ఆపన్నులకు.. అమృతమూర్తి
* దివ్యాంగుల పాలిట దైవం గాయత్రి
* మానసిక వికలాంగుల సేవే ఆమె లోకం
పలమనేరు రూరల్: ఇంట్లో ఇద్దరు పిల్లలను చూసుకోవడం తల్లికి కష్టమైన రోజులివి. అలాంటిది 73 మంది పిల్లలను చూసుకుంటూ వారితో మమేమకైపోయిన తల్లి కాని తల్లి ఆమె. కుటుంబాన్ని వదలి మానసిక వికలాంగుల కోసం 16 ఏళ్లుగా అవిశ్రాం తం గా కృషిచేస్తోంది. వారికి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలు చేరేందుకు సాయపడుతోంది ఆ తల్లికానీ తల్లి. ఆమే పలమనేరు పట్టణంలోని రిమ్మర్స్ బుద్ధిమాంద్యం పాఠశాల ప్రిన్సిపాల్ గాయత్రి.
బుద్ధిమాంద్యం పిల్లలే ఆమెకు ప్రపంచం..
బెరైడ్డిపల్లె మండలం నెల్లిపట్లకు చెందిన గాయత్రి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గతంలో టీచర్‌గా పనిచేస్తుండేది. స్కూల్ అయిపోగానే అందరూ టీచర్లు ఇళ్లకు వె ళ్లిపోయినా ఈమె మాత్రం వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు చెప్పేది. సామాజిక సేవను నర నరానా జీర్ణించుకున్న గాయత్రి ఈ క్రమంలో ఆమె 1999లో డాక్టర్ సుధాకర్ నడు పుతున్న రూరల్ ఇండియా మెడికల్ అండ్ రిలీఫ్ సొసైటీ( రిమ్మర్స్) అనే స్వచ్ఛంద సంస్థలో చేరింది.
ఇందులో భాగం గా గ్రామాల్లోకి వెళ్లి పేద రోగులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించే క్యాంపులను చేపట్టేది. తర్వాత బుద్ధిమాంద్యం పిల్లల కోసం నిర్వహించిన సర్వే నిమిత్తం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కర్ణాటకకు చెందిన శాంతి అనే సిస్టర్‌ను స్ఫూర్తిగా తీసుకుని పూర్తిగా సమాజసేవకు అంకితమయ్యారు. ఇదిలా ఉండగా 2014లో ఈమె భర్త నటరాజరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈమెకు పిల్లలు లేరు. దీంతో దివ్యాంగులనే తన పిల్లలుగా భావించి సేవ చేస్తోంది.
ఐదుగురితో మొదలై...
పలమనేరులోని పెంకుల మిషన్ సమీపంలో ఓ అద్దె భవనంలో రిమ్మర్స్ సంస్థ నడుస్తోంది. 1999లో ఐదుగురు పిల్లతో మొదలైన వీరి సేవలు ప్రస్తుతం 73 మంది పిల్లలకు అందుతున్నాయి. ఇక్కడ మానసిక వికలాంగులు(ఎంఆర్) పక్షవాతంతో మతిస్థిమితం కోల్పోయిన పిల్లలు(సెలి బిరల్ పాలసీ) వికలాంగులు(పీహెచ్‌సీ) తదితర 14 సంవత్సరాలలోపు పిల్లలున్నారు. వీరికి ఉదయం లేచింది మొదలు పడుకునేదాక అన్ని పనులు ఇక్కడి సిబ్బందే చూస్తారు. పిల్లలకు హాస్టల్ ఉంది. ఇక్కడ పలు రకాల వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. పలువురు విద్యార్థులు ఎన్‌ఐవోసీలో టెన్త్ పాసయ్యారు. ఇప్పటి వరకు 50 మంది కి ఈ సంస్థ కొత్తజీవితం ఇచ్చింది.
ఇక్కడున్నవారంతా నా పిల్లలే..
16 ఏళ్లుగా ఈ పిల్లలను నా బిడ్డలుగానే చూసుకుంటున్నా, వారంతా అమ్మా అని పిలుస్తుంటే అంతకు మించిన ఆనందమేముంటుంది. ఈ పిల్లల కోసం త్వరలో నా సొంత డబ్బుతో ఓ టైలరింగ్ సెంటర్‌ను పెట్టాలి. అలాగే సొంత భవనం ఏర్పాటు చేసుకోవాలి. దీంతోపాటు ఓల్డేజ్ హోమ్ ను పెట్టాలనే ఆలోచన ఉంది. సమాజంలో వీరు స్వశక్తితో బతకగలగాలన్నదే నా లక్ష్యం. నా లక్ష్యానికి దాతలు సహకరిస్తే బాగుంటుంది.
- గాయత్రి, ప్రిన్సిపాల్, రిమ్మర్స్ బుద్ధిమాంద్యం పాఠశాల, పలమనేరు