సీఎం రేవంత్‌తో హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్ రోష్నీ నాడర్ భేటీ
కొత్త క్యాంపస్ ప్రారంపోత్సవానికి రావాలని ఆహ్వనం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నగరంలోని హైటెక్ సిటీలో త్వరలో కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త క్యాంపస్ ద్వారా మరో 5 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్నీ నాడర్ మల్హోత్రా శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. కొత్త క్యాంపస్ ప్రారంపోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వనించారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్.. విద్యార్థులకు మెరుగైన శిక్షణ, విద్యావనరుల విస్తరణ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి పనిచేయాల్సిందిగా హెచ్‌సీఎల్‌ను కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్‌సీఎల్ చేస్తున్న కృషిని సీఎం అభినందించారు. హెచ్‌సీఎల్‌కు తగినంత సహకారం అందిస్తామని చెప్పారు. నైపుణ్య శిక్షణ ద్వారా యువత సాధికారత కోసం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామని రోష్నీ నాడర్ హామీ ఇచ్చారు. స్కిల్స్ యూనివర్సిటీతోపాటు హెచ్‌సీఎల్ విద్యాకార్యక్రమాలను రాష్ట్రంలోని ఇతర వర్సిటీలకు విస్తరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment