ఇప్పటి పిల్లలకు సెల్‌ఫోన్ లేకపోతే నిమిషం కూడా గడవడం లేదు. స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతున్నారు. క్లాస్ బుక్స్ తప్ప కథల పుస్తకాల జోలికిపోయే పిల్లలు చాలా అరుదైపోయారు. కేరళకు చెందిన 12 ఏళ్ల యశోద డి. షెనయ్ మాత్రం ఇందుకు భిన్నం. సెల్‌ఫోన్ కన్నా చేతిలో పుస్తకం అంటేనే ఈ చిన్నారికి మక్కువ. అంతేనా... పుస్తక పఠనంపై ప్రేమతో ఏకంగా గ్రంథాలయమే నెలకొల్పి, ఉచిత సేవలు అందిస్తోంది. చిన్న వయస్సులోనే ఇంత పెద్ద బాధ్యతను ప్రేమగా నిర్వర్తిస్తోన్న యశోద పేరు అనతికాలంలోనే రాష్ట్రమంతా తెలిసింది. జాతీయ మీడియా ఆమెను ప్రముఖంగా చూపించింది. దేశంలో ‘అతిచిన్న’ లైబ్రేరియన్‌గా గుర్తింపు పొందింది.
కొచ్చిలోని మతన్‌చెరీ ప్రాంతానికి చెందిన యశోద షెనయ్.. టీడీ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున పాలియరక్కవు ఆలయం సమీపంలో తన సొంత ఇంట్లోని పై అంతస్థులో కొలువుతీర్చిన యశోద గ్రంథాలయాన్ని కేరళ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ డాక్టర్ కేఎస్ రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఇక్కడి నుంచి ఎవరైనా ఉచితంగా పుస్తకాలు తీసుకెళ్లి చదువుకోవచ్చు. సభ్యత్వానికి ఎటువంటి ఫీజు లేదు. పుస్తకాలు ఆలస్యంగా తిరిగిచ్చినా జరిమానా చెల్లించక్కర్లేదు. ఎందుకంటే, అసలు తాను ఈ ఉచిత గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి లేటు ఫీజే కారణమట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. మూడో తరగతి నుంచే అన్నయ్య అచ్యుత్, అమ్మ బ్రహ్మజ సాయంతో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్న యశోద కోసం ఆమె తండ్రి దగ్గరలోని లైబ్రరీ నుంచి పుస్తకాలు తెస్తుండేవారు. ఆలస్యంగా పుస్తకాలు తిరిగిచ్చినప్పుడు లేటు ఫీజు చెల్లించడంతో పాటు లైబర్రీ కార్డు కోసం నెల నెలా డబ్బులు కడుతుండటంతో చిన్నారి యశోద మదిలో పలు ప్రశ్నలు మెదిలాయి.
డబ్బులు చెల్లించే స్తోమత లేనివారు ఎలా చదువుకుంటారు? ఉచితంగా పుస్తకాలు చదువుకునే అవకాశం లేదా? పుస్తక పఠనానికి పైసలు ఎందుకు? అనే ప్రశ్నలు చిన్నారిని ఆలోచింపజేశాయి. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తానే సొంతంగా ఉచిత గ్రంథాలయం ఏర్పాటు చేసి సామాజిక సేవకు శ్రీకారం చుట్టింది. కుటుంబ సభ్యుల సహకారంతో తన పేరుతో ఏర్పాటు చేసిన ‘యశోద లైబ్రరీ’లో 3,500 వరకు పుస్తకాలు ఉన్నాయి. తన మాతృభాషైన మలయాళం పుస్తకాలకు ఆమె అగ్రపీఠం వేసింది. ఏం పుస్తకాలున్నాయని ఎవరైనా అడిగితే ‘2500 పైగా మలయాళం బుక్స్, వెయ్యి వరకు ఇంగ్లీషు పుస్తకాలున్నాయి. కొంకణి, హిందీ, సంస్కృతం పుస్తకాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉచితంగా ఈ గ్రంథాలయాన్ని అందరూ వినియోగించుకోవచ్చు’ అని ఉత్సాహంగా చెబుతుంది యశోద. 110 మంది సభ్యులున్న ఈ గ్రంథాలయానికి 20 మంది పాఠకులు రెగ్యులర్‌గా వస్తుంటారు. యశోద అన్నయ్య, ఆమె క్లాస్‌మేట్స్‌తో పాటు స్కూల్ టీచర్లు కూడా ఈ లైబ్రరీలో సభ్యత్వం తీసుకోవడం విశేషం. మెట్లు ఎక్కి పైకి వచ్చి చదవలేని వారి కోసం ప్రత్యేకంగా సభ్యత్వ కార్డులు ఇచ్చి ఇంటికే పుస్తకాలు పంపించే ఏర్పాటు చేసి తన మంచి మనసు చాటుకుంది.
నాన్న అండదండలు
యశోదకు పుస్తక పఠనంపై ఆసక్తి కలగడానికి ఆమె తండ్రి దినేశ్ ఆర్. షెనయ్ కారణం. స్వతహాగా ఆర్టిస్టు అయిన ఆయన ఉచిత గ్రంథాలయం ఏర్పాటు చేస్తానన్న కూతుర్ని ఎంతగానో ప్రోత్సహించారు. తన ఇంటి పై అంతస్థును కూతురి లైబ్రరీ కోసం ఇచ్చేశారు.‘చదువుతూ ఎదుగు. తర్కంతో విజ్ఞానాన్ని సముపార్జించు’ అంటూ కేరళ గంథ్రాలయ ఉద్యమ పితామహుడు పీఎన్ పణిక్కర్ చెప్పిన మాటలను సదా స్మరించుకుంటానని, అలాగే ‘చదివినా చదవకపోయినా నువ్వు ఎదుగుతావు. ఒకవేళ నువ్వు చదువుకుంటే వాటి ఫలాలు అందుకుంటావు. చదువుకోకపోతే జీవితంలో వెనుకబడతావు’ అంటూ కన్ జని మాష్ రాసిన వాక్యాలను అందరూ గుర్తుంచుకుంటే మంచిదని సూచించింది.
ఆఘ్రాణిస్తూ చదువుతా
లైబ్రరీని చూసుకుంటూ కూర్చుంటే మరి చదువు సంగతేంటని అడిగితే.. ‘నేను స్కూల్‌కు వెళ్లినప్పుడు అమ్మ, నాన్న, అన్నయ్య ఎవరో ఒకరు లైబ్రరీని చూసుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మా లైబ్రరీ పాఠకుల కోసం తెరచివుంటుంద’ని యశోద సమాధానమిచ్చింది. ఆన్‌లైన్‌లో పుస్తకాలు చదవడం తనకు ఇష్టముండదని, పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని చదివిన అనుభూతి ఈ–బుక్స్ రీడింగ్‌తో రాదని తెలిపింది. ‘పుస్తకం నా చేతికి అందిన వెంటనే ముందుగా దాని వాసనను ఆఘ్రాణిస్తూ ప్రతి పేజీని ఇష్టంగా చదువుతాను. ఇలా అయితేనే చదివినదంతా బుర్రలోకి ఎక్కుతుందని వివరించింది. ఇన్ని మాటలు ఎక్కడ నేర్చావే చిన్నితల్లి అని అడిగామనుకోండి. ‘పుస్తకాలు చదవడం వల్ల’ అంటూ వెంటనే యశోద నుంచి జవాబొస్తుంది. నిజమే అనిపిస్తోంది కదూ!
– పోడూరి నాగ శ్రీనివారావు
సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment