cerebral palsy
-
అవగాహనే ప్రధానం
ఏడీహెచ్‌డీ, సెరిబ్రల్ పాల్సీ, ఇతర మనోవైకల్యాలు ఉన్న పిల్లల మానసిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు హైదరాబాద్ వాసి ఫరీదా రాజ్.స్పెషల్ చిల్డ్రన్కు శిక్షణ ఎలా ఇవ్వాలనే అంశాల మీద టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సెంటర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, టీచర్ ట్రైనర్, రెమెడియల్ ఎడ్యుకేటర్, రైటర్ అయిన ఫరీదా రాజ్ తన రచనల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా ప్రజలలో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పిల్లల్లో వచ్చే డిస్లెక్సియాపై పుస్తకాలు రాసిన ఫరీదా రాజ్ ఇటీవల ‘అన్బ్రేకబుల్ స్పిరిట్ – నావిగేటింగ్ లైఫ్ విత్ ఎమ్మెస్ పేరుతో మల్టిపుల్ స్కెర్లోసిస్పై పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది భారతదేశంలో వైద్య లేదా వైద్యేతర వ్యక్తి రాసిన మొట్టమొదటి పుస్తకంగా పేరొందింది. సరైన రోగ నిర్ధారణ, సకాలంలో చికిత్స, సంరక్షణ, కుటుంబ మద్దతుతో వ్యక్తులు సుదీర్ఘమైన, చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాలను గడపవచ్చని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా చెబుతారు ఆమె. ‘‘ఇటీవల చాలా కుటుంబాల్లో తెలియని అలజడిని సృష్టిస్తున్న సమస్య మల్టిపుల్ స్కెర్లోసిస్. దీనిని ఒక జబ్బుగా కాకుండా అవగాహనతో సరిదిద్దాల్సిన అంశంగా గుర్తించాలి. సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిని నేరుగా కలిసి, వారి వేదనను, చికిత్సా విధానాలను ఇందులో పొందుపరించాను. స్పెషల్ కిడ్స్ సామర్థ్యాలకు.. నేను స్కూల్ టీచర్‌గా ఉన్న మొదటి రోజులవి. ట్రైనింగ్ పీరియడ్. క్లాస్‌రూమ్‌లో ఉన్నప్పుడు మొదటి రోజే అక్కడి ఓ సంఘటన నన్ను అమితంగా కదిలించింది. ముగ్గురు, నలుగురు పిల్లలు టీచర్ చెబుతున్న విషయంపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. వారిలో అసహనం స్థాయులు దాటడాన్ని, టీచర్ సహనం కోల్పోవడాన్నీ గమనించాను. ఎదిగే వయసు పిల్లల్లో సహజంగానే చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ సమస్య యువతలో మరింత ఎక్కువగా ఉండటాన్ని చూస్తుంటాం. వారిలో ఆందోళన కూడా ఒకింత ఎక్కువే. ఇలాంటప్పుడు వారికి మెంటల్ వెల్బీయింగ్ అవసరం. ఇక మానసిక వైకల్యాలు ఉన్న పిల్లల్లోనైతే అందరికీ వీరి పట్ల నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఇలాంటి పిల్లలను చూసుకునేవారికి సరైన గైడెన్స్ ఉండటం లేదని ఆ రోజే అనిపించింది. మనోవైకల్యాలు ఉన్న పిల్లల్లో సామర్థ్యాలను వెలికితీయడానికి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రతిరోజూ కృషి చేయాల్సి ఉంటుంది. అభ్యాసంలో వారిని నిమగ్నం చేయడానికి కొత్త కొత్త మార్గాలను కనుక్కోవాలి. దానిపైనే కృషి చేయాలనుకున్నాను. ఆ తర్వాత అందుకు తగిన పరిష్కారాలనూ కనుక్కున్నాను. వందల మంది టీచర్లకు శిక్షణ స్పెషల్ చిల్డ్రన్కు ఎలాంటి శిక్షణ అవసరమో, అందుకు టీచర్ల నైపుణ్యత ఎలా ఉండాలనే దానిపై రెగ్యులర్ సెషన్స్ నిర్వహించాను. ఇది రాష్ట్రస్థాయిలో మంచి మార్పులు తీసుకువచ్చింది. ఉపాధ్యాయులు, నేర్చుకునే ఇబ్బందులు ఉన్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఒక హ్యాండ్–బుక్ తీసుకువచ్చాను. జన్యులోపాలపై అవగాహన ముంబైలో పుట్టి పెరిగిన నేను, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కి వెళుతున్న తొలినాళ్లలో ఒక రోజు, మానసిక వికలాంగురాలైన పాపతో ఉన్న ఒక మహిళను అక్కడ చూశాను. ఆమెతో మాటలు కలిపితే ఆ పాప ఆమెకు ఏడవ సంతానం అని తెలిసింది. ఆమె ఇతర పిల్లలందరికీ కూడా అదే సమస్య ఉంది. జన్యుపరమైన లోపాల వల్ల పిల్లలకు అలాంటి సమస్య వచ్చిందని ఆ మహిళకు తెలియదు. ఆ విషయం తెలియక జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం ఆమె ఎప్పుడూ వెళ్లలేదని తెలుసుకున్నాను. దీంతో ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇలాంటి మహిళలకు అవగాహన కల్పించాలని. అప్పటి నుంచి మహిళలకు జన్యుపరమైన కౌన్సెలింగ్స్ చేస్తూ ఉండేదాన్ని. ఈ అంశంపై ఉర్దూ పత్రికతో పాటు జాతీయ స్థాయి పత్రికలలోనూ వీటికి సంబంధించిన కథనాలపై వ్యాసాలు ఇచ్చాను. ఒక్కో అడుగు.. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేయడం నుంచి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకునే వరకు చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు ఎన్నో. క్యాన్సర్ పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఆంకాలజిస్టులచే కార్యక్రమాల నిర్వహణ నన్ను ఎంతోమందికి చేరువ చేసింది. మల్టిపుల్ స్కెర్లోసిస్తో బాధపడుతున్న వ్యక్తులను చూసినప్పుడు ప్రజలకు ఈ విషయం పట్ల అవగాహన లేదని అర్థ్ధమైంది. దీంతో సమస్యను ఎదుర్కొంటున్నవారిని కలిసి, కదిలించే కథనాలను పాఠకుల ముందుకు తీసుకువచ్చాను’’ అని వివరించే ఫరీదా రాజ్ మల్టిపుల్ స్కెర్లోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్‌కి కార్యనిర్వాహక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. లాభాపేక్ష లేని ఈ సంస్థ ద్వారా మల్టిపుల్ స్కెర్లోసిస్ బారిన పడిన వ్యక్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
తోడుంటే నడుస్తారు
ఆగినప్పుడు అడుగు ముందుకు పడటానికి తోడు కావాలి. నడిపించే సాయం కావాలి. లోకం మనల్ని కూడా నడిపిస్తుందన్న నమ్మకం కలిగించాలి. అహ్మదాబాద్‌కు చెందిన శ్రద్ధా సోపార్కర్ నడవలేని వారికి తోడు నిలుస్తుంది. వారికి ప్రోస్థెటిక్ కాళ్లు అమర్చి జీవితాల్లో మళ్లీ కదలిక తెస్తోంది. సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న సొంత కూతురిని చూశాక సాటి వారి బాధ ఆమెకు అర్థమైంది. ఆమె స్పందన ఇవాళ ఎందరికో వెలుగు. శ్రద్ధా సోపార్కర్ లా చదివింది. కాని ఎప్పుడూ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఆమెకు హైజీన్ ప్రాడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. భర్త కూడా వ్యాపారస్తుడు. మొదట కొడుకు పుట్టాడు. అంతా హ్యాపీగా ఉండగా 2016లో కుమార్తె పుట్టినప్పుడు కుదుపు వచ్చింది. ‘నా కుమార్తెకు సెరిబ్రల్ పాల్సీ అని డాక్టర్లు చెప్పారు. నా కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఆ డిజార్డర్ ఉన్న పిల్లలకు వెంటనే నయం కాదు. జీవితంలో వారు పూర్తిగా నార్మల్ కాలేరు. వారికి కావలసిన థెరపీలు, సర్జరీలు చేయించాలంటే చాలా ఖర్చు కూడా. డబ్బుకు నాకు ఇబ్బంది లేదు కాబట్టి నా కుమార్తెకు కావలసిన థెరపీలు మొదలుపెట్టాను. కాని నా కుమార్తె వల్లే నాకు చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అర్థమైంది’ అంటుంది శ్రద్ధ. ► మలుపు తిప్పిన ఘటన ‘2018లో అహ్మదాబాద్‌లోని ఒక థెరపీ సెంటర్‌కు పాపను తీసుకుని వెళ్లాను. సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న నాలాంటి పిల్లల తల్లులు కూడా చాలామంది వచ్చారు. అందరం భోజనానికి కూచున్నప్పుడు ఒకామె ఉత్త మజ్జిగ తాగుతూ కనిపించింది. ఎందుకు బాక్స్ తెచ్చుకోలేదు అని అడిగాను. ‘‘నేను ఇళ్లల్లో పని చేస్తాను. మా ఆయన ఆటో నడుపుతాడు. మా సంపాదన కొడుకు థెరపీలకు చాలడం లేదు. అందుకే అన్నం కూడా వండుకోలేకపోతున్నాం’’ అంది. నాకు మనసు చేదుగా అయిపోయింది. ఆమెకు కావాల్సిన సాయం చేయడం మొదలుపెట్టాను. అలాంటి తల్లులు మరికొంత మంది వచ్చారు. వారికీ చేయడం మొదలుపెట్టాను. సాయం పొందుతున్న వారు 10 మంది అయ్యేసరికి నా భర్త ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవ చేయి అన్నాడు. అలా మధురం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నా సేవను మొదలు పెట్టాను’ అంది శ్రద్ధ. ► చిన్నారులకు సేవ మెదడు సంబంధమైన రుగ్మతల వల్ల కదలికలు పరిమితమైన చిన్నారులకు, టీకాలు సరిగా వాడకపోవడం వల్ల అనారోగ్యం పాలైన చిన్నారులకు కావలసిన థెరపీలు, మందులు, వైద్య సహాయం ఇవన్నీ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది శ్రద్ధ. ఆమె తన సొంత డబ్బుల నుంచి ఇవన్నీ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమెకు మెల్లగా సాయం అందసాగింది. ‘పేదవర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలకు సెరిబ్రల్ పాల్సీ వస్తే నిస్సహాయంగా వదిలేస్తారు. అది పిల్లల స్థితిని మరింత దిగజారుస్తుంది. వారికి ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా సాయం అందడం లేదు. మనలాంటి వాళ్లం స్పందించకపోతే ఎలా?’ అంటుంది శ్రద్ధ. ► ప్రోస్థెటిక్ కాళ్లు ఈ థెరపీలతో పాటు ప్రమాదవశాత్తు లేదా జన్మతః కాళ్లు కోల్పోయిన పిల్లలకు, పెద్దలకు ప్రోస్థెటిక్ కాళ్లు అమర్చాలని నిశ్చయించుకుంది శ్రద్ధ. అయితే ఇవి నాసిరకంవి కాదు. ఓట్టోబాక్ అనే జర్మన్ కంపెనీ సాయంతో నాణ్యంగా తయారైన కృత్రిమ కాళ్లు. ‘‘ఇప్పటికి 100 మందికి కృత్రిమ కాళ్లు ఇచ్చాం. నడవడం మానేసిన ఆ దురదృష్టవంతులు మేము అమర్చిన ప్రోస్థెటిక్ కాళ్లతో నడిచినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ఈ కాళ్లు అమర్చాక వాహనాలు నడపొచ్చు. సైకిల్ కూడా తొక్కొచ్చు. స్నానం చేయడంలో కూడా ఇబ్బంది లేదు’’ అంది శ్రద్ధ. ఈమె ద్వారా కాళ్లు అమర్చుకున్న చిన్నారులు ఆటలు ఆడుతూ గెంతుతూ సంతోషంగా ఉండటం కూడా చూడొచ్చు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. కాని స్పందించే గుణమే కావాలి. సేవకు అడుగు ముందుకేస్తే నాలుగు చేతులు తోడవుతాయి. నాలుగు కాళ్లు నడుస్తాయి. తాము నడుస్తూ నలుగురినీ నడిపించేవారే గొప్పవారు. -
ట్విన్స్ పుట్టారన్న ఆనందం మాయదారి రోగంతో మాయం, 17 ఏళ్లొచ్చినా!
17 ఏళ్లు అయినా ఇంకా పసిపిల్లల్లా పాకుతూనే ఉన్న కన్నబిడ్డల్ని చూసి తల్లిడిల్లిపోతున్న తల్లితండ్రుల ఆవేదన ఇది.. ‘మేమిద్దరం మాకిద్దరం’ అన్నట్టుగా ఇద్దరు కవల పిల్లలతోపాటు నలుగురు కుటుంబ సభ్యులూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మాయదారి వ్యాధి వారి జీవితాల్లో కల్లోలం నింపింది. దీంతో తమ కన్నబిడ్డల్ని ఎలాగైనా కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దామోదరన్, అతని భార్యకు ఇద్దరు మగపిల్లలు కవలలుగా జన్మించారు. వారికి అల్లారుముద్దుగా రామర్ , లక్ష్మణన్ అని పేరు పెట్టుకున్నారు. పుట్టిన కొన్ని నెలల వరకు కుటుంబం అంతా ఆనంద క్షణాలను ఆస్వాదించారు. కానీ.. నెలలు పెరిగే కొద్దీ తమ బిడ్డల్లో ఎదుగుదల లోపం ఉన్నట్టు గుర్తించారు. సరైన చికిత్స అందించేందుకు ఎన్నో ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. చివరికి వైద్యులు చెప్పిన సంగతి విని దామోదరన్ దంపతులు నిలువునా కుంగిపోయారు. భవిష్యత్తు భయంకరంగా తోచి వణికిపోయారు. ‘స్పాస్టిక్ డిప్లెజియా’ అనే అరుదైన వ్యాధి కారణంగానే వారికిలా జరుగుతోందని వైద్యులు నిర్ధారించారు. స్పాస్టిక్ డిప్లెజియా సెరిబ్రల్ పాల్సీ చిన్నపిల్లల్లో మెదడుకు వచ్చే అరుదైన పక్షవాతం. బాల్యంలో లేదా చిన్నతనంలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఇది కండరాల నియంత్రణ , సమన్వయాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. మెదడు ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లనే చూపు కూడా మందగించింది. వారి స్వంతంగా ఏమీ చేసుకోలేకపోతున్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కవలలకు చికిత్సకు రూ. 6,00,000 ($7359.03) ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దామెదరన్ దంపతులు ఆందోళనలో పడిపోయారు. 65 ఏళ్ల రోజుకూలీగా పనిచేస్తున్న దామోదరన్ కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఉన్నదంతా తెగనమ్మి బిడ్డలకు వైద్యం చేయించారు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టే తిరుగుతుండటంతో ఉన్న ఆ కాస్త రాబడి కూడా లేదు. మరోవైపు అప్పులు, వైద్య బిల్లులు కొండలా పేరుకు పోయాయి. ఈ నేపథ్యంలో దాతలు పెద్దమనసుతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు దామోదరన్ దంపతులు. రోజులు గడిచే కొద్దీ, నిమిష నిమిషానికీ తమ బిడ్డల పరిస్థితి దారుణంగా మారుతోందని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కవల పిల్లలైన రామర్, లక్ష్మణన్ కోలుకోవాలంటే మీ ఆదరణే దిక్కు. దయచేసి పిల్లలను రక్షించడంలో మాకు సహాయం చేయమనివారు ప్రార్థిస్తున్నారు. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
విద్యాబాలన్.. ‘జల్సా’ మూవీ రివ్యూ
క్రైమ్ అండ్ పనిష్మెంట్... పురుష ప్రపంచంలో కనిపించే చర్య... ప్రతిచర్య. కాని స్త్రీల ప్రపంచంలో నేరం తర్వాత శిక్ష ఉంటుందా క్షమ ఉంటుందా? ‘జల్సా’ సినిమా చూడాలి. ఇద్దరు హీరోల రోజులు పోయి ఇద్దరు మహిళా ఆర్టిస్టుల రోజులు వచ్చాయి అని ఈ సినిమా ఎలుగెత్తి చాటుతోంది. విద్యాబాలన్, షెఫాలీ షా... వీళ్ల పోస్టర్‌తో సినిమా రిలీజ్ కావడం పెద్ద బాలీవుడ్ లీప్. మరో విశేషం సెరిబ్రల్ పాల్సీ ఉన్న తెలుగు పిల్లవాడు సూర్య కాశీభట్ల ముఖ్యపాత్ర పోషించి ఆకట్టుకోవడం. ఈవారం సండే సినిమా. మనిషి ఒక నేరం చేస్తాడు. చట్టం శిక్ష విధిస్తుంది. అన్నిసార్లు చట్టానికి చిక్కకపోవచ్చు. ఆ శిక్ష సాపేక్షం కావచ్చు. అంతమాత్రం చేత ఆ నేరం ఆ మనిషిని ఊరికే ఉంచుతుందా? మానసికంగా అది విధించే శిక్ష ఏమిటి? పశ్చాత్తాపంతో విధించుకునే శిక్ష ఏమిటి? శిక్షను తప్పించుకుందామనుకుని ప్రయత్నిస్తూ ఆ అశాంతి లో వేసుకునే శిక్ష ఏమిటి? మానవ ప్రవర్తన, స్వభావం, ఆలోచన ఎప్పటికప్పుడు వినూత్నం. పరిస్థితులకు ఒక్కోసారి బానిస. అవే పరిస్థితులపై విజేత. ‘జల్సా’ ఒక నేరం చేసిన స్త్రీకి, ఆ నేరం వల్ల నష్టపోయిన స్త్రీకి మధ్య నడిచే కథ. సాధారణంగా సినిమా అనేది వ్యాపారం కాబట్టి ఇలాంటి కథలు మగవారి మధ్య రాసుకుంటారు. ఆ మగవాళ్ల ఇమేజ్‌తో సినిమాలు ఆడుతాయి. కాని ఇప్పుడు స్త్రీలతో కథ నడిపించవచ్చని నిరూపిస్తున్నారు. ఇది ప్రయోగం. ప్రయత్నం. ముందంజ. కథ ఏమిటి? ముంబై నగరంలో ఉన్నత వర్గానికి చెందిన జర్నలిస్ట్ విద్యాబాలన్. ఆమె విడాకులు తీసుకుంది. ఆమెకు సెరిబ్రల్ పాల్సీ ఉన్న ఒక పన్నెండేళ్ల కొడుకు ఉన్నాడు. తోడుగా వృద్ధురాలైన తల్లిగా రోహిణి హట్టాంగడి. వీరందరికీ వండి పెట్టడానికి రుక్సానా అనే వంట మనిషి షెఫాలీ షా. విద్యా బాలన్ విలువలు ఉన్న జర్నలిస్ట్. ఆమె సత్యాన్ని వెలికి తీయడానికి ఎంతటి వారినైనా ఎదిరిస్తూ ఉంటుంది. కాని ఆమే సత్యాన్ని దాయవలసి వస్తే? ఒకరోజు అర్ధరాత్రి ఆమె డ్యూటీ నుంచి ముగించి కారు డ్రైవ్ చేస్తూ ఒక టీనేజ్ అమ్మాయిని ఢీ కొడుతుంది. ఊహించని ఈ ఘటనకు ఎలా రియాక్ట్ కావాలి? అక్కడ ఎవరూ ఉండరు. దిగి చూసే ధైర్యం లేదు. టీనేజ్ అమ్మాయిని ఆమె ఖర్మానికి వదిలి ఇల్లు చేరుకుంటుంది. కాని మరుసటి రోజు తెలుస్తుంది అలా తాను యాక్సిడెంట్ చేసి మృత్యువు అంచుదాకా (సీరియస్‌గా గాయపడుతుంది) పంపిన అమ్మాయి తన పనిమనిషి కూతురేనని. ఒక వైపు సంఘంలో పరువు, ఇంకో వైపు జైలు భయం, మరోవైపు ఎలా తప్పించుకోవాలి అనే ఆందోళన, తన సొంత ఇంటి మనిషిలాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాననే గిల్ట్. ఇవన్నీ ఆమెను వెంటాడుతాయి. సత్యాన్ని వెతుకులాడే జర్నలిస్ట్ తానే ఒక సత్యాన్ని తొక్కిపెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. మరోవైపు పనిమనిషి అయిన షెఫాలీ షాకు ఇదంతా తెలియదు. ఎవరో యాక్సిడెంట్ చేశారు. తన యజమాని వైద్యం చేయిస్తోంది. కూతురు బతుకు బుగ్గిపాలైంది అనే శోకం. కాని ఒక నేరం జరిగితే అందుకు తప్పకుండా శిక్ష ఉంటుంది. చట్టానికి విద్యాబాలన్ దొరక్కపోవచ్చు. కాని షెఫాలీ షాకు దొరికిపోతుంది. తన కూతురికి యాక్సిడెంట్ చేసింది తన యజమానే అని తెలుసుకున్న షెఫాలీ షా ఏం చేసింది? చూడాలి. పరిస్థితులు ఒక ఘటన జరిగినప్పుడు పరిస్థితుల కొద్దీ మనిషి స్వభావం ఎలా మారిపోతుందో ఈ సినిమా చర్చిస్తుంది. విద్యాబాలన్ యాక్సిడెంట్ ముందు వరకూ ఒక మనిషి... అయ్యాక ఒక మనిషి. ఆమెకు తీవ్రమైన మానసిక ఆందోళన మొదలైపోతుంది. లిఫ్ట్‌లో, నాలుగ్గోడల మధ్య ఉండలేకపోతుంటుంది. పీడకలలు. ఇదంతా సత్యాన్ని దాచడం వల్లే. ఆమె తన స్వభావానికి విరుద్ధంగా ఈ విషయం బయటపడకుండా ఉండాలంటే ఎవరెవరిని ఎంతెంత పెట్టి కొనాలి అనే రంధిలో పడిపోతుంది. మరోవైపు తన కూతురులాంటి అమ్మాయిని జీవచ్ఛవంలా హాస్పిటల్లో చూసి లోలోపల కుమిలిపోతూ ఉంటుంది. అటువైపు షెఫాలీ షా చుట్టూ చాలామంది మూగుతారు. నేరం జరిగినప్పుడు శిక్ష పడాలి అని మొదట అనిపిస్తుంది. కాని పేదవాళ్లు ఆ సందర్భంలో ఒకలాగా శ్రీమంతులు ఒకలాగా వ్యవహరిస్తారని ఈ సినిమాలో చూపిస్తారు. పోలీసులే మధ్యవర్తులుగా మారి నీకో పది లక్షలు ఇప్పిస్తాం... కాంప్రమైజ్ అయిపో అని షెఫాలీని ఒప్పిస్తారు. గమనించండి. పేదవాళ్లు శ్రీమంతులకు నష్టం కలిగిస్తే ఇలాంటి అప్షన్ ఉండదు. వారు జైలుకు వెళతారు. షెఫాలీ అంగీకరిస్తుంది. కాని చివరకు నేరం చేసింది తన యజమానే అనుకున్నాక ఆమె ప్రతిచర్య వేరేగా ఉంటుంది. ఆ ప్రతిచర్య ఏమిటి? స్త్రీ అంటే క్షమ. క్షమించడమే. కాని ఇదంతా గ్రిప్పింగ్‌గా ఉంటుంది చూడటానికి. ఆ పిల్లాడు ఈ సినిమాలో విద్యాబాలన్ కుమారుడుగా వేసిన సూర్య కాశీభట్ల మరో ముఖ్యపాత్ర. ఈ పాత్ర ఒక సంకేతం కావచ్చు. కన్నకొడుకు సెరిబ్రల్ పాల్సీ (మాట, కదలికల లోపం)తో ఉన్నప్పటికీ విద్యా బాలన్ ఆ పిల్లాణ్ణి ప్రేమించకుండా ఉంటుందా? ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడికి వంట మనిషిగా పని చేసే షెఫాలీ కూడా వాణ్ణి ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడు సంపూర్ణుడు కాడు. లోపం ఉన్నవాడు. తాము ఇష్టపడే మనుషులు సంపూర్ణులు అయి ఉండరు. ఏవో ఒక లోపాలు ఉంటాయి. తప్పులు జరుగుతాయి. పొరపాట్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతమాత్రాన ఆ బంధాలను తెంపేసుకోలేము. కఠినమైన శిక్షలు విధించలేము. క్షమ ఒక మార్గం ఏమో వెతకాలి. ఏమంటే శిక్ష కంటే క్షమ గొప్పది. ఈ సినిమా అలాంటి ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. విద్యా బాలన్, షెఫాలీ... వీరద్దరి గొప్ప నటనను చూడొచ్చు. సూర్య కూడా ఎంతో గొప్పగా నటిస్తాడు. కథ ఇంకా బాగుండొచ్చు. క్లయిమాక్స్ అసంపూర్ణం అనిపించవచ్చు. కాని అసంపూర్ణతను ప్రేమించమనే కదా డైరెక్టర్ సురేశ్ త్రివేణి చెబుతున్నది. అమేజాన్ ప్రైమ్‌లో ఉంది. -
నాన్న భుజాలపై బంగారు కొండ
కడుపులో ఉన్న ఆడపిల్ల పుట్టేలోపే ఆ శిశువును కడుపులోనే చంపేయాలన్న ఆలోచన పుడుతున్న సమాజం ఇది. అటువంటిది.. తన కూతురికి ఇరవై ఏళ్ల వయసు వచ్చేవరకు వైద్యం చేయిస్తూనే ఉండాలని తెలిసి కూడా ఆ తండ్రి ఏ మాత్రం తన కన్నబిడ్డను నిర్లక్ష్యం చేయకుండా ఆమెను చదివించడానికి భుజాలపై మోస్తూ కొండ ఎక్కి దిగుతూ ఉన్నాడంటే.. అతడిని ఆదర్శంగా చెప్పుకోవలసిందే. ఆ తండ్రి నిశాంత్. ఆ కూతురు నియా. వారిది కేరళ. నియా ఒకటో తరగతి చదువుతోంది. ఏడేళ్ల వయసు. ఆ వయసు పిల్లలకు ఉదయాన్నే పళ్లు తోముకోవడం, పాలు తాగటం, చొక్కా గుండీలు పెట్టుకోవటం వంటి విషయాలు అతి సులభం. కాని నియాకు ఈ పనులు చేయటానికి ఇతరుల సహాయం కావాలి. కారణం.. నియా సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతోంది. దాదాపుగా అచేతన స్థితి. అయినప్పటికీ, తన బిడ్డను చదివించాల్సిందేనని నిశాంత్ ప్రతి రోజూ ఆమెను మెడ మీద ఎక్కించుకుని తాము ఉంటున్న వేనాడ్ నుంచి ఒక కిలోమీటరు మేర ‘ట్రెక్కింగ్’ చేసి, ఆమెను పాఠశాలకు చేర్చుతాడు. ఇంటికి వచ్చేటప్పుడూ అంతే. మళ్లీ అంత మేరా కొండలు, గుట్టలు దిగడం. ‘‘ఈ ప్రాంతమంతా రాళ్లగుట్టలతో నిండి ఉన్నప్పటికీ, ఇక్కడ గ్రామ ప్రజలు ఆర్థికంగా పేదవారు కావటం వల్ల, ఎక్కడికైనా నడిచే వెళ్తారు. నాకు వచ్చే చాలీచాలని డబ్బుతో, మేం ముగ్గురం ఏదో తినగలుగుతున్నాం. అలాగే నియాకు కావలసిన మందులు కొనగలుగుతున్నాను’’ అంటాడు నిశాంత్. అతడు ఆటోడ్రైవర్. తాముండే కురవ కాలనీ సమీపంలో ఉన్న చెంగుత్తాయ ప్రాంతానికి ఆటో నడుపుతాడు. కూతురికి ఎప్పుడూ దగ్గరగా ఉండటం కోసం ఎన్నో ఉద్యోగాలను విడిచిపెట్టేశాడు. నియాను ఇంటికి పరిమితం చేయకుండా, స్కూల్‌కి తీసుకువెళ్లటం కోసమే ఆటో నడుపుతున్నాడు. నియాకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు సెరిబ్రెల్ పాల్సీ బయటపడింది. కొండ ఎక్కి దిగాల్సిందే నియా చదువుతున్న పాఠశాల ఇంటి నుంచి ఐదు కి.మీ. దూరంలో ఉంటుంది. ఉదయం ఎనిమిదిన్నరకు ఇంటి దగ్గర బయలుదేరి, ఒక కిలోమీటరు మేరకు కూతుర్ని భుజాలపై ఎక్కించుకుని ట్రెకింగ్ చేసి, అక్కడ నుంచి ఆటోలో ఆమెను స్కూల్‌కి తీసుకువెళ్తాడు. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా నడుస్తాడు. ఆమెను స్కూల్లో దింపేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఆటో నడిపి మళ్లీ సాయంత్రం నాలుగూ ముప్పైకి స్కూల్ విడిచే సమయానికి నియాను ఎక్కించుకుని వస్తాడు. అక్కడితో ముగిసిపోదు నిశాంత్ ప్రయాణం. అక్కడ నుంచి ఆటోలో తీసుకువచ్చి, మళ్లీ ఒక కిలోమీటరు ట్రెకింగ్ చేయాల్సిందే. ఏదేమైనా ఆరు గంటల లోపు ఇల్లు చేరుకోవాలి. ‘‘ఆలస్యమైతే, ఆ చీకట్లో క్రూర జంతువులు మా మీద పడి చంపేసే అవకాశం ఉంది’’ అంటాడు నిశాంత్. అతను సంపాదించే దానిలో చాలావరకు కూతురు ఫిజియోథెరపీకే ఖర్చు అవుతుంది. ఆమె కోసం ఇప్పటివరకు 1.5 లక్షలు అప్పు చేశాడు. తిరిగి తీర్చటం చాలా కష్టంగా ఉంది. అప్పటికీ బ్యాంకు అధికారులు వడ్డీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినా అసలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాడు నిశాంత్. ‘కష్టపడుతూనే ఉంటా’ నియా పరిస్థితి గమనించిన ఆ స్కూల్ హెడ్మాస్టర్ థామస్ జాకబ్ క్రౌడ్ ఫండింగ్‌కి ఆన్లైన్లో దాతలకు విజ్ఞప్తి చేశారు. కొద్దికొద్దిగా డబ్బు అందుతోంది. రెండు నెలల క్రితం నియా కండరాలకు ఒక ఆపరేషన్ జరిగింది. ఆమెను చూసిన డాక్టర్లు, ‘‘నియాకు క్రమం తప్పకుండా వైద్యం చేయిస్తూంటే, ఆమెకు పద్దెనిమిదీ ఇరవై ఏళ్లు సంవత్సరాలు వచ్చేసరికి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవుతుంది’’ అంటున్నారు. ‘‘నా బిడ్డను ఆరోగ్యవంతురాలిని, విద్యావంతురాలిని చేయడానికి నేను నిరంతర పోరాటం చేస్తూనే ఉంటాను. ఆమె తనకై తను స్వేచ్ఛగా తిరిగేంత వరకు కష్టపడుతూనే ఉంటాను’’ అన్నాడు నిశాంత్. నియా తల్లి గృహిణి. బిడ్డ కోసం బయట తండ్రి ఎంత చేస్తున్నాడో.. ఇంట్లో ఆమె అంతా చేస్తోంది. – జయంతి -
పసి మెదడులో కల్లోలం
సాక్షి, కర్నూలు : ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలను పట్టి పీడిస్తున్న వ్యాధులు అనేకం. అయితే ఇందులో కొన్ని వ్యాధులను పూర్తిగా అరికట్టవచ్చు. మరికొన్ని వ్యాధులు ప్రాణాంతకం కాగా, ఇంకొన్ని వ్యాధులు పిల్లల జీవితాన్ని అంగవైక్యలంగా మారుస్తున్నాయి. ఉదాహరణకు పోలియో. ఇది పోలియో వైరస్ వల్ల సంభవించే వ్యాధి. దీని ప్రభావం అంగవైకల్యం. కానీ వివిధ వైద్య పద్ధతుల ద్వారా పోలియోను జయించాము, దానిని పూర్తిగా అరికట్టాము. కానీ మళ్లీ పిల్లలను పట్టిపీడిస్తున్న వ్యాధి సెరిబ్రల్ పాల్సీ. ప్రస్తుతం ఈ వ్యాధి దాదాపుగా ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 5 నుంచి 8 మందిలో వస్తోంది. అక్టోబర్ 6వ తేదీన వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా ప్రత్యేక కథనం. సెరిబ్రమ్ మెదడులో ఒక భాగం. సెరిబ్రల్ పాల్సీ అనేది వ్యాధి కాదు. ఇది ఒక శారీరక, మానసిక రుగ్మత. చిన్నపిల్లల్లో చాలా మంది సెరిబ్రల్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో మెదడు శాశ్వతంగా దెబ్బతినడంతో, అసాధారణమైన ఎదుగుదలతో ఈ సమస్య వస్తోంది. ఈ వ్యాధి పురోగమించడం ఉండదు. వారిలో ముఖ్యంగా మెదడులోని సెరిబ్రమ్ దెబ్బతినడం జరుగుతుంది. సెరిబ్రమ్ మానవుని శరీరానికి సంబంధించిన ప్రతి పనితీరు నిర్దేశించబడి ఉంటుంది. కానీ గర్భం దాల్చిన సమయంలో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ప్రసవ సమయంలో శిశువు మెదడుకు గాయం అవ్వడం, గర్భంలోనే పిండదశలో మెదడు ఎదుగుదలలో లోపం వంటి కారణాలతో ఈ వ్యాధి కలుగుతుంది. 28 వారాలకు ముందే పిల్లలు పుట్టడం వల్ల తక్కువ బరువుతో ఉంటారు. అలాగే జన్యుపరమైన కారణాలు కూడా సెరిబ్రల్‌పాల్సీ రావడానికి దోహదపడతాయి. వైద్య పరిశీలన ఆధారంగా చేసుకుని నాలుగు నిమిషాల కన్నా ఎక్కువ సమయం మెదడుకు ఆక్సిజన్ అందకపోతే మెదడులోని నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. దీని ప్రభావం కారణంగా శాశ్వత అంగ వైకల్యంగా మారుతుంది. మిగతా పిల్లలతో పోల్చుకుంటే సెరిబ్రల్ పాల్సీ రుగ్మత ఉన్న పిల్లలు విభిన్నంగా ఉంటారు. వీరి ప్రవర్తన, పనితీరు, నడవడం, మాట్లాడటం, తినడం, రాయడం, కూర్చోవడం వంటివి. వీరిలో ముఖ్యంగా కండరాలు బిగుసుకుపోవడం, కదలికలో లోపాలు కనిపిస్తాయి. వెయ్యి మందిలో ఐదుగురు ప్రసవ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పోషకాహార లోపం కారణంతో మన జిల్లాలో సెరిబ్రల్ పాల్సీతో జని్మస్తున్న పిల్లల సంఖ్య ప్రతి వెయ్యిలో ఐదు మంది దాకా ఉంటోంది. ముఖ్యంగా కొన్ని రకాల సామాజిక వర్గాలకు చెందిన పిల్లల్లో, నిరక్షరాస్యత అధికంగా ఉన్న కోసిగి, ఆలూరు, ఆస్పరి, కౌతాళం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, హాలహరి్వ, డోన్, కృష్ణగిరి, తుగ్గలి, చిప్పగిరి, కోడుమూరు, గూడూరు తదితర ప్రాంతాల్లో ఇలాంటి పిల్లలు అధికంగా కనిపిస్తారని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు సెరిబ్రల్ పాల్సీ లక్షణాలు చిన్నపిల్లల్లో మూడు సంవత్సరాల వయస్సులోనే కనిపిస్తాయి. పుట్టిన తర్వాత వారి ఎదుగుదల సమయంలో మిగతా పిల్లల్లో కంటే వీరిలో తేడాలు గమనించవచ్చు. శారీరక కదలికలు, కండరాలపై నియంత్రణ లోపిస్తుంది. కండరాల బలహీనత, సమన్వయం లోపిస్తుంది. కండరాలు బిగుసుకుపోవడం, కండరాల సంకోచ వ్యాకోచాల్లో ఇబ్బంది ఉంటుంది. అసాధారణ నడక, సిజర్ వాకింగ్ (కత్తెర కాళ్లు), మునికాళ్లపై నడక ఉంటుంది. నడవడం, రాయడం, టైపు చేయడంలో కండరాల సమన్వయం లోపిస్తుంది. కండరాల బిగుసు, చిన్నవిగా ఉండటం, సంకోచంగా మారడం. వినడం, చూడటం, ఆలోచించడం, మాట్లాడటంలో తేడాలు వస్తాయి. బ్లాడర్ (మూత్రాశయం), బొవెల్ (మలాశయం) నియంత్రణ సమస్యలు వస్తాయి. అసాధారణ కదలికలు, నోటిలో నుంచి లాలాజలం కారడం, కోపం, చురుకత వంటివి, చేతులు, కాళ్లు వంకరలు తిరుగుతాయి. -
నేడు రక్షాబంధన్
అమ్మ నాన్న అన్నీ తానై... ఆ యువతికి కాళ్లు పనిచేయవు. కానీ ఆ విషయమే గుర్తుండదు. ఎందుకంటే అన్న ఉన్నాడుగా అంటుంది. ఆమెకి చేతులు కదలవు. అది మనం చెబితేగానీ గుర్తుకు రాదు. ఎందుకంటే అన్న ఉన్నాడుగా. అమ్మ. నాన్నలలో నుంచి ఒకో అక్షరం కలిపి అన్నగా మారితే... ఎలా ఉంటుందో అలాంటి అన్న అతను. ఎన్నో ఏళ్లుగా ఆ చెల్లికి అన్నీ తానైన పెన్నిధి అతను. - రామంతాపూర్ వీణ ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకుంటుంది. టిఫిన్ చేస్తుంది. తలదువ్వుకుంటుంది. భోజనం చేస్తుంది. ఇవి అందరూ చేసే పనులే కదా అనుకోవద్దు. నిజానికి ఈ పనులేవీ చేసుకునేందుకు వీణ శరీరం సహకరించదు. అయినా ఆమెకు ఆ లోటు తెలీదు. అసలు ఏ లోటూ తెలీదు. ఎందుకంటే అన్నీ తానైన అన్నయ్య ఆమెకు ఉన్నాడు. ‘మా అన్నయ్య ఆణిముత్యం’ అంటుంది మురిపెంగా వీణ. తోబుట్టువు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా.. తోడబుట్టిన చెల్లికి అన్నీ తానై సేవలతో సోదర బంధానికి చిరునామాగా మారిన ఈ అన్నాచెల్లెళ్లు వీణ, మధు రామంతాపూర్ ఇందిరానగర్ వాసులు. వయోభారంతో తల్లిదండ్రులు తమ పనులే చేసుకోలేని స్థితిలో ఉంటే... గత కొన్నేళ్లుగా సెరిబ్రల్ పాల్సి (కాళ్లు చేతులు పనిచేయకపోవడం) వ్యాధితో వీల్‌ఛైర్‌కు పరిమితమైంది చెల్లి. ఈ బాధ్యతల్ని చూసి మధు ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేయలేదు. సోదరుడి బాధ్యత నుంచి పారిపోలేదు. చెల్లెలినే తన లోకంగా మార్చుకున్నాడు. ఉదయం లేవగానే బ్రెష్ చేయడం మొదలుకొని టీ, టిఫిన్ అందించడమే కాకుండా తల దువ్వడం, భోజనం తినిపించడం వంటి సపర్యలు చేసేటప్పుడు అమ్మని తలపిస్తాడు. ఉదయం మార్కెట్‌కు, సాయంత్రం ఆహ్లాదం కోసం పార్కుకు, గుడికి సైతం వీల్‌చైర్‌లో తీసుకెళ్లేటప్పడు నాన్నని మరిపిస్తాడు. కళ్లలో పెట్టుకుని చెల్లెమ్మను అపురూపంగా చూసుకుంటున్నాడు. ‘నా అన్న దేవుడిచ్చిన వరం’ అంటుంటే... ‘నాచెల్లెలే నా లోకం’ అంటాడా అన్న. రాఖీ కట్టడానికి చేతులు సైతం కదల్చలేని ఆ చెల్లి... ‘ఈ ఒక్కరోజు దేవుడు నా చేతులు కదిలిస్తే బాగుణ్ను అన్నయ్యా..’ అని కోరుకుంటుంటే... ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని... తానే రాఖీ కట్టుకుని... ఆప్యాయంగా చెల్లి తల నిమిరి జీవితాంతం అండగా నిలుస్తాననే హామీనే బహుమతి చేశాడా అన్న. ఇది చూడముచ్చటైన అనుబంధం. అన్నాచెల్లెళ్ల ఆప్యాయతకు అసలైన ప్రతిరూపం. -
ప్లీజ్.. ప్రాణభిక్ష పెట్టండి
జీవచ్ఛవంలా పడి ఉన్న ఈ యువకుడి పేరు కొండా పాపారావు. సత్తుపల్లి మండల పరిధిలోని రేజర్లకు చెందిన వాడు. సత్తుపల్లి గీతమ్స్ పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పెళ్లి అయ్యింది. భార్య పేరు కల్యాణి. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఉన్నట్టుండి వీరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జీబీ సిండ్రోమ్, పక్షవాతం బారినపడ్డాడు పాపారావు. కొద్దిరోజులుగా కోమాలోనే ఉన్నాడు. ప్రస్తుతం విజయవాడ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఉన్నది కాస్త అమ్మేసి వైద్యానికి రూ.3లక్షలు ఖర్చు చేశారు. అయినా ఎలాంటి మార్పూలేదు. ఇంకా రూ.6లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. చేతిలో చిల్లిగవ్వలేదు. మాయదారి జబ్బుతో పాపారావు పరిస్థితి క్షణం ఒక యుగంలా మారింది. ఏం చేయాలో ఆ కుటుంబ సభ్యులకు పాలుపోవడం లేదు. దాతలే పాపారావు ప్రాణాలు నిలబెట్టాలని వేడుకుంటున్నారు. ‘నా భర్తకు దాతలే ప్రాణభిక్ష పెట్టాలి’ అంటూ కల్యాణి కన్నీరుమున్నీరవుతోంది. ఆర్థికసాయం అందించాలనుకుంటున్న దాతలు ‘కొండా కల్యాణి (అకౌంట్ నంబర్: 33664673557, ఎస్బీఐ సత్తుపల్లి) పేరు మీద జమ చేయాలని వేడుకుంటోంది. మరిన్ని వివరాలకు 8019702328, 9705952584 నంబర్లను సంప్రదించాలని కోరుతోంది. -సత్తుపల్లి