ఆయన ఒక సంగీత విద్వాంసుడు. వయొలిన్ వాయించాడంటే మండుటెండల్లో కూడా వర్షాలు కురుస్తాయని పేరు. ఆయన ఒకసారి ఒక సర్కస్ చూడటానికి వెళ్లాడు. అక్కడొక సర్కస్ కళాకారుడు వయొలిన్ వాయిస్తుంటే ఒక ఎలుగుబంటి డాన్స్ చేసింది. ప్రేక్షకుల చప్పట్లతో సర్కస్ టెంట్ మార్మోగింది. అది చూసిన మన వయొలిన్ విద్వాంసుడు ‘‘బాగా తర్ఫీదునిచ్చిన ఎలుగుబంటి మాత్రమే నీ వయొలిన్‌కు తగినట్టు నాట్యం చేయగలదు. కాని నా సంగీతంతో ఎటువంటి జంతువు చేతనైనా నాట్యం చేయించగలను’’అన్నాడు గొప్పగా. ‘‘అది సాధ్యం కాదు’’ అన్నాడు సర్కస్ కళాకారుడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగి పోటీకి దారితీసింది. దాంతో వయొలిన్ విద్వాంసుడికి ఎదురుగా ఒక సింహాన్ని పంపాడు సర్కస్ కళాకారుడు. వయొలిన్ నాదానికి చిందులేస్తూ ఆడింది సింహం. ఆ తరువాత ఒక చిరుతపులిని పంపాడు. అది కూడా వయొలిన్ సంగీతానికి మైమరచి నాట్యం చేసింది. తరువాత ఒక పెద్దపులి వంతు వచ్చింది.
ఏమాత్రం బెదిరిపోకుండా అద్భుతంగా వయొలిన్ వాయించసాగాడు విద్వాంసుడు. అయితే ఆ పులి సంగీతానికి అసలు ఏమీ మైమరచిపోకుండా పంజావిప్పి వయొలిన్ విద్వాంసుడి మీదికి దూకబోయింది. బిత్తరపోయిన ప్రేక్షకులు చెల్లాచెదరయ్యారు. విద్వాంసుడు కూడా వయొలిన్‌ను కిందపడేసి పరుగుతీసి పులిబారి నుంచి తప్పించుకున్నాడు. సర్కస్ సిబ్బంది ఒడుపుగా పులిని బోనులో బంధించారు. ప్రాణభయం నుంచి తేరుకున్న సంగీత విద్వాంసుడు సర్కస్ కళాకారుని ముందు తన ఓటమిని అంగీకరిస్తూనే, ఆ పెద్దపులి తన సంగీతానికి కట్టుబడకపోవడం తనకెంతో ఆశ్చర్యం కలిగిస్తోందన్నాడు. అందుకు సర్కస్ కళాకారుడు నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘ఆ పెద్ద పులి పుట్టినప్పుడే దానికి చెవుల్లేవు. ఈ సంగతి గమనించిన ప్రేక్షకులు పారిపోవడం ప్రారంభించారు. మీరు అది గమనించకుండా వయొలిన్ వాయిస్తూనే ఉన్నారు’’అన్నాడు. సంగీత విద్వాంసుడు తల దించుకున్నాడు. ఈ కథను చెప్పిన గురువు తన శిష్యులతో– చదువు, తెలివి, చురుకుదనం మాత్రమే ఉంటే చాలదు. వర్తమానం గురించిన స్పృహ కూడా అవసరం. ఈ వివేకం లేనివారికి ఎన్ని తెలివితేటలున్నా ఏవిధమైన ప్రయోజనమూ ఉండదని గ్రహించాలి’’ అని బోధించాడు.
– డి.వి.ఆర్.
పెద్దపులి
Published Mon, Jan 21 2019 12:18 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM
Comments
Please login to add a commentAdd a comment