానిదే. పాటల పోటీలు నిర్వహించడం, యోగా శిక్షణ అందించడం, కుట్లు, అల్లికలు నేర్పడం ద్వారా వారిని చైతన్యపరుస్తున్నాం. భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందేందుకు ఇవి వారికి ఎంతో ఉపయోగపడతారుు. - చుక్కా వెంకటేశ్వర్లు, మనోచేతన నిర్వాహకుడు -
స్పందించిన ‘ఈ తరం’ స్వచ్ఛంద సంస్థ
సిద్దిపేట అర్బన్: భర్త చనిపోయిన ఓ మహిళ మానసిక వికలాంగులైన ఇద్దరు పిల్లలను పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలుసుకున్న ‘ఈ తరం’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్పందించారు. బంధువులంతా దూరం కావడంతో ఆసరా కరువైన బాల్‌లక్ష్మి అనే అభాగ్యురాలు తన ఇద్దరు కుమారులు మహేందర్, కుమార్‌తో పడుతున్న వ్యథపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘కష్టాలే తోడు నీడ’ శీర్షికన వెలువడిన కథనంపై ‘ఈ తరం’ సేవా సంస్థ ప్రతినిధులు స్పందించారు. విద్యార్థులను మానసికంగా ధృడంగా చేసే కార్యక్రమాలను చేపడుతూ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు కృషి చేస్తున్న సిద్దిపేటకు చెందిన ‘ఈ తరం’ స్వచ్ఛంద సేవా సంస్థ ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. సిద్దిపేట పట్టణంలో అభయజ్యోతి మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం నిర్వాహకులు జోజి సహకారంతో టూటౌన్ సీఐ సైదులు చేతుల మీదుగా ఆ కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకులను, క్వింటాల్ బియ్యాన్ని అందించారు. ఇకపై కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని, పిల్లల్ని ఎక్కడైనా చేర్పించి కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఐ సైదులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న బాల్‌లక్ష్మి కుటుంబం గురించి సాక్షి దినపత్రిక వెలుగులోకి తేవడం అభినందనీయమన్నారు. ఇలాంటి కథనాలను మరిన్ని వెలికి తీసి మానవతా వాదులకు తెలియజేస్తే దాతల సహకారంతో ఆయా కుటుంబాలకు కొంతైనా మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తోర్నాల గ్రామ సర్పంచ్ పరమేశ్వర్‌గౌడ్, ఈ తరం సేవా సంస్థ అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి నాగరాజు, గౌరవ అధ్యక్షుడు వీవీ కన్న, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, సభ్యులు శేఖర్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.