
సామాన్యుడు.. అయినా చిరంజీవుడు
అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు.. ‘మట్టి మనిషి ఆకాశం’ గ్రంథంలో డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి రాసిన మాటలివి.
- సి.నారాయణరెడ్డి మరణం తెలుగుకు తీరని లోటు
- దిగ్భ్రాంతి చెందిన సాహితీలోకం.. ప్రముఖుల నివాళి
అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు.. ‘మట్టి మనిషి ఆకాశం’ గ్రంథంలో డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి రాసిన మాటలివి. అవును. కవివర్యుడు భౌతికంగా చనిపోయారుగానీ అక్షరాల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతోన్న సినారె సోమవారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కరీంగనర్ జిల్లాలోని మారుమూల పల్లె హనుమాజీపేటలో 1931, జులై 29 జన్మించిన ఆయన.. భారతదేశం గర్వించదగిన సాహితీవేత్తగా ఎదిగిన క్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే..
హనుమాజీపేటలో మల్లారెడ్డి-బుచ్చమ్మ దంపతులకు జన్మించారు నారాయణరెడ్డి. ప్రాథమిక విద్యాబ్యాసంమంతా సొంత ఊళ్లోనే సాగింది. మాధ్యమిక విద్య(సిరిసిల్లలో), ఉన్నత విద్య(కరీంనగర్) అభ్యసించారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ కాలేజీలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ చదివారు. మాధ్యమికం నుంచి డిగ్రీదాకా ఆయన చదివింది ఉర్దూమీడియంలోనే కావడం గమనార్హం. ఆ తర్వాత ఓయూలోనే తెలుగు సాహిత్యంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు.
ఉద్యోగం, సాహితీ ప్రస్థానం
ప్రారంభంలో సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకుడిగా చేసిన నారాయణరెడ్డి.. తర్వాత నిజాం కాలేజీలో, అటుపై ఉస్మానియా వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనిర్సిటీ ఉపకులపతిగానూ ఆయన సేవలందించారు. ఉద్యోగం చేస్తూనే సాహితీసేవను కొనసాగించారు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది. ప్రముఖంగా కవి అయినప్పటికీ పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సినిమా పాటలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు తదితర ప్రక్రియలన్నింటిలో విశేష రచనలు చేశారు.
(చదవండి: సినారె అక్షరానుబంధం)
కాలేజీ రోజుల్లో ‘శోభ’ అనే పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించారు. ‘జనశక్తి’ పత్రికలో సినారె కవిత తొలిసారి అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించి సత్తా చాటుకున్నారు. 1953 లో ‘నవ్వని పువ్వు’ సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. ఇది సినారె తొలి ప్రచురణ. ఆ వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది.
గులేబకావళి కథతో సినిమాల్లోకి..
1962 లో గులేబకావళి కథ చిత్రం లోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ..’ అనే పాటతో సినీరంగ ప్రవేశం చేశారు నారాయణరెడ్డి. అటుపై పలు సినిమాలకు 3500 పాటలు, కవితలు రాశారు.
కుటుంబం..
సినారె- సుశీల దంపతులకు నలుగురు ఆడపిల్లలు. గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి. భార్య సుశీల మరణానంతరం ఆమె పేరుమీద ఔత్సాహిక సాహితీకారులకు ఏటా అవార్డులు అందిస్తున్నారు సినారె.
అంతర్జాతీయ ఖ్యాతి
హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం, సంస్కృతం, లాటి భారతీయభాషల్లోనేకాక.. ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషల్లో సైతం సినారె రచనలు అనువాదం అయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నారు.
సినారె రచనల్లోని ఫేమస్ కొటేషన్లు..
- కుత్తుకులను నరికితే కాదు, గుండెలను కలిపితే గొంతు. (మట్టి మనిషి ఆకాశం గ్రంథంలో)
- ఏ భాష చెణుకైనా, ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు.
- కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు.
- అంటరానివారెవరో కాదు, మా వెంటరానివారే.
- అదృష్టమనేది మత్తకోకిలలా ఉంటుంది. అది కాలమనే మావి గుబుళ్ళలో దాగి ఉంటుంది.
- అంత కడువెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లు మనకు మిగులును గతంలోపలి మంచి, అదియే సంప్రదాయం.
- అందరిలాగే సామాన్యుణ్ణి. అయినా చిరంజీవుణ్ణి.
- గతమనెడు వజ్రంపు గోడల కట్టడంపై నిట్టనిలువునా శిరసునెత్తిన స్వర్ణమయ గోపురం సుమ్ము వర్తమానమ్ము.
- విధి నిదురబోతుంది. విధిలిఖితం నిదురబోదు.