రాగాల పల్లకిలో కోకిలమ్మలు.. | sakshi cityplus with singers ranjani ,gayatri sisters | Sakshi
Sakshi News home page

రాగాల పల్లకిలో కోకిలమ్మలు..

Published Wed, Nov 12 2014 10:44 PM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM

రాగాల పల్లకిలో కోకిలమ్మలు.. - Sakshi

రాగాల పల్లకిలో కోకిలమ్మలు..

రాగాల పల్లకిలో కోకిలమ్మలు.. సంగీత సామ్రాజ్యంలో విరిసిన జంటస్వరాలు.. ఈ అక్కాచెల్లెళ్లు. తమిళనాట విరిసిన ఈ కర్ణాటక సంగీత ఝరి.. అటుపై ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తం అయింది. చిన్ననాటి నుంచి ఒకే మాట.. ఒకే పాటగా సాగిన వీరి యుగళార్చన.. సరాగాలతో పల్లవించింది.

వయోలినిస్ట్‌లుగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఇద్దరు సోదరీమణులూ.. మధుర గాత్రంతో గంధర్వ గీతికలను వినిపిస్తున్నారు. సౌత్ ఇండియన్ కల్చర్ అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన రంజనీ, గాయత్రి సిస్టర్స్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది.

 
తొమ్మిదో ఏట నుంచే ఇద్దరం సంగీతం నేర్చుకోవడం ఆరంభించాం. మా అమ్మ మీనాక్షి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఆమె సంప్రదాయ సంగీతంలో ప్రసిద్ధులైన పాలక్కాడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించింది. అందుకే చిన్ననాటి నుంచే సంగీతంపై అభిరుచి ఏర్పడింది. చదువుతో పాటు సంగీత సాధన చేశాం. ఆ రోజు పడిన కష్టానికి ఫలితం ఇదిగో ఈ రోజు సంగీత పథంలో మాకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. మొదట్లో వయోలినిస్ట్‌లుగా ఉన్న మేము క్రమంగా గాత్ర కచేరీల్లో స్థిరపడ్డాం.అలా నేర్చుకున్నాం
 
1997లో మొదటిసారి ప్రదర్శన ఇచ్చాం. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పద్మభూషణ్ పీఎస్ నారాయణస్వామిదగ్గర సంగీతం నేర్చుకున్నాం. ఆయన శిష్యరికంతో మాకు కచేరీలలో ఏ ఆటంకాలు ఎదురుకాలేదు. ప్రముఖ విద్వాంసురాలు డీకే పట్టమ్మాళ్‌తో కలసి కచేరీలు చేయగలిగాం. ఈ అవకాశాన్ని మా అదృష్టంగా భావిస్తాం. తర్వాతి కాలంలో సీతానారాయణ్ దగ్గర భజనలు, విశ్వాస్ జోషి దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాం. ప్రపంచ  ఖ్యాతి పొందిన కొల్హాపూర్‌కు చెందిన మానిక్ ఖైద్- అప్పాసాహెబ్ దగ్గర కూడా నేర్చుకున్నాం.

తిరుమలేశుని కృప
మా మొట్టమొదటి కచేరి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమాల్లో భాగంగా జరిగింది. వేలాది మంది జనం మధ్య సాగిన ఆ కచేరీని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాం.వేంకటేశుడి కృపతో ఆనాటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఆ స్వామే మమ్మల్ని నడిపిస్తున్నాడని అనిపిస్తుంటుంది. అలా మొదలైన మా గాత్ర ప్రయాణం జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిధ్వనించింది. అమెరికా, యూకే, కెనెడా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాం.
 
అభిమానమే అవార్డులు

అవార్డులు, బిరుదుల కన్నా.. ప్రేక్షకుల అభిమానమే మాకు ఎక్కువ ఆనందాన్ని పంచుతుంది. ఢిల్లీలోని సంస్కృతి ఫౌండేషన్ ఇచ్చిన అవార్డులతో మొదలు..  కల్కి కృష్ణమూర్తి మెమోరియల్ అవార్డు, యోగం నారాయణ స్వామి అవార్డు ఇలా ఎన్నో వచ్చాయి. ప్రముఖ సితార్ విద్వాంసుడు, భారతరత్న పురస్కార గ్రహీత పండిత్ రవిశంకర్ ఢిల్లీలో మా గాత్ర కచేరీకి వచ్చి మమ్మల్ని అభినందించారు. ఆ ఆనందం వెల కట్టలేనిది.
 
ఇది సరిగమనం
హైదరాబాద్‌తో మా అనుబంధం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. ఇక్కడ చాలా క చేరీలు నిర్వహించాం. ఇక్కడి వారికి సంగీతంపై మక్కువే కాదు పరిజ్ఞానం కూడా ఉంది. ఎంతో శ్రద్ధగా వింటారు. చక్కగా ఆనందిస్తారు. ఈ తరం పిల్లలు సంగీతం వైపు నడుస్తున్నారు. కార్పొరేట్ కల్చర్‌లో జీవిస్తున్నా.. శాస్త్రీయ సంగీతంపై మక్కువతో ఈ రంగం వైపు వస్తున్నారు. చదువుతో పాటు సంగీత సాధనలో కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. సరిగమల సావాసంతో మనోబలం కలుగుతుంది. ఈ మార్గం వైపు మరింత మంది రావాలి.

..:: కోన సుధాకర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement