సిద్దిపేట అర్బన్: భర్త చనిపోయిన ఓ మహిళ మానసిక వికలాంగులైన ఇద్దరు పిల్లలను పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలుసుకున్న ‘ఈ తరం’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్పందించారు. బంధువులంతా దూరం కావడంతో ఆసరా కరువైన బాల్‌లక్ష్మి అనే అభాగ్యురాలు తన ఇద్దరు కుమారులు మహేందర్, కుమార్‌తో పడుతున్న వ్యథపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘కష్టాలే తోడు నీడ’ శీర్షికన వెలువడిన కథనంపై ‘ఈ తరం’ సేవా సంస్థ ప్రతినిధులు స్పందించారు.
విద్యార్థులను మానసికంగా ధృడంగా చేసే కార్యక్రమాలను చేపడుతూ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు కృషి చేస్తున్న సిద్దిపేటకు చెందిన ‘ఈ తరం’ స్వచ్ఛంద సేవా సంస్థ ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. సిద్దిపేట పట్టణంలో అభయజ్యోతి మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం నిర్వాహకులు జోజి సహకారంతో టూటౌన్ సీఐ సైదులు చేతుల మీదుగా ఆ కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకులను, క్వింటాల్ బియ్యాన్ని అందించారు. ఇకపై కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని, పిల్లల్ని ఎక్కడైనా చేర్పించి కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న సీఐ సైదులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న బాల్‌లక్ష్మి కుటుంబం గురించి సాక్షి దినపత్రిక వెలుగులోకి తేవడం అభినందనీయమన్నారు. ఇలాంటి కథనాలను మరిన్ని వెలికి తీసి మానవతా వాదులకు తెలియజేస్తే దాతల సహకారంతో ఆయా కుటుంబాలకు కొంతైనా మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తోర్నాల గ్రామ సర్పంచ్ పరమేశ్వర్‌గౌడ్, ఈ తరం సేవా సంస్థ అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి నాగరాజు, గౌరవ అధ్యక్షుడు వీవీ కన్న, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, సభ్యులు శేఖర్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
స్పందించిన ‘ఈ తరం’ స్వచ్ఛంద సంస్థ
Published Tue, Nov 25 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement