నేడు రక్షాబంధన్
అమ్మ నాన్న అన్నీ తానై...
ఆ యువతికి కాళ్లు పనిచేయవు. కానీ ఆ విషయమే గుర్తుండదు. ఎందుకంటే అన్న ఉన్నాడుగా అంటుంది. ఆమెకి చేతులు కదలవు. అది మనం చెబితేగానీ గుర్తుకు రాదు. ఎందుకంటే అన్న ఉన్నాడుగా. అమ్మ. నాన్నలలో నుంచి ఒకో అక్షరం కలిపి అన్నగా మారితే... ఎలా ఉంటుందో అలాంటి అన్న అతను. ఎన్నో ఏళ్లుగా ఆ చెల్లికి అన్నీ తానైన పెన్నిధి అతను. - రామంతాపూర్
వీణ ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకుంటుంది. టిఫిన్ చేస్తుంది. తలదువ్వుకుంటుంది. భోజనం చేస్తుంది. ఇవి అందరూ చేసే పనులే కదా అనుకోవద్దు. నిజానికి ఈ పనులేవీ చేసుకునేందుకు వీణ శరీరం సహకరించదు. అయినా ఆమెకు ఆ లోటు తెలీదు. అసలు ఏ లోటూ తెలీదు. ఎందుకంటే అన్నీ తానైన అన్నయ్య ఆమెకు ఉన్నాడు. ‘మా అన్నయ్య ఆణిముత్యం’
అంటుంది మురిపెంగా వీణ.
తోబుట్టువు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా..
తోడబుట్టిన చెల్లికి అన్నీ తానై సేవలతో సోదర బంధానికి చిరునామాగా మారిన ఈ అన్నాచెల్లెళ్లు వీణ, మధు రామంతాపూర్ ఇందిరానగర్ వాసులు. వయోభారంతో తల్లిదండ్రులు తమ పనులే చేసుకోలేని స్థితిలో ఉంటే... గత కొన్నేళ్లుగా సెరిబ్రల్ పాల్సి (కాళ్లు చేతులు పనిచేయకపోవడం) వ్యాధితో వీల్‌ఛైర్‌కు పరిమితమైంది చెల్లి. ఈ బాధ్యతల్ని చూసి మధు ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేయలేదు. సోదరుడి బాధ్యత నుంచి పారిపోలేదు. చెల్లెలినే తన లోకంగా మార్చుకున్నాడు. ఉదయం లేవగానే బ్రెష్ చేయడం మొదలుకొని టీ, టిఫిన్ అందించడమే కాకుండా తల దువ్వడం, భోజనం తినిపించడం వంటి సపర్యలు చేసేటప్పుడు అమ్మని తలపిస్తాడు. ఉదయం మార్కెట్‌కు, సాయంత్రం ఆహ్లాదం కోసం పార్కుకు, గుడికి సైతం వీల్‌చైర్‌లో తీసుకెళ్లేటప్పడు నాన్నని మరిపిస్తాడు. కళ్లలో పెట్టుకుని చెల్లెమ్మను అపురూపంగా చూసుకుంటున్నాడు. ‘నా అన్న దేవుడిచ్చిన వరం’ అంటుంటే... ‘నాచెల్లెలే నా లోకం’ అంటాడా అన్న.
రాఖీ కట్టడానికి చేతులు సైతం కదల్చలేని ఆ చెల్లి... ‘ఈ ఒక్కరోజు దేవుడు నా చేతులు కదిలిస్తే బాగుణ్ను అన్నయ్యా..’ అని కోరుకుంటుంటే... ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని... తానే రాఖీ కట్టుకుని... ఆప్యాయంగా చెల్లి తల నిమిరి జీవితాంతం అండగా నిలుస్తాననే హామీనే బహుమతి చేశాడా అన్న. ఇది చూడముచ్చటైన అనుబంధం. అన్నాచెల్లెళ్ల ఆప్యాయతకు అసలైన ప్రతిరూపం.