పర్యాటక రంగంలో ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది స్లీప్ టూరిజం. ఈ కొత్త కాన్సెప్ట్‌కు ఆదరణ క్రమంగా పెరుగు తోంది. స్లీప్ టూరిజం అంటే ఆహ్లాద కరమైన పర్యాటక ప్రదేశానికి వెళ్లి ఆనందంగా నిద్రపోతూ సేదదీరడమే. ప్రధానంగా వేళా పాళా లేకుండా పని ఒత్తిడిలో మునిగి తేలుతున్న కార్పొరేట్ ఉద్యోగులు, ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ , యువత ఈ స్లీప్ టూరిజంపై ఆసక్తి చూపుతోంది. స్లీప్ టూరిజం సేవలు అందించే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం రండి!
జీవనశైలి మార్పులు, మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగం కూడా ట్రెండ్ మార్చుకుంటోంది. అలా వచ్చిందే స్లీప్ టూరిజం. బిజీ బిజీ జీవితంనుంచి విశ్రాంతి, కోరుకునే వారి అభిరుచులకు అనుగుణంగానే అన్ని రంగాల్లాగే పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సస్టెయినబుల్ టూరిజం, ఫుడ్ టూరిజం, ఎక్స్‌పరిమెంటల్ టూరిజం, వెల్‌నెస్ టూరిజం.. ఈ జాబితాలో వచ్చిందే స్లీప్ టూరిజం. దీన్నే ‘నాప్‌కేషన్స్' లేదా 'నాప్ హాలిడేస్' అని కూడా పిలుస్తారు.
స్లీప్ టూరిజంలో యోగ, స్విమ్మింగ్, స్పా, పార్లర్ సెషన్‌లు , ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు గంటల కొద్దీ నిద్ర ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పచ్చని ప్రకృతి, కొండలు, లోయలు, సెలయేరుల సవ్వడి, బుజ్జి పిట్టల కిలకిలా రావాలు వీటి మధ్య హాయిగా సేదతీరడం అన్నమాట. రొమాంటిక్ అనుభవం కావాలనుకుంటే జంటగా వెళ్లవచ్చు, లేదా ఏకాంతంగా గడపాలనుకుంటే సోలోగా కూడా వెళ్లవచ్చు. అసలు ఈ ఊహే కొండంత ప్రశాంతతనిస్తుంది కదా.
మరింకెందుకు ఆలస్యం. భారతదేశంలో స్లీప్ టూరిజం ప్రదేశాలు, రిసార్ట్‌లు, ధ్యానం, ఆయుర్వేద చికిత్సలు, థెరపీలు,నిద్రకోసం మంచి ప్యాకేజీలను అందించే కొన్ని ప్రదేశాలను చెక్ చేద్దాం.
కూర్గ్: కూర్గ్ కర్నాటకలోని ఒక సుందరమైన హిల్ స్టేషన్. అక్కడి పచ్చదనం , ప్రశాంతమైన వాతావరణం స్లీప్ టూరిజానికి బెస్ట్ డెస్టినేషన్.
లేహ, లడాఖ్: అందమైన సరస్సులు, కొండలు, లోయలు, కేవలం ఎండకాలంలో మాత్రమే కాదు ఏ సీజన్‌లో అయినా మనల్ని ఆకట్టుకునే చక్కటి ప్రకృతి రమణీయ దృశ్యాలు మంచి ఆహ్లాదాన్ని పంచుతాయి.
అలెప్పీ..
కేరళలోని అలెప్పీ బ్యాక్ వాటర్స్ అందాలో మంచి పర్యాటక ప్రదేశంగా పాపులర్. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వీలుగా, హౌస్‌బోట్లలో హాయిగా నిద్రపోయే సౌకర్యాలున్నాయి.
గోవా: స్లీప్ టూరిజం సేవలకు గోవా మరో మంచి ఆప్షన్. అప్పుడే లేలేత ఎండ ..అప్పుడే చిరుజల్లులొస్తాయి భలే ఉంటుంది. ఇక్కడ రిసార్ట్‌లు ,హోటళ్లు , స్పా చికిత్సలు, యోగా, మంచి ఆహారం తదితర సౌకర్యాలతో మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి.
మైసూర్: మీరు ఒక వేళ దేవాలయాలను సందర్శించి, దైవ దర్శనం చేసుకొని, ప్రశాతంత పొందాలనుకుంటే మైసూర్ చక్కటి. ఇక్కడ స్లీప్ టూరిజం అవకాశాలు బాగానే ఉన్నాయి.
రిషికేశ్: చుట్టూ పర్వతాలు ,బియాస్ నది పరవళ్లు, చల్లని గాలులతో రిషికేష్ కూడా హాయిగా కనుకు తీసేందుకు అనువైన ప్రదేశం.
నాకో: హిమాచల్ ప్రదేశ్‌లోని పిన్ డ్రాప్ సైలెన్స్ ప్రాంతంగా గుర్తింపు పొందిన నాకో అనే హిల్‌స్టేషన్ కూడా స్లీప్ టూరిజానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ ఎంత చిన్న శబ్దమైనా చాలా దూరం వినిపిస్తుందని అంటారు. చుట్టూ పచ్చని అడవులు, అందమైన లొకేషన్ల మధ్య ఉండే ఈ ప్రాంతం హాయిగా కునుకు తీసేందుకు సరిగ్గా ఉంటుంది.
దువార్స్: పశ్చిమ బెంగాల్‌లోని దువార్స్ పట్టణం స్లీప్ టూరిజాన్ని కోరుకునేవారికి చక్కటి ప్రదేశం అని చెప్పవచ్చు. చుట్టూ తేయాకు తోటలు, దట్టమైన అటవీ ప్రాంతం, రిసార్టులతో అత్యంత రమణీయంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment