Happiness Hormone
-
మంచిమాట.. ముందు నిన్ను నీవు సరిదిద్దుకో!
ఆనందం అంటే బయటికి నిరూపించలేనిది. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అనుభవించే స్థితి. ఒక్కో పదార్థం తినడం వల్ల ఒక్కో రుచికి సంబంధించిన అనుభూతి కలుగుతుంది. అలా ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది..? ఆ అనుభూతిని ఎలా పొందాలి..? ఆనందానికి అర్థం పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? అది తెలుసుకుంటే ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు. నీ గురించి నువ్వు ఆలోచిస్తే, నీవు ఎవరో తెలుసుకుంటే చాలు. నిజానికి నీవు ఎవరు అంటే ఆ భగవంతుడివే. ఆ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది. నీ గురించి నీవు తెలుసుకోవడం మొదలుపెట్టగానే అంతరంగం శుద్ధి కావడం మొదలవుతుంది. వేరే వారి గురించి ఆలోచిస్తే నీ అంతరంగం కలుషితమవుతుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటే వారి సమాచారం, వారి భావాలు నీ మనసు లోకి ప్రవేశించి నీ మీద స్వారీ చేస్తాయి. నీవు ఎవరి గురించి అయితే అతిగా ఆలోచిస్తే నీ జీవితం వారికి సమర్పించినట్లు, మీ వ్యక్తిత్వం సహజత్వాన్ని కోల్పోయి అతనికి నీవు బానిసగా ఉన్నట్లే. ఇతరుల పట్ల ఆలోచిస్తున్నాను అంటే మనం వారిపై రాగద్వేషాలు పెంచుకున్నట్లే. ప్రస్తుతం మనుషులు తన జీవితం తను జీవించటం మర్చిపోయి ఇతరుల గురించి అనవసరంగా ఆలోచించుకుంటూ లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు ఈనాటి మానవుడు. ఒకసారి మనసు కలుషితమై పరిపరివిధాల అనవసరమైన విషయాల గురించి మనసులో ఆలోచన చేసి దాని ద్వారా శరీరంలో ప్రాణ శక్తి తగ్గి అనేక రకాల రసాయనిక చర్యలు జరిగి తద్వారా అవయవాలు పని చేయక అనేక రకాల జబ్బులు కలిగి శరీరం తన శక్తిని కోల్పోయి దీర్ఘకాలిక రోగాల పాలవుతున్నారు. మానవునికి ఈ శరీరం ఉంటేనే ఏ కార్యమైనా చేయగలిగేది. నీవు జీవించేది నీ కోసమా..? లేక ఇతరుల కోసమా..? ఆలోచించుకోవాలి. ఇతరుల కోసం జీవిస్తున్నాను అని నీవు అనుకుంటే నీవు మాయలో ఉన్నట్టే... బానిసత్వంలో బతుకుతున్నట్టే. సమాజాన్ని ఉద్ధరించే ముందు నిన్ను నీ కుటుంబాన్ని ఉద్ధరించాలి. నీ కుటుంబాన్ని కాకుండా సమాజాన్ని ఉద్ధరించే ఆలోచన చాలా ప్రమాదకరం. ఇంతవరకు ఎవరు అది సాధించలేదు. సేవ చేయాలి కానీ నీవే తర్వాత సేవ చేయించుకునే పరిస్థితి ఏర్పడకూడదు. నిజానికి సేవ అంటే దాని నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు, అలా ఆశించి సేవ చేస్తే కర్మ రెట్టింపు అవుతుంది. సమాజం చెడిపోయింది. దానిని మంచి వైపు నడిపించాలని తపనతో తమ కుటుంబాన్ని మంచి వైపు నడిపించడం మరచిపోతున్నారు. సమాజాన్ని ఉద్ధరించడం తప్పనిసరి అవసరమే కానీ దానికి ఓ పద్ధతి ఉంది. ముందు తనని తను ఉద్ధరించుకోకుండా, తన బాధ్యతలు, బంధాలను, దాటకుండా సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం సరికాదు. అందుకు సమాజం కూడా సహకరించదు. నీ కోసం నీవు జీవించడమే నిన్ను నమ్ముకున్న వాళ్లకు నీవు ఇచ్చే అత్యున్నత జీవితం. నిన్ను నీవు ఉద్ధ్దరించి ఉన్నప్పుడే సమాజాన్ని సరి చేసే అర్హత వస్తుంది. కాబట్టి మొదలు నిన్ను నీవు సరి చేసుకో. ఆ తర్వాతనే సమాజం గురించి ఆలోచన చేయి. ఈ ప్రపంచంలో ఎవరి జీవితం వారిది. ఎవరి కర్మలు వారివి. కాబట్టి ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణలో ఉండాలి. నీకు ప్రపంచాన్ని మార్చే అర్హత వచ్చినప్పుడు ప్రపంచం నిన్ను వదలదు. నీకు ఆ అర్హత లేకుంటే సమాజం నిన్ను స్వీకరించదు. మేధావులు మాకు అంతా తెలుసు అనుకుంటారు కానీ అదే వారి బలహీనత. తమ ద్వారా సమాజం మారుతుంది అనుకుంటారు. భౌతిక పరమైన అభివృద్ధి ద్వారానే మనిషి ఆనందంగా జీవిస్తున్నా అనుకుంటున్నాడు. అందుకే భౌతికమైన అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. అందరూ తెలుసుకోవాల్సిన నగ్నసత్యం మనిషి జీవితకాలం పరితపించేది ఆనందం కోసమే. కానీ ఆ ఆనందం పొందాలనే తపనలో భౌతిక, శారీరక సుఖాలే ఆనందం అనే భ్రమలో నిజమైన ఆనందాన్ని పొందలేక అసంతృప్తి పడుతున్నాడు. దీనికి మూల కారణం తన గురించి తను ఆలోచించుకోలేకపోవడం. నీ గురించి నీవు తెలుసుకుంటూ నీ జీవితం గురించి ఆలోచించుకోవడమే దీనికి పరిష్కారం. మనిషి ఆనందంగా ఉండలేక పోవడానికి కొంత పూర్వ జన్మ, ఇంకొంత ఈ జన్మలో చేసిన కర్మలు కారణం. ఈ కర్మలను క్రమేణా నివృత్తి చేసుకుంటూ వాటి తీవ్రతను తగ్గించుకొని అనవసరమైన వాటికి విలువ ఇవ్వకుండా అవసరమైన విషయాలకు మాత్రమే విలువ ఇస్తూ ఫలితం పొందితే ఆనందం సిద్ధిస్తుంది. ఆనందం అంటే ఎవరికి వారు స్వయంగా అనుభవించే స్థితి. ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు. ► భౌతిక సంపద పెరగడం అంటే మానసిక సంపద తరగడమే. ► సంపద పెరిగితే సంతృప్తి రావాలి ► సంతృప్తిని మించిన సంపద లేదు. ► ఆనందం లేనప్పుడు జీవితానికి అర్థం లేదు, ► మనం ఎందుకు జీవిస్తున్నాం ఎలా జీవిస్తున్నామో తెలుసుకోవాలి. ► ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా జీవిస్తాడు. – భువనగిరి కిషన్ యోగి -
ఆనందం ఇచ్చే ఆహారం ఇదే...
ఆహ్లాదాహారం సెరిటోనిన్: ఇది మనకు సంతోష భావనను ఇస్తుంది. అందుకే దీన్ని ‘హ్యాపీనెస్ హార్మోన్’ అంటారు. డిప్రెషన్, మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం, నిద్ర పాటర్న్స్ మారిపోవడం వంటి మానసిక సమస్యల్లో దీని లోపం ఎక్కువ. ఎక్కడ దొరుకుతుంది: పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. గోరువెచ్చటి నీటితో స్నానం చేసి, మీరు రోజూ రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి. వెంటనే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలిగి, మంచి నిద్రపడుతుంది. దానికి కారణం పాలల్లోని ట్రిప్టోఫాన్... సెరిటోనిన్ను స్రవించేలా చేయడమే. అలాగే కోడిమాంసం, వెన్నతో కూడా ఇది లభిస్తుంది. విటమిన్ బి6 లభించే పొట్టుతో ఉండే ఆహారధాన్యాలు, బఠాణీలు, కాలీఫ్లవర్, అవకాడోలతో పాటు... విటమిన్ బి12 ఉండే కాలేయం, కిడ్నీ, తాజామాంసం, క్యాబేజీ, బ్రకోలీ వంటివి కూడా సెరిటోనిన్ స్రవించేందుకు దోహదపడతాయి. సెరిటోనిన్ నేరుగా లభ్యం కావాలంటే పైనాపిల్, అరటిపండ్లు, ప్లమ్ తినండి. ఎండార్ఫిన్ : మనలో యాంగై్జటీని తొలగించే రసాయనం ఇది. మనలో ఇది స్రవించినప్పుడు ‘ఫీల్ గుడ్’ భావన కలుగుతుంది. ఏదైనా నొప్పి కలిగినప్పుడు దాని నుంచి ఉపశమన భావన కలగడానికి దోహదం చేసేది ఎండార్ఫినే. సాధారణంగా వ్యాయామం చేసే వాళ్లు, అంతా పూర్తయ్యాక ఒక తృప్తికరమైన, సంతోషకరమైన ఫీలింగ్‌లో ఉంటారు. దానికి కారణం ఈ ఎండార్ఫిన్. ఎక్కడ దొరుకుతుంది: ఎక్సర్జైజ్తో పాటు ఎండార్ఫిన్ స్రవించేందుకు చాకోలెట్లు కొంతమేరకు దోహదపడతాయి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీస్ ఎండార్ఫిన్ స్రావానికి బాగా ఉపయోగపడతాయి. ఇక తియ్యటి ద్రాక్షలో కూడా ఎండార్ఫిన్స్ ఉంటాయి. ∙డోపమైన్ : మనం సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే చురుకుదనానికి కారణం డోపమైన్. ఏదైనా వేదన లేదా బాధ కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి అవసరమైన చురుకుదనాన్ని ఇచ్చేదీ ఇదే. ఎక్కడ దొరుకుతుంది: పక్వానికి వచ్చిన అరటి పండులో టైరోసిన్ పాళ్లు ఎక్కువ. ఈ టైరోసిన్ అనే అమైనోఆసిడ్... డోపమైన్ స్రవించేలా చేస్తుంది. ఇక బీట్రూట్లో ఉంటే బీటైన్ అనే అమైనో ఆసిడ్ ‘ఎస్–ఎడినోస్ల్మెథోయినైన్’ (శామ్–ఈ)ని స్రవించేలా ప్రేరేపిస్తుంది. మళ్లీ ఈ ‘శామ్–ఈ’... డోపమైన్‌తో పాటు సెరిటోనిన్నూ స్రవించేలా చేస్తుంది. మాంసాహారం, గుడ్లు, చేపలు, సీఫుడ్స్‌లో ఉండే ప్రోటీన్లు నార్ ఎపీనెఫ్రిన్తో పాటు డోపమైన్‌ను స్రవించేలా చేసే మంచి మూడ్స్ బూస్టర్ ఆహారమే. ఒక్క మాట... చేపలు తినే సమాజాలలో డిప్రెషన్ కేసులు తక్కువ. ఇలా ఎందుకు జరుగుతుందనే అంశం మీద పరిశోధనలు జరిగాయి. ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చేపల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు – ఆనందాన్ని కలిగించే మెదడు స్రావాలు నిత్యం మెయింటైన్ అయ్యేలాచేసేందుకు దోహపపడతాయని తేలింది. ఫినైల్ ఇథిలమైన్ : మీరు కొత్తగా ఒక స్నేహితుడితోనో లేదా స్నేహితురాలితోనో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి. ఆ కొత్తలో ఉన్న ఆహ్లాదభావన ఎలా కలుగుతుందో తెలుసా? అవన్నీ ఫినైల్ ఇథమైన్ ప్రభావం వల్లనే. ఎక్కడ దొరుకుతుంది : చాకోలెట్లోని ఫినైల్ ఎథిలమైన్ మూడ్స్‌ను ఆహ్లాదంగా మారుస్తుంది. ఈ ఆహారం వద్దు ప్లీజ్... : కాఫీలోని కెఫిన్, సిగరెట్‌లోని నికోటిన్, ఆల్కహాల్, నిషేధిత మాదకద్రవ్యాలు అకస్మాత్తుగా సెరిటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్ పాళ్లను ఎక్కవయ్యేలాగానూ, అనియంత్రితంగానూ విడుదల చేస్తాయి. దాంతో తొలుత హుషారు గా అనిపించినా, తర్వాత ఈ రసాయనాల సమన్వయ లోపం వల్ల మన మూడ్స్కూ, ఆరోగ్యానికీ హాని కలుగుతుంది.