
తెలంగాణ యాసలోనే మాట్లాడాలంటరు
అది అమ్మ మీద ప్రేమలాంటిది సినారె జన్మదిన వేడుకలో సీఎం
ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్
తాజా కవితాసంపుటి ‘నింగికెగిరిన చెట్లు’ ఆవిష్కరణ
హైదరాబాద్: తాను తెలంగాణ యాసలోనే మాట్లాడాలని చాలా మంది కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్నప్పుడు అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్న తెలుగమ్మాయి ఓ రోజు నా దగ్గరకు వచ్చింది. అంకుల్ భవిష్యత్తులో కూడా మీ ఉపన్యాసాలు తెలంగాణ యాసలోనే సాగాలని కోరింది. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లి నా భార్యకు పరిచయం చేయించిన, వయసులో చిన్నదైనా ఆ అమ్మాయికి పాదాభివందనం చెయ్యాలనిపించింది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘మీ అమ్మ మీద మీకెంత ప్రేమ ఉంటదో, మా అమ్మ మీద మాకంతే ప్రేమ ఉంటదని గుర్తుంచుకోవాలి’ అని తెలంగాణ యాసను తక్కువ చేసి మాట్లాడే వారిని ఉద్దేశించి ఆయన అన్నారు. ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి(సినారె) 84వ జన్మదిన వేడుకలు మంగళవారం రవీంద్రభారతిలో జరిగాయి. వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినారె కొత్త రచన ‘నింగికెగిరిన చెట్లు’ కవితా సంపుటిని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సినారెతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆయన తనకు గురుతుల్యులని, తాను సిద్దిపేటలో డిగ్రీ చదివే రోజుల నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. ఓ పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినారెను తానే వెళ్లి స్వయంగా ఆహ్వానించానని, ఆ సందర్భంగా ‘మా ఊరు హనుమాజీపేటకు బాట మీ సిద్దిపేట’ అంటూ ఆయన చమత్కరించారని గుర్తు చేశారు. నాటి కాలానికి తగ్గట్టే ‘నన్ను దోచుకుందువటే’ అని రాసినా, ఇప్పటి కాలానికి ‘ఒసే రాములమ్మ’ పాటలు రాసినా అది ఒక్క సినారెకే చెల్లిందని కేసీఆర్ ప్రశంసించారు.
ఆయనది బహుముఖ కవిత్వమని పేర్కొంటూ ‘పొట్ట సేత పట్టుకుని బొంబాయి ఎల్లిపాయె... ఎట్ట ఉన్నడో కొడుకు ఏం తిన్నడో..’ అంటూ కరీంనగర్ యాసలో గతంలో సినారె రాసిన గేయ పంక్తులు చదివారు. ఈ సభలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని చెబుతూ ‘రాజకీయ సభల్లో నీ కతెంత అంటే నీ కతెంత అనుకుంటరు. కానీ ఈ సభ హాయిగా ఉంది మంచి పాటలు, మాటలు విన్న’ అని ముగించారు. కాగా, తన కవితాసంపుటి ఆవిష్కరణకు సీఎం కేసీఆర్ రావడం ఆనందం కలిగించిందని సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను ఉటంకించి కరీంనగర్ యాసలోని ఓ గీతాన్ని చదివి వినిపించారు. మాటకు దండం పెడతా, పాటకు దండం పెడతా.. మాటను, పాటను నమ్మిన మనిషికి దండం పెడతానంటూ అది సాగింది. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, గ్రంధ పరిచయకర్తగా దర్భశయనం శ్రీనివాసచార్య, అమెరికాకు చెందిన కార్డియాలజిస్టు శ్రీనివాసరెడ్డి, శారద అకునూరి, వంశీరామరాజు, సాంస్కృతిక శాఖ సంచాలకులు కవితాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు సినారె పాటలతో సాంస్కృతిక విభావరి నిర్వహించారు. కేసీఆర్ సభలోకి రాగానే దాన్ని ముగించబోగా.. తనకు ఆయన పాటలు వినాలని ఉందని కోరి మరీ... కార్యక్రమాన్ని కొనసాగింపజేయడం విశేషం. సరిగా నడవలేకపోతున్న సినారెను వేదికపైకి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయిపట్టుకుని తీసుకువచ్చారు.