కరోనా కారణంగా పాఠశాలలు లేకపోవడంతో పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఇటు ఆటలు కూడా తగ్గాయి. దీంతో వారు టీవీ, స్మార్ట్ ఫోన్ చూడటం పెరిగింది. వీటి వాడకం వల్ల పిల్లల కళ్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతోంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దంటే .. ‘ఐ’తే టీవీ, లేకుంటే స్మార్ట్ ఫోన్ చూడటం ప్రధానంగా మారింది. కరోనా కారణంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థులు వేసవి సెలవులకు ముందు నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. పరీక్షలు సైతం రద్దయ్యాయి. దీంతో కొన్ని విద్యాసంస్థలు, గురుకులాలు మాత్రం విద్యార్థులకు ఆన్‌లైన్లో పాఠాలు బోధిస్తున్నాయి. దీంతో పాటు విద్యార్థులు ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడంతో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగింది. దీనికితోడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటంతో పాటు పలు యాప్‌లను వినియోగిస్తూ రొజంతా గడుపుతున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకం గత నాలుగు నెలల నుంచి బాగా పెరిగి పోవడంతో గతంలో కంటే ఇప్పుడు రెట్టింపు స్థాయిలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అలాగే కళ్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
♦ కరోనా కష్టకాలంలో స్మార్ట్‌ఫోన్లతో జీవన శైలిలో మార్పులు
♦ తెరుచుకోని విద్యాసంస్థలు
♦ ఆన్‌లైన్ తరగతులతో పెరిగిన కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ల వాడకం
♦ చూపు మందగించే ప్రమాదం ఉందంటున్న వైద్య నిపుణులు
♦ అవసరం ఉన్నంతవరకే వాడాలని సూచన
స్మార్ట్‌ఫోన్ అవసరం మేరకు వినియోగిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. కాగా లాక్‌డౌన్, సెలవులు, తరగతులు సోషల్ యాప్స్ అంటూ అధికంగా వినియోగిస్తుండటతో స్మార్ట్ ఫోన్ అనేక ఆరోగ్య సమస్యలకు మూలంగా మారింది. ఏడాది పిల్లల నుంచి ఈస్మార్ట్ ఫోన్‌ల వినియోగం పెరగుతుంది. ఏడ్చే పిల్లలను ఊరుకోపెట్టాలన్నా, చిన్నారులను బుజ్జగించి అన్నం తినిపించాలన్నా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ దిక్కుగా మారింది. స్మార్ట్‌ఫోన్‌లో బొమ్మలు, పాటలు చూపిస్తేనే అన్నం తింటామనే పిల్లల నుంచి యుక్త వయసుకు చేరుకున్న వారిలో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైంది. స్మార్ట్‌ఫోన్ నుంచి వచ్చే రంగురంగుల కిరణాలు కంటి కార్నియాపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కంటి సమస్యలతో కంటి వైద్యులను ఆశ్రయిస్తున్న వారిలో సగం మంది స్మార్ట్‌ఫోన్‌ను అధికంగా వాడడంతో కార్నియా సమస్యలు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. నిత్యం 5 నుంచి 6 గంటలు ఫోన్ వాడే వారిలో నేత్రాలు డ్రై (పొడిగా మారడం) అవడంతో కార్నియా (నల్లగుడ్డు) సమస్య వస్తున్నట్లు చెబుతున్నారు. అలా వస్తున్న వారిలో 15 నుంచి 25సంవత్సరాల మధ్య వయసున్న వారే అధికంగా ఉంటున్నారని 30 నుంచి 55ఏళ్ల మధ్య వయస్సు వారిలో వృత్తిరీత్యా కంప్యూటర్‌పై పనిచేస్తుండటంతో సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు.
అనారోగ్యం వైపు అడుగులు
నిత్యం 5నుంచి 6గంటలు స్మార్ట్ ఫోన్ వాడేవారిలో కళ్లు డ్రై అవడంతో కార్నియా సమస్యలకు గురవుతుంది. అలాంటి వారికి కళ్లు మంటలు, దురదలు రావడం, వెలుతురును సరిగా చూడక పోవడం, కళ్లు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈదశలో సరైన చికిత్స పొందకుంటే నల్లగుడ్డు దెబ్బతిని చూపు మందగించే అవకాశాలు ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్ అధికంగా వాడటంతో వచ్చే ఇబ్బందులు
మెడ నొప్పులు, వెన్నెముక డిస్క్‌లు ఒత్తిడికి గురై నొప్పులతో సతమతమవడం, నరాలు బిగుసుకుపోవడం, చేతి వేళ్లకు తరుచూ తిమ్మిర్లు రావడం, సర్శ కోల్పోవడం, జీవన క్రియలు మందగించడం, వెన్ను నొప్పులు, నిద్రలేమి, తుంటి కండరాలు పట్టేయడం.
స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడొద్దు
స్మార్ట్‌ఫోన్ వచ్చిన తరువాత ప్రపంచం కళ్లముందు ఉంటుంది. దీంతో వినియోగం సైతం పెరిగింది. కాగా అవసరం మేరకు వినియోగించాలి. ఎక్కువసేపు వాడటంవల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం చిన్న పిల్లలు, యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను వాడటంతో కంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఏదైన కంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే చికిత్స చేయించుకోవాలి. లేకుంటే కార్నియా దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఫోన్ వాడే ముందు జాగ్రత్తలు తీసుకుని అవసరం మేరకు మాత్రమే వాడటం మంచిది. కంటిచూపు మెరుగు పడేందుకు గాను విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలు, పండ్లు, కోడిగుడ్లు తినాలి. – డాక్టర్ వెంకటస్వామి, కౌడిపల్లి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
♦ స్మార్ట్ ఫోన్‌లో ౖబ్రెట్‌నెస్ తక్కువగా పెట్టుకుని ఉపయోగించాలి.
♦ కళ్లకు ఫోన్‌కు 15సెంటీమీటర్ల దూరంలో ఉంచి చూడాలి.
♦ ముఖానికి దగ్గరగా పెట్టుకోవద్దు.
♦ 20నిమిషాల పాటు ఫోన్, కంప్యూటర్ వాడిన తరువాత 20 సెకన్లుపాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడంవల్ల కనురెప్పలు వేయడంతో నల్లగుడ్డు పొరపైకి నీరుచేరి కల్లు డ్రై అవకుండా దోహదపడుతుంది.
♦ ఎట్టి పరిస్థితులల్లో చీకట్లో స్మార్ట్ ఫోన్ వినియోగించకూడదు.
♦ కంప్యూటర్‌పై అధిక సమయం పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసెస్ వాడాలి.
♦ రోజులో ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్, కంప్యూటర్స్‌పై పనిచేసేవారు ఐ డ్రాప్స్ వాడడంతో‡ దుష్పలితాలు లేకుండా చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment