సాక్షి, అమరావతి: ‘స్వగ్రామం నుంచే సాఫ్ట్‌వేర్’ విధులు నిర్వర్తించే వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టనున్నట్లు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. స్టార్టప్‌లకు ఏపీ చిరునామాగా మారనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం ప్రఖ్యాత ఐటీ కంపెనీ 'హెచ్సీఎల్ టెక్నాలజీస్' చైర్‌పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రాతో మంత్రి మేకపాటి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్‌మోహన్‌రెడ్డి ఆలోచన ప్రకారం విశాఖపట్నంలో అత్యున్నత స్థాయి నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఐటీ వృద్ధితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తరహా అత్యాధునిక కోర్సులకు చిరునామాగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్శిటీలో తోడ్పాటునందించాలని మంత్రి కోరడంతో హెచ్ల్‌సీఎల్ చైర్‌పర్సన్ సానుకూలంగా స్పందించడమే కాక ఆసక్తి చూపారు. (చదవండి: నైపుణ్యమే యువత భవితకు ఆయుధం)
ఇతర రాష్ట్రాలలో స్టార్టప్‌ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అంకురాల ఏర్పాటుకు అనుకూలమని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఏపీలో చాలా తక్కువ ఖర్చుకే హబ్‌ల ఏర్పాటుకు అవసరమైన భూములు, ప్రతిభగల యువత పుష్కలంగా ఉందన్నారు. ప్రస్తుతం హెచ్‌సీఎల్ సంస్థ చేపడుతున్న 'టెక్ బీ' కార్యక్రమం ద్వారా ఇంటర్ చదివిన యువతకు 18 ఏళ్లు నిండేసరికే ఉద్యోగాలు పొందేలా వివిధ కోర్సులు నేర్పడం, శిక్షణ అందించడం, ప్లేస్ మెంట్ల ద్వారా ఉద్యోగాలివ్వడం వంటి అంశాలను మంత్రి మేకపాటికి ఛైర్ పర్సన్ రోష్ని వివరించారు. పదవతరగతి పూర్తి చేసిన బాలికలకు కూడా ఇదే తరహా కార్యక్రమం ద్వారా స్వశక్తితో నిలిచేలా చేయడానికి యత్నిస్తున్న హెచ్‌సీఎల్‌ను మంత్రి మేకపాటి అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈవో శివశంకర్ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment