సాక్షి, అమరావతి: విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా సంస్కరణలను కూడా మనమే మొదటిసారి అమలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఆంధ్రా లయోలా కళాశాలల్లో ‘డిజిటల్ విద్యావిధానం–సాంకేతికతతో కూడిన బోధన–అభ్యాసం’పై మాస్టర్ రిసోర్స్ పర్సన్లకు (ట్రైనర్లకు) శుక్రవారం శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ ప్రపంచమంతా పయనిస్తున్న డిజిటల్ బాటలో మన రాష్ట్రం ముందుండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే అద్భుతమైన సంస్కరణలను, పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. మూడు నాలుగేళ్లలో ‘మన బడి నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా ప్రతి విద్యార్థికి సొంతబిడ్డలా ఉన్నతమైన విద్యను అందించాలని కోరారు.
క్షేత్రస్థాయిలో ఏ స్థాయిలో విద్య అందుతుంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు తనిఖీ చేస్తుంటారన్నారు. జగనన్న అమ్మఒడి, మన బడి నాడు–నేడు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశ సంస్కరణల ద్వారా ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. ఇప్పుడు డిజిటల్ విద్యాబోధన ద్వారా తరగతిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు మరింత ప్రభావవంతంగా బోధించే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా డిజిటల్ కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి బైజూస్‌తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా అందించిన ట్యాబ్‌లలో బైజూస్ ప్రీమియం కంటెంట్‌ను సక్రమంగా అందించడం ద్వారా 2024–25 నాటికి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌తో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేలా సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ ట్యాబుల కోసం రూ.686 కోట్లు వెచ్చించినట్టు చెప్పారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఎఫ్‌పీ, స్మార్ట్ టీవీలతో బోధన
అన్ని ప్రీ–హైస్కూళ్లు, హైస్కూళ్లలో 6 నుంచి 10 తరగతుల వరకు 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్‌పీ)ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి వీటిద్వారా బోధన ఉంటుందన్నారు. ఫౌండేషనల్, ఫౌండేషనల్ ప్లస్ పాఠశాలలకు 10,038 స్మార్ట్ టీవీలు ఇవ్వనున్నట్టు చెప్పారు. మన బడి నాడు–నేడు మొదటివిడత పాఠశాలల్లో వీటిని బిగించేందుకు రూ.352 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
విద్యార్థులకు మెరుగైన డిజిటల్ బోధన అందించేందుకు శిక్షణలో పాల్గొన్న జిల్లా రిసోర్సు పర్సన్లు ప్రతి పాఠశాలలో డిజిటల్ విద్యావిధానం చక్కగా అమలయ్యేలా తర్ఫీదు ఇవ్వాలని ఆయన కోరారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, పాఠశాలవిద్య కమిషనర్ (ఇన్‌ఫ్రా) కాటమనేని భాస్కర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, జాయింట్ డైరెక్టర్ (సర్వీసులు) మువ్వా రామలింగం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment