మానసిక వికాసానికి క్రీడలు దోహదం
గుంటూరుస్పోర్ట్స్: క్రీడల్లో రాణించే విద్యార్థులు చదువులో కూడా ముందంజలో ఉంటారని రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి జె.డి.శీలం చెప్పారు. క్రీడలు మంచి ఆరోగ్యంతోపాటు, మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయన్నారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో శనివారం 60వ రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రోరల్ స్కేటింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ఆసక్తి, ప్రతిభను గమనించి ఆ దిశగా క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.
జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి చుక్కా కొండయ్య మాట్లాడుతూ విజయనగరం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, గుంటూరు, వైజాగ్, కడప, చిత్తూరు జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు అండర్-11, 14, 17 బాలబాలికల విభాగాలలో పోటీలు జరుగుతాయని స్టేడియం స్కేటింగ్ కోచ్ సలామ్ చెప్పారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారును రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ పార్వతి, డీఈవో శ్రీనివాసరెడ్డి, డీఎస్‌డీవో వెంకటేశ్వరరావు, బాబురావు, పీఈటీలు, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.