Paytm Cash Records Over Rs 70,000 Avereage Investment From 2-1 Lakh Demat a/c Holders In FY21 - Sakshi
Sakshi News home page

Paytm: డీమ్యాట్‌లో పేటీఎమ్‌ దూకుడు

Published Tue, Aug 3 2021 12:59 AM | Last Updated on Tue, Aug 3 2021 1:20 PM

Paytm Money Records Rs 70, 000 Average Investment From 2. 1 Lakh Demat Account Holders - Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల కంపెనీ పేటీఎమ్‌ మనీ చిన్న ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21) మార్చికల్లా 2.1 లక్షల డీమ్యాట్‌ ఖాతాలను ప్రారంభించినట్లు వార్షిక నివేదికలో పేర్కొంది. వీటిలో 80 శాతం 35 ఏళ్లలోపు ఇన్వెస్టర్లేనని తెలియజేసింది. ఈ ఖాతాలలో సగటున రూ. 70,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరులో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు పేటీఎమ్‌ మనీ సీఈవో వరుణ్‌ శ్రీధర్‌ తెలియజేశారు.

ఈ కాలంలో ఇన్వెస్టర్లు సగటున నెలకు 10 లావాదేవీలు చొప్పున నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది. సగటున రూ. 46,000 విలువైన స్టాక్స్‌ను హోల్డ్‌ చేసినట్లు తెలియజేసింది. ఇదేవిధంగా కొత్త పెట్టుబడులకు రూ. 74,000 జమ చేసినట్లు వివరించింది. ఇక మహిళా ఇన్వెస్టర్లు రెట్టింపుకాగా.. విభిన్న పెట్టుబడి ప్రొడక్టులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వార్షిక నివేదిక వివరించింది. మొత్తం ఇన్వెస్టర్లలో మహిళల సంఖ్య రెట్టింపుకాగా..మొత్తం వినియోగదారుల్లో 44 శాతం మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక తదితర ఐదు రాష్ట్రాలనుంచే నమోదైనట్లు తెలియజేసింది. డీమ్యాట్‌ ఖాతాదారుల్లో 64 శాతం మంది మ్యూచువల్‌ ఫండ్స్‌లో, 28 శాతం మంది ఈక్విటీలలో ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది.

పేటీఎం భారీ నియామకాల ప్రణాళిక...
డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల్లో ఉన్న పేటీఎం.. క్షేత్రస్థాయిలో  20,000 మందిని నియమించుకుంటోంది. వర్తకులను డిజిటల్‌ లావాదేవీల వైపు మళ్లించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయి ఉద్యోగికి వేతనం, కమీషన్‌ రూపంలో నెలకు రూ.35 వేలు, ఆపైన ఆర్జించే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన యువతీ యువకులు, కళాశాల విద్యార్థులను ఈ ఉద్యోగాల్లో చేర్చుకోనున్నట్టు వివరించింది. క్షేత్ర స్థాయి ఉద్యోగులుగా పెద్ద ఎత్తున మహిళలను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. ఆన్‌డ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ కలిగి, 18 ఏళ్లు దాటిన ఔత్సాహికులు అర్హులు. ద్విచక్ర వాహనంతోపాటు గతంలో సేల్స్‌ విభాగంలో పనిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. స్థానిక భాషవచ్చి ఉండాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement