Artificial hand
-
కృత్రిమ ‘చెయ్యిచ్చాడు’
మిలన్: ఇటలీలో ఆయనో డెంటిస్టు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం సుతారమూ ఇష్టం లేదు. సోమవారం నుంచి దేశంలో ‘సూపర్ హెల్త్ పాస్’ నిబంధన అమల్లోకొస్తోంది. టీకా తీసుకున్న వారికి జారీచేసే ఈ పాస్ చూపితేనే సినిమా థియేటర్, రెస్టారెంట్, బార్లు, సాంస్కృతిక వేదికల్లోకి అనుమతిస్తారు. దాంతో 57 ఏళ్ల ఈ డెంటిస్టు అతి తెలివిని ప్రదర్శించాడు. తన చేయిని షర్ట్‌లోపల (ఛాతి భాగానికి కట్టేసుకొని) పెట్టుకుని భుజానికి సిలికాన్‌తో చేసిన కృత్రిమ చెయ్యిని తగిలించాడు. బీయిలా సిటీలో గురువారం టీకా కేంద్రానికెళ్లి టీకా వేయాలని కృత్రిమ చేతి స్లీవ్స్‌ను పైకి లేపాడు. పరధ్యానంగా నర్సు టీకా వేసేస్తుందని అనుకొన్నాడు. అయితే నర్సు ఫిలిప్పాకు చేయి పట్టుకోగానే అనుమానం వచ్చింది. ‘చర్మం చల్లగా ఉంది. అత్కుక్కుంటోంది. రంగులో తేడా ఉంది. ఒక చెయ్యి ప్రమాదంలో కోల్పోయి ఉంటాడు. పొరపాటున కృత్రిమ చెయ్యి ఇచ్చాడని అనుకొన్నాను. మరో చెయ్యి ఇవ్వమని కోరగా.. ఆయన అసలు నిజం బయటపెట్టాడు. తనకు వ్యాక్సినేషన్ ఇష్టం లేదని, పాస్ కోసమే ఇలా చేశానన్నాడు’ అని ఫిలిప్పా వెల్లడించారు. ఇటలీలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో మనోడు ససేమిరా అంటే... ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు. పాస్ కోసం ఇప్పుడిలా చేసి దొరికిపోయాడు. అతని వివరాలతో ఉన్నతాధికారులకు నర్సు ఫిర్యాదు చేసింది. ఆయనపై క్రిమినల్ అభియోగాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. -
మనామి గురించి తెలిస్తే మన ఆలోచన మారుతుంది
సేవలో అమ్మలా.. నీటిలో చేపలా..సంగీతంలో సరిగమలా.. మనామి ఓ అద్భుతం. సంకల్పానికి నిలువుటద్దం. కృత్రిమ చేత్తో వయోలిన్ వాయిస్తూ ఆకట్టుకుంటున్న ఈ యువతిని చూస్తుంటే ఇలాంటి వీడియోలు, చిత్రాలు ఎన్నో చూశాం కదా అనుకోవచ్చు. కానీ, మనామి గురించి తెలుసుకుంటే మాత్రం మన ఆలోచనా దృక్పథం ఆటోమేటిక్‌గా మారిపోతుంది. ‘మనామి ఇటో అకా’ జపాన్ వాసి. ఓ అద్భుతమైన వయోలిన్ వాయిద్యకారిణి. మనామి వయోలిన్‌ను చేతిలోకి తీసుకునేముందు తన భుజాలను ఒకసారి సరిచేసు కుంటుంది. ఆ తర్వాత వయోలిన్‌ను ఎడమ చేత్తో భుజం మీదుగా పట్టుకుని, ఆపై ప్రొస్తెటిక్ చేయికి కట్టిన వయోలిన్ కీ సహాయంతో ప్లే చేస్తుంది. ఆ వయోలిన్ నాదం చెవులకు వీనుల విందుచేస్తుంది. మనిషి సంకల్పం ముందు ఎంతటి అడ్డంకినైనా గడ్డిపోచగా మార్చుకోవచ్చు అని నిరూపిస్తుంది మనామి. (‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’) కృత్రిమ చేయి ఉన్న జపాన్ మొదటి నర్సు మనామి సాధించిన విజయాల జాబితా చూస్తే ఒక్క వయోలిన్ వాయిద్యకారిణిగానే ఆమె మిగిలిపోదు. ప్రమాదంలో చేయి కోల్పోయినా తన అభిరుచిని వదల్లేదు. అలాగే చదువునూ వదల్లేదు. నర్సింగ్ చదువుతున్న కాలంలో ప్రమాదం జరిగినా చదువును కొనసాగించి నర్సు అయ్యింది. ప్రోస్తెటిక్ చేయితో రోగులకు సేవలు అందిస్తుండటంతో జపాన్‌లో ‘ఫస్ట్ ప్రోస్తెటిక్ హ్యాండ్ నర్స్’గా గుర్తింపు పొందింది. మనామి నర్సు, వయోలిన్ వాద్యకారిణి, అలాగే ప్రసిద్ధ పారాలింపిక్ స్విమ్మర్ కూడా. 2008 బీజింగ్ పారాలింపిక్స్‌లో 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో నాలుగో స్థానం, 2012 లో జరిగిన లండన్ పారాలింపిక్స్‌లో 8వ స్థానం లో నిలిచింది. మనామి వీడియో ట్విట్టర్లో షేర్ అవడంతో ఇప్పుడది విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా మనామికి అభినందనలు తెలుపుతున్నారు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుంటే పట్టుదల మనిషిని ఏ విజయతీరాలకు చేరుస్తుందో కళ్లారా వీక్షించవచ్చు. మన జీవితాలనూ గొప్పగా దిద్దుకోవడానికి స్ఫూర్తిగా నిలుపుకోవచ్చు. (ఒడి పట్టిన హీరో) -
ఈ చేయి భలే ‘స్మార్ట్’
సరిగ్గా నాలుగేళ్ల కింద.. రైలు ప్రమాదంలో ఎడమ చేయి, కాలు పోగొట్టుకున్నాడు లండన్‌కు చెందిన 26 ఏళ్ల జేమ్స్ యంగ్. కొన్ని రోజులకు డాక్టర్లు అతడికి కృత్రిమ చేయి, కాలు అతికించారు. వాటితో అందరిలాగా పనులు చేసుకోలేకపోతున్నానని ఎంతగానో బాధ పడేవాడు. వీడియో గేమ్స్ అంటే అమితాసక్తి ఉన్న జేమ్స్.. ఆన్లైన్లో ఓ రోజు ప్రకటన చూశాడు. తాము తయారు చేసిన ‘స్మార్ట్’ కృత్రిమ చేయిని ప్రయోగించేందుకు ఎవరైనా ముందుకు రావాలని కొనామి అనే ఆన్లైన్ కంపెనీ కోరింది. వెంటనే ఇందుకు ‘నేను రెడీ’ అంటూ ధైర్యం చేశాడు మనోడు. అదే జేమ్స్ జీవితానికి కొత్త మలుపు. జేమ్స్ భుజం చర్మానికి అతికించిన సెన్సర్లు.. కండరాల నుంచి వచ్చే సంకేతాలను గుర్తించి కృత్రిమ చేయి పనిచేసేలా చేస్తాయి. కింద పడ్డ నాణేన్ని కూడా సులువుగా తీయగలుగుతుందంటే ఇది నిజమైన చేయికి ఏ మాత్రమూ తీసిపోదని అర్థమవుతోంది. అంతేకాదు దీనిలో మరెన్నో విశేషాలున్నాయి. ఈ చేయిలో ఓ లేజర్ లైటు, టార్చ్ లైటు, ఫోన్ చార్జర్, ఓ వాచి, ఓ డ్రోన్ కూడా ఉన్నాయి. అయితే ఇది పరిశోధన దశలోనే ఉందని, వచ్చే ఏడాదిలోగా పూర్తిగా అభివృద్ధి చేస్తామని కృత్రిమ చేయి పరిశోధకులు చెబుతున్నారు. కృత్రిమ అవయవాలను త్రీడీ ప్రింటింగ్, సాంకేతికత పెరగడం ద్వారా తక్కువ ధరలోనే లభిస్తాయని ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన సేథు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. -
చేతినే కాదు.. స్పర్శనూ ఇచ్చారు
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి పదేళ్ల కింద ఓ ప్రమాదం వల్ల పక్షవాతం వచ్చింది. వెన్నుపూస దెబ్బతిని చెయ్యి పడిపోయింది. ఆ చెయ్యిని కదిలించలేడు, స్పర్శ జ్ఞానం కూడా లేదు. కానీ ఇప్పుడా వ్యక్తి వస్తువులను పట్టుకోగలుగుతున్నాడు, అవి ఎలా ఉన్నాయో (మెత్తగా, గట్టిగా, వేడిగా.. ఇలా) ముట్టుకుని తెలుసుకోగలుతున్నాడు. కానీ ఇది తన చేతితో కాదు.. ఒక కృత్రిమ చెయ్యితో..! ఈ కృత్రిమ చెయ్యిని నేరుగా అతని మెదడుకు అనుసంధానించడం ద్వారా ఇది సాధ్యమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా డిఫెన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డార్పా) ఈ విప్లవాత్మకమైన విజయాన్ని సాధించింది. ప్రమాదాల్లోనో, ఇతర కారణాలవల్లో కాళ్లూ, చేతులు పోగొట్టుకున్నవారికి కృత్రిమ అవయవాలు అమర్చడం సాధారణమే. కాలుగానీ, చెయ్యిగానీ లేని లోటును ఈ కృత్రిమ అవయవాలు కొంత వరకూ తీర్చగలవు. కానీ వాటితో వస్తువులను ముట్టుకున్నప్పుడు ఆ స్పర్శ అనుభూతిని మాత్రం ఇవ్వలేవు. ఇది అతిపెద్ద లోటు. ఈ లోటును తీర్చడం ద్వారా జీవ సాంకేతిక రంగంలో డార్పా శాస్త్రవేత్తలు అద్భుతమైన ముందడుగు వేశారు. డార్పా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ విధానం ద్వారా వ్యక్తులు తమకు అమర్చిన కృత్రిమ అవయవాలను నేరుగా మెదడు ద్వారానే నియంత్రించడంతోపాటు, వాటిని స్పర్శించిన అనుభూతిని పొందుతారని డార్పా ప్రోగ్రామ్ మేనేజర్ జస్టిన్ సాంచెజ్ చెప్పారు. తద్వారా సహజమైన అవయవాలు ఉన్న భావన వస్తుందన్నారు. పక్షవాతానికి గురైన ఒక వ్యక్తి మెదడులోని గ్రాహక ప్రాంతాని (మోటార్ కార్టెక్స్)కి కృత్రిమ చెయ్యి నుంచి సంకేతాలు అందించే ఎలక్ట్రోడ్లను అమర్చామని చెప్పారు. జాన్హాప్కిన్స్ వర్సిటీకి చెందిన అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ ఈ కృత్రిమ చెయ్యిని రూపొందించిందని.. దీని వేళ్లకు ఒత్తిడిని, స్పర్శను గుర్తించే సెన్సర్లను అమర్చారని తెలిపారు. అనంతరం ఆ వ్యక్తి కళ్లకు గంతలు కట్టి కృత్రిమ చేతులను తమ చేతులతో, వివిధ వస్తువులతో తాకి చూశామని... వీటన్నింటినీ అతను గుర్తించగలిగాడని సాంచెజ్ వెల్లడించారు. దాదాపుగా సహజమైన చెయ్యిలా అనుభూతిని పొంది నట్లు ఆ వ్యక్తి వెల్లడించాడని తెలిపారు.