ఇన్వెస్టర్లకు బ్రోకింగ్‌ సంస్థల గాలం.. | Broking firms focus for investors | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు బ్రోకింగ్‌ సంస్థల గాలం..

Published Wed, May 4 2022 5:38 AM | Last Updated on Wed, May 4 2022 5:38 AM

Broking firms focus for investors - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి మెగా పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో పాలసీదారులు, ఇన్వెస్టర్లను మార్కెట్‌ వైపు మళ్లించడంపై బ్రోకింగ్‌ సంస్థలు, ఫిన్‌టెక్‌ కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఇనాక్టివ్‌ ఖాతాలను మళ్లీ పునరుద్ధరించేలా మదుపుదారులను ప్రోత్సహించడం మొదలుకుని క్యూఆర్‌ కోడ్‌తో అప్పటికప్పుడు డీమ్యాట్‌ ఖాతాలను తెరవడం, వినూత్న ఆఫర్లు ఇవ్వడం వరకూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా  ఎల్‌ఐసీ ఐపీవోకి దరఖాస్తు చేసుకోవడానికి .. సంక్లిష్టమైన బ్యాŠంకు లావాదేవీతో సంబంధం లేకుండా, అత్యంత సంపన్న ఇన్వెస్టర్లకు (హెచ్‌ఎన్‌ఐ) యూపీఐ ద్వారా చెల్లింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతున్నాయి.

దేశీయంగా అతి పెద్ద బ్రోకింగ్‌ సంస్థ జిరోధా, ఈ మధ్యే బ్రోకింగ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టిన పేటీఎం మనీ ఇప్పటికే దీన్ని అమల్లోకి తేగా, మిగతా సంస్థలు అదే బాట పట్టనున్నాయి. తమ దగ్గరే డీమ్యాట్‌ ఖాతాలు తెరిచేలా డిజిటల్, సంప్రదాయ బ్రోకింగ్‌ సంస్థలు పలు స్కీములు, గిఫ్ట్‌ వోచర్లతో పాలసీదారులను ఊరిస్తున్నాయి. కొత్త క్లయింట్లకు ఏంజెల్‌ వన్‌ బ్రోకింగ్‌ సంస్థ రూ. 15,000 విలువ చేసే వోచర్లు ఆఫర్‌ చేస్తోంది. చాలా మటుకు బ్రోకరేజీలు ఇప్పటికే రిటైల్‌ ఇన్వెస్టర్లు, పాలసీదారులు ఐపీవోకి దరఖాస్తు చేసుకునేందుకు ’ప్రీ–అప్లై’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి. గ్రామీణ ప్రాంతాల వారు కూడా దరఖాస్తు చేసుకోవడంలో తోడ్పడేందుకు ఫిన్‌టెక్‌ సంస్థ స్పైస్‌ మనీ తాజాగా రెలిగేర్‌ బ్రోకింగ్‌తో జట్టు కట్టింది. 

మూణ్నెల్లలో 91 లక్షల ఖాతాలు.. 
నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీఎల్‌), సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీస్‌ (సీడీఎస్‌ఎల్‌) గణాంకాల ప్రకారం జనవరి–మార్చి మధ్య కాలంలో కొత్తగా 91 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు వచ్చాయి. దీంతో 2022 మార్చి 31 నాటికి మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 8.06 కోట్ల నుంచి (గతేడాది డిసెంబర్‌ ఆఖర్లో) 8.97 కోట్లకు పెరిగింది. ఎల్‌ఐసీ ఐపీవోపై రిటైల్‌ ఇన్వెస్టర్లలో భారీగా ఆసక్తి నెలకొందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ వర్గాలు తెలిపాయి. ఈ ఐపీవో కోసమే గత నెలలో 45,000 పైచిలుకు ఖాతాలు తెరిచామని, వీరిలో 40 శాతం మంది కస్టమర్లు .. మార్కెట్‌కు కొత్త వారేనని వివరించాయి.

మే 4న ప్రారంభమయ్యే ఐపీవోలో భాగంగా ఎల్‌ఐసీలో ప్రభుత్వం 3.5 శాతం వాటాలు (22.13 కోట్ల షేర్లు) విక్రయిస్తోంది. ఉద్యోగులకు షేరు ధరపై రూ. 45, పాలసీదారులకు రూ. 60 మేర డిస్కౌంట్‌ లభించనుంది. 2008లో రిలయన్స్‌ పవర్‌కి రికార్డు స్థాయిలో వచ్చిన 48 లక్షల పైచిలుకు దరఖాస్తులకు మించి ఎల్‌ఐసీ ఐపీవోకి బిడ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 21,000 కోట్లు సమీకరించనుంది. తద్వారా దేశీయంగా ఇది అతి పెద్ద పబ్లిక్‌ ఇష్యూగా నిలవనుంది.

ఎల్‌ఐసీ ఐపీవో బిడ్‌కు పేటీఎం రూటు
క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌తో డీమ్యాట్‌ ఖాతా
వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం) అనుబంధ సంస్థ అయిన పేటీఎం మనీ ఎల్‌ఐసీ ఐపీవోకు దరఖాస్తు చేసుకునే వారి కోసం ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కిరాణా స్టోర్లు, పేటీఎం మర్చంట్‌ భాగస్వాముల వద్ద క్యూఆర్‌ కోడ్స్‌ను ఏర్పాటు చేశామని.. జీవిత కాలం ఎటువంటి చార్జీల్లేని డీమ్యాట్‌ ఖాతాను ఆఫర్‌ చేస్తున్నామని తెలిపింది. ఎవరైనా తమ ఫోన్‌ నుంచి క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా సులభంగా డీమ్యాట్‌ ఖాతాను తమ వద్ద తెరవొచ్చని సూచించింది. ఖాతా తెరిచిన అనంతరం ఎల్‌ఐసీ ఐపీవోకు బిడ్‌ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ నెల 4 నుంచి ఎల్‌ఐసీ ఐపీవో ప్రారంభం అవుతుండగా.. 9న ముగియనుంది.‘‘ గత కొన్ని ఏళ్లుగా క్యాపిటల్‌ మార్కెట్లలో రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రవేశం పెరుగుతుండడాన్ని చూస్తున్నాం. ఎల్‌ఐసీ ఐపీవోతో ఇది మరింత పెరగనుంది. దేశవ్యాప్తంగా పేటీఎం మర్చంట్‌ భాగస్వాముల వద్ద క్యూఆర్‌ కోడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా ఉచిత డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభించొచ్చు’’అని పేటీఎం మనీ అధికార ప్రతినిధి తెలిపారు. పేటీఎం మనీ హోమ్‌స్క్రీన్‌లో ఐపీవో సెక్షన్‌కు వెళ్లి అక్కడ అడిగిన వివరాలు ఇవ్వడం ద్వారా డీమ్యాట్‌ ఖాతా తెరవొచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement