ఆనందం ఇచ్చే ఆహారం ఇదే...
ఆహ్లాదాహారం
సెరిటోనిన్: ఇది మనకు సంతోష భావనను ఇస్తుంది. అందుకే దీన్ని ‘హ్యాపీనెస్ హార్మోన్’ అంటారు. డిప్రెషన్, మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం, నిద్ర పాటర్న్స్ మారిపోవడం వంటి మానసిక సమస్యల్లో దీని లోపం ఎక్కువ.
ఎక్కడ దొరుకుతుంది: పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. గోరువెచ్చటి నీటితో స్నానం చేసి, మీరు రోజూ రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి. వెంటనే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలిగి, మంచి నిద్రపడుతుంది. దానికి కారణం పాలల్లోని ట్రిప్టోఫాన్... సెరిటోనిన్‌ను స్రవించేలా చేయడమే. అలాగే కోడిమాంసం, వెన్నతో కూడా ఇది లభిస్తుంది. విటమిన్ బి6 లభించే పొట్టుతో ఉండే ఆహారధాన్యాలు, బఠాణీలు, కాలీఫ్లవర్, అవకాడోలతో పాటు... విటమిన్ బి12 ఉండే కాలేయం, కిడ్నీ, తాజామాంసం, క్యాబేజీ, బ్రకోలీ వంటివి కూడా సెరిటోనిన్ స్రవించేందుకు దోహదపడతాయి. సెరిటోనిన్ నేరుగా లభ్యం కావాలంటే పైనాపిల్, అరటిపండ్లు, ప్లమ్ తినండి.
ఎండార్ఫిన్ : మనలో యాంగై్జటీని తొలగించే రసాయనం ఇది. మనలో ఇది స్రవించినప్పుడు ‘ఫీల్ గుడ్’ భావన కలుగుతుంది. ఏదైనా నొప్పి కలిగినప్పుడు దాని నుంచి ఉపశమన భావన కలగడానికి దోహదం చేసేది ఎండార్ఫినే. సాధారణంగా వ్యాయామం చేసే వాళ్లు, అంతా పూర్తయ్యాక ఒక తృప్తికరమైన, సంతోషకరమైన ఫీలింగ్‌లో ఉంటారు. దానికి కారణం ఈ ఎండార్ఫిన్.
ఎక్కడ దొరుకుతుంది: ఎక్సర్‌జైజ్‌తో పాటు ఎండార్ఫిన్ స్రవించేందుకు చాకోలెట్లు కొంతమేరకు దోహదపడతాయి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీస్ ఎండార్ఫిన్ స్రావానికి బాగా ఉపయోగపడతాయి. ఇక తియ్యటి ద్రాక్షలో కూడా ఎండార్ఫిన్స్ ఉంటాయి.
∙డోపమైన్ : మనం సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే చురుకుదనానికి కారణం డోపమైన్. ఏదైనా వేదన లేదా బాధ కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి అవసరమైన చురుకుదనాన్ని ఇచ్చేదీ ఇదే.
ఎక్కడ దొరుకుతుంది: పక్వానికి వచ్చిన అరటి పండులో టైరోసిన్ పాళ్లు ఎక్కువ. ఈ టైరోసిన్ అనే అమైనోఆసిడ్... డోపమైన్ స్రవించేలా చేస్తుంది. ఇక బీట్‌రూట్‌లో ఉంటే బీటైన్ అనే అమైనో ఆసిడ్ ‘ఎస్–ఎడినోస్ల్‌మెథోయినైన్’ (శామ్–ఈ)ని స్రవించేలా ప్రేరేపిస్తుంది. మళ్లీ ఈ ‘శామ్–ఈ’... డోపమైన్‌తో పాటు సెరిటోనిన్‌నూ స్రవించేలా చేస్తుంది. మాంసాహారం, గుడ్లు, చేపలు, సీఫుడ్స్‌లో ఉండే ప్రోటీన్లు నార్ ఎపీనెఫ్రిన్‌తో పాటు డోపమైన్‌ను స్రవించేలా చేసే మంచి మూడ్స్ బూస్టర్ ఆహారమే.
ఒక్క మాట... చేపలు తినే సమాజాలలో డిప్రెషన్ కేసులు తక్కువ. ఇలా ఎందుకు జరుగుతుందనే అంశం మీద పరిశోధనలు జరిగాయి. ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చేపల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు – ఆనందాన్ని కలిగించే మెదడు స్రావాలు నిత్యం మెయింటైన్ అయ్యేలాచేసేందుకు దోహపపడతాయని తేలింది.
ఫినైల్ ఇథిలమైన్ : మీరు కొత్తగా ఒక స్నేహితుడితోనో లేదా స్నేహితురాలితోనో ఫ్రెండ్‌షిప్ చేశారనుకోండి. ఆ కొత్తలో ఉన్న ఆహ్లాదభావన ఎలా కలుగుతుందో తెలుసా? అవన్నీ ఫినైల్ ఇథమైన్ ప్రభావం వల్లనే.
ఎక్కడ దొరుకుతుంది : చాకోలెట్‌లోని ఫినైల్ ఎథిలమైన్ మూడ్స్‌ను ఆహ్లాదంగా మారుస్తుంది.
ఈ ఆహారం వద్దు ప్లీజ్... : కాఫీలోని కెఫిన్, సిగరెట్‌లోని నికోటిన్, ఆల్కహాల్, నిషేధిత మాదకద్రవ్యాలు అకస్మాత్తుగా సెరిటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్ పాళ్లను ఎక్కవయ్యేలాగానూ, అనియంత్రితంగానూ విడుదల చేస్తాయి. దాంతో తొలుత హుషారు గా అనిపించినా, తర్వాత ఈ రసాయనాల సమన్వయ లోపం వల్ల మన మూడ్స్‌కూ, ఆరోగ్యానికీ హాని కలుగుతుంది.