ఈ చేయి భలే ‘స్మార్ట్’
సరిగ్గా నాలుగేళ్ల కింద.. రైలు ప్రమాదంలో ఎడమ చేయి, కాలు పోగొట్టుకున్నాడు లండన్‌కు చెందిన 26 ఏళ్ల జేమ్స్ యంగ్. కొన్ని రోజులకు డాక్టర్లు అతడికి కృత్రిమ చేయి, కాలు అతికించారు. వాటితో అందరిలాగా పనులు చేసుకోలేకపోతున్నానని ఎంతగానో బాధ పడేవాడు. వీడియో గేమ్స్ అంటే అమితాసక్తి ఉన్న జేమ్స్.. ఆన్‌లైన్‌లో ఓ రోజు ప్రకటన చూశాడు. తాము తయారు చేసిన ‘స్మార్ట్’ కృత్రిమ చేయిని ప్రయోగించేందుకు ఎవరైనా ముందుకు రావాలని కొనామి అనే ఆన్‌లైన్ కంపెనీ కోరింది. వెంటనే ఇందుకు ‘నేను రెడీ’ అంటూ ధైర్యం చేశాడు మనోడు. అదే జేమ్స్ జీవితానికి కొత్త మలుపు.
జేమ్స్ భుజం చర్మానికి అతికించిన సెన్సర్లు.. కండరాల నుంచి వచ్చే సంకేతాలను గుర్తించి కృత్రిమ చేయి పనిచేసేలా చేస్తాయి. కింద పడ్డ నాణేన్ని కూడా సులువుగా తీయగలుగుతుందంటే ఇది నిజమైన చేయికి ఏ మాత్రమూ తీసిపోదని అర్థమవుతోంది. అంతేకాదు దీనిలో మరెన్నో విశేషాలున్నాయి. ఈ చేయిలో ఓ లేజర్ లైటు, టార్చ్ లైటు, ఫోన్ చార్జర్, ఓ వాచి, ఓ డ్రోన్ కూడా ఉన్నాయి. అయితే ఇది పరిశోధన దశలోనే ఉందని, వచ్చే ఏడాదిలోగా పూర్తిగా అభివృద్ధి చేస్తామని కృత్రిమ చేయి పరిశోధకులు చెబుతున్నారు. కృత్రిమ అవయవాలను త్రీడీ ప్రింటింగ్, సాంకేతికత పెరగడం ద్వారా తక్కువ ధరలోనే లభిస్తాయని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన సేథు విజయ్‌కుమార్ పేర్కొన్నారు.