న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ దిగ్గజం బైజూస్ శరవేగంగా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కొత్తగా మరో సంస్థను కొనుగోలు చేసింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే గ్రేట్ లెర్నింగ్‌ను 600 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,466 కోట్లు) దక్కించుకుంది. ప్రొఫెషనల్, ఉన్నత విద్య సెగ్మెంట్‌లో తన స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా గ్రేట్ లెర్నింగ్‌లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,977 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. బైజూస్ ఇటీవలే అమెరికాకు చెందిన డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫాం ఎపిక్‌ను 500 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 3,730 కోట్లు) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఉత్తర అమెరికా మార్కెట్లో 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7,460 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది.
బైజూస్ గ్రూప్‌లో భాగంగా మారినప్పటికీ వ్యవస్థాపక సీఈవో మోహన్ లక్కంరాజు, సహ వ్యవస్థాపకులు హరి నాయర్, అర్జున్ నాయర్‌ల సారథ్యంలో గ్రేట్ లెర్నింగ్ ఇకపైనా స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగించనుంది. బైజూస్ టెక్నాలజీ, గ్రేట్ లెర్నింగ్ ప్రొఫెషనల్ కోర్సుల కంటెంట్ ఒక దగ్గరకు చేరేందుకు ఈ డీల్ ఉపయోగపడనుంది. అంతర్జాతీయంగా పేరొందిన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కంపెనీతో జట్టు కట్టడం ద్వారా కొత్త సెగ్మెంట్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోగలమని బైజూస్ వ్యవస్థాపక, సీఈవో బైజూ రవీంద్రన్ తెలిపారు. ఆన్‌లైన్‌లో ఉన్నత విద్యాభ్యాసం పెరిగే కొద్దీ అందుబాటు ధరల్లో అందరికీ విద్యను అందించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని మోహన్ పేర్కొన్నారు.
బైజూస్.. గ్రేట్ లెర్నింగ్ ఇలా..
గ్రేట్ లెర్నింగ్ 2013లో ప్రారంభమైంది. ఇప్పటిదాకా 170 పైచిలుకు దేశాల్లో 15 లక్షల మంది పైగా విద్యార్థులకు కోర్సులు అందించింది. ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వంటి దిగ్గజ విద్యా సంస్థలకు చెందిన 2,800 పైగా పరిశ్రమ నిపుణులు ఇందులో మెంటార్లుగా ఉన్నారు. ప్రధానంగా సింగపూర్, అమెరికా, భారత్‌లో గ్రేట్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment