HCL Tech CEO C Vijayakumar’s Salary Dips 80 pc In FY23 - Sakshi
Sakshi News home page

HCL: టాప్‌ ఐటీ కంపెనీ సీఈవో జీతం ఢమాల్‌! ఏకంగా 80 శాతం.. కారణం ఇదే..

Published Sun, Jul 30 2023 3:28 PM | Last Updated on Sun, Jul 30 2023 4:19 PM

HCL Tech CEO Vijayakumar Pay Drops 80pc FY23 Why - Sakshi

HCL Tech CEO Vijayakumar Pay Drops: దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ వేతనం 2023 ఆర్థిక సంవత్సరంలో భారీగా పడిపోయింది.  కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. సీఈవో విజయకుమార్ 2023 ఆర్థిక సంవత్సరంలో 3.46 మిలియన్‌ డాలర్లు (రూ. 28.4 కోట్లు) అతి తక్కువ వేతనాన్ని పొందారు.

ఇందులో మూల వేతనం 2 మిలియన్ డాలర్లు, పర్ఫామెన్స్‌ బోనస్ 1.43 మిలియన్‌ డాలర్లు, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు 0.03 మిలియన్‌ డాలర్లు ఉన్నాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న 16.5 మిలియన్‌ డాలర్లు (రూ. 130 కోట్లు)  కంటే దాదాపు 80 శాతం తక్కువ గమనార్హం.

కారణం ఇదే.. 
హెచ్‌సీఎల్‌ కంపెనీ సీఈవో విజయ్‌కుమార్‌ వేతనం ఈ ఏడాది భారీగా తగ్గిపోవడానికి కారణం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు లేదా ఎల్‌టీఐ లేకపోవడం అని తెలుస్తోంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఈ దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను ఎల్‌టీఐని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మైలురాళ్లు లేదా బోర్డు నిర్దేశించిన లక్ష్యాల సాధన ఆధారంగా చెల్లిస్తారు. 2022 ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ ఎల్‌టీఐ రూపంలో 12.50 మిలియన్‌ డాలర్లు సంపాదించారు.

ఇదీ చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులు ఇక ఇంటికే..!

అయితే 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎల్‌టీఐని ఆయన 2024లో అందుకోనున్నారు. అయినప్పటికీ సీఈవో విజయకుమార్‌ 2023లో అందుకున్న జీతం అదే కంపెనీలో మొత్తం ఉద్యోగుల సగటు వేతనం కంటే 253.35 రెట్లు ఎక్కువ. గత మార్చి 31 నాటికి హెచ్‌సీఎల్‌ కంపెనీకి చెందిన 60 దేశాల్లోని 210 డెలివరీ కేంద్రాలలో మొత్తం 2,25,944 మంది ఉద్యోగులు ఉన్నారు. 

ఇతర కంపెనీల సీఈవోల జీతాలు.. 
గత ఏడాది వరకు భారతదేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా ఉన్న విజయకుమార్.. ఈ ఏడాది ఇతర కంపెనీల సీఈవోలతో పోల్చితే చాలా తక్కువ వేతనం పొందారు. 2023 ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ రూ.29.16 కోట్లు, టెక్ మహీంద్రా అవుట్‌గోయింగ్  సీఈవో సీపీ గుర్నానీ రూ.30.14 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 56.44 కోట్లు, విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రూ.82 కోట్లు వేతనాలు అందుకున్నట్లు ఆయా కంపెనీల వార్షిక నివేదిక ద్వారా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement