తెలుగువారిలో ఎంతో టాలెంట్
స్వరానుబంధం..!
‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల’ పాట, ‘బురద నవ్వింది కమలాలుగా’ అని ‘విశ్వంభర’లోని కవితలు వినగానే.. ఎలా గోరటి వెంకన్న, డాక్టర్ సి.నారాయణ రెడ్డి గుర్తుకు వస్తారో.. అలానే కర్ణాటక సంగీతంలో లాల్గుడి పేరు వినగానే లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ బిడ్డలు లాల్గుడి జీజేఆర్ కృష్ణన్, విజయలక్ష్మి గుర్తుకు వస్తారు.
ప్రతిభ లేని వారిని ఘనమైన కుటుంబ నేపథ్యం కూడా రక్షించలేదని అంటున్న వారికి... సంగీతమే నిజయమైన ప్రపంచం. ‘కళాసాగారం’ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చి వారు ‘సిటీ ప్లస్’తోముచ్చటించారు. మా పూర్వీకులు త్యాగరాజ శిష్యులు. నాటి నుంచి నేటి వరకు సంగీతంతో మా అనుబంధం కొనసాగుతోంది. దాన్ని అందిపుచ్చుకుని భక్తితో ముందుకు సాగుతున్నాం. పూర్వీకుల ఆశీర్వాదంతో వయోలిన్‌లో ప్రతిభ సంపాదించాం.
లాల్గుడి బాణీ...
కర్ణాటక సంగీతానికే మకుటాయమానం లాల్గుడి జయరామన్. లాల్గుడి అనేది మా తల్లిదండ్రుల ఊరు. సంగీతం గురించి చర్చ వస్తే లాల్గుడి శైలి అని చెబుతారు. అంతగా జయరామన్ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధులయ్యారు. అందుకే కర్ణాటక సంగీతమన్నా, వయోలిన్ పాటలు వినపడ్డా ‘లాల్గుడి వారి బాణీ’ అని ఠక్కున అనేస్తారు. జీజేఆర్ కృష్ణన్‌తో నాది రక్త సంబంధం. ఐదేళ్ల నుంచే కర్ణాటక సంగీతం, వయోలిన్‌పై మక్కువ కలిగింది. నాన్న జయరామన్‌తో కలసి కచేరీలు చేశాం. ఊపిరి ఉన్నంత వరకూ ఇలా కచేరీలు చేస్తూనే ఉంటాం. సంగీతం ద్వారా వారు ఆశించినట్లు సమాజంలో విలువలు పెంపొందించి, ప్రేమ, కరుణ, సేవానిరతి నింపుతాం. మరో ప్రపంచం సంగీతం ద్వారానే సాధ్యం.
అంకితభావంతోనే...
నేడు పిల్లలకు చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ గురు, శిష్య పరంపరను విడవకూడదు. సమగ్రంగా సంగీతం, వయోలిన్ నేర్చుకోవాలంటే 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది. ఈ రంగంలో రాణించాలంటే... చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండాలి. ఏకాగ్రత, శ్రద్ధ, వికాసం, పఠనం, జ్ఞాపక శక్తి.. ఇవన్నీ శాస్త్రీయ సంగీతం ద్వారా అలవడతాయి.
తెలుగువారిలో ఎంతో టాలెంట్
శాస్త్రీయ సంగీతంలో తెలుగువారూ తక్కువేం కాదు. ఎంతో ప్రతిభ ఉన్నా... తక్కువ మంది ఇటువైపు వస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. విద్యార్థి దశ నుంచే ప్రోత్సహించాలి.
హైదరాబాద్‌తో ఆత్మీయ అనుబంధం
చిన్న నాటి నుంచి ఇక్కడికి వచ్చి వెళుతూనే ఉన్నా. మా అమ్మ వైపు బంధువులు సికింద్రాబాద్‌లో ఉండేవారు. ఇక్కడ కచేరీ అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. తమిళనాడులో సంగీతానికి ప్రాముఖ్యం ఎంతో ఉంది. అందుకే అక్కడ పచ్చగా వర్ధిల్లుతోంది.
కోన సుధాకర్‌రెడ్డి