మనసును వ్యాకుల పరిచే డిప్రెషన్
మీకు తెలుసా?
డిప్రెషన్... ఈ సమస్య ఎలా వచ్చి పడుతుందో కానీ చాలా మందిని చాలా సందర్భాల్లో వేధిస్తుంటుంది. మానసికంగా మొదలై శారీరక సమస్యలకు దారి తీసే ఈ రుగ్మతను ఎవరికి వారే స్వయంగా నియంత్రించుకోవచ్చు.
జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చీకాకు పెడుతున్న అంశం మనసులోకి రానంతగా వ్యాపకాలను కల్పించుకోవడం అన్నమాట.
ఒకసారి చిన్నప్పటి స్నేహితులందరినీ గుర్తు చేసుకుని కలవడానికి ప్రయత్నించాలి. దూరాన ఉన్న వారితో ఫోన్ చేసి కబుర్లు చెప్పాలి.
కంటినిండా నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే నిద్రమాత్రలను ఆశ్రయించవద్దు. రాత్రి భోజనంలో నిద్రను పెంచే ఆహారాన్ని (నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం వంటివి) తీసుకోవాలి.
రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట సేపు నడక, యోగసాధన, జిమ్ వంటివీ ఏదో ఒక వ్యాయామం చేయాలి. వ్యాయామంతో దేహంలో ఫీల్‌గుడ్ హార్మోన్‌లు విడుదలవుతాయి. అవి మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి.
జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేసి తాజాపండ్లు, కూరగాయలను తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి.
ఆలోచనలను సానుకూల దృక్పథంలో సాగనివ్వాలి.