సాక్షి, కర్నూలు : ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలను పట్టి పీడిస్తున్న వ్యాధులు అనేకం. అయితే ఇందులో కొన్ని వ్యాధులను పూర్తిగా అరికట్టవచ్చు. మరికొన్ని వ్యాధులు ప్రాణాంతకం కాగా, ఇంకొన్ని వ్యాధులు పిల్లల జీవితాన్ని అంగవైక్యలంగా మారుస్తున్నాయి. ఉదాహరణకు పోలియో. ఇది పోలియో వైరస్ వల్ల సంభవించే వ్యాధి. దీని ప్రభావం అంగవైకల్యం. కానీ వివిధ వైద్య పద్ధతుల ద్వారా పోలియోను జయించాము, దానిని పూర్తిగా అరికట్టాము. కానీ మళ్లీ పిల్లలను పట్టిపీడిస్తున్న వ్యాధి సెరిబ్రల్ పాల్సీ. ప్రస్తుతం ఈ వ్యాధి దాదాపుగా ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 5 నుంచి 8 మందిలో వస్తోంది. అక్టోబర్ 6వ తేదీన వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
సెరిబ్రమ్ మెదడులో ఒక భాగం. సెరిబ్రల్ పాల్సీ అనేది వ్యాధి కాదు. ఇది ఒక శారీరక, మానసిక రుగ్మత. చిన్నపిల్లల్లో చాలా మంది సెరిబ్రల్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో మెదడు శాశ్వతంగా దెబ్బతినడంతో, అసాధారణమైన ఎదుగుదలతో ఈ సమస్య వస్తోంది. ఈ వ్యాధి పురోగమించడం ఉండదు. వారిలో ముఖ్యంగా మెదడులోని సెరిబ్రమ్ దెబ్బతినడం జరుగుతుంది. సెరిబ్రమ్ మానవుని శరీరానికి సంబంధించిన ప్రతి పనితీరు నిర్దేశించబడి ఉంటుంది. కానీ గర్భం దాల్చిన సమయంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ కారణంగా ప్రసవ సమయంలో శిశువు మెదడుకు గాయం అవ్వడం, గర్భంలోనే పిండదశలో మెదడు ఎదుగుదలలో లోపం వంటి కారణాలతో ఈ వ్యాధి కలుగుతుంది.
28 వారాలకు ముందే పిల్లలు పుట్టడం వల్ల తక్కువ బరువుతో ఉంటారు. అలాగే జన్యుపరమైన కారణాలు కూడా సెరిబ్రల్‌పాల్సీ రావడానికి దోహదపడతాయి. వైద్య పరిశీలన ఆధారంగా చేసుకుని నాలుగు నిమిషాల కన్నా ఎక్కువ సమయం మెదడుకు ఆక్సిజన్ అందకపోతే మెదడులోని నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. దీని ప్రభావం కారణంగా శాశ్వత అంగ వైకల్యంగా మారుతుంది. మిగతా పిల్లలతో పోల్చుకుంటే సెరిబ్రల్ పాల్సీ రుగ్మత ఉన్న పిల్లలు విభిన్నంగా ఉంటారు. వీరి ప్రవర్తన, పనితీరు, నడవడం, మాట్లాడటం, తినడం, రాయడం, కూర్చోవడం వంటివి. వీరిలో ముఖ్యంగా కండరాలు బిగుసుకుపోవడం, కదలికలో లోపాలు కనిపిస్తాయి.
వెయ్యి మందిలో ఐదుగురు
ప్రసవ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పోషకాహార లోపం కారణంతో మన జిల్లాలో సెరిబ్రల్ పాల్సీతో జని్మస్తున్న పిల్లల సంఖ్య ప్రతి వెయ్యిలో ఐదు మంది దాకా ఉంటోంది. ముఖ్యంగా కొన్ని రకాల సామాజిక వర్గాలకు చెందిన పిల్లల్లో, నిరక్షరాస్యత అధికంగా ఉన్న కోసిగి, ఆలూరు, ఆస్పరి, కౌతాళం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, హాలహరి్వ, డోన్, కృష్ణగిరి, తుగ్గలి, చిప్పగిరి, కోడుమూరు, గూడూరు తదితర ప్రాంతాల్లో ఇలాంటి పిల్లలు అధికంగా కనిపిస్తారని వైద్యులు చెబుతున్నారు.
వ్యాధి లక్షణాలు
- సెరిబ్రల్ పాల్సీ లక్షణాలు చిన్నపిల్లల్లో మూడు సంవత్సరాల వయస్సులోనే కనిపిస్తాయి. పుట్టిన తర్వాత వారి ఎదుగుదల సమయంలో మిగతా పిల్లల్లో కంటే వీరిలో తేడాలు గమనించవచ్చు.
- శారీరక కదలికలు, కండరాలపై నియంత్రణ లోపిస్తుంది.
- కండరాల బలహీనత, సమన్వయం లోపిస్తుంది.
- కండరాలు బిగుసుకుపోవడం, కండరాల సంకోచ వ్యాకోచాల్లో ఇబ్బంది ఉంటుంది.
- అసాధారణ నడక, సిజర్ వాకింగ్ (కత్తెర కాళ్లు), మునికాళ్లపై నడక ఉంటుంది.
- నడవడం, రాయడం, టైపు చేయడంలో కండరాల సమన్వయం లోపిస్తుంది.
- కండరాల బిగుసు, చిన్నవిగా ఉండటం, సంకోచంగా మారడం.
- వినడం, చూడటం, ఆలోచించడం, మాట్లాడటంలో తేడాలు వస్తాయి.
- బ్లాడర్ (మూత్రాశయం), బొవెల్ (మలాశయం) నియంత్రణ సమస్యలు వస్తాయి.
- అసాధారణ కదలికలు, నోటిలో నుంచి లాలాజలం కారడం, కోపం, చురుకత వంటివి, చేతులు, కాళ్లు వంకరలు తిరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment