
అనుకున్న తేదీ
అనుకున్న తేదీ
మనఃఫలకం మీద
ముద్రితమైనప్పుడు
ఆ స్థితికి తిరోగతి ఉండదు
అది తన కర్తవ్యాన్ని
అక్షత స్ఫూర్తితో కొనసాగిస్తుంటుంది.
గ్రీష్మంలో ఉడికిపోతున్నా
వర్షర్తువులో నిలువెల్లా తడుస్తున్నా
ఆ తేదీ గమనంలో తేడా ఉండదు
కొన్ని కొన్ని ఊహలు
ఉన్మత్త స్థితిలో వచ్చి
తన ముందు పొర్లాడుతూ వున్నా
ఆ తేదీ స్వేచ్ఛా పూర్వకంగా
సాగిపోతుంటుంది.
తేదీ అంటే మరేదీ కాదు
కాలం గీసుకున్న గీటు.
ఆ గీటు మాసిపోకముందే
దూరాన వున్న
లక్ష్య శిఖరం చేరుకోవాలి.
అందుకు ఆ తేదీ
తన గమన వేగాన్ని పెంచుతూ పోతుంది
అది అవతలి అంచుకు చేరుకునే ముందే
గుండె లోతుల్లో వున్న
సంకల్పాలను చేదుకుంటూ ఉంటుంది.
ఉద్దిష్ట కార్యనిర్వహణ ఫలప్రదం కాగానే
ఆ తేదీ అదృశ్యమై
మరో తేదీ అవతరిస్తుంది.
అది ఏ తేదీయో కాదు
కరిగి పోయిన తేదీకి రూపాంతరమే.
- సి.నారాయణరెడ్డి