ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి పార్థీవ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళు అర్పించారు.
హైదరాబాద్ : ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పార్థీవ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. సినారె భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. సినారె కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... గొప్ప సాహితీవేత్తను కోల్పోయామని, సినారె మరణం తెలుగు జాతి, దేశానికే తీరని లోటు అని అన్నారు. ఒక మహనీయుడ్ని కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు సి.నారాయణ రెడ్డి అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సులు నడుపనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్‌లోని దర్గా పరిసర మహాప్రస్థానానికి వచ్చే సినారే అభిమానుల కోసం ఏర్పాట్లు చేశారు.