మంచిమాట.. ముందు నిన్ను నీవు సరిదిద్దుకో! | You have to uplift your family before you can uplift the community | Sakshi
Sakshi News home page

మంచిమాట.. ముందు నిన్ను నీవు సరిదిద్దుకో!

Published Mon, Jan 10 2022 12:20 AM | Last Updated on Mon, Jan 10 2022 12:20 AM

You have to uplift your family before you can uplift the community - Sakshi

ఆనందం అంటే బయటికి నిరూపించలేనిది. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అనుభవించే స్థితి. ఒక్కో పదార్థం తినడం వల్ల ఒక్కో రుచికి సంబంధించిన అనుభూతి కలుగుతుంది. అలా ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది..? ఆ అనుభూతిని ఎలా పొందాలి..? ఆనందానికి అర్థం పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? అది తెలుసుకుంటే ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు.

నీ గురించి నువ్వు ఆలోచిస్తే, నీవు ఎవరో తెలుసుకుంటే చాలు. నిజానికి నీవు ఎవరు అంటే ఆ భగవంతుడివే. ఆ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది. నీ గురించి నీవు తెలుసుకోవడం మొదలుపెట్టగానే అంతరంగం శుద్ధి కావడం మొదలవుతుంది.

వేరే వారి గురించి ఆలోచిస్తే నీ అంతరంగం కలుషితమవుతుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటే వారి సమాచారం, వారి భావాలు నీ మనసు లోకి ప్రవేశించి నీ మీద స్వారీ చేస్తాయి. నీవు ఎవరి గురించి అయితే అతిగా ఆలోచిస్తే నీ జీవితం వారికి సమర్పించినట్లు, మీ వ్యక్తిత్వం సహజత్వాన్ని కోల్పోయి అతనికి నీవు బానిసగా ఉన్నట్లే. ఇతరుల పట్ల ఆలోచిస్తున్నాను అంటే మనం వారిపై రాగద్వేషాలు పెంచుకున్నట్లే.

ప్రస్తుతం మనుషులు తన జీవితం తను జీవించటం మర్చిపోయి ఇతరుల గురించి అనవసరంగా ఆలోచించుకుంటూ లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు ఈనాటి మానవుడు. ఒకసారి మనసు కలుషితమై పరిపరివిధాల అనవసరమైన విషయాల గురించి మనసులో ఆలోచన చేసి దాని ద్వారా శరీరంలో ప్రాణ శక్తి తగ్గి అనేక రకాల రసాయనిక చర్యలు జరిగి తద్వారా అవయవాలు పని చేయక అనేక రకాల జబ్బులు కలిగి శరీరం తన శక్తిని కోల్పోయి దీర్ఘకాలిక రోగాల పాలవుతున్నారు. మానవునికి ఈ శరీరం ఉంటేనే ఏ కార్యమైనా చేయగలిగేది.

నీవు జీవించేది నీ కోసమా..? లేక ఇతరుల కోసమా..? ఆలోచించుకోవాలి. ఇతరుల కోసం జీవిస్తున్నాను అని నీవు అనుకుంటే నీవు మాయలో ఉన్నట్టే... బానిసత్వంలో బతుకుతున్నట్టే. సమాజాన్ని ఉద్ధరించే ముందు నిన్ను నీ కుటుంబాన్ని ఉద్ధరించాలి. నీ కుటుంబాన్ని కాకుండా సమాజాన్ని ఉద్ధరించే ఆలోచన చాలా ప్రమాదకరం. ఇంతవరకు ఎవరు అది సాధించలేదు. సేవ చేయాలి కానీ నీవే తర్వాత సేవ చేయించుకునే పరిస్థితి ఏర్పడకూడదు.

నిజానికి సేవ అంటే దాని నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు, అలా ఆశించి సేవ చేస్తే కర్మ రెట్టింపు అవుతుంది. సమాజం చెడిపోయింది. దానిని మంచి వైపు నడిపించాలని తపనతో తమ కుటుంబాన్ని మంచి వైపు నడిపించడం మరచిపోతున్నారు. సమాజాన్ని ఉద్ధరించడం తప్పనిసరి అవసరమే కానీ దానికి ఓ పద్ధతి ఉంది. ముందు తనని తను ఉద్ధరించుకోకుండా, తన బాధ్యతలు, బంధాలను, దాటకుండా సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం సరికాదు. అందుకు సమాజం కూడా సహకరించదు.

నీ కోసం నీవు జీవించడమే నిన్ను నమ్ముకున్న వాళ్లకు నీవు ఇచ్చే అత్యున్నత జీవితం. నిన్ను నీవు ఉద్ధ్దరించి ఉన్నప్పుడే సమాజాన్ని సరి చేసే అర్హత వస్తుంది. కాబట్టి మొదలు నిన్ను నీవు సరి చేసుకో. ఆ తర్వాతనే సమాజం గురించి ఆలోచన చేయి. ఈ ప్రపంచంలో ఎవరి జీవితం వారిది. ఎవరి కర్మలు వారివి. కాబట్టి ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణలో ఉండాలి. నీకు ప్రపంచాన్ని మార్చే అర్హత వచ్చినప్పుడు ప్రపంచం  నిన్ను వదలదు. నీకు ఆ అర్హత లేకుంటే సమాజం నిన్ను స్వీకరించదు. మేధావులు మాకు అంతా తెలుసు అనుకుంటారు కానీ అదే వారి బలహీనత. తమ ద్వారా సమాజం మారుతుంది అనుకుంటారు.

 భౌతిక పరమైన అభివృద్ధి ద్వారానే మనిషి ఆనందంగా జీవిస్తున్నా అనుకుంటున్నాడు. అందుకే భౌతికమైన అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నాడు.
 అందరూ తెలుసుకోవాల్సిన నగ్నసత్యం మనిషి జీవితకాలం పరితపించేది ఆనందం కోసమే. కానీ ఆ ఆనందం పొందాలనే తపనలో  భౌతిక, శారీరక సుఖాలే ఆనందం అనే భ్రమలో నిజమైన ఆనందాన్ని పొందలేక అసంతృప్తి పడుతున్నాడు. దీనికి మూల కారణం తన గురించి తను ఆలోచించుకోలేకపోవడం. నీ గురించి నీవు తెలుసుకుంటూ నీ జీవితం గురించి ఆలోచించుకోవడమే దీనికి పరిష్కారం.

 మనిషి ఆనందంగా ఉండలేక పోవడానికి కొంత పూర్వ జన్మ, ఇంకొంత ఈ జన్మలో చేసిన కర్మలు కారణం. ఈ కర్మలను క్రమేణా నివృత్తి చేసుకుంటూ వాటి తీవ్రతను తగ్గించుకొని అనవసరమైన వాటికి విలువ ఇవ్వకుండా అవసరమైన విషయాలకు మాత్రమే విలువ ఇస్తూ ఫలితం పొందితే ఆనందం సిద్ధిస్తుంది.
ఆనందం అంటే ఎవరికి వారు స్వయంగా అనుభవించే స్థితి. ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు.

► భౌతిక సంపద పెరగడం అంటే మానసిక సంపద తరగడమే.
► సంపద పెరిగితే సంతృప్తి రావాలి
► సంతృప్తిని మించిన సంపద లేదు.
► ఆనందం లేనప్పుడు  జీవితానికి అర్థం లేదు,
► మనం ఎందుకు జీవిస్తున్నాం ఎలా జీవిస్తున్నామో తెలుసుకోవాలి.  
 ► ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా జీవిస్తాడు.


– భువనగిరి కిషన్‌ యోగి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement