చేతినే కాదు.. స్పర్శనూ ఇచ్చారు | New DARPA prosthetic hand grants 'near-natural' sense of touch | Sakshi
Sakshi News home page

చేతినే కాదు.. స్పర్శనూ ఇచ్చారు

Published Wed, Sep 16 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

చేతినే కాదు.. స్పర్శనూ ఇచ్చారు

చేతినే కాదు.. స్పర్శనూ ఇచ్చారు

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి పదేళ్ల కింద ఓ ప్రమాదం వల్ల పక్షవాతం వచ్చింది. వెన్నుపూస దెబ్బతిని చెయ్యి పడిపోయింది. ఆ చెయ్యిని కదిలించలేడు, స్పర్శ జ్ఞానం కూడా లేదు. కానీ ఇప్పుడా వ్యక్తి వస్తువులను పట్టుకోగలుగుతున్నాడు, అవి ఎలా ఉన్నాయో (మెత్తగా, గట్టిగా, వేడిగా.. ఇలా) ముట్టుకుని తెలుసుకోగలుతున్నాడు. కానీ ఇది తన చేతితో కాదు.. ఒక కృత్రిమ చెయ్యితో..! ఈ కృత్రిమ చెయ్యిని నేరుగా అతని మెదడుకు అనుసంధానించడం ద్వారా ఇది సాధ్యమైంది.

ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా డిఫెన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డార్పా) ఈ విప్లవాత్మకమైన విజయాన్ని సాధించింది. ప్రమాదాల్లోనో, ఇతర కారణాలవల్లో కాళ్లూ, చేతులు పోగొట్టుకున్నవారికి కృత్రిమ అవయవాలు అమర్చడం సాధారణమే. కాలుగానీ, చెయ్యిగానీ లేని లోటును ఈ కృత్రిమ అవయవాలు కొంత వరకూ తీర్చగలవు. కానీ వాటితో వస్తువులను ముట్టుకున్నప్పుడు ఆ స్పర్శ అనుభూతిని మాత్రం ఇవ్వలేవు. ఇది అతిపెద్ద లోటు. ఈ లోటును తీర్చడం ద్వారా జీవ సాంకేతిక రంగంలో డార్పా శాస్త్రవేత్తలు అద్భుతమైన ముందడుగు వేశారు.

డార్పా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ విధానం ద్వారా వ్యక్తులు తమకు అమర్చిన కృత్రిమ అవయవాలను నేరుగా మెదడు ద్వారానే నియంత్రించడంతోపాటు, వాటిని స్పర్శించిన అనుభూతిని పొందుతారని డార్పా ప్రోగ్రామ్ మేనేజర్ జస్టిన్ సాంచెజ్ చెప్పారు. తద్వారా సహజమైన అవయవాలు ఉన్న భావన వస్తుందన్నారు. పక్షవాతానికి గురైన ఒక వ్యక్తి మెదడులోని గ్రాహక ప్రాంతాని (మోటార్ కార్టెక్స్)కి కృత్రిమ చెయ్యి నుంచి సంకేతాలు అందించే ఎలక్ట్రోడ్‌లను అమర్చామని చెప్పారు.

జాన్‌హాప్కిన్స్ వర్సిటీకి చెందిన అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ ఈ కృత్రిమ చెయ్యిని రూపొందించిందని.. దీని వేళ్లకు ఒత్తిడిని, స్పర్శను గుర్తించే సెన్సర్లను అమర్చారని తెలిపారు. అనంతరం ఆ వ్యక్తి కళ్లకు గంతలు కట్టి కృత్రిమ చేతులను తమ చేతులతో, వివిధ వస్తువులతో తాకి చూశామని... వీటన్నింటినీ అతను గుర్తించగలిగాడని సాంచెజ్ వెల్లడించారు. దాదాపుగా సహజమైన చెయ్యిలా అనుభూతిని పొంది నట్లు ఆ వ్యక్తి వెల్లడించాడని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement