musicologist
-
పెద్దపులి
ఆయన ఒక సంగీత విద్వాంసుడు. వయొలిన్ వాయించాడంటే మండుటెండల్లో కూడా వర్షాలు కురుస్తాయని పేరు. ఆయన ఒకసారి ఒక సర్కస్ చూడటానికి వెళ్లాడు. అక్కడొక సర్కస్ కళాకారుడు వయొలిన్ వాయిస్తుంటే ఒక ఎలుగుబంటి డాన్స్ చేసింది. ప్రేక్షకుల చప్పట్లతో సర్కస్ టెంట్ మార్మోగింది. అది చూసిన మన వయొలిన్ విద్వాంసుడు ‘‘బాగా తర్ఫీదునిచ్చిన ఎలుగుబంటి మాత్రమే నీ వయొలిన్‌కు తగినట్టు నాట్యం చేయగలదు. కాని నా సంగీతంతో ఎటువంటి జంతువు చేతనైనా నాట్యం చేయించగలను’’అన్నాడు గొప్పగా. ‘‘అది సాధ్యం కాదు’’ అన్నాడు సర్కస్ కళాకారుడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగి పోటీకి దారితీసింది. దాంతో వయొలిన్ విద్వాంసుడికి ఎదురుగా ఒక సింహాన్ని పంపాడు సర్కస్ కళాకారుడు. వయొలిన్ నాదానికి చిందులేస్తూ ఆడింది సింహం. ఆ తరువాత ఒక చిరుతపులిని పంపాడు. అది కూడా వయొలిన్ సంగీతానికి మైమరచి నాట్యం చేసింది. తరువాత ఒక పెద్దపులి వంతు వచ్చింది. ఏమాత్రం బెదిరిపోకుండా అద్భుతంగా వయొలిన్ వాయించసాగాడు విద్వాంసుడు. అయితే ఆ పులి సంగీతానికి అసలు ఏమీ మైమరచిపోకుండా పంజావిప్పి వయొలిన్ విద్వాంసుడి మీదికి దూకబోయింది. బిత్తరపోయిన ప్రేక్షకులు చెల్లాచెదరయ్యారు. విద్వాంసుడు కూడా వయొలిన్‌ను కిందపడేసి పరుగుతీసి పులిబారి నుంచి తప్పించుకున్నాడు. సర్కస్ సిబ్బంది ఒడుపుగా పులిని బోనులో బంధించారు. ప్రాణభయం నుంచి తేరుకున్న సంగీత విద్వాంసుడు సర్కస్ కళాకారుని ముందు తన ఓటమిని అంగీకరిస్తూనే, ఆ పెద్దపులి తన సంగీతానికి కట్టుబడకపోవడం తనకెంతో ఆశ్చర్యం కలిగిస్తోందన్నాడు. అందుకు సర్కస్ కళాకారుడు నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘ఆ పెద్ద పులి పుట్టినప్పుడే దానికి చెవుల్లేవు. ఈ సంగతి గమనించిన ప్రేక్షకులు పారిపోవడం ప్రారంభించారు. మీరు అది గమనించకుండా వయొలిన్ వాయిస్తూనే ఉన్నారు’’అన్నాడు. సంగీత విద్వాంసుడు తల దించుకున్నాడు. ఈ కథను చెప్పిన గురువు తన శిష్యులతో– చదువు, తెలివి, చురుకుదనం మాత్రమే ఉంటే చాలదు. వర్తమానం గురించిన స్పృహ కూడా అవసరం. ఈ వివేకం లేనివారికి ఎన్ని తెలివితేటలున్నా ఏవిధమైన ప్రయోజనమూ ఉండదని గ్రహించాలి’’ అని బోధించాడు. – డి.వి.ఆర్. -
ఏ వెలితీ లేదు.. ఏ అసంతృప్తీ లేదు...
బాలాంత్రపు రజనీకాంతరావు పేరు చెబితే... ఆకాశవాణి గుర్తుకొస్తుంది. ఆకాశవాణి పేరు చెబితే... రజనీకాంతరావు గుర్తొస్తారు. ప్రారంభదశలో ఆకాశవాణి కి జవం, జీవం ఇచ్చిన రూపశిల్పి ఆయన. తొలినాళ్లలో ఆకాశవాణికి దిశానిర్దేశం చేసిన దార్శనికుడాయన. గొప్ప గొప్ప కళాకారుల్ని పరిచయం చేయడమే కాక, భక్తిరంజని వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించిన సృజనశీలి... సంగీత, సాహిత్య శిఖరాలను అధిరోహించిన వాగ్గేయకారుడు రజనీకాంతరావుతో కొంతకాలం కిందట విశాఖలో కె.రామచంద్రమూర్తి జరిపిన ప్రత్యేక సంభాషణ ఇది... ఓసారి భానుమతిగారికి సన్మానం జరుగుతోంది. ఆ సభకు గోపాలరెడ్డిగారు అధ్యక్షుడు. నేను ఆయన దగ్గరకు వెళ్లి ఓ పాట పాడటానికి అనుమతినివ్వమని అడిగాను. ఆయన సరే అన్నారు. అప్పుడు నేను ‘ఓహోహో పావురమా’ అనే పాటను ఇమిటేట్ చేసి ‘ఓహోహో భానుమతీ’ అంటూ పాడాను. ముప్ఫయ్యేళ్ల క్రితం భానుమతిని స్టార్‌డమ్‌కి తీసుకెళ్లిన పాట అది. నేను సంగీతం అందించిన ‘స్వర్గసీమ’ చిత్రంలోనిది. పాట విని భానుమతి చాలా సంతోషపడింది. దాన్ని అప్పటికప్పుడు రాశానని తెలిసి ఆశ్చర్యపోయింది. మీ ఆధ్వర్యంలో ఆకాశవాణికి అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆ సందర్భంలో మీ అనుభూతి... ? అంతర్జాతీయ రేడియో కార్యక్రమాల పోటీలో మనం కూడా పాల్గొనాలి అని మా డెరైక్టర్ జనరల్ చెప్పారు. అది నీ ద్వారానే జరగాలి, పోటీకి పంపాల్సిన కార్యక్రమాన్ని నువ్వే తయారు చేయాలి అని నాతో అన్నారాయన. అది పిల్లలకు భౌగోళిక శాస్త్రం బోధించే విధంగా ఉండాలని చెప్పారు. అలా ఉండాలి అంటే... పిల్లలకు ఏ నదుల గురించో పర్వతాల గురించో వివరిస్తూ ఉన్నట్టుగా ఓ యాత్రాకథనాన్ని తయారు చేయాలనిపించింది నాకు. దాంతో ‘కొండ నుంచి కడలి దాకా’ అన్న కార్యక్రమానికి రూపకల్పన చేశాను. నది కొండల్లో పుట్టి సముద్రంలో కలుస్తుంది. ఆ క్రమంలో అది ఎన్నో ప్రాంతాలను స్పృశిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. కాబట్టి నా కార్యక్రమం ద్వారా ప్రజలకీ నదులకూ ఉన్న సంబంధం పిల్లలకు చెప్పినట్టు అవుతుంది అనిపించింది. ‘ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి, కొండల్లొ దుమికింది కోనల్లొ ఉరికింది, శంకరాభరణ రాగాలాపకంఠియై ఉప్పొంగిపోయింది గోదావరి’ అన్న పాట... ‘హా యని కిన్నెర ఏడ్చెను, తన మనోహరుడు శిలయైనాడని, తానేమో ఒక వాగైనానని’ అన్న విశ్వనాథ వారి రచనతో పాటు మరికొన్ని కీర్తనలు, శ్రీనాథుడి సీస పద్యాలతో ఆ కార్యక్రమాన్ని తయారు చేశాను. అంతర్జాతీయ ఖ్యాతిని గడించడానికి తగిన అన్ని అంశాలూ అందులో ఉండటంతో ఊహించనంత పేరు, అవార్డూ వచ్చాయి ఆకాశవాణికి. స్వాతంత్య్రం వచ్చేనాటికి మీకు ఇరవయ్యేళ్లు. నాటి జ్ఞాపకాలేవైనా మాతో పంచుకుంటారా? అప్పట్లో బ్రిటిష్‌వాళ్ల ప్రాభవాన్ని చూశాన్నేను. స్వాతంత్య్ర ఉద్యమాన్నీ కళ్లారా చూశాను. రేడియోలో కూడా అందరూ ప్రసంగాలు ఇస్తుండేవారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ప్రసంగం పూర్తయ్యాక జైహింద్ అనేవారు. అయితే అది ప్రసారం చేసేవాణ్ని కాదు నేను. ప్రసంగం అయ్యీ అవ్వగానే జైహింద్ అనే సమయానికి స్విచ్ కట్టేసేవాణ్ని. అది దేశద్రోహం కాదు. ఆవిడ స్వాతంత్య్ర సమరయోధురాలు కాబట్టి అలా అనేది. కానీ నేను స్టేషన్ ఇన్చార్జిగా అన్నిటినీ సమానంగా చూడాలి. కాబట్టి అలా చేసేవాడిని. టంగుటూరి సూర్యకుమారి, రావు బాలసరస్వతి, ఘంటసాల, రాజేశ్వరరావు వంటివాళ్లందరితో మీరు పాటలు పాడించారు. వాళ్లంతా తర్వాత చాలా ఖ్యాతి గడించడం మీకు గర్వంగా అనిపించిందా? కచ్చితంగా గర్వించదగ్గ విషయమే. వాళ్లందరూ మొదట్లో నాతో కలిసి పని చేశారు. ఆగస్ట్ పదిహేను, అర్ధరాత్రి నెహ్రూగారి ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసారం పూర్తి కాగానే మద్రాస్ స్టేషన్లో డి.కె.పట్టమ్మాళ్ పాటను, తర్వాత నా పాటను ప్రసారం చేయాలి అనుకున్నారు. దాంతో ఆ సందర్భం కోసం మంచి దేశభక్తి గీతాన్ని రాశాను. దాన్ని సూర్యకుమారితో పాడించాను. శంకరంబాడి సుందరాచారి రాసిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటను కూడా తను నా ఆధ్వర్యంలోనే పాడింది. ఠాగూర్ పుట్టినరోజు కోసం ‘ఓ నవ యువకా’ అనే పాట రాశాను. దానిని సరళ అనే ఆవిడతో పాడించాను. ‘మేఘసందేశం’ నాటికలో ఘణాఘణా ఘణాగణా గర్జింపవా ఘనాశనీ అనే పాటని ఘంటసాలతో పాడించాను. వాళ్లందరూ ఎంతో ప్రతిభావంతులు. అందరితోనూ నాకు మంచి అనుబంధం ఉండేది. మీరు ఎంతోమందిని పరిచయం చేశారు. పైకి తీసుకొచ్చారు. వారిలో మీరు గర్వంగా ఫీలయ్యే మీ శిష్యులెవరు? పన్నాల సుబ్రహ్మణ్యభట్టు, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీపాద పినాకపాణి... వీళ్లు ముగ్గురూ నాకు మంచి శిష్యులు. మల్లీశ్వరి సినిమాకి రాజేశ్వరరావూ మీరూ కలిసి సంగీతం చేశారని చాలామంది అంటుంటారు. నిజమేనా? అదంతా అబద్ధం. మేం కలిసి చేయలేదు. ఇద్దరం కలిసి పని చేస్తే బాగుంటుంది అనుకునేవాళ్లం. అంతే తప్ప చేయలేదు. అవన్నీ వట్టి పుకార్లు. సినిమాల్లో అవకాశాలొచ్చినా రేడియోలోనే ఎందుకు కొనసాగారు? నిజమే. అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ నేను సినిమా వైపు వెళ్లలేకపోయాను. ఎందుకంటే నేను అప్పటికే రేడియోకి అలవాటు పడిపోయాను. పైగా అందులోనే ఉద్యోగం కాబట్టి వేరే దాని గురించి ఆలోచించడం అంతగా కుదరలేదు. పైగా ఒక రేడియో ఆఫీసర్‌గా నేను చాలా సంతోషాన్ని, గౌరవాన్ని అనుభవించాను. అందుకే నాకు రేడియోని వదిలిపెట్టబుద్ధి కాలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆకాశవాణిలో వచ్చిన మార్పులేంటి? అప్పట్లో మేము ఏదైనా రాస్తే... అది కచ్చితంగా అందరికీ ఉపయోగపడాలి అని ప్రతిజ్ఞ చేసి రాసేవాళ్లం. ఒకరి కంటే ఒకరు బాగా రాయాలని పోటీ పడేవాళ్లం. కానీ ఇప్పుడలా లేదు. కాకపోతే మంగళగిరి ఆదిత్యప్రసాద్ లాంటి వాళ్లు కొందరు చక్కని ప్రయోగాలు చేశారు. అది సంతోషం కలిగించింది నాకు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు, సంగీత నాటక అకాడెమీ అవార్డు... ఈ రెండు అవార్డుల్నీ అందుకున్నవారు దేశం మొత్తంలో మీరొక్కరే. ఆ అనుభూతి గురించి చెప్తారా? సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. రాధాకృష్టన్‌గారు సాహితీ ప్రియులు. ఆయన వరండాలో ఉన్న ర్యాక్స్ నిండా పుస్తకాలే. అవన్నీ దాటుకుని, పైన ఉన్న ఆయన గదిలోకి వెళ్తే... ఆ గది నిండా కూడా పుస్తకాలే. ఆయన దగ్గర అన్ని ఉన్నా కూడా, నా చేతిలో ఉన్న పుస్తకం ఏంటా అని ఆయన ఆసక్తిగా చూసిన చూపుని నేను మర్చిపోలేను. అప్పుడు నా చేతిలో ఉన్నది ‘ఆంధ్ర వాగ్గేయకారుల చరితము’. దాన్ని తీసుకుని, అందులో ఉన్న ఓ పాటను పాడటం మొదలుపెట్టారాయన. నాకు చాలా ఆనందమే సింది. అదో మర్చిపోలేని అనుభవం. ఆ తర్వాత సంగీత నాటక అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. అది కూడా చాలా సంతోషాన్ని కలిగించిన విషయం. చేయాలనుకుని చేయలేకపోయింది ఏదైనా ఉందా? జీవితంలో చేయాలనుకున్నవన్నీ చేశాను. ఏ వెలితీ లేదు. ఏ అసంతృప్తీ లేదు. కాకపోతే నా పేరుతో సంగీత సాహిత్య పరిషత్తు ఏదైనా పెట్టాలని ఉంది. నాకు రెగ్యు లర్గా పెన్షన్ వస్తుంది. అదంతా దాచిపెడితే కొన్ని లక్షలు అయ్యింది. దానికి తోడు ఠాగూర్ అవార్డు ద్వారా మరో మూడు లక్షలు జతయ్యాయి. వీటన్నిటితో ఓ నిధిని ఏర్పాటు చేయాలి. ఆ నిధి భవిష్యత్తులో సంగీత సాహిత్యాల అభివృద్ధికి ఉపయోగపడాలనేది నా కోరిక. -
కథ కంచికి వెళ్లిపోయింది.. చరిత్ర మాత్రం మిగిలింది!
ఏయన్నార్ జయంతి స్పెషల్ సుమారు 60 మంది హీరోయిన్లతో స్టెప్పులేసి, డ్యూయెట్లు పాడి, రొమాన్స్ చేసి, ఆ రోజుల్లో ఓ కలల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్న అక్కినేని కలలోకి ఏ హీరోయిన్ రాలేదా? ఇదే మాట ఆయన్నే నేరుగా అడిగితే ‘ఎందుకు రాలేదు... వచ్చింది... కాకపోతే ఆమె హీరోయిన్ కాదు’ అని అన్నారాయన. హీరోయిన్ కాకపోతే ఇంకెవరయి ఉంటారు? మనసుకి నచ్చిన ప్రతి వారితో ఎంతో చనువుగా ఉంటారాయన. అలాంటిది ఆయన కలల్లోకి చొరబడే ఆ డ్రీమ్‌గర్ల్ ఎవరై ఉంటారు? ‘అమ్మో... నేన్చెప్పనుగాక చెప్పను’ అంటూ ఓ రెండు మూడు రోజులు బతిమాలించుకుని ఆ రహస్యాన్ని బయటపెట్టారాయన - ‘సూర్యకాంతం’ అని. ఈ మాట ఎవరు విన్నా ఆశ్చర్యపోతారు. ఆయన మనల్ని ఆట పట్టిస్తున్నారనుకుంటారు. కానీ ఇది నిజం. ‘భార్యాభర్తలు’ షూటింగ్లో... ఓ సీన్లో ఆవిడ అద్దం ముందు కూచొని తల దువ్వుకుంటూ ఉంటుంది. ఆవిడ వెనక సోఫాలో నేను కూచొని ఉన్నాను. లావుగా ఉన్నా కళ గల ముఖం అనుకున్నాను. అంతే... అదే సబ్ కాన్షియస్‌లో రిజిస్టర్ అయిపోయిందనుకుంటాను... అదే రోజు రాత్రి ఆవిడ కల్లోకొచ్చింది. ‘ఏ.. ఏ.. ఏ..’ అంటూ పెద్ద అరుపుతో లేచి కూచున్నాను. ‘‘ఏంటండీ... ఏమయ్యింది... ఎప్పుడూ ఇలా నిద్దట్లో అరవలేదు?’’ అంటూ అడిగింది అన్నపూర్ణ. ‘‘సూర్యకాంతం కల్లోకొచ్చింది’’ అని చెప్పాను. అంత అర్ధరాత్రిలోనూ మా ఆవిడ ఒకటే నవ్వు ‘‘ఏ సావిత్రో, జమునో, కృష్ణకుమారో రాకుండా సూర్యకాంతం ఏమిటండీ మరీనూ?’’ అంటూ. ‘‘ఈ ఎక్స్‌పీరియెన్స్ నేను షూట్ చేసుకుంటాను’’ అని అడిగాను. ‘‘వద్దు... పెద్దావిడ... బావుండదు... పైగా ఆవిడ నన్ను ‘తమ్ముడూ’ అని అంటుంది. పత్రికల్లోకైతే ఓకే గానీ విజువల్‌గా వద్దు. పాఠకులు అర్థం చేసుకోగలరు గానీ ప్రేక్షకులు వాళ్లలా ఆలోచించలేరు’’ అని అన్నారు. అంత క్లియర్ కన్విక్షన్ ఉన్న వ్యక్తి ఆయన. అలానే కమిట్మెంట్ విషయంలో కూడా అటువంటి వ్యక్తిత్వం మరొకరిలో కనబడదు. ‘మా టీవీ’ కోసం చేసిన ‘గుర్తుకొస్తున్నాయి’ షూటింగ్ టైమ్‌లో ‘ఆయనొస్తే కూచోబెట్టండి’ అని ఓ కుర్చీ వేయించి, పక్కన ఇంకేమైనా మంచి లొకేషన్లు ఉన్నాయా అని చూడడానికి వెళ్లి వచ్చేలోగా ఆయనొచ్చి కూచునేవారు. నేను రాగానే లేచి నిలబడేవారు. ‘‘మీకన్నా దాదాపు ముఫ్ఫై ఏళ్ళు చిన్నవాణ్ణి సార్...’’ అని సిగ్గుపడిపోతుంటే ‘‘ఇక్కడ మీరు డెరైక్టరు... నేను మిమ్మల్ని గౌరవిస్తేనే యూనిట్ మిమ్మల్ని గౌరవిస్తుంది’’ అనేవారు అక్కినేని. షూటింగ్ ముగియగానే ‘‘మళ్లీ ఎప్పుడుండొచ్చు?’’ అని అడిగేవారు. ‘‘రెండు రోజుల ముందు నుంచీ ఎర్లీగా పడుకోవాలి. షూటింగ్ టైమ్‌లో ముఖం ఫ్రెష్‌గా కనిపించాలి కదా!?’’ అనేవారు. అంత బాధ్యత ఫీలయ్యే నటీనటులు ఇవాళ ఎంతమంది ఉండి ఉంటారు? అంతవరకూ మనల్ని పేరు పెట్టి పిలిచే అక్కినేని ఒకసారి షూటింగ్ టైమ్ గనుక ఫిక్స్ అయితే ఇంక ఆయన నుంచి వచ్చేది ‘ఓకే సర్’ అనే. ఆ ‘సర్’ అనే పదం షూటింగ్ పూర్తయ్యే వరకూ ఉంటుంది. ప్యాకప్ అయిన వెంటనే మాయమైపోతుంది. మనల్ని మన పేరుతోనే పిలుస్తారు. మనసుకి, మెదడుకి ఎంతో శిక్షణ ఇస్తేనే గాని ఇంతటి క్రమశిక్షణ సాధ్యం కాదు. చాలా విషయాలు నాతో పంచుకునే వారాయన. ‘‘సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు వీలైతే ఓసారి రండి’’ అని ఫోన్ చేసేవారు. కారప్పూస, టీ ఆయన ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్. వెళ్లేసరికి ఇద్దరికి రెడీగా ఉండేది. ఇక కబుర్లే కబుర్లు. ‘‘కొన్ని పాత్రలు నేను వెయ్యకపోతే అవి ఎందుకు వెయ్యటం లేదో, వాటి గురించి ఎన్టీఆర్‌కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాణ్ణి. ఎందుకంటే తర్వాత అప్రోచ్ అయ్యేది ఆయన్నే కాబట్టి’’ అని చెప్పారు ఏయన్నార్. ‘గుర్తుకొస్తున్నాయి’ తీస్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఆయనతో విభేదించాల్సి వచ్చేది. ఉదాహరణకి ‘పూజాఫలం’ సినిమాలో ఆయన పక్కన వేసింది జగ్గయ్య అని నేనూ, కాదు రమణమూర్తి అని ఆయనా వాదించుకున్నాం. ఒక్క క్షణం ఆలోచించి ‘‘వద్దు... మీ వెర్షనే కానివ్వండి. యూ ఆర్ ది కెప్టెన్’’ అని మనస్ఫూర్తిగా నేననుకున్న వెర్షన్‌కే తన అనుభవాల్ని చెప్పారు. మర్నాడు సరిగా ఉదయం 6 గంటలకి... ఏయన్నార్ గారి దగ్గర్నుంచి ఫోన్... ‘‘మీరే కరెక్ట్. ‘పూజాఫలం’లో నా పక్కన యాక్ట్ చేసింది జగ్గయ్యే. మరి రమణమూర్తి అని ఎలా పొరబడ్డానో ఏమిటో?’’ అంటే, ‘‘ఐయామ్ సారీ... షూటింగ్ టైమ్‌లో నేను మీతో అలా ఆర్గ్యూ చేసి ఉండాల్సింది కాదు’’ అని ఆయన అంటూంటే ఆ సంస్కారం ముందు అంగుష్ఠమాత్రుణ్ణయిపోయా. నేనేది అడిగినా కాదనేవారు కాదు. ఎంతో కఠి నంగా తీసుకున్న నిర్ణయాలు కూడా నా మీద అభిమానంతో సడలించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి - ఇక జీవితంలో అడుగు పెట్టనన్న సారథీ స్టూడియోస్‌లో దాదాపు ముప్ఫై ఏళ్ల తర్వాత తిరిగి అడుగు పెట్టడం. నేను జీవితాంతం గర్వంగా చెప్పుకోగలిగిన సంఘటన అది. ‘గుర్తుకొస్తున్నాయి’ 74 ఎపిసోడ్లు. తెరపై ఏయన్నార్, సుమ తప్ప ఇంకెవరూ కనిపించరు. 74 ఎపిసోడ్లు తెరపై కేవలం ఇద్దరే... టెలివిజన్ చరిత్రలో అదొక రికార్డ్. ‘నా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు గుండెల్లో దాచుకున్న రహస్యాలతో సహా అన్నీ కవర్ చేసేశారు మీరు. ఈ వయసులో కూడా నా జ్ఞాపకశక్తి అమోఘంగా ఉందని ప్రేక్షకులకి రుజువు చేశారు. నా ఆనందం కొద్దీ ఇస్తున్నాను. కాదనకండి’’ అంటూ ఓ చెక్ ఇచ్చారాయన. ‘నా ఉద్యోగ ధర్మంగా నాకెంతో ఇష్టమైన మీ గురించి చేశాను. నేనిలా తీసుకోకూడదు’’ అన్నాను. దానికాయన ఎంత మురిసిపోయారో - ‘ఐ లైక్ యువర్ క్యారెక్టర్’ అంటూ అంతటితో ఊరుకోలేదు. నేను పని చేసిన ‘మా టీవీ’ యాజమాన్యాన్ని ఒప్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుని, డబ్బుగా ఉంటే ఖర్చయిపోతుందని ఓ బంగారు కంకణం చేయించి ఆయనకు చూపించాను. ‘‘మంచి పని చేశారు. ఉంచండి. ఎప్పటికైనా ఆ కంకణాన్ని నేను మీకు తొడుగుతాను’’ అని అన్నారు అక్కినేని. ఇవాళ... కథ కంచికి వెళ్లిపోయింది... చరిత్ర మాత్రం మిగిలింది... బంగారంలాంటి ఆయనే లేరు. ఆ బంగారు కంకణం మాత్రం ఆయన తొడగకుండానే మిగిలిపోయింది ఆయన గుర్తుగా...!! - రాజా, మ్యూజికాలజిస్ట్, raja.musicologist@gmail.com