బుడి బుడి నడకల నుంచి సూపర్‌ స్పీడ్‌ వరకు... | Extracurricular learning platform Spark Studio | Sakshi
Sakshi News home page

బుడి బుడి నడకల నుంచి సూపర్‌ స్పీడ్‌ వరకు...

Published Sat, Jul 22 2023 4:08 AM | Last Updated on Sat, Jul 22 2023 11:06 AM

Extracurricular learning platform Spark Studio - Sakshi

సక్సెస్‌ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు.
నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సి ఉంటుంది.
తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది.
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, విజయం కోసం ఎదురు చూస్తూ ఏఐ ఇంగ్లీష్‌ ట్యూటర్‌ స్టార్టప్‌ ‘స్పార్క్‌ స్టూడియో’ ద్వారా ఘన విజయం సాధించింది
అనుశ్రీ గోయల్‌...


కొన్ని సంవత్సరాల క్రితం...
స్టాన్‌ఫోర్డ్‌(యూఎస్‌)లో యూత్‌ ఫెయిల్యూర్‌ స్టార్టప్‌ల గురించి పాల్‌ గ్రహమ్‌ విశ్లేషణాత్మకమైన ప్రసంగం ఇచ్చాడు. ‘స్టార్టప్‌కు సంబంధించిన సమస్త విషయాలపై దృష్టి పెడుతున్నారు. ప్రజలు బాగా కోరుకునేది ఏమిటి అనే కీలకమైన విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు’ పాల్‌ గ్రహమ్‌ అన్నప్పుడు హాల్‌లో చప్పట్లు మారుమోగాయి.
ఆ ప్రేక్షకులలో అనుశ్రీ గోయెంకా ఉంది.
అనుశ్రీకి గ్రహమ్‌ ఉపన్యాసం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది.

అహ్మదాబాద్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ చేసిన అనుశ్రీ మానిటర్‌ గ్రూప్‌లో కన్సల్టంట్‌గా అయిదు సంవత్సరాలు పనిచేసింది. ఆ తరువాత స్క్రోల్‌ మీడియా, స్విగ్గీలో పనిచేసింది. ఉద్యోగం యాంత్రికం అనిపించిందో, ఇంతకంటే చేయడానికి ఏం లేదు.. అనే నిర్లిప్తత ఆవహించిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త దారిలోకి వచ్చింది.

‘వ్యాపారంపై నా ముద్ర ఉండాలి. అది నాకు సంతోషం కలిగించేలా ఉండాలి’ అనుకుంటూ రంగంలోకి దిగింది అనుశ్రీ.
పది సంవత్సరాలు కార్పొరేట్‌ ప్రపంచంలో పనిచేసిన అనుశ్రీ గ్రహమ్‌ ప్రసంగాన్ని పదేపదే గుర్తు తెచ్చుకుంటూ బెంగళూరు కేంద్రంగా ‘స్పార్క్‌ స్టూడియో’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. ‘స్పార్క్‌ స్టూడియో’ అనేది పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ లెర్నింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌.
 మొదట ‘స్పార్క్‌ స్టూడియో’ ఐడియాను శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ ఎనలిస్ట్‌లకు చెప్పినప్పుడు– ‘సక్సెస్‌ కావడం కష్టం’ అంటూ ఎన్నో కారణాలు చెప్పారు.
అయినా వెనకడుగు వేయలేదు అనుశ్రీ.

 ‘మన దేశంలో హై–క్వాలిటీ ఆర్ట్స్, లిబరల్‌ ఎడ్యుకేషన్‌కు కొరత ఉంది’ తాను తరచుగా విన్న మాట ‘స్పార్క్‌ స్టూడియో’కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. పిల్లలకు ఆన్‌లైన్‌ బోధన చేయడానికి ‘స్పార్క్‌ స్టూడియో’ ద్వారా దేశవ్యాప్తంగా పేరున్న పెయింటర్‌లు, మ్యూజిషియన్‌లు, ఇతర ఆర్టిస్ట్‌లను ఒకే వేదిక మీదికి తీసుకు వచ్చింది అనుశ్రీ.

‘స్పార్క్‌ స్టూడియో’ ప్రారంభమైన కొద్ది నెలల తరువాత...
‘ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ మార్కెట్‌లో విపరీతమైన పోటీ ఉంది. మీరు చాలా ఆలస్యంగా దీనిలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఎంతోమంది సక్సెస్‌ సాధించారు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి చేసేదేమిటి?’ ఇలాంటి కామెంట్స్‌ ఎన్నో వినిపించాయి.
‘వంద వ్యాపారాల్లో నీదొకటి అయినప్పుడు దానిపై నీదైన ముద్ర, శైలి ఉండాలి’ అని గ్రహమ్‌ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన స్నేహితులైన కౌస్తుబ్‌ ఖడే, జ్యోతిక సహజనందన్, నమిత గోయెంకాలతో ఒక టీమ్‌గా ఏర్పడింది అనుశ్రీ.

‘నేను బాగా పేరున్న స్కూల్‌లో చదువుకున్నాను. అయితే హై–క్వాలిటీ ఆర్ట్స్‌ కరికులమ్‌కు అక్కడ చోటు లేదు. స్పార్క్‌ స్టూడియో ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కరికులమ్‌ను డిజైన్‌ చేశాము. పిల్లలు యానిమేషన్, మ్యూజిక్, ఫొటొగ్రఫీ...ఎన్నో నేర్చుకోవచ్చు. తమ పిల్లలు ఎన్నో కళలు నేర్చుకోవచ్చు అనే ఆలోచన తల్లిదండ్రులకు బాగా నచ్చింది. ఆర్ట్స్, మ్యూజిక్‌ ద్వారా పిల్లల్లో భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని ఎంత నచ్చజెప్పినా, వారు డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేకపోవడం అసలు సమస్య. మార్కెట్‌ అంటే ఇదే అనే విషయం ఆలస్యంగా అర్థమైంది. ఇలా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను’ అంటుంది అనుశ్రీ.

రెండు సంవత్సరాల ‘స్పార్క్‌ స్టూడియో’ ప్రయాణం లాభాలు లేవు, నష్టాలు లేవు అన్నట్లుగా ఉండేది. అప్పటికే కొన్ని ప్రసిద్ధ ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ ఎడ్‌టెక్‌ స్టార్టప్‌లు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘ఏం మిస్‌ అవుతున్నాం’ అంటూ ఆలోచిస్తున్న సమయంలో అనుశ్రీకి తట్టిన ఐడియా....పబ్లిక్‌ స్పీకింగ్‌ కోర్స్, ఇంగ్లీష్‌ కమ్యూనికేషన్‌. ఈ రెండు అంశాలు చేర్చడంతో అప్పటి వరకు బుడి బుడి నడకల ‘స్పార్క్‌ స్టూడియో’ వేగం పుంజుకుంది. సక్సెస్‌ఫుల స్టార్టప్‌గా నిలిచింది. ‘నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి’ అంటుంది అనుశ్రీ గోయెంక.
 
నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి.
– అనుశ్రీ గోయెంకా

తన బృందంతో
అనుశ్రీ గోయెంకా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement