సాయం పొందిన బాలికతో శ్రద్ధా సోపార్కర్
ఆగినప్పుడు అడుగు ముందుకు పడటానికి తోడు కావాలి. నడిపించే సాయం కావాలి. లోకం మనల్ని కూడా నడిపిస్తుందన్న నమ్మకం కలిగించాలి. అహ్మదాబాద్‌కు చెందిన శ్రద్ధా సోపార్కర్ నడవలేని వారికి తోడు నిలుస్తుంది. వారికి ప్రోస్థెటిక్ కాళ్లు అమర్చి జీవితాల్లో మళ్లీ కదలిక తెస్తోంది. సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న సొంత కూతురిని చూశాక సాటి వారి బాధ ఆమెకు అర్థమైంది. ఆమె స్పందన ఇవాళ ఎందరికో వెలుగు.
శ్రద్ధా సోపార్కర్ లా చదివింది. కాని ఎప్పుడూ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఆమెకు హైజీన్ ప్రాడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. భర్త కూడా వ్యాపారస్తుడు. మొదట కొడుకు పుట్టాడు. అంతా హ్యాపీగా ఉండగా 2016లో కుమార్తె పుట్టినప్పుడు కుదుపు వచ్చింది.
‘నా కుమార్తెకు సెరిబ్రల్ పాల్సీ అని డాక్టర్లు చెప్పారు. నా కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఆ డిజార్డర్ ఉన్న పిల్లలకు వెంటనే నయం కాదు. జీవితంలో వారు పూర్తిగా నార్మల్ కాలేరు. వారికి కావలసిన థెరపీలు, సర్జరీలు చేయించాలంటే చాలా ఖర్చు కూడా. డబ్బుకు నాకు ఇబ్బంది లేదు కాబట్టి నా కుమార్తెకు కావలసిన థెరపీలు మొదలుపెట్టాను. కాని నా కుమార్తె వల్లే నాకు చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అర్థమైంది’ అంటుంది శ్రద్ధ.
► మలుపు తిప్పిన ఘటన
‘2018లో అహ్మదాబాద్‌లోని ఒక థెరపీ సెంటర్‌కు పాపను తీసుకుని వెళ్లాను. సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న నాలాంటి పిల్లల తల్లులు కూడా చాలామంది వచ్చారు. అందరం భోజనానికి కూచున్నప్పుడు ఒకామె ఉత్త మజ్జిగ తాగుతూ కనిపించింది. ఎందుకు బాక్స్ తెచ్చుకోలేదు అని అడిగాను. ‘‘నేను ఇళ్లల్లో పని చేస్తాను. మా ఆయన ఆటో నడుపుతాడు. మా సంపాదన కొడుకు థెరపీలకు చాలడం లేదు. అందుకే అన్నం కూడా వండుకోలేకపోతున్నాం’’ అంది. నాకు మనసు చేదుగా అయిపోయింది. ఆమెకు కావాల్సిన సాయం చేయడం మొదలుపెట్టాను. అలాంటి తల్లులు మరికొంత మంది వచ్చారు. వారికీ చేయడం మొదలుపెట్టాను. సాయం పొందుతున్న వారు 10 మంది అయ్యేసరికి నా భర్త ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవ చేయి అన్నాడు. అలా మధురం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నా సేవను మొదలు పెట్టాను’ అంది శ్రద్ధ.
► చిన్నారులకు సేవ
మెదడు సంబంధమైన రుగ్మతల వల్ల కదలికలు పరిమితమైన చిన్నారులకు, టీకాలు సరిగా వాడకపోవడం వల్ల అనారోగ్యం పాలైన చిన్నారులకు కావలసిన థెరపీలు, మందులు, వైద్య సహాయం ఇవన్నీ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది శ్రద్ధ. ఆమె తన సొంత డబ్బుల నుంచి ఇవన్నీ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమెకు మెల్లగా సాయం అందసాగింది. ‘పేదవర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలకు సెరిబ్రల్ పాల్సీ వస్తే నిస్సహాయంగా వదిలేస్తారు. అది పిల్లల స్థితిని మరింత దిగజారుస్తుంది. వారికి ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా సాయం అందడం లేదు. మనలాంటి వాళ్లం స్పందించకపోతే ఎలా?’ అంటుంది శ్రద్ధ.
► ప్రోస్థెటిక్ కాళ్లు
ఈ థెరపీలతో పాటు ప్రమాదవశాత్తు లేదా జన్మతః కాళ్లు కోల్పోయిన పిల్లలకు, పెద్దలకు ప్రోస్థెటిక్ కాళ్లు అమర్చాలని నిశ్చయించుకుంది శ్రద్ధ. అయితే ఇవి నాసిరకంవి కాదు. ఓట్టోబాక్ అనే జర్మన్ కంపెనీ సాయంతో నాణ్యంగా తయారైన కృత్రిమ కాళ్లు. ‘‘ఇప్పటికి 100 మందికి కృత్రిమ కాళ్లు ఇచ్చాం. నడవడం మానేసిన ఆ దురదృష్టవంతులు మేము అమర్చిన ప్రోస్థెటిక్ కాళ్లతో నడిచినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ఈ కాళ్లు అమర్చాక వాహనాలు నడపొచ్చు. సైకిల్ కూడా తొక్కొచ్చు. స్నానం చేయడంలో కూడా ఇబ్బంది లేదు’’ అంది శ్రద్ధ. ఈమె ద్వారా కాళ్లు అమర్చుకున్న చిన్నారులు ఆటలు ఆడుతూ గెంతుతూ సంతోషంగా ఉండటం కూడా చూడొచ్చు.
డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. కాని స్పందించే గుణమే కావాలి. సేవకు అడుగు ముందుకేస్తే నాలుగు చేతులు తోడవుతాయి. నాలుగు కాళ్లు నడుస్తాయి. తాము నడుస్తూ నలుగురినీ నడిపించేవారే గొప్పవారు.
Comments
Please login to add a commentAdd a comment