గాడిలో పడ్డ చదువులు.. సత్ఫలితాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్యలు | Andhra Pradesh education sector recovered from Corona Situations | Sakshi
Sakshi News home page

గాడిలో పడ్డ చదువులు.. సత్ఫలితాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్యలు

Published Thu, Feb 9 2023 3:41 AM | Last Updated on Thu, Feb 9 2023 10:03 AM

Andhra Pradesh education sector recovered from Corona Situations - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా విపత్తు అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. దాని ప్రభావం విద్యా రంగం పైనా తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా విద్యా రంగం రెండుళ్లు దాదాపు స్తంభించిపోయింది. స్కూళ్లు, ఆట పాటలు లేక విద్యార్థులు మానసికండా కుంగిపోయారు. కరోనా సమయంలో పాఠశాలల విద్యార్థులకు బోధన పూర్తిస్థాయిలో అందక తరగతికి తగ్గ సామర్థ్యాలు దెబ్బతిన్నాయి. మన రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి.  అయితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారు.

చదువులకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. చదువుల్లో విద్యార్థులు ఎక్కడా వెనకబడకుండా త్వరితగతిన చర్యలు చేపట్టేలా విద్యా శాఖను సమాయత్తం చేశారు. కరోనా విజృంభణ సమయంలో ఆన్‌లైన్‌ తరగతులు, ఇంటర్నెట్‌ సౌకర్యం లేని ప్రాంతాల్లోని విద్యార్థులకు వీడియోలతో పాఠాలు చెప్పించారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో పలు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని రాష్ట్రాలకంటే ముందుగానే స్కూళ్లు తెరిపించారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూనే, తరగతుల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించారు. ఇది సత్ఫలితాలనిచ్చింది. విద్యార్థులు ఉల్లాసంగా పాఠశాలలకు రావడం ప్రారంభించారు. ఇప్పుడు రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణ, బోధనాభ్యసన కార్యక్రమాలు క్రమపద్ధతిలో సాగుతున్నాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి.

కరోనాతో తగ్గిన పాఠశాలల పనిదినాలు
రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రతి ఏటా జూన్‌ 12న ప్రారంభమై మరుసటి ఏడాది ఏప్రిల్‌ చివరి వరకు ఉంటుంది. పర్వదినాలు, జాతీయ దినోత్సవాలు, ఇతర సెలవులు అన్నీ పోను 220 రోజులు తరగతులు తప్పనిసరిగా జరగాలి. 2019 సంవత్సరంలో కరోనా వైరస్‌ వ్యాప్తితో అన్ని రంగాలతో పాటు విద్యా రంగమూ అతలాకుతలమైంది. 2019 – 20 విద్యా సంవత్సరం చివర్లో (2020 మార్చి 24న) కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో అన్ని రంగాలతో పాటు పాఠశాలలూ మూతపడ్డాయి.

203 రోజులే పాఠశాలలు నడిచాయి. 2020 – 21 విద్యా సంవత్సరంలో రెండోసారి కరోనా వైరస్‌ విజృంభణతో మళ్లీ పాఠశాలల నిర్వహణకు తీవ్ర ఆటంకం కలిగింది. ఆన్‌లైన్‌లోనే బోధన సాగింది. పాఠశాలలు లేక విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురయ్యారు. పిల్లల చదువులకే అత్యధిక ప్రాధాన్యమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక ముందు జాగ్రత్తలతో పాఠశాలలను తెరిపించేలా ఆదేశాలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లోకన్నా ముందుగా స్కూళ్లు తెరిపించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. స్కూళ్లను పూర్తిస్థాయిలో శానిటైజ్‌ చేయించడం, అందరికీ మాస్కులు తప్పనిసరి చేయడంతో సహా అనేక ముందు జాగ్రత్తలతో స్కూళ్లను తెరిచింది. పబ్లిక్‌ పరీక్షలుండే 10వ తరగతితో పాటు 8, 9 తరగతులు ముందుగా ప్రారంభించింది. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత మిగతా తరగతులనూ ప్రారంభించింది.

ఈ ఏడాది ఇతర రాష్ట్రాలకన్నా ముందుగా అన్ని జాగ్రత్తలతో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లను పునఃప్రారంభించారు. విద్యార్ధులందరూ ఒకేసారి కాకుండా భౌతిక దూరం పాటించేలా  కొన్ని తరగతులను ఉదయం, మరికొన్ని తరగతులను మధ్యాహ్నం నిర్వహించింది. పై తరగతుల వారికి ఎక్కువ రోజులు బోధన జరిగేలా చర్యలు చేపట్టింది. కనిష్టంగా ప్రైమరీ తరగతులకు 50 పని దినాలు, గరిష్టంగా పై తరగతులకు 130 వరకు పనిదినాలు ఉండేలా చూశారు.

2021–22 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లు యథాతథంగా సాగేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆ సంవత్సరంలో 180 రోజుల పాటు పాఠశాలలు నడిచాయి. ప్రస్తుత (2022–23) విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో తరగతులు జరుగుతున్నాయి. పాఠశాలల పనిదినాలకు ఇబ్బంది రాకుండా పర్వదినాల్లోని సెలవులను కూడా సర్దుబాటుచేసి తరగతులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది 220 రోజులు స్కూళ్లు కొనసాగనున్నాయి.

కోవిడ్‌లో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సహాయ కార్యక్రమాలు
కోవిడ్‌ కారణంగా 2019–20, 2020–21లో పాఠశాలల నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో పిల్లల చదువులు దెబ్బతినకుండా ఏ రాష్ట్రంలోనూ లేని 
అనేక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వాటిలో ప్రధానమైనవి..

► దూరదర్శన్‌ సప్తగిరి ఛానెల్‌ ద్వారా టెన్త్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వీడియో పాఠాలను ప్రసారం చేయించింది.
► విద్యామృతం అనే నూతన కార్యక్రమాన్ని నిర్వహించింది.
► టీవీ ప్రసారాలు అందుకోలేని టెన్త్‌ విద్యా­ర్థుల కోసం విద్యా కలశం పేరుతో రేడియో ద్వారా పాఠాలను ప్రసారం చేసింది
► ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు లేని మారుమూల కొండ ప్రాంతాలకు ప్రత్యేకంగా స్క్రీన్‌ ప్రొజెక్టర్‌తో కూడిన వాహనాలను పంపించి, అక్కడి విద్యార్థులకు వీడియో ద్వారా పాఠాలు బోధించింది
► ఎస్సీఈఆర్టీ యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పాఠాలు, ఇతర విద్యా కార్యక్రమాలను ప్రసారం చేయించింది
► టీచర్లలో బోధనా విధానాలపై నూతన ఒరవడులను పెంచేందుకు వెబినార్‌ల  ద్వారా శిక్షణ ఇచ్చింది. వీటి ద్వారా 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించారు.
► పాఠశాలలు తెరిచాక తదుపరి విద్యా సంవత్సరాల్లో పై తరగతులకు వెళ్లే విద్యార్థుల్లో లోపాల సవరణకు బ్రిడ్జి కోర్సులను నిర్వహించింది. 
► 2020 – 21 విద్యా సంవత్సరంలో విద్యా వారధి పేరుతో దూరదర్శన్‌ సప్తగిరి ఛానెల్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు ప్రసారం చేయించింది
► విద్యార్థులకు సందేహా నివృత్తికి ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబర్‌ కేటాయించింది. ఈ నంబర్‌కు ఫోన్‌ చేసిన వారికి విద్యావేత్తల ద్వారా సందేహాలు నివృత్తి చేయించింది.
► టీఎల్‌ఎం పోటీలు, కవర్‌ పేజీ డిజైన్‌లు, పెయింటింగ్, డ్రాయింగ్‌ పోటీలతో విద్యార్థులను ప్రోత్సహించింది.
► కోవిడ్‌ సమయంలో ఇళ్లకే పరిమితమైన ప్ర­భు­త్వ స్కూళ్ల విద్యార్థులు మధ్యాహ్న భో­జ­నా­నికి ఇబ్బందిపడకుండా సుమారు 36,­88,­610 మందికి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా రోజువారీ బియ్యం, గుడ్లు చిక్కీ­లతో కూడిన డ్రై రేషన్‌ పంపిణీ చేయించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement