సేవలో అమ్మలా.. నీటిలో చేపలా..సంగీతంలో సరిగమలా.. మనామి ఓ అద్భుతం. సంకల్పానికి నిలువుటద్దం.
కృత్రిమ చేత్తో వయోలిన్ వాయిస్తూ ఆకట్టుకుంటున్న ఈ యువతిని చూస్తుంటే ఇలాంటి వీడియోలు, చిత్రాలు ఎన్నో చూశాం కదా అనుకోవచ్చు. కానీ, మనామి గురించి తెలుసుకుంటే మాత్రం మన ఆలోచనా దృక్పథం ఆటోమేటిక్‌గా మారిపోతుంది. ‘మనామి ఇటో అకా’ జపాన్ వాసి. ఓ అద్భుతమైన వయోలిన్ వాయిద్యకారిణి. మనామి వయోలిన్‌ను చేతిలోకి తీసుకునేముందు తన భుజాలను ఒకసారి సరిచేసు కుంటుంది. ఆ తర్వాత వయోలిన్‌ను ఎడమ చేత్తో భుజం మీదుగా పట్టుకుని, ఆపై ప్రొస్తెటిక్ చేయికి కట్టిన వయోలిన్ కీ సహాయంతో ప్లే చేస్తుంది. ఆ వయోలిన్ నాదం చెవులకు వీనుల విందుచేస్తుంది. మనిషి సంకల్పం ముందు ఎంతటి అడ్డంకినైనా గడ్డిపోచగా మార్చుకోవచ్చు అని నిరూపిస్తుంది మనామి. (‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’)
కృత్రిమ చేయి ఉన్న జపాన్ మొదటి నర్సు
మనామి సాధించిన విజయాల జాబితా చూస్తే ఒక్క వయోలిన్ వాయిద్యకారిణిగానే ఆమె మిగిలిపోదు. ప్రమాదంలో చేయి కోల్పోయినా తన అభిరుచిని వదల్లేదు. అలాగే చదువునూ వదల్లేదు. నర్సింగ్ చదువుతున్న కాలంలో ప్రమాదం జరిగినా చదువును కొనసాగించి నర్సు అయ్యింది. ప్రోస్తెటిక్ చేయితో రోగులకు సేవలు అందిస్తుండటంతో జపాన్‌లో ‘ఫస్ట్ ప్రోస్తెటిక్ హ్యాండ్ నర్స్’గా గుర్తింపు పొందింది. మనామి నర్సు, వయోలిన్ వాద్యకారిణి, అలాగే ప్రసిద్ధ పారాలింపిక్ స్విమ్మర్ కూడా. 2008 బీజింగ్ పారాలింపిక్స్‌లో 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో నాలుగో స్థానం, 2012 లో జరిగిన లండన్ పారాలింపిక్స్‌లో 8వ స్థానం లో నిలిచింది. మనామి వీడియో ట్విట్టర్‌లో షేర్ అవడంతో ఇప్పుడది విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా మనామికి అభినందనలు తెలుపుతున్నారు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుంటే పట్టుదల మనిషిని ఏ విజయతీరాలకు చేరుస్తుందో కళ్లారా వీక్షించవచ్చు. మన జీవితాలనూ గొప్పగా దిద్దుకోవడానికి స్ఫూర్తిగా నిలుపుకోవచ్చు. (ఒడి పట్టిన హీరో)
Comments
Please login to add a commentAdd a comment