రోష్ని నాడార్, శివ నాడార్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 3,214 కోట్లను తాకింది. యూఎస్ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,925 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 12.5 శాతం పుంజుకుని రూ. 20,068 కోట్లకు చేరింది. గతంలో రూ. 17,841 కోట్ల టర్నోవర్ నమోదైంది.
కాగా.. పూర్తి ఏడాదికి ఆదాయంలో రెండంకెల వృద్ధిని అందుకోగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. ఇబిట్ మార్జిన్లు 19–21 శాతం మధ్య నమోదుకాగలవని ఆశిస్తోంది. ఈ కాలంలో నికరంగా 7,522 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించింది. క్యూ2(జూలై–సెప్టెంబర్)లో కొత్తగా మరో 6,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నట్లు పేర్కొంది. పూర్తి ఏడాదికి 20,000–22,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు మానవ వనరుల ముఖ్య అధికారి వీవీ అప్పారావు వెల్లడించారు. ఈ నెల 1 నుంచి వేతన పెంపును చేపట్టినట్లు తెలియజేశారు.
బుకింగ్స్ స్పీడ్
ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ త్రైమాసిక వారీగా పటిష్ట వృద్ధిని సాధించగలమని హెచ్‌సీఎల్ టెక్ ప్రెసిడెంట్, సీఈవో సి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. క్యూ1లో బుకింగ్స్ వార్షిక ప్రాతిపదికన 37 శాతం జంప్‌చేసినట్లు తెలియజేశారు. క్లౌడ్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ డీల్స్ ఇందుకు దోహదపడుతున్నట్లు వివరించారు. కాగా.. కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ ఎమిరిటస్, వ్యూహాత్మక సలహాదారుగా కొత్త బాధ్యతలు స్వీకరించినట్లు కంపెనీ పేర్కొంది.
ప్రధాన వ్యూహాల అధికారి, ఎండీగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీటికి రాజీనామా చేసినట్లు కంపెనీ తెలియజేసింది. కొత్త పదవులలో ఐదేళ్లపాటు కొనసాగనున్నట్లు వివరించింది. విజయ్ కుమార్ ఇకపై సీఈవో, ఎండీగా వ్యవహరించనున్నారు. గతేడాది జూలైలో నాడార్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోగా.. ఆయన కుమార్తె రోష్నీ నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. తద్వారా లిస్టెడ్ దేశీ కంపెనీకి తొలి మహిళా చైర్‌ఉమన్‌గా ఎంపికయ్యారు.
ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.3 శాతం నీరసించి రూ. 1,002 వద్ద ముగిసింది.
ఇతర హైలైట్స్
► క్యూ1లో కొత్త డీల్స్ 37 శాతం ఎగశాయి. వీటి విలువ(టీసీవీ) 166.4 కోట్ల డాలర్లు.
► డాలర్ల రూపేణా నికర లాభం 12.8 శాతం బలపడింది. 4.3 కోట్ల డాలర్లకు చేరింది.
► గత క్యూ1తో పోలిస్తే ఆదాయం 15.5% ఎగసి 271.96 కోట్ల డాలర్లను తాకింది.
► వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండును బోర్డు ఆమోదించింది.
► మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు ఈ నెల 28 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది.
► జూన్ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 1,76,499కు చేరింది.
► వార్షిక ప్రాతిపదికన ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 11.8 శాతంగా నమోదైంది.
► ఐబీఎం మాజీ ఎగ్జిక్యూటివ్ వనితా నారాయణన్ బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment