c.narayana reddy
-
ఓరుగల్లు సిగలో అద్భ్బుత పరిశోధనాలయం
‘జానపద గిరిజన విజ్ఞాన పీఠం’తెలుగు సంస్కృతికి వెలుగులద్దిన కాకతీయ చక్రవర్తుల రాజధాని ఓరుగల్లులో 1995లో జానపద గిరిజన విజ్ఞాన పీఠానికి అంకుర్పారణ జరిగింది. ఆదివాసీ గిరిజన తెగల జీవన పరిణామ క్రమంలో వారు ఉపయోగించిన ఎద్దుల బండ్లు, టంగాలు, సంగీత వాయిద్యాలు, సవారి కచ్చురం, పనిముట్లు, కీలు గుర్రాలు, వివిధ శుభకార్యక్రమాల్లో వాడే పల్లకీలు తదితర వస్తువులను జాగ్రత్తగా విజ్ఞాన పీఠం మ్యూజియంలో భద్రపరిచారు. గిరిజన కళారూపాలను భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో విజ్ఞాన పీఠం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహిస్తున్నారు.నేడు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ‘ఓరుగల్లు జానపద గిరిజన విజ్ఞాన పీఠం’పై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. హన్మకొండ కల్చరల్: తెలంగాణ వాదం రగిల్చిన స్ఫూర్తితో జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఏర్పడింది. అప్పటి వైస్‌చాన్స్‌లర్ ఆచార్య పేర్వారం జగన్నాథం, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వరరావు , కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ళ రామశాస్త్రి, కార్యదర్శి వీ.ఆర్ విద్యార్థి, పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ తదితర ప్రముఖుల ఆకాంక్షతో ఈ పీఠం రూపుదిద్దుకుంది. 1998 లో ఇక్కడ పీహెచ్డీ కోర్సులు, ఎంఫిల్ తరగతులు ప్రారంభమయ్యాయి. టూరిజం కేంద్రంగా రూపొందాలని.. 1999లో జానపద గిరిజన విజ్ఞాన పీఠం జిల్లాలో ప్రత్యేక సందర్శనీయ స్థలంగా అభివృద్ధి చెందనుందని భావించి అప్పటి కలెక్టర్ శాలినీమిశ్రా హంటర్‌రోడ్‌లో 3.7 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ పీఠం డీమ్డ్ యూనివర్సిటిగా అభివృద్ధి చెందాలని భావించిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఆచార్య సి. నారాయణరెడ్డి అందించిన రూ. 30 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో 2000 సంవత్సరంలో స్వంత భవనం నిర్మించారు. 2001లో దూరవిద్యాకేంద్రం ప్రారంభం కాగా దానికి అనుబంధంగా వరంగల్‌లో దూరవిద్యాకేంద్రం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2009 లో రాణి రుద్రమదేవి పేరిణి కళా కేంద్రాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. జానపదుల కళలకు సజీవ రూపం పీఠానికి చెందిన పరిశోధన బృందం గ్రామాలకు వెళ్ళి అక్కడ రోజుల తరబడి ఉంటూ వారితో మాట్లాడుతూ జానపదుల విజ్ఞానాన్ని, కళలను భవిష్యత్ తరాలకు సజీవ రూపంలో అందించేలా కృషి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొడ, కృష్ణ, పశ్చిమగోదావరి, చిత్తూరు, కడపజిల్లాలో సర్వే నిర్వహించి.. ఆయా ప్రాంతాల్లోని కళా బృందాలను ప్రోత్సహించారు. జాతీయస్థాయి గుర్తింపు తెలుగు జానపద విజ్ఞానం మీద జరుగుతున్న అధ్యయనం మరింత అర్ధవంతంగా, వైవిధ్యంగా జరగడానికి గిరిజన పీఠం ఏర్పాటు చేసిన సదస్సులు జాతీయస్థాయిలో ప్రశంసలు పొందాయి. 1000 గంటల నిడివిగల వీడియోలు, 10వేల ఛాయాచిత్రాలు, 9000 పేజీల రాత ప్రతులు పీఠం మ్యూజియంలో నిక్షిప్తం చేశారు. 18 జాతీయ సదస్సులు జానపద గిరిజన íపీఠం ఆధ్వర్యంలో 18 జాతీయ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ రంగాల ప్రముఖులు సమర్పించిన పరిశోధనా పత్రాలను సమీకరించి.. ‘జానపద గిరిజన విజ్ఞానం జాతీయ సదస్సుల పత్రాలు’ అనే పుస్తకంగా ప్రచురించారు. జానపద గిరిజన విజ్ఞానంపైపలు పుస్తకాలు.. ఇప్పటివరకు జానపద విజ్ఞాన సమాలోచన, నల్గొండ రాష్ట్రస్థాయి జానపద కళోత్సవాలు ప్రత్యేక సంచిక, జానపద కిరణం త్రైమాసిక పత్రిక, మన పల్లెటూళ్ల పాటలు అమ్మాపురం, కొర్రాజుల కథలు, జానపద విజ్ఞానదర్శిని, చౌళ్లపల్లి, జానపదవిజ్ఞాన దర్శిని , విస్నూరు, వల్మిడి, ద్రౌపది తిరుణాళ్ళు (ధర్మరాజు తిరునాళ్ళు), తూర్పుగోదావరి జిల్లా జానపద ఆటలు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, కొండరెడ్డి గిరిజ నుల జీవనవిధానం, బొడ్లంక పాటలు, పగటివేష కళా కారుల సాంస్కృతిక జీవనం (పార్వతీనగర్), మల్లన్న జాతర ఐనవోలు, బంజారాల తీజ్‌పండుగ పుస్తకాల ను ప్రచురించారు. అరుదైన జానపద కళారూపాలపై పరిశోధన.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రముఖంగా చిందుయక్షగానం, డక్కలి, గౌడశెట్టి, ఏనుటి, మందహెచ్చు, కాకిపడిగెల, మాసయ్య, గంజికూటి, కూజరి, డోలి, పట్టెడ, బాట్స్, దాడి, బైండ్ల, దూబ్బుల, బుడబుక్కల, ఒగ్గు, పంబాల, మొండి, గంగిరెద్దు, బాలసంతు, జంగాలు, శారద, డప్పు, పాములాట, చెక్కబొమ్మలాట, తోలుబొమ్మలాట, ఎరుకసోదే, పిట్టలదొర, లంబాడానృత్యం, కోయనృత్యం, కోర్రాజులు, కూనపులి, ఆద్దెపుసింగు, కాటిపాపల, హరిదాసులు, కడ్డీతంత్రి, కోలాటం, చెక్కభజ న, మాలభోగం, కిన్నెర, చిలుకపంచాంగం వంటి ఎన్నో కళారూపాలు దర్శనమిస్తాయి. జానపద గిరిజన విజ్ఞానపీఠం.. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సహకారంతో వారిజీవన విధానాలపై పరిశోధనలు జరిపి పుస్తకాలుగా వెలువరించనున్నారు. భవిష్యత్ తరాలకు వారధి జానపదగిరిజన విజ్ఞానపీఠాన్ని సందర్శించడం ఒక మధురానుభూతి. అంతరించిన , అంతరిస్తున్న అనేకానేక ఉపకరణాలను మ్యూజియంలో మళ్ళీ వీక్షిం చే అవకాశం కల్పించిన ఈ సంస్థకు అభినందనలు. – సిరికొండ మధుసూదనాచారి, శాసనసభాపతి ప్రతి కళారూపంపై పుస్తకం రాష్ట్ర సాంస్కృతికశాఖ సహకారంతో ఇటీవలే కొమ్ము, అద్దపుసింగు, కూనపులి, రుంజ, తోటి, గుర్రపు, తదితర కళారూపాలపై డాక్యుమెంటేషన్ నిర్వహించాం. త్వరలోనే పుస్తకం రూపొందిస్తాం. తెలంగాణ మాండలిక భాషాపదాలను కూడా 13వేల వరకు సేకరించాం. వచ్చే నెలలో జాతీయసదస్సు నిర్వహించనున్నాం. విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య ఆలేఖ్య పుంజాల మా పరిశోధనలను ప్రొత్సహిస్తున్నారు. – ఆచార్య భట్టు రమేష్, పీఠాధిపతి, జానపద గిరిజన విజ్ఞాన పీఠం, వరంగల్ -
ఘనంగా సినారె జయంతి ఉత్సవాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆదివారం సిద్దిపేట పట్ట ణంలోని స్థానిక కేంద్ర గ్రంథాలయంలో సాహితీ దిగ్గజం జ్ఞానపీట్Š‡ అవార్డు గ్రహీత కీ.శే.డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సినారె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, అనంతరం, సినారె స్మృతులను నేమరువేసుకున్నారు. ఈ సందర్భంగా కథాశిల్పి ఐతాచంద్రయ్య మాట్లాడుతూ.. లయబద్ధమైన గేయాలతో మదికియింపైన రచయితగా సినారెకు గొప్ప పేరు ఉందని అన్నారు. ప్రముఖ కవి అంజయ్య మాట్లాడుతూ.. కలం పట్టి రచనలు ప్రారంభించిన నాటి నుంచి మరణించే వరకు కలం ఆపని మహానీయుడు సినారె అని పొగిడారు. నేడు సినారె లేకున్నా ఆయన రచనలు ప్రజల్లో సాహితీలోకంలో అనునిత్యం పాఠిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. సినీజగత్తులో మరుపురాని పాటల తో మదిన నిలిచారని అన్నారు. కవి ఉండ్రాళ్ల రాజేశం మాట్లాడుతూ.. పల్లెటూరిలో పుట్టి మట్టి పరిమళత్వం పంచి పెట్టిన కవి సినారె అన్నారు. తన వద్దకు వచ్చిన కవులను ఆదరించి వారికి మెళకువలు నేర్పిన గొప్ప వ్యక్తి సినారె అని పేర్కొన్నారు. కార్యక్రమంలో దాసరి రాజు, ఎన్నవెళ్లి రాజమౌలి, పెందోట వెంకటేశ్వర్లు, కోణం పర్శరాములు, జస్వరాజ్‌కుమార్, శ్రీచరణ్ సాయిదాస్, మిట్టపల్లి పర్శరాములు, భరత్ పాల్గొన్నారు. -
గొప్ప సాహితీవేత్తను కోల్పోయాం: చంద్రబాబు
హైదరాబాద్ : ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పార్థీవ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. సినారె భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. సినారె కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... గొప్ప సాహితీవేత్తను కోల్పోయామని, సినారె మరణం తెలుగు జాతి, దేశానికే తీరని లోటు అని అన్నారు. ఒక మహనీయుడ్ని కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు సి.నారాయణ రెడ్డి అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సులు నడుపనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్‌లోని దర్గా పరిసర మహాప్రస్థానానికి వచ్చే సినారే అభిమానుల కోసం ఏర్పాట్లు చేశారు. -
సామాన్యుడు.. అయినా చిరంజీవుడు
- సి.నారాయణరెడ్డి మరణం తెలుగుకు తీరని లోటు - దిగ్భ్రాంతి చెందిన సాహితీలోకం.. ప్రముఖుల నివాళి అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు.. ‘మట్టి మనిషి ఆకాశం’ గ్రంథంలో డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి రాసిన మాటలివి. అవును. కవివర్యుడు భౌతికంగా చనిపోయారుగానీ అక్షరాల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతోన్న సినారె సోమవారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కరీంగనర్ జిల్లాలోని మారుమూల పల్లె హనుమాజీపేటలో 1931, జులై 29 జన్మించిన ఆయన.. భారతదేశం గర్వించదగిన సాహితీవేత్తగా ఎదిగిన క్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. హనుమాజీపేటలో మల్లారెడ్డి-బుచ్చమ్మ దంపతులకు జన్మించారు నారాయణరెడ్డి. ప్రాథమిక విద్యాబ్యాసంమంతా సొంత ఊళ్లోనే సాగింది. మాధ్యమిక విద్య(సిరిసిల్లలో), ఉన్నత విద్య(కరీంనగర్) అభ్యసించారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ కాలేజీలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ చదివారు. మాధ్యమికం నుంచి డిగ్రీదాకా ఆయన చదివింది ఉర్దూమీడియంలోనే కావడం గమనార్హం. ఆ తర్వాత ఓయూలోనే తెలుగు సాహిత్యంలో పీజీ, పీహెచ్డీ పూర్తిచేశారు. ఉద్యోగం, సాహితీ ప్రస్థానం ప్రారంభంలో సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకుడిగా చేసిన నారాయణరెడ్డి.. తర్వాత నిజాం కాలేజీలో, అటుపై ఉస్మానియా వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనిర్సిటీ ఉపకులపతిగానూ ఆయన సేవలందించారు. ఉద్యోగం చేస్తూనే సాహితీసేవను కొనసాగించారు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది. ప్రముఖంగా కవి అయినప్పటికీ పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సినిమా పాటలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు తదితర ప్రక్రియలన్నింటిలో విశేష రచనలు చేశారు. (చదవండి: సినారె అక్షరానుబంధం) కాలేజీ రోజుల్లో ‘శోభ’ అనే పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించారు. ‘జనశక్తి’ పత్రికలో సినారె కవిత తొలిసారి అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించి సత్తా చాటుకున్నారు. 1953 లో ‘నవ్వని పువ్వు’ సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. ఇది సినారె తొలి ప్రచురణ. ఆ వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. గులేబకావళి కథతో సినిమాల్లోకి.. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ..’ అనే పాటతో సినీరంగ ప్రవేశం చేశారు నారాయణరెడ్డి. అటుపై పలు సినిమాలకు 3500 పాటలు, కవితలు రాశారు. కుటుంబం.. సినారె- సుశీల దంపతులకు నలుగురు ఆడపిల్లలు. గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి. భార్య సుశీల మరణానంతరం ఆమె పేరుమీద ఔత్సాహిక సాహితీకారులకు ఏటా అవార్డులు అందిస్తున్నారు సినారె. అంతర్జాతీయ ఖ్యాతి హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం, సంస్కృతం, లాటి భారతీయభాషల్లోనేకాక.. ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషల్లో సైతం సినారె రచనలు అనువాదం అయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నారు. సినారె రచనల్లోని ఫేమస్ కొటేషన్లు.. కుత్తుకులను నరికితే కాదు, గుండెలను కలిపితే గొంతు. (మట్టి మనిషి ఆకాశం గ్రంథంలో) ఏ భాష చెణుకైనా, ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు. కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు. అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే. అదృష్టమనేది మత్తకోకిలలా ఉంటుంది. అది కాలమనే మావి గుబుళ్ళలో దాగి ఉంటుంది. అంత కడువెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లు మనకు మిగులును గతంలోపలి మంచి, అదియే సంప్రదాయం. అందరిలాగే సామాన్యుణ్ణి. అయినా చిరంజీవుణ్ణి. గతమనెడు వజ్రంపు గోడల కట్టడంపై నిట్టనిలువునా శిరసునెత్తిన స్వర్ణమయ గోపురం సుమ్ము వర్తమానమ్ము. విధి నిదురబోతుంది. విధిలిఖితం నిదురబోదు. -
తెలుగువారిలో ఎంతో టాలెంట్
స్వరానుబంధం..! ‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల’ పాట, ‘బురద నవ్వింది కమలాలుగా’ అని ‘విశ్వంభర’లోని కవితలు వినగానే.. ఎలా గోరటి వెంకన్న, డాక్టర్ సి.నారాయణ రెడ్డి గుర్తుకు వస్తారో.. అలానే కర్ణాటక సంగీతంలో లాల్గుడి పేరు వినగానే లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ బిడ్డలు లాల్గుడి జీజేఆర్ కృష్ణన్, విజయలక్ష్మి గుర్తుకు వస్తారు. ప్రతిభ లేని వారిని ఘనమైన కుటుంబ నేపథ్యం కూడా రక్షించలేదని అంటున్న వారికి... సంగీతమే నిజయమైన ప్రపంచం. ‘కళాసాగారం’ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చి వారు ‘సిటీ ప్లస్’తోముచ్చటించారు. మా పూర్వీకులు త్యాగరాజ శిష్యులు. నాటి నుంచి నేటి వరకు సంగీతంతో మా అనుబంధం కొనసాగుతోంది. దాన్ని అందిపుచ్చుకుని భక్తితో ముందుకు సాగుతున్నాం. పూర్వీకుల ఆశీర్వాదంతో వయోలిన్‌లో ప్రతిభ సంపాదించాం. లాల్గుడి బాణీ... కర్ణాటక సంగీతానికే మకుటాయమానం లాల్గుడి జయరామన్. లాల్గుడి అనేది మా తల్లిదండ్రుల ఊరు. సంగీతం గురించి చర్చ వస్తే లాల్గుడి శైలి అని చెబుతారు. అంతగా జయరామన్ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధులయ్యారు. అందుకే కర్ణాటక సంగీతమన్నా, వయోలిన్ పాటలు వినపడ్డా ‘లాల్గుడి వారి బాణీ’ అని ఠక్కున అనేస్తారు. జీజేఆర్ కృష్ణన్‌తో నాది రక్త సంబంధం. ఐదేళ్ల నుంచే కర్ణాటక సంగీతం, వయోలిన్‌పై మక్కువ కలిగింది. నాన్న జయరామన్‌తో కలసి కచేరీలు చేశాం. ఊపిరి ఉన్నంత వరకూ ఇలా కచేరీలు చేస్తూనే ఉంటాం. సంగీతం ద్వారా వారు ఆశించినట్లు సమాజంలో విలువలు పెంపొందించి, ప్రేమ, కరుణ, సేవానిరతి నింపుతాం. మరో ప్రపంచం సంగీతం ద్వారానే సాధ్యం. అంకితభావంతోనే... నేడు పిల్లలకు చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ గురు, శిష్య పరంపరను విడవకూడదు. సమగ్రంగా సంగీతం, వయోలిన్ నేర్చుకోవాలంటే 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది. ఈ రంగంలో రాణించాలంటే... చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండాలి. ఏకాగ్రత, శ్రద్ధ, వికాసం, పఠనం, జ్ఞాపక శక్తి.. ఇవన్నీ శాస్త్రీయ సంగీతం ద్వారా అలవడతాయి. తెలుగువారిలో ఎంతో టాలెంట్ శాస్త్రీయ సంగీతంలో తెలుగువారూ తక్కువేం కాదు. ఎంతో ప్రతిభ ఉన్నా... తక్కువ మంది ఇటువైపు వస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. విద్యార్థి దశ నుంచే ప్రోత్సహించాలి. హైదరాబాద్‌తో ఆత్మీయ అనుబంధం చిన్న నాటి నుంచి ఇక్కడికి వచ్చి వెళుతూనే ఉన్నా. మా అమ్మ వైపు బంధువులు సికింద్రాబాద్‌లో ఉండేవారు. ఇక్కడ కచేరీ అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. తమిళనాడులో సంగీతానికి ప్రాముఖ్యం ఎంతో ఉంది. అందుకే అక్కడ పచ్చగా వర్ధిల్లుతోంది. కోన సుధాకర్‌రెడ్డి -
అనుకున్న తేదీ
అనుకున్న తేదీ మనఃఫలకం మీద ముద్రితమైనప్పుడు ఆ స్థితికి తిరోగతి ఉండదు అది తన కర్తవ్యాన్ని అక్షత స్ఫూర్తితో కొనసాగిస్తుంటుంది. గ్రీష్మంలో ఉడికిపోతున్నా వర్షర్తువులో నిలువెల్లా తడుస్తున్నా ఆ తేదీ గమనంలో తేడా ఉండదు కొన్ని కొన్ని ఊహలు ఉన్మత్త స్థితిలో వచ్చి తన ముందు పొర్లాడుతూ వున్నా ఆ తేదీ స్వేచ్ఛా పూర్వకంగా సాగిపోతుంటుంది. తేదీ అంటే మరేదీ కాదు కాలం గీసుకున్న గీటు. ఆ గీటు మాసిపోకముందే దూరాన వున్న లక్ష్య శిఖరం చేరుకోవాలి. అందుకు ఆ తేదీ తన గమన వేగాన్ని పెంచుతూ పోతుంది అది అవతలి అంచుకు చేరుకునే ముందే గుండె లోతుల్లో వున్న సంకల్పాలను చేదుకుంటూ ఉంటుంది. ఉద్దిష్ట కార్యనిర్వహణ ఫలప్రదం కాగానే ఆ తేదీ అదృశ్యమై మరో తేదీ అవతరిస్తుంది. అది ఏ తేదీయో కాదు కరిగి పోయిన తేదీకి రూపాంతరమే. - సి.నారాయణరెడ్డి -
తెలంగాణ యాసలోనే మాట్లాడాలంటరు
అది అమ్మ మీద ప్రేమలాంటిది సినారె జన్మదిన వేడుకలో సీఎం ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్ తాజా కవితాసంపుటి ‘నింగికెగిరిన చెట్లు’ ఆవిష్కరణ హైదరాబాద్: తాను తెలంగాణ యాసలోనే మాట్లాడాలని చాలా మంది కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్నప్పుడు అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్న తెలుగమ్మాయి ఓ రోజు నా దగ్గరకు వచ్చింది. అంకుల్ భవిష్యత్తులో కూడా మీ ఉపన్యాసాలు తెలంగాణ యాసలోనే సాగాలని కోరింది. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లి నా భార్యకు పరిచయం చేయించిన, వయసులో చిన్నదైనా ఆ అమ్మాయికి పాదాభివందనం చెయ్యాలనిపించింది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘మీ అమ్మ మీద మీకెంత ప్రేమ ఉంటదో, మా అమ్మ మీద మాకంతే ప్రేమ ఉంటదని గుర్తుంచుకోవాలి’ అని తెలంగాణ యాసను తక్కువ చేసి మాట్లాడే వారిని ఉద్దేశించి ఆయన అన్నారు. ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి(సినారె) 84వ జన్మదిన వేడుకలు మంగళవారం రవీంద్రభారతిలో జరిగాయి. వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినారె కొత్త రచన ‘నింగికెగిరిన చెట్లు’ కవితా సంపుటిని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సినారెతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆయన తనకు గురుతుల్యులని, తాను సిద్దిపేటలో డిగ్రీ చదివే రోజుల నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. ఓ పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినారెను తానే వెళ్లి స్వయంగా ఆహ్వానించానని, ఆ సందర్భంగా ‘మా ఊరు హనుమాజీపేటకు బాట మీ సిద్దిపేట’ అంటూ ఆయన చమత్కరించారని గుర్తు చేశారు. నాటి కాలానికి తగ్గట్టే ‘నన్ను దోచుకుందువటే’ అని రాసినా, ఇప్పటి కాలానికి ‘ఒసే రాములమ్మ’ పాటలు రాసినా అది ఒక్క సినారెకే చెల్లిందని కేసీఆర్ ప్రశంసించారు. ఆయనది బహుముఖ కవిత్వమని పేర్కొంటూ ‘పొట్ట సేత పట్టుకుని బొంబాయి ఎల్లిపాయె... ఎట్ట ఉన్నడో కొడుకు ఏం తిన్నడో..’ అంటూ కరీంనగర్ యాసలో గతంలో సినారె రాసిన గేయ పంక్తులు చదివారు. ఈ సభలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని చెబుతూ ‘రాజకీయ సభల్లో నీ కతెంత అంటే నీ కతెంత అనుకుంటరు. కానీ ఈ సభ హాయిగా ఉంది మంచి పాటలు, మాటలు విన్న’ అని ముగించారు. కాగా, తన కవితాసంపుటి ఆవిష్కరణకు సీఎం కేసీఆర్ రావడం ఆనందం కలిగించిందని సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను ఉటంకించి కరీంనగర్ యాసలోని ఓ గీతాన్ని చదివి వినిపించారు. మాటకు దండం పెడతా, పాటకు దండం పెడతా.. మాటను, పాటను నమ్మిన మనిషికి దండం పెడతానంటూ అది సాగింది. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, గ్రంధ పరిచయకర్తగా దర్భశయనం శ్రీనివాసచార్య, అమెరికాకు చెందిన కార్డియాలజిస్టు శ్రీనివాసరెడ్డి, శారద అకునూరి, వంశీరామరాజు, సాంస్కృతిక శాఖ సంచాలకులు కవితాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు సినారె పాటలతో సాంస్కృతిక విభావరి నిర్వహించారు. కేసీఆర్ సభలోకి రాగానే దాన్ని ముగించబోగా.. తనకు ఆయన పాటలు వినాలని ఉందని కోరి మరీ... కార్యక్రమాన్ని కొనసాగింపజేయడం విశేషం. సరిగా నడవలేకపోతున్న సినారెను వేదికపైకి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయిపట్టుకుని తీసుకువచ్చారు. -
సినారె - స్టార్ స్టార్ సూపర్ స్టార్