HCL Technologies
-
హెచ్‌సీఎల్ టెక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్లో నికర లాభం 5.5 శాతం బలపడి రూ. 4,591 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 4,350 కోట్లు ఆర్జించింది. పూర్తి ఏడాదికి ఆదాయ ఆర్జన అంచనా(గైడెన్స్)ను తాజాగా 4.5–5 శాతానికి సవరించింది. ఇంతక్రితం 3.5–5 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. డిమాండ్ వాతావరణంతోపాటు విచక్షణా వ్యయాలు పెరుగుతున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ పేర్కొన్నారు. దీంతో గైడెన్స్‌ను మెరుగుపరచినట్లు తెలియజేశారు. తాము అందిస్తున్న డిజిటల్, ఏఐ సేవలపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. మొత్తం ఆదాయం సైతం 5 శాతం పుంజుకుని రూ. 28,446 కోట్లకు చేరింది. త్రైమాసికవారీగా ఆదాయం 8.4 శాతం, నికర లాభం 3.6 శాతం చొప్పున వృద్ధి చూపాయి. వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ.6 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. ఆర్డర్లు ఓకే క్యూ3లో హెచ్‌సీఎల్ టెక్ 2.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. క్యూ3లో 2,134 మంది ఉద్యోగులను జత చేసుకోగా.. మొత్తం సిబ్బంది సంఖ్య 2,20,755కు చేరింది. జనవరి–మార్చి(క్యూ4)లో 1,000 మందికి కొత్తగా ఉపాధి కల్పించనున్నట్లు హెచ్ఆర్ అధికారి ఆర్ సుందరరాజన్ తెలియజేశారు. వచ్చే ఏడాది(2025–26) ఉద్యోగులను తీసుకోవడంకంటే స్పెషలైజేషన్‌పై అధిక దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. యూఎస్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పందిస్తూ అక్కడి తమ ఉద్యోగుల్లో 80 శాతం స్థానికులేనని విజయకుమార్ వెల్లడించారు. దీంతో హెచ్1బీ వీసాలపై అతితక్కువగానే ఆధారపడుతున్నట్లు తెలియజేశారు. ఇవి ఏడాదికి 500–1,000వరకూ మాత్రమే ఉంటాయని తెలియజేశారు. వెరసి తమ బిజినెస్‌పై ఇలాంటి అంశాలు ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం నష్టంతో రూ. 1,985 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం అప్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ క్యూ2లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 4,235 కోట్లుగా నమోదైంది. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్ల నుంచి రూ. 28,862 కోట్లకు చేరింది. రెవెన్యూ వృద్ధితో పాటు లాభదాయకత కూడా మెరుగ్గా ఉందని సంస్థ సీఈవో సి. విజయ్ కుమార్ తెలిపారు. వార్షికంగా ఆదాయ వృద్ధి 3.5–5.0 శాతంగా ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచి్చంది. క్యూ2లో 780 మంది ఉద్యోగులను తగ్గించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,18,621కి చేరింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి గాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 12 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు స్వల్పంగా ఒక్క శాతం పెరిగి రూ. 1,856 వద్ద క్లోజయ్యింది. -
హెచ్‌సీఎల్ రోష్ని నాడార్కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాను .. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. వ్యాపార, పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మకమైన ’షెవాలీర్ డి లా లెజియన్ డి హానర్’ (’నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’) లభించినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పురస్కారాన్ని అందుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, భారత్ .. ఫ్రాన్స్ మధ్య పటిష్టమైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రోష్ని తెలిపారు. తమకు కీలక మార్కెట్లలో ఒకటైన ఫ్రాన్స్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నామని ఆమె పేర్కొన్నారు. -
దాతృత్వంలో శివ్ నాడార్ టాప్
ముంబై: విరాళాలివ్వడంలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ్ నాడార్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. 2023లో ఏకంగా రూ. 2,042 కోట్లు విరాళమిచ్చి ఎడెల్‌గివ్ హురున్ ఇండియా 2023 జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. గతేడాది ఇచి్చన రూ. 1,161 కోట్లతో పోలిస్తే ఇది 76 శాతం అధికం. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ రూ. 1,774 కోట్లతో (గతేడాదితో పోలిస్తే 267 శాతం అధికం) రెండో స్థానంలోనూ, రూ. 376 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ మూడో స్థానంలో ఉన్నారు. అంబానీ విరాళాలు గతేడాదితో పోలిస్తే 8 శాతం తగ్గాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా రూ. 287 కోట్లతో నాలుగో స్థానంలో, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ. 285 కోట్లతో (50 శాతం అధికం) ఈ జాబితాలో అయిదో స్థానంలో ఉన్నారు. ఇటీవలి హురున్ కుబేరుల జాబితా ప్రకారం అంబానీ సంపద రూ. 8.08 లక్షల కోట్లుగాను, అదానీది రూ. 4.74 లక్షల కోట్లు, నాడార్ సంపద రూ. 2.28 లక్షల కోట్లుగాను ఉంది. సంపద పెరిగే కొద్దీ సంపన్న కుటుంబాలు .. అట్టడుగు వర్గాల వారి కోసం ఆహారం, దుస్తులు, ఉపకార వేతనాలు మొదలైన దాతృత్వ కార్యకలాపాలకు విరాళాలిచ్చే ధోరణి పెరుగుతోందని హురున్ ఇండియా చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. లిస్టులో మొత్తం 119 మంది వ్యక్తులు, కుటుంబాలు ఉన్నాయి. మరిన్ని వివరాలు.. ► బజాజ్ కుటుంబంతో పాటు సైరస్ ఎస్ పూనావాలా, అదార్ పూనావాలా, రోహిణి నీలెకని వంటి వారు టాప్ 10లో నిల్చారు. మహిళల్లో నీలెకనితో పాటు అను ఆగా (థర్మాక్స్), లీనా గాంధీ తివారీ (యూఎస్వీ) కూడా ఉన్నారు. ► డిస్కౌంటు బ్రోకరేజీ జిరోధా సహ–వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ జాబితాలో అత్యంత పిన్న వయసు్కడు. కామత్ సోదరులు రూ. 110 కోట్లు విరాళమిచ్చారు. ► రూ. 150 కోట్ల విరాళంతో ఎల్అండ్టీ గౌరవ చైర్మన్ ఏఎం నాయక్ .. ప్రొఫెషనల్స్ జాబితాలో అగ్రస్థానంలో, ఓవరాల్ లిస్టులో 11వ స్థానంలో ఉన్నారు. -
వారంలో 3 రోజులు ఆఫీసుకు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా వారంలో మూడు రోజులపాటు కార్యాలయానికి వచ్చి పనిచేయడాన్ని తప్పనిసరి చేసింది. సుదూర ప్రాంతం నుంచి పనిచేసే విధానం కొనసాగింపు సరైన ఆలోచనకాదంటూ కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయ్‌కుమార్ పేర్కొ న్నారు. వెరసి సంస్థ ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీ సుకు హాజరై విధులు నిర్వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వారంలో ఏ మూడు రోజులు అన్న విషయంలో స్వల్ప వెసులుబాటు(ఫ్లెక్సిబిలిటీ) కలి్పంచనున్నట్లు తెలియజేశారు. కోవిడ్–19 కారణంగా ఇంటి నుంచే విధుల(వర్క్ ఫ్రమ్ హోమ్) విధానానికి బీజం పడగా.. ఇటీవల పలు ఐటీ దిగ్గజాలు తిరిగి ఆఫీసునుంచి బా« ద్యతల నిర్వహణకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీసీఎస్ ఇప్పటికే..: బుధవారం క్యూ2 ఫలితాలు వెల్లడించిన టీసీఎస్ 6.14 లక్షల మంది సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించవలసిందిగా ఆదేశించినట్లు వెల్లడించిన విషయం విదితమే. ఇక మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగుల విధుల విషయంలో వెసులుబాటుకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ అత్యధిక శాతం సిబ్బంది ఆఫీసులకు తరలి వస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. సుదూర ప్రాంతాల నుంచి పనిచేయడం ద్వారా అటు సిబ్బందికి, ఇటు సంస్థకు ప్రయోజనకరంకాదని విజయ్‌కుమార్ వ్యా ఖ్యానించారు. ఇది సరైన ఆలోచనకాదని, దీంతో వారంలో మూడు రోజుల పని విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే 60 శాతంమంది కార్యాలయాలకు హాజరవుతుండగా.. సిబ్బంది మొత్తానికి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. -
కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు..
ప్రసిద్ధ ఐటీ సేవల కంపెనీ హెచ్‌సీఎల్ టెక్(HCLTech)కి వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగుల యూనియన్ కార్మిక శాఖను ఆశ్రయించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) చెల్లింపు విధానాన్ని అప్డేట్ చేసిన హెచ్‌సీఎస్ టెక్ సంస్థపై ఐటీ ఉద్యోగుల యూనియన్ ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. భారీగా తగ్గిన జీతాలు త్రైమాసిక పనితీరు రేటింగ్ ప్రాతిపదికన ఈపీబీ చెల్లించే విధానాన్ని హెచ్‌సీఎస్ టెక్ ఇటీవల సవరించింది. కోవిడ్ కంటే ముందున్న ఫార్మాట్‌ను అమలు చేస్తోంది. కోవిడ్ సమయంలో ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు రేటింగ్‌తో సంబంధం లేకుండా అందరికీ అంటే బెంచ్ మీద ఉన్న ఉద్యోగులకు కూడా 100 శాతం ఈపీబీని కంపెనీ చెల్లించేది. కానీ దీన్ని పాత విధానంలోనే ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ రేటింగ్‌కు అనుగుణంగా బోనస్ చెల్లించునున్నట్లు కంపెనీ ఉద్యోగులకు తెలియజేసింది. ఏప్రిల్ 1 నుంచే పాత విధానాన్ని అమల్లోకి తెచ్చిన కంపెనీ ఉద్యోగులకు ఒక రోజు ముందు దీని గురించి ఈ-మెయిల్స్ పంపినట్లు తెలిసింది. పాత ఈపీబీ) చెల్లింపు విధానంతో ఉద్యోగుల జీతాలు భారీగా తగ్గాయి. ఉద్యోగుల ఆక్షేపణలు ఇవి.. నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ ‘గత పాలసీ ప్రకారం, ఉద్యోగులు బెంచ్‌లో ఉన్నప్పటికీ, నెలవారీ ప్రాతిపదికన స్థిరమైన రేటుతో ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) చెల్లిస్తామని హెసీఎల్ కంపెనీ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈపీబీ చెల్లింపులను నిర్ణయించడానికి త్రైమాసిక పనితీరు సమీక్ష ప్రక్రియను అమలు చేస్తూ కంపెనీ ఆకస్మికంగా పాలసీని మార్చింది’ అన్నారు. మార్చిన విధానం ప్రకారం.. ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఆధారంగా ఈపీబీని కంపెనీ చెల్లిస్తుంది. అంటే అత్యుత్తమ పనితీరు రేటింగ్ ఉన్న వారికి గరిష్టంగా 80-90 శాతం, తక్కువ రేటింగ్ ఉన్నవారికి కేవలం 30-40 శాతం వరకు ఉంటుందని వివరించారు. ఇదీ చదవండి ► ఈ ఐటీ కంపెనీ సూపర్! వెయ్యికిపైగా ఉద్యోగాలు.. 800 మంది భారత్ నుంచే.. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం బలపడి రూ. 3,983 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 3,599 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసికవారీగా అంటే గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన రూ. 4,096 కోట్లతో పోలిస్తే నికర లాభం 3 శాతం తగ్గింది. కాగా.. ఈ క్యూ4లో మొత్తం ఆదాయం 18 శాతం ఎగసి రూ. 26,606 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 22,597 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 10 శాతం మెరుగై రూ. 14,845 కోట్లను తాకింది. 2021–22లో రూ. 13,499 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. లక్ష కోట్లను దాటి రూ. 1,01,456 కోట్లకు చేరింది! అంతక్రితం ఏడాది రూ. 85,651 కోట్ల ఆదాయం అందుకుంది. భారీ డీల్స్ అప్ క్యూ4లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 13 భారీ డీల్స్ గెలుచుకుంది. వీటి విలువ 207.4 కోట్ల డాలర్లుకాగా.. వార్షికంగా 18 శాతం క్షీణించింది. ఈ కాలంలో కంపెనీ 3,674 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,25,944కు చేరింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతంగా నమోదైంది. డీల్ పైప్‌లైన్ దాదాపు కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు కంపెనీ సీఈవో విజయ్‌కుమార్ పేర్కొన్నారు. గైడెన్స్ గుడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 6–8 శాతం వృద్ధి చెందగలదని హెచ్‌సీఎల్ టెక్ తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున డివిడెండును ప్రకటించింది. వరుసగా 81వ త్రైమాసికంలోనూ డివిడెండును చెల్లిస్తున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు నామమాత్ర నష్టంతో రూ. 1,037 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్కు స్విస్ సంస్థ నుంచి భారీ ఆర్డర్
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ కంపెనీ ఎస్ఆర్ టెక్నిక్స్ నుంచి కొన్నేళ్లపాటు అమల్లో ఉండే(మల్టీ ఇయర్) కాంట్రాక్టును కుదుర్చుకున్నట్లు దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ తాజాగా పేర్కొంది. ఆర్డర్లో భాగంగా టెక్నిక్స్ కార్యకలాపాలను డిజిటల్ రూపేణా మార్పు చేసేందుకు అనుగుణమైన సర్వీసులు అందించనున్నట్లు తెలియజేసింది. వైమానిక నిర్వహణ, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్వో) సర్వీసులందించే టెక్నిక్స్ కొన్ని భాగస్వామ్య సంస్థలతో కలసి పనిచేస్తోంది. యూరప్, అమెరికా, ఆసియా, మధ్యప్రాచ్యంలో బిజినెస్ డెవలప్మెంట్ కార్యలయాలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 500 కస్టమర్లకు విమానాల ఇంజిన్లు, ఎయిర్‌ఫ్రేమ్, విడిభాగాలు, సాంకేతిక మద్దతుసహా అవసరమైన(కస్టమైజ్డ్) సేవలు సమకూరుస్తోంది. కాగా.. హెచ్‌సీఎల్ టెక్ డీల్ విలువను వెల్లడించలేదు. -
హెచ్‌సీఎల్ టెక్ కొత్త లోగో
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన లోగోను, బ్రాండ్ ఐడెంటిటీని విడుదల చేసింది. క్లయింట్లు, ప్రజలు, కమ్యూనిటీల విషయంలో కంపెనీ వైఖరిని ప్రతిబింబించే విధంగా ‘సూపర్ చార్జింగ్ ప్రోగ్రెస్’ అంటూ లోగో పక్కన క్యాప్షన్‌ను పెట్టింది. లోగోలో రాకెట్ సింబల్‌ను చేర్చింది. నిత్యం తమ క్లయింట్ల డిజిటల్ పరివర్తనాన్ని వేగవంతం చేసే విధంగా కొత్త లోగోకు రూపకల్పన చేసినట్టు కంపెనీ తెలిపింది. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
విదేశాల్లోనూ దూసుకెళ్తాం,ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్!
ముంబై: గత రెండేళ్లుగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి (ఐటీ) డిమాండ్ భారీ స్థాయిలోనే ఉందని ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా తెలిపారు. అంతర్జాతీయంగా క్లయింట్లు డిజిటల్ వైపు మళ్లడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించగలదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. క్లౌడ్, డిజిటల్ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు కొత్త మార్కెట్లలోకి కూడా విస్తరించడంపై హెచ్‌సీఎల్ టెక్ దృష్టి సారిస్తున్నట్లు రోష్నీ తెలిపారు. ‘అయిదేళ్ల తర్వాత చూస్తే మేము మరిన్ని మార్కెట్లలోకి విస్తరిస్తాం. మరింత మంది కస్టమర్లు ఉంటారు. సీఈవో విజయ్‌కుమార్ చెప్పినట్లుగా మేము రెండంకెల స్థాయిలో వృద్ధిని కొనసాగిస్తాం‘ అని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం ఉత్తర ఆసియా, సెంట్రల్ అమెరికా, తూర్పు యూరప్, ఆఫ్రికా దేశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. యూరప్, అమెరికా వంటి పెద్ద మార్కెట్లలో క్లయింట్లతో మాట్లాడినప్పుడు వారు మరింత వేగంగా డిజిటలీకరణను ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తున్నట్లు వెల్లడైందని రోష్నీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 22,597 కోట్లకు చేరింది. నికర లాభం రూ. 1,102 కోట్ల నుంచి రూ. 3,593 కోట్లకు ఎగిసింది. -
టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ చేతికి స్విట్జర్లాండ్ కంపెనీ!
న్యూఢిల్లీ: డిజిటల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ కాన్ఫినాలేను కొనుగోలు చేసినట్లు సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. స్విట్జర్లాండ్ కంపెనీ కొనుగోలుకి యూకే అనుబంధ సంస్థ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 2012లో ఏర్పాటైన కాన్‌ఫినాలే బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ రంగాలలో ఐటీ కన్సల్టింగ్ సేవలందిస్తోంది. ఈ వ్యూహాత్మక కొనుగోలుతో అవలాక్ కన్సల్టింగ్, అమలు, నిర్వహణ సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి ద్వారా గ్లోబల్ వెల్త్‌మేనేజ్‌మెంట్‌లో విస్తరించనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలియజేసింది. అవలాక్ ప్రీమియం ఇంప్లిమెంటేషన్ పార్టనర్ టైటిల్ పొందిన నాలుగు గ్లోబల్ సంస్థలలో కాన్‌ఫినాలే ఒకటని ఈ సందర్భంగా వెల్లడించింది. బ్యాంకింగ్ నైపుణ్యానికి సాఫ్ట్వేర్ సామర్థ్యం జతకావలసిన అవసరమున్నదని బలంగా విశ్వసిస్తున్నట్లు కాన్‌ఫినాలే సీఈవో రోలండ్ స్టాబ్ పేర్కొన్నారు. ఇందుకు హెచ్‌సీఎల్ టెక్ పరిపూర్ణమైన భాగస్వామి అని పేర్కొన్నారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల రంగ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం హైజంప్ చేసి రూ. 3,593 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,102 కోట్లు ఆర్జించింది. ఇందుకు వివిధ విభాగాలు, సర్వీసులకు నెలకొన్న భారీ డిమాండ్ సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఇది 4.4 శాతం అధికంకాగా.. వార్షికంగా మొత్తం ఆదాయం 15 శాతం ఎగసి రూ. 22,957 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 575 కోట్లు వన్‌టైమ్ బోనస్, రూ. 1,222 కోట్లమేర వాయిదాపడిన పన్ను చెల్లింపులు ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రస్తావించింది. వీటిని పరిగణిస్తే ప్రస్తుత సమీక్షా కాలంలో నికర లాభం 24 శాతం పుంజుకున్నట్లు తెలియజేసింది. ఇతర హైలైట్స్ ► స్థిర కరెన్సీ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) ఆదాయంలో 12–14 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ► వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ► గతేడాది 40,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. సిబ్బంది సంఖ్య 2,08,877కు చేరింది. ► క్యూ4లో నికరంగా 11,100 మందికి ఉపాధిని కల్పించింది. ► మార్చికల్లా ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 21.9 శాతంగా నమోదు. ► క్యూ4లో 226 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ► పూర్తి ఏడాదికి నికర లాభం 11,145 కోట్ల నుంచి రూ. 13,499 కోట్లకు ఎగసింది. ► 2021–22లో మొత్తం ఆదాయం రూ. 75,379 కోట్ల నుంచి రూ. 85,651 కోట్లకు పెరిగింది. ప్రోత్సాహకరంగా.. మార్కెట్ వాతావరణం అత్యంత ప్రోత్సాహకరంగా ఉంది. వివిధ విభాగాలు, సర్వీసులకు పటిష్ట డిమాండ్ కనిపిస్తోంది. వెరసి సర్వీసుల బిజినెస్‌లో మరోసారి అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను సాధించాం. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయంలో 17.5% వృద్ధిని అందుకున్నాం. – సి.విజయ్ కుమార్, సీఈవో, ఎండీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు 1.2% బలపడి రూ. 1,102 వద్ద ముగిసింది. -
డిజిటల్ ఫ్యూచర్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి: శివశంకర్
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతుండటం వల్ల డిజిటల్ వినియోగం మరింత పెరిగింది. వీడియో కాన్ఫరెన్సింగ్ & వర్చువల్ మీటింగ్‌ల నుండి ఆన్లైన్ విద్య వరకు ఇప్పుడు 'కొత్త టెక్నాలజీ మన జీవితంలోని అన్ని అంశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు & వ్యాపార సంస్థలు ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీ & ఆటోమేషన్తో సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై శ్రద్ధ చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు Metaverse. మెటవర్స్ అంటే మనం నివసించే ప్రపంచానికి మించిన ఒక సింక్రోనస్ డిజిటల్ ప్రపంచం. Web 3.0 ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, బ్రాండ్లతో పరిశ్రమ అంతటా అలలను సృష్టించాయి, వినియోగదారులకు ఇంతకు ముందెన్నడూ చూడని ఇంటరాక్టివిటీని అందించే అవకాశాలను అన్వేషించాయి. క్రిష్టోకరెన్సీ & NFTల విస్తరణ అలాగే ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ టెక్నాలజీ, ఈస్పోర్ట్ల పెరుగుదల డిజిటల్ భవిష్యత్తును మనకు అందిస్తుంది. ప్రస్తుతం సాంకేతికత మనం జీవించే, పనిచేసే విధానాన్ని మరింత వేగంగా మారుస్తుంది. అయితే, ఈ సాంకేతికతలను నావిగేట్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారికి ఇది నిస్సందేహంగా కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డిజిటల్ ఇండియా: ఒక కొత్త భవిష్యత్తుకు మార్గం సుగమం భారతదేశంలో మరింత సౌకర్యవంతంగా, మా ప్రభుత్వం దాని ఫ్లాగ్షిప్ 'డిజిటల్ ఇండియా" చొరవ ద్వారా భారతదేశాన్ని డిజిటల్‌గా సాధికారత కలిగిన సమాజంగా & నాలెడ్జ్ ఎకానమీగా మార్చడానికి పెట్టుబడి పెడుతుంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆన్-డిమాండ్ గవర్నెన్స్ & సేవలు అలాగే పౌరుల డిజిటల్ సాధికారత వంటి ప్రోగ్రామ్‌ల ముఖ్య ఫోకస్ ఏరియాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభావం, పరిణామం & మనం నివసించే ప్రపంచాన్ని మర్చివేయడంతో యువత ముఖ్యంగా పెరుగుతున్న ఈ డిమాండ్లకు, సరిపోయేలా ఆచరణాత్మక మార్గాల్లో వారి శిక్షణను ప్లాన్ చేయడం ద్వారా ఫలితం పొందుతారు. స్కీల్లింగ్ ప్రోగ్రామ్‌లు: ముఖ్యమైన నైపుణ్యాలతో విద్యార్థులను శక్తివంతం చేయడం బహుళ తరాల శ్రామికశక్తితో, ప్రపంచంలోని ఎక్కువ మొత్తంలో యువ జనాభా కలిగిన భారతదేశం, ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల మంది యువత వర్క్‌ఫోర్స్‌లో చేరడాన్ని మనం గమనిస్తున్నాం. యువత విభిన్న నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ వారందరికీ ఉమ్మడిగా ఒక విషయం ఉంది. అది వారంతా ఉపాధి పొంది మంచి నాణ్యమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. మహమ్మారి సమయంలో మంచి నైపుణ్యం గల వనరుల అవసరం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది IT పరిశ్రమ, ప్రభుత్వానికి బాగా తెలుసు. యజమానులు తమ ఉద్యోగులకు ఉన్న నైపుణ్యాలు, ఉద్యోగార్టులకు ఉన్న నైపుణ్యాల మధ్య అంతరం ఎలా ఉందో పరిశ్రమలు మాట్లాడుతున్నాయి. 12వ తరగతి గ్రాడ్యుయేట్లకు అవకాశాలు: డ్యూయల్, డిపెండబుల్ & వైవిధ్యం 12వ తరగతి నుంచి గ్రాడ్యుయేట్‌కి సిద్దం అవుతున్న విద్యార్థులు పూర్తిగా రూపాంతరం చెందిన డిజిటల్ సొసైటీకి శిఖరాగ్రంగా నిలుస్తున్నారు. IT పరిశ్రమ 2022లో వృద్ధి చెందుతుందని, ముఖ్యంగా టైర్-2 నగరాల్లో పటిష్టమైన ఉపాధి. అవకాశాలను అందిస్తుందని ఇటీవలి పరిశ్రమ నివేదికలు తెలుపుతున్నందున, 12 తరగతి నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీ సంబందిత శిక్షణా కార్యక్రమాలలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు. 'డ్యుయల్-ఫోకస్': విద్యపై డ్యుయల్ -ఫోకస్ ఏకీకృతం చేయడం + ఆచరణాత్మక శిక్షణ, ఇందులో ఈ రోజు IT పరిశ్రమలో అత్యవసరంగా అవసరమైన నైపుణ్యాలను అందించడం. వాస్తవాప్రపంచ ఐటీ ప్రాజెక్ట్‌లను బహిర్గతం చేయడం వంటివి ఉంటాయి. 'డిపెండబుల్': శిక్షణా కార్యక్రమం వ్యవధిలో వారికి స్టెపండ్ ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం ఇస్తూ, శిక్షణానంతరం హామీ ఇవ్వబడిన ఉద్యోగంలో ఉంచే భద్రతను విద్యార్థులకు అందిస్తుంది. వైవిధ్యం: విద్యార్థి వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు & మార్గదర్శకత్వానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలపై దృష్టి సారించే సంపూర్ణ బోధనను కలిగి ఉంటుంది. మీరు భారతదేశంలో విద్య & ట్రైనింగ్ చరిత్రను పరిశీలించినప్పుడు, వృత్తిపరమైన ట్రైనింగ్ & నైపుణ్యం మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయినట్లు మీరు చూడవచ్చు. గురుకులం, పాఠశాల అభ్యాస రీతులు, హైబ్రిడ్ మోడల్ లెర్నింగ్‌పై దృష్టి సారించాయి, ఇది రోజు మొత్తంలో నైపుణ్యాలను ఆచరణాత్మకంగా ఉపయోగించడం చేర్చబడ్డాయి. ఇంటిగ్రేటెడ్ ప్రారంభ-కెరీర్ ప్రోగ్రామ్‌లు: విస్తరిస్తున్న హారిజోన్లు HCL టెక్నాలజీస్‌లో, హైస్కూల్ గ్రాడ్యుయేట్లకు అత్యుత్తమ ఇన్-క్లాస్ ఇంటిగ్రేటెడ్ ప్రారంభ-కెరీర్ ప్రోగ్రామ్‌లను అందించడంపై మేము దృష్టి పెడుతున్నాము, ఇది విద్యార్థులు లైవ్ ప్రాజెక్ట్‌లో క్లాస్‌రూమ్‌లో నేర్చుకున్న వాటిని ఆచరణాత్మకంగా వర్తింపజేసే అవకాశాలను అందిస్తుంది. 'వారు నేర్చుకునేటప్పుడు' సంపాదించే అవకాశం విద్యార్థులకు చిన్న వయస్సు నుండే ఆర్థిక బాధ్యతను నేర్పుతుంది. వారు పొందే ఆచరణాత్మక ఎక్స్పోజర్ & మార్గదర్శకత్వం వారి తోటివారిపై వారికి ఆధిక్యతను అందిస్తుంది. మన చుట్టూ ఎన్ని మార్పులు జరుగుతున్నప్పటికీ, స్మార్ట్ మార్గాన్ని ఎంచుకునే వారికి ITలో అవకాశాల కొరత లేదు. IT పరిశ్రమకు అవసరమైన సంబంధిత నైపుణ్యాలు ఉన్నవారు, ఒక మంచి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, వాస్తవ-ప్రపంచ ప్రాజెక్ట్‌లకు ఆచరణాత్మకంగా బహిర్గతం చేయడం చాలా అనిశ్చిత సమయాల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించగలదు. నా కెరీర్ ప్రారంభ దశలో, డాక్టర్ A.P.J. అబ్దుల్ కలాం మార్గదర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్‌లో పని చేయడానికి, నేర్చుకోవడానికి నాకు అవకాశం లభించింది, భారతదేశం గొప్ప నాయకులు మరియు దూరదృష్టి గలవారిలో ఒకరిగా వారిని మనమందరం ప్రేమగా గుర్తుంచుకుంటాము. ఆయన అనేక వివేకవంతమైన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అతని ఒక అందమైన కోట్ గుర్తుకు వస్తుంది. "ఆకాశంవైపు చూడు. మనం ఒంటరిగా లేము. మొత్తం విశ్వం మనతో స్నేహపూర్వకంగా" ఉంటుంది అలాగే కలలు కనేవారికి, పని చేసేవారికి ఉత్తమమైన వాటిని అందించడానికి మాత్రమే సహకరిస్తుంది. శ్రీమతి శివశంకర్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ -
‘బోనస్‌లు తిరిగి ఇచ్చేయండి’.. ఉద్యోగులకు కంపెనీ షాక్!
దేశంలోనే నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీని ఏడాది మధ్యలో వీడుతున్న ఉద్యోగులను.. బోనస్ కింద చెల్లించిందంతా తిరిగి ఇచ్చేయమంటూ వేధిస్తోందన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు ప్రకటన ఇచ్చుకుంటున్నప్పటికీ.. అది ఉద్యోగులకు పూర్తి ఊరట ఇచ్చేదిగా లేదని తెలుస్తోంది!. తాజాగా భారత ఐటీ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెసీఎల్పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజైన్లు చేసి కంపెనీని వీడుతున్న ఉద్యోగులను ‘పర్ఫార్మెన్స్ బోనస్’ ఇచ్చిందంతా.. తిరిగి చెల్లించాకే బయటకు వెళ్లాలని కోరుతోంది. ఈ మేరకు హెచ్ఆర్ పాలసీలోని రూల్‌ను చూపించడంతో ఉద్యోగులు ఖంగుతింటున్నారు. ఈ విషయంపై ఐటీ ఎంప్లాయిస్ యూనియన్లను ఉద్యోగులు ఆశ్రయించినట్లు సమాచారం. లేబర్ మినిస్టర్ భూపేందర్ యాదవ్‌కి, హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్‌కి సైతం లేఖలు రాశారు పుణే ఐటీ యూనియన్ ప్రతినిధి హర్మీత్ సలూజ. డబ్బులు తిరిగి చెల్లించని ఉద్యోగుల ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు, రిలీవింగ్ లెటర్లు ఇవ్వకుండా కంపెనీ వేధిస్తోందని సలూజ ఆ లేఖలో ప్రస్తావించారు. హెచ్‌సీఎల్ ప్రకటన అయితే హెచ్‌సీఎల్ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతోంది. ఉద్యోగులకు తెలియకుండా తామేం చేయట్లేదని పేర్కొంది. మంత్లీ బేసిస్ మీద చెల్లించే అడ్వాన్స్ విషయంలో హెచ్ఆర్ పాలసీ ప్రకారం.. అదీ ఉద్యోగులు సంతకాలు చేసిన కాలమ్ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేసింది. నవంబర్ 2021న ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రకారం.. సెప్టెంబర్ 1, 2021 నుంచి మార్చ్ 31, 2022 మధ్య కంపెనీని వీడే ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ల నుంచి.. ఎంప్లాయి పర్ఫార్మెన్స్ బోనస్ (EFB) రికవరీ చేస్తామని తెలిపింది. ఇక వివాదాస్పదం కావడంతో ఆఘమేఘాల మీద ఆ పాలసీని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. వెనక్కి తగ్గలేదు! వివాదాస్పద ఈ పాలసీ విషయంలో హెచ్‌సీఎల్ ఒక స్పష్టమైన ప్రకటనంటూ ఇవ్వకపోవడం గమనార్హం. దశాబ్దానికి పైగా జూనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు జీతం కాకుండా.. అడ్వాన్స్‌గా చెల్లింపులు అందుకుంటున్నారు. అలాగే ఇకపై కంపెనీ మా ఉద్యోగుల కోసం ముందస్తు వేరియబుల్ చెల్లింపును కొనసాగిస్తుంది. అంతేకాదు డిసెంబర్ 22, 2021 నుంచి రికవరీలను కూడా మాఫీ చేసిందని హెచ్‌సీఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఇక్కడే గందరగోళం నెలకొంది. ఈఎఫ్‌బీ రికవరీ పాలసీని మాత్రమే హెచ్‌సీఎల్ వెనక్కి తీసుకుందని.. ఏపీఎంబీ (Advance Monthly Performance Bonus) విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సలూజ చెప్తున్నారు. ఈఎఫ్‌బీ అనేది ఉద్యోగులందరికీ వర్తించే బోనస్ కాగా.. ఏఎంపీబీ మాత్రం ప్రత్యేకించి ప్రాజెక్టుల కోసం పని చేసే ఉద్యోగులందరికీ జారీ చేస్తున్న బోనస్. సో.. రిజైన్ చేసిన ఉద్యోగులు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న మాట!. -
అరుదైన ఫీట్‌ను సాధించిన హెచ్‌సీఎల్..!
భారత టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. హెచ్‌సీఎల్ టెక్ షేర్లు సెప్టెంబర్ 24న మార్కెట్ క్యాప్ 50 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. శుక్రవారం బీఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ రూ. 3,68,420 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను హెచ్‌సీఎల్ నమోదు చేసింది.సెప్టెంబర్ 24 న హెచ్‌సీఎల్ కంపెనీ షేర్లు రూ .1,359.75 వద్ద ట్రేడయ్యాయి. అమెరికాకు చెందిన ఎమ్‌కెఎస్ ఇన్స్ట్రుమెంట్స్తో కంపెనీ ఐదు సంవత్సరాల ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత గత 5 రోజుల్లో దాదాపు 7 శాతం మేర హెచ్‌సీఎల్ షేర్లు పెరిగాయి. చదవండి: ప్యాన్‌కేక్ .. ఆ రుచి వెనుక కష్టాల కథ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగంలో మెరుగైన పనితీరు, అధిక ఉత్పాదకత కోసం ఎమ్కేఎస్ ఇన్స్ట్రుమెంట్స్తో హెచ్‌సీఎల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హెచ్‌సీఎల్ కంపెనీ మార్కెట్ క్యాప్ 50 బిలియన్ డాలర్లకు చేరిందని మాజీ సీఈఓ వినీత్ నాయర్ ఈరోజు ట్విటర్లో వెల్లడించారు. ఈ అసాధారణ ఫీట్‌ను అందించినందుకు ఉద్యోగులకు, మేనెంజ్మెంట్ టీమ్‌కు ధన్యవాదాలను తెలియజేశారు. కంపెనీ తదుపరి లక్ష్యం 100 బిలియన్ డాలర్లని పేర్కొన్నారు. చదవండి: Knight Frank Luxury Investment Index: లగ్జరీ ఉత్పత్తుల్లో వీటిపై అధిక లాభాలు...! -
HCL TECH Bee 2021: ఇంటర్‌తోనే ఐటీ జాబ్
సాఫ్ట్వేర్ జాబ్స్ అనగానే.. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులు పూర్తిచేసుకొని.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలుంటేనే సాధ్యమని భావిస్తారు. కాని ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు.. చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ ద్వారా.. ఎంట్రీ లెవెల్ ఐటీ జాబ్స్‌కు అవసరమైన శిక్షణను అందిస్తోంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో పూర్తి స్థాయి ఉద్యోగ నియామకం లభిస్తుంది. ఇటీవల హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, ఫీజులు, శిక్షణ, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం.. టెక్ బీకి అర్హతలు ► హెచ్‌సీఎల్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సును 2020,2021లో పూర్తిచేసి ఉండాలి. ► ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మ్యాథమెటిక్స్/బిజినెస్ మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ► ఇంటర్/10+2లో మార్కులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా నిర్దేశించారు. ఐటీ సర్వీసెస్‌కు దరఖాస్తుచేసుకునే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 85శాతానికిపైగా, సీబీఎస్సీ, ఐసీఎస్సీ అభ్యర్థులకు 80శాతానికిపైగా ఉండాలి. అసోసియేట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే..60 శాతానికి పైగా మార్కులు తప్పనిసరి. ఎంపిక విధానం ► దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్ కెరీర్ అప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి.. ఫైనల్ ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థి వ్యక్తిత్వం, ఇతర విద్యా ప్రమాణాలను పరిశీలిస్తారు. (యూజీసీ–నెట్ 2021: కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్.. ఇక్కడ క్లిక్ చేయండి) ఎంపికైతే శిక్షణ ► హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్‌ను ఇంటర్మీడియట్తోనే ఐటీ పరిశ్రమలో చేరేలా ప్రోత్సహించేందుకు రూపొందించారు. ఎంపికైన వారికి లక్నో, నోయిడా, మధురై, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, నాగపూర్‌ల్లో శిక్షణ కేంద్రాలున్నాయి. ► శిక్షణ ‘ఐటీ సర్వీసెస్, అసోసియేట్’ అని రెండు విభాగాలుగా ఉంటుంది. ► ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐటీ రంగంలో పూర్తిస్థాయి ఉద్యోగాలకు అవసరమైన శిక్షణనిస్తారు ► ఆన్లైన్/ఆఫ్‌లైన్ అసెస్మెంట్లు, చర్చలు, కేస్ బేస్డ్ సబ్మిషన్స్ వంటివి ఉంటాయి ► ట్రైనింగ్..ఫౌండేషన్,టెక్నాలజీ/డొమైన్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ అని మూడు దశల్లో ఉంటుంది ఫీజు మినహాయింపు ► టెక్ బీ–2021 ప్రోగ్రామ్‌లో ఐటీ సర్వీసెస్, అసోసియేట్ శిక్షణ ఏడాది కాలం పాటు ఉంటుంది. ఈ ఏడాది కాలానికి ఐటీ సర్వీసెస్‌కు రూ.2 లక్షలు, అసోసియేట్ ట్రైనింగ్‌కు రూ.లక్ష ఫీజుగా చెల్లించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువగా ఉంటే.. వారు బ్యాంక్ నుంచి సాయం పొందవచ్చు. ► శిక్షణలో 90 శాతం,అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన అభ్యర్థులకు నూరు శాతం ప్రోగ్రామ్ ఫీజు నుంచి మినహాయింపు; 85 శాతం నుంచి 90 శాతం స్కోరు చేసినవారికి 50 శాతం ఫీజు రాయితీ ఇస్తారు. (యూనియన్ బ్యాంకులో.. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు) ఉద్యోగం–ఉన్నత విద్య ► విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటారు. ► కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు అభ్యర్థికి నెలకు రూ.10 వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు. పూర్తిస్థాయి ఉద్యోగిగా ఎంపికైతే.. ప్రారంభ వార్షిక వేతనం 1.70 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు చెల్లిస్తారు. ► హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూనే.. బిట్స్ పిలానీ, శాస్త్ర యూనివర్సిటీలో ఉన్నత విద్య కోర్సులో చేరే అవకాశం కూడా ఉంది. ► పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్‌కు: https://registrations.hcltechbee.com -
ఫ్రెషర్లకు హెచ్‌సీఎల్ బంపర్ ఆఫర్..!
రానున్న రోజుల్లో హెచ్‌సీఎల్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిమాండ్ తగ్గట్టుగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2023 వరకు సుమారు 30 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకొనున్నట్లు కంపెనీ హూమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావ్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం కంపెనీలో సుమారు 40 నుంచి 50 శాతం మేర ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఒక ప్రకటనలో వీవీ అప్పారావు పేర్కొన్నారు. గత సంవత్సరంలో హెచ్‌సీఎల్ సుమారు 14 వేల మంది ఫ్రెషర్లను నియామకం చేసింది. 2021 సంవత్సరానికిగాను సుమారు 20 వేల నుంచి 22 వేల మంది ప్రెషర్లను తీసుకోవాలని హెచ్‌సీఎల్ భావిస్తోందని వీవీ అప్పారావు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 40-50 శాతం కొత్త నియామాకాలతో 2023 ఆర్థిక సంవత్సరానికి సుమారు 30 వేల మంది కొత్త వారికి ఉద్యోగాలను హెచ్‌సీఎల్ కల్పించనుందని వీవీ అప్పారావు తెలిపారు. కంపెనీలో ప్రస్తుతం సుమారు 1.76లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం హెచ్‌సీఎల్ 35 శాతం కొత్త వారిని, 65 శాతం అనుభవం కల్గిన ఉద్యోగులను నియమిస్తోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఫ్రెషర్ల సంఖ్యను 70 శాతానికి పెంచాలని కంపెనీ భావిస్తోందని వీవీ అప్పారావు తెలిపారు. తాజాగా కంపెనీలో అట్రిషన్‌ను ఎదుర్కోవడం కోసం కంపెనీలోని ఉత్తమ ఉద్యోగులకు బెంజ్ కార్లను ఇవ్వాలని హెచ్‌సీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రసిద్ధ కాలేజీల నుంచి హెచ్‌సీఎల్ ఎక్కువ ఫ్రెషర్లను నియామాకం చేసుకోనుంది. ఈ ఏడాది ఐఐటీల నుంచి సుమారు 206 మందిని నియమించుకుంది. గత ఏడాది ఐఐటీలనుంచి ఫ్రెషర్ల భర్తీ సంఖ్య 134 గా ఉంది. కాగా దేశవ్యాప్తంగా పలు టాప్ 200 కాలేజీల నుంచి ఫ్రెషర్లను నియమించుకోవడానికి హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోందని హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ వీవీ అప్పారావు పేర్కొన్నారు. -
హెచ్‌సీఎల్ ఉద్యోగులకు ఉచితంగా బెంజ్ కార్లు..!
పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉత్తమ ప్రతిభను కనబర్చినందుకుగాను ప్రోత్సాహాకాలను అందిస్తాయి. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తన కంపెనీ ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగుల కోసం భారీ బహుమతులను అందిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలోని టాప్ పెర్పామర్లకు మెర్సిడెస్ బెంజ్ కార్లను ఇవ్వాలని హెచ్‌సీఎల్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బోర్డు ఆమోదం తెలపాల్సి ఉందని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ అప్పారావు వీవీ పేర్కొన్నారు. అట్రిషన్ విధానాన్ని నివారించేందుకు పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలను అందిస్తాయి. రీప్లేస్మెంట్ హైరింగ్ కాస్ట్ 15 నుంచి 20 శాతం ఎక్కువ ఉండడంతో తమ ఉద్యోగుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని వీవీ అప్పారావు పేర్కొన్నారు. జావా డెవలపర్‌ను ప్రస్తుతం ఇచ్చే ప్యాకేజ్‌లో హైర్ చేసుకోవచ్చు, కానీ క్లౌడ్ ప్రోఫెషనల్స్‌ను సేమ్ ప్యాకేజ్‌లపై హైర్ చేసుకోలేమని తెలిపారు. హెచ్‌సీఎల్‌లో మంచి రిటెన్షన్ ప్యాకేజ్ ఉందని, ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతంలో 50 నుంచి 100 శాతం వరకు క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ స్కీమ్‌తో సుమారు 10 శాతం మందికి కీలక నైపుణ్యాలు కల్గిన ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 22 వేల మందిని కొత్తగా ఉద్యోగులను హైర్ చేసేందుకు కంపెనీ ప్రణాళికలు చేస్తోందని పేర్కొన్నారు ఇదిలా ఉండగా హెచ్‌సీఎల్ కంపెనీలో ఈ తైమాసికంలో ఉద్యోగుల అట్రిషన్ గత త్రైమాసికం కంటే 1.9 శాతం పెరిగి 11.8 శాతంగా నమోదైంది. -
హెచ్‌సీఎల్ టెక్.. భేష్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 3,214 కోట్లను తాకింది. యూఎస్ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,925 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 12.5 శాతం పుంజుకుని రూ. 20,068 కోట్లకు చేరింది. గతంలో రూ. 17,841 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. పూర్తి ఏడాదికి ఆదాయంలో రెండంకెల వృద్ధిని అందుకోగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. ఇబిట్ మార్జిన్లు 19–21 శాతం మధ్య నమోదుకాగలవని ఆశిస్తోంది. ఈ కాలంలో నికరంగా 7,522 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించింది. క్యూ2(జూలై–సెప్టెంబర్)లో కొత్తగా మరో 6,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నట్లు పేర్కొంది. పూర్తి ఏడాదికి 20,000–22,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు మానవ వనరుల ముఖ్య అధికారి వీవీ అప్పారావు వెల్లడించారు. ఈ నెల 1 నుంచి వేతన పెంపును చేపట్టినట్లు తెలియజేశారు. బుకింగ్స్ స్పీడ్ ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ త్రైమాసిక వారీగా పటిష్ట వృద్ధిని సాధించగలమని హెచ్‌సీఎల్ టెక్ ప్రెసిడెంట్, సీఈవో సి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. క్యూ1లో బుకింగ్స్ వార్షిక ప్రాతిపదికన 37 శాతం జంప్‌చేసినట్లు తెలియజేశారు. క్లౌడ్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ డీల్స్ ఇందుకు దోహదపడుతున్నట్లు వివరించారు. కాగా.. కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ ఎమిరిటస్, వ్యూహాత్మక సలహాదారుగా కొత్త బాధ్యతలు స్వీకరించినట్లు కంపెనీ పేర్కొంది. ప్రధాన వ్యూహాల అధికారి, ఎండీగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీటికి రాజీనామా చేసినట్లు కంపెనీ తెలియజేసింది. కొత్త పదవులలో ఐదేళ్లపాటు కొనసాగనున్నట్లు వివరించింది. విజయ్ కుమార్ ఇకపై సీఈవో, ఎండీగా వ్యవహరించనున్నారు. గతేడాది జూలైలో నాడార్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోగా.. ఆయన కుమార్తె రోష్నీ నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. తద్వారా లిస్టెడ్ దేశీ కంపెనీకి తొలి మహిళా చైర్‌ఉమన్‌గా ఎంపికయ్యారు. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో 0.3 శాతం నీరసించి రూ. 1,002 వద్ద ముగిసింది. ఇతర హైలైట్స్ ► క్యూ1లో కొత్త డీల్స్ 37 శాతం ఎగశాయి. వీటి విలువ(టీసీవీ) 166.4 కోట్ల డాలర్లు. ► డాలర్ల రూపేణా నికర లాభం 12.8 శాతం బలపడింది. 4.3 కోట్ల డాలర్లకు చేరింది. ► గత క్యూ1తో పోలిస్తే ఆదాయం 15.5% ఎగసి 271.96 కోట్ల డాలర్లను తాకింది. ► వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండును బోర్డు ఆమోదించింది. ► మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు ఈ నెల 28 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ► జూన్ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 1,76,499కు చేరింది. ► వార్షిక ప్రాతిపదికన ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 11.8 శాతంగా నమోదైంది. ► ఐబీఎం మాజీ ఎగ్జిక్యూటివ్ వనితా నారాయణన్ బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 2,962 కోట్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో రూ. 2,962 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 6 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 3,154 కోట్లు ఆర్జించింది. యూఎస్ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం ఆదాయం దాదాపు 6 శాతం పుంజుకుని 19,642 కోట్లను తాకింది. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 5 శాతం క్షీణించి 41 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. ఆదాయం 6 శాతం పెరిగి 270 కోట్ల డాలర్లకు చేరింది. రికార్డ్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం 17.6% పుంజుకుని రూ. 13,011 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6.7 శాతం బలపడి రూ. 75,379 కోట్లకు చేరింది. డాలర్ల రూపేణా నికర లాభం 13% పెరిగి 176 కోట్ల డాలర్లను తాకగా.. ఆదాయం 1,017.5 కోట్ల డాలర్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 6 డివిడెండును ప్రకటించింది. దీనికి జతగా.. ఆదాయం తొలిసారి 10 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడంతో మరో రూ. 10ను ప్రత్యేక మధ్యంతర డివిడెండుగా ప్రకటించింది. వెరసి వాటాదారులకు షేరుకి రూ. 16 చొప్పున చెల్లించనుంది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 26 డివిడెండ్ చెల్లించినట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. షేరు ఫ్లాట్: మార్కెట్లు ముగిశాక హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు విడుదల చేసింది. ఎన్ఎస్ఈలో షేరు 0.6% నీరసించి రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.975–950 మధ్య ఊగిసలాడింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ4లో ఆదాయం 2.5 శాతం పుంజుకుంది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ లభించాయి. విభిన్న విభాగాల నుంచి మొత్తం 19 భారీ డీల్స్‌ను కుదుర్చుకున్నాం. తద్వారా కొత్త ఏడాదిలోకి ఉత్సాహంగా అడుగుపెట్టాం. – సి.విజయ్‌కుమార్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ప్రెసిడెంట్, సీఈవో -
హెచ్‌సీఎల్ టెక్బీ ప్రోగ్రామ్: ఇంటర్‌తోనే ఐటీ కొలువు
ఇంటర్ పూర్తయిందా.. వెంటనే ఐటీ కొలువులో చేరాలనుందా.. కానీ, ఉన్నత విద్య కూడా కొనసాగించాలనుకుంటున్నారా ?! మీలాంటి విద్యార్థులకు సరితూగే కొలువుల కోర్సే.. హెచ్‌సీఎల్ అందిస్తున్న టెక్బీ ఎర్లీ కెరియర్ ప్రోగ్రామ్. ఇందులో చేరితే అనుభవంతోపాటు కొలువూ సొంతమవుతుంది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పట్టా అందుకునే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా టెక్బీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. సదరు కోర్సు ప్రత్యేకత, దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు, ఎంపిక ప్ర్రక్రియ తదితరాల గురించి పూర్తి సమాచారం.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్.. గ్రాడ్యుయేట్లు, ఇంటర్ విద్యార్థులకు ఉపయో గపడేలా పలు ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. తాజాగా హెచ్‌సీఎల్ ఐటీ ఇంజనీర్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదలైంది. హెచ్‌సీఎల్ టెక్బీ.. ఇంటర్ పూర్తయిన వెంటనే ఫుల్‌టైమ్ జాబ్ చేయాలనుకొనే అభ్యర్థుల కోసం రూపకల్పన చేసిన ప్రోగ్రామ్. హెచ్‌సీఎల్‌లో ఎంట్రీ లెవల్ కొలువుల భర్తీకి అవసరమైన నైపుణ్యాలపై అభ్యర్థులకు 12 నెలల శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ఉద్యోగం చేస్తూనే అభ్యర్థులు బిట్స్–పిలానీ, సస్త్ర యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. టెక్బీ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.10000 స్టైపెండ్ చెల్లిస్తారు. అనంతరం పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులైన తర్వాత రూ.2లక్షల–2.20 లక్షల వార్షిక వేతనం అందుతుంది. అర్హత ► 2019, 2020లో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. అలాగే 2021లో ఇంటర్ పూర్తి చేసుకోనున్న/ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ► అభ్యర్థి ఇంటర్లో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ను చదివుండాలి. ఫీజు ► ప్రోగ్రామ్ ఫీజు ట్యాక్స్‌లతో కలిపి రూ.2.20 లక్షల వరకు ఉంటుంది. ► అభ్యర్థులకు బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తారు. ► విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తారు. ► శిక్షణ సమయంలో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు∙పొందిన వారికి 100 శాతం ఫీజు మాఫీ చేస్తారు. అలాగే 85–90 శాతం మార్కులు పొందిన వారికి 50 శాతం ఫీజు మాఫీ చేస్తారు. శిక్షణ ► హెచ్‌సీఎల్ టెక్బీ ప్రోగ్రామ్.. అభ్యర్థులను హెచ్‌సీఎల్ ప్రాజెక్ట్స్‌పై పనిచేసేందుకు సన్నద్ధులను చేస్తుంది. ► ఫౌండేషన్ ట్రైనింగ్‌లో భాగంగా.. ప్రొఫెషనల్ ఐటీ ఉద్యోగిగా మారేందుకు అవసరమైన ఐటీ ఫండమెంటల్స్‌ను బోధిస్తారు. ► అభ్యర్థులకు కంపెనీ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాక్సెస్ లభిస్తుంది. ఇందులో కంపెనీ విధులకు సంబంధించిన చర్చలు, ఆన్లైన్ అసెస్మెంట్లు, అసైన్మెంట్స్, కేస్ బేస్డ్ సబ్మిషన్స్ ఉంటాయి. అభ్యర్థులు టెక్నాలజీ సర్వీసెస్‌కు సంబంధించిన ఐటీ సర్టిఫికెట్ పొందవచ్చు. ఉద్యోగ వివరాలు ► శిక్షణను పూర్తి చేసకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో ఫుల్ టైమ్ ఉద్యోగిగా అవకాశం కల్పిస్తారు. ► ఆఫర్ అందుకున్నవారు దేశంలోని హెచ్‌సీఎల్ క్యాంపస్‌ల్లో అప్లికేషన్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సపోర్ట్, డిజైన్ ఇంజనీర్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ► హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్స్ తదితర సౌకర్యాలు ఉంటాయి. ► బెనిఫిట్ బాక్స్ ప్రోగ్రామ్ కింద డిస్కౌంట్స్, ఇతర ఆఫర్స్‌ను అందుకోవచ్చు. ఉన్నత విద్య ► కెరీర్ రూపకల్పనలో విద్యది కీలకపాత్ర. దీన్ని గుర్తించిన హెచ్‌సీఎల్.. బిట్స్ పిలానీ, సస్త్రా యూనివర్సిటీ భాగస్వామ్యంతో టెక్బీ స్కాలర్స్‌కు ప్రత్యేక ఉన్నత విద్యా ప్రోగ్రామ్స్‌ను ఆఫర్చేస్తోంది. బిట్స్, పిలానీ ► బిట్స్ పిలానీ సహకారంతో ఎంప్లాయిబిలిటీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వర్క్ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ప్రోగ్రామ్‌ను హెచ్‌సీఎల్ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కోర్సులకు సంబంధించిన తరగతులను హెచ్‌సీఎల్ క్యాంపస్‌లలో నిర్వహిస్తారు. ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన ఫీజులో కొంత మొత్తాన్ని హెచ్‌సీఎల్ భరిస్తుంది. ఈ బీఎస్సీ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే... ఇదే ఇన్స్టిట్యూట్లో ఎమ్మెస్సీ/ఎంటెక్ కోర్సుల్లో చేరే వీలుంది. ► హెచ్‌సీఎల్ టెక్ బీ అభ్యర్థులు తంజావూర్‌లోని సస్త్ర డీమ్డ్ యూనివర్సిటీలో మూడేళ్ల బీసీఏలో చేరొచ్చు. ఈ కోర్సు పూర్తయ్యాక బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ/ఎంటెక్‌లో ప్రవేశం పొందే వీలుంది. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.hcltechbee.com -
హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగులకు బొనాంజా
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 72,800 కోట్లు) ఆదాయ మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ప్రత్యేకంగా వన్–టైమ్ బోనస్ ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ. 700 కోట్లు వెచ్చిస్తోంది. 2021 ఫిబ్రవరిలో ఈ స్పెషల్ బోనస్‌ను చెల్లించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఏడాది పైగా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు దాదాపు 10 రోజుల వేతనానికి సరిసమానంగా ఇది ఉంటుందని పేర్కొంది. సంస్థలో 1,59,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. 2020లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 10 బిలియన్ డాలర్ల ఆదాయం మైలురాయిని అధిగమించింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన తరుణంలోనూ ప్రతీ ఉద్యోగీ ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించి, సంస్థ వృద్ధికి తోడ్పడ్డారని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అప్పారావు వి.వి. తెలిపారు. డిజిటల్ సర్వీసులు, ఇతర ఉత్పత్తుల ఊతంతో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 31.1 శాతం పెరిగి రూ. 3,982 కోట్లకు ఎగిసింది. అలాగే ఆదాయం 6.4 శాతం పెరిగి రూ. 19,302 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం గైడెన్స్ అంచనాలను 1.5–2.5 శాతం నుంచి 2–3 శాతానికి పెంచింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు సుమారు 1 శాతం పెరిగి రూ. 958 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్.. క్యూ3 కిక్!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది(2020–21) మూడో త్రైమాసికంలో రూ. 3,982 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 31 శాతం అధికంకాగా.. డిజిటల్, ప్రొడక్టుల విభాగంలో పటిష్ట వృద్ధి ఇందుకు సహకరించింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో యూఎస్గాప్ ప్రమాణాల ప్రకారం మొత్తం ఆదాయం 6.4 శాతం పెరిగి రూ. 19,302 కోట్లను తాకింది. స్థిరకరెన్సీ ప్రాతిపదికన ఆదాయం తొలుత వేసిన 1.5–2.5 శాతం అంచనాలను మించుతూ 3.5 శాతం బలపడింది. ఈ బాటలో క్యూ4(జనవరి–మార్చి)లోనూ ఆదాయం 2–3 శాతం స్థాయిలో పుంజుకోనున్నట్లు అంచనా వేసింది. వెరసి గతంలో ఇచ్చిన 1.5–2.5 శాతం గైడెన్స్‌ను ఎగువముఖంగా సవరించింది. కొత్త ఏడాది హుషారుగా...: త్రైమాసిక ప్రాతిపదికన డిసెంబర్ క్వార్టర్లో పటిష్ట వృద్ధిని సాధించినట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. డీల్ పైప్‌లైన్‌లో కనిపిస్తున్న స్పీడ్ ప్రకారం రానున్న త్రైమాసికాలలో మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు తెలియజేశారు. తద్వారా కొత్త ఏడాదిని హుషారుగా ప్రారంభించినట్లు వ్యాఖ్యానించారు. సొల్యూషన్లు, సర్వీసులపై దృష్టిపెట్టడం ద్వారా కంపెనీ ప్రత్యేక తరహాలో వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. 2020 జనవరి–డిసెంబర్ మధ్యకాలంలో తొలిసారి ఆదాయం 10 బిలియన్ డాలర్లను అధిగమించినట్లు తెలియజేశారు. స్థిరకరెన్సీ ప్రాతిపదికన వార్షికంగా 3.6 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఏడు బిజినెస్ విభాగాల్లో ఐదు సానుకూల వృద్ధిని సాధించినట్లు వివరించారు. ప్రధానంగా యూరోప్‌లో మీడియా, టెలికం విభాగాలు పటిష్ట ప్రగతిని సాధించినట్లు వెల్లడించారు. 20,000 మందికి చాన్స్ వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు నిర్ణయించింది. క్యూ3లో 13 ట్రాన్స్ఫార్మేషనల్ డీల్స్‌ను కుదుర్చుకుంది. డిసెంబర్ క్వార్టర్లో నికరంగా 6,597 మందిని నియమించుకుంది. ఉద్యోగ వలస 10.2 శాతంగా నమోదైంది. దీంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య తాజాగా 1,59,682కు చేరింది. మార్చి క్వార్టర్లో 5,000 మంది ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు వెల్లడించింది. రానున్న రెండు త్రైమాసికాలలో 20,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు విజయ్ కుమార్ తెలియజేశారు. ఐబీఎం డీల్‌ను పూర్తిచేసిన నేపథ్యంలో జూలై–డిసెంబర్ మధ్య కాలంలో 13.4 శాతం వృద్ధి సాధించినట్లు తెలియజేశారు. ఐబీఎం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్‌ను రూ. 12,252 కోట్లకు హెచ్‌సీఎల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. క్యూ3 ఫలితాలు, మార్కెట్లలో అమ్మకాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో 4% పతనమై రూ. 989 వద్ద ముగిసింది. -
సంపన్న మహిళల్లో రోష్ని నాడార్ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా అత్యంత సంపన్న మహిళల జాబితాలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆమె సంపద రూ. 54,850 కోట్లు. రూ. 36,600 కోట్ల సంపదతో బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా రెండో స్థానంలోనూ, రూ. 11,590 కోట్లతో రాధా వెంబు (జోహో) మూడో స్థానంలో ఉన్నారు. హురున్ ఇండియా, కోటక్ వెల్త్ సంయుక్తంగా రూపొందించి 100 మంది భారతీయ సంపన్న మహిళల జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో చోటు దక్కించుకున్నారు. అపోలో హాస్పిటల్స్‌కి సంబంధించి ఏకంగా నలుగురు ఉన్నారు. లిస్టులోని మహిళల సంపద సగటు విలువ సుమారు రూ. 2,725 కోట్లు. కనీసం రూ. 100 కోట్ల సంపద గలవారిని జాబితాలో పరిగణనలోకి తీసుకున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో (వెల్త్ మేనేజ్మెంట్) ఓషర్యా దాస్ తెలిపారు. అత్యధికంగా ముంబైలో 32 మంది, న్యూఢిల్లీలో 20, హైదరాబాద్‌లో 10 మంది సంపన్న మహిళలు ఉన్నారు. -
హెచ్‌సీఎల్, ఇన్ఫీ పుష్- ఐటీ షేర్ల దూకుడు
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించే వీలున్నట్లు ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా అభిప్రాయపడింది. ఆదాయం, నిర్వహణ మార్జిన్లు అంచనాల(గైడెన్స్)ను అందుకోనున్నట్లు పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 3.5 శాతం పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇబిట్ మార్జిన్లు 20.5-21 శాతం స్థాయిలో నమోదుకావచ్చని తెలియజేసింది. దీంతో ఐటీ రంగంపై ఇన్వెస్టర్లలో ఆశలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మరోవైపు యూరోపియన్ సంస్థ గైడ్‌విజన్‌ను సొంతం చేసుకోనున్నట్లు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సేవలందించే ఈ యూరోపియన్ కంపెనీ కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఫలితంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తోపాటు.. సాఫ్ట్వేర్ సేవల ఇతర కంపెనీలకూ డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. దీంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ ఏకంగా 4.5 శాతం ఎగసింది. టీసీఎస్ రికార్డ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు 9.6 శాతం దూసుకెళ్లింది. రూ. 789 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. టీసీఎస్ 3 శాతం ఎగసింది. రూ. 2,447 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. అంతేకాకుండా టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 9 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి ఆర్ఐఎల్ తదుపరి అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా రికార్డు సాధించింది. జోరుగా హుషారుగా ఐటీ సేవల ఇతర కంపెనీలలో ఎంఫసిస్ 8.4 శాతం జంప్‌చేసి రూ. 1251ను తాకింది. తొలుత రూ. 1,270 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఈ బాటలో మైండ్‌ట్రీ 3.7 శాతం ఎగసి రూ. 1227 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాది గరిష్టంకాగా.. ఇన్ఫోసిస్ 4 శాతం దూసుకెళ్లి రూ. 983కు చేరింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇదే విధంగా కోఫోర్జ్ 3.25 శాతం లాభపడి రూ. 2158 వద్ద కదులుతోంది. ఇది ఏడాది గరిష్టంకాగా.. టెక్ మహీంద్రా 3.5 శాతం పెరిగి రూ. 792 వద్ద ట్రేడవుతోంది. ఇక ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2.6 శాతం బలపడి రూ. 2564 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2564 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఐటీ దిగ్గజం విప్రో సైతం 2.75 శాతం పుంజుకుంది. రూ. 302 సమీపంలో ఏడాది గరిష్టం వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో తొలుత రూ. 1331 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకిన టాటా ఎలక్సీ 2 శాతం లాభంతో రూ. 1314 వద్ద ట్రేడవుతోంది. -
హెచ్‌సీఎల్ టెక్‌లో 15 వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15వేల మంది ఫ్రెషర్ల నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. కరోనావైరస్ టెక్ కంపెనీలను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ, బలమైన డిమాండ్, వృద్ధి అంచనాల నేపథ్యంలో ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాల కల్పనకు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో హెచ్‌సీఎల్ కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్లపై దృష్టి పెట్టింది. గత ఏడాది 9వేలమందిని ఎంపిక చేసుకున్న సంస్థ ఈ ఏడాది అదనంగా మరో 6 వేల మందిని చేర్చుకోనుంది. ఇతర టెక్ కంపెనీల మాదిరిగానే, హెచ్‌సీఎల్ కూడా తన నియామకాలను వర్చువల్‌గా చేపట్టనుంది. అయితే కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా క్యాంపస్‌లలో ప్రెషర్ల ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉందని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సుమారు 1000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్టు తెలిపింది. వృద్ధి, ఖాళీలను పూరించే పక్రియలో భాగంగా ఈ నియామకాలు ఉండనున్నాయి. అయితే ఈ ఏడాది కంపెనీని వీడే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని హెచ్ఆర్ హెడ్ వీవీ అప్పారావు తెలిపారు కాగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ జూన్ 2020 త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 31.7 శాతం పెరిగి 2,925 కోట్ల రూపాయలను నమోదు చేసింది. కంపెనీ ఆదాయం 8.6 శాతం పెరిగి 17,841 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 16,425 కోట్లు. ఈ త్రైమాసికంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆదాయం ప్రభావితమైనప్పటికీ బలమైన డిమాండ్ పరిస్థితులున్నట్టు ఫలితాల సందర్భంగా కంపెనీ సీఈఓ సీ విజయకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 2,925 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసిక కాలంలో 32 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.2,220 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.2,925 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. ఆదాయం రూ.16,425 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.17,841 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, మాత్రం 4 శాతం క్షీణించిందని పేర్కొంది. పటిష్టమైన డీల్స్ సాధించామని రానున్న క్వార్టర్లలో మంచి వృద్ధినే సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు ఎలాంటి వేతన పెంపు లేదని స్పష్టం చేసింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్ ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► స్థిర కరెన్సీ ధరల్లో కంపెనీ ఆదాయం క్యూ1లో 1 శాతం మేర వృద్ధి చెందింది. ► రానున్న మూడు క్వార్టర్లలో ఒక్కో క్వార్టర్‌కు 1.5–2.5 శాతం మేర వృద్ధి సాధిస్తామని కంపెనీ అంచనా వేస్తోంది. ► మార్చి క్వార్టర్‌తో పోల్చితే డీల్స్ 40 శాతం పెరిగాయి. ► ఈ క్యూ1లో స్థూలంగా 7,005 ఉద్యోగాలిచ్చింది. జూన్ క్వార్టర్ చివరి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,50,287కు పెరిగింది. మొత్తం ఉద్యోగుల్లో 96 శాతం మంది ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఆట్రీషన్ రేటు (ఉద్యోగుల వలస)14.6 శాతంగా ఉంది. ఆర్థిక ఫలితాలు ప్రకటించిన తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 3 శాతం లాభంతో రూ.644కు ఎగసింది. చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 1 శాతం నష్టంతో రూ.623 వద్ద ముగిసింది. ఇప్పటి నుంచి అంతా సానుకూల వృద్ధే.... ప్రపంచమంతా తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఈ ఆర్థిక సంవత్సరాన్ని ఆరంభించాం. ఈ క్యూ1లో అంచనాలకనుగుణంగానే ఓ మోస్తరు వృద్ధి మాత్రమే సాధింగలిగాం. అధ్వాన పరిస్థితులను అధిగమించాం. ఇక ఇప్పటి నుంచి అంతా సానుకూల వృద్ధే. హెచ్1 బీ వీసాలపై నిషేధం దురదృష్టకరం. అయితే ఈ ప్రభావం మా కంపెనీపై పెద్దగా ఉండదు. అమెరికాలో 67 శాతం మంది ఉద్యోగులు అక్కడి స్థానికులే. –విజయకుమార్, ప్రెసిడెంట్, సీఈఓ, హెచ్‌సీఎల్ టెక్ -
అదరగొట్టిన ఐటీ దిగ్గజం : డివిడెండ్
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యూ4లో మెరుగైన ఫలితాలను సాధించింది. మార్చి 2020తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 3154 కోట్లగా వుంది. త్రైమాసిక పరంగా 3.8 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేయగా, వార్షిక ప్రాతిపదికన నికర లాభం 22.8 శాతం పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం 2.5 శాతం పెరిగి రూ .18,590 కోట్లకు చేరుకుంది. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం 0.8 శాతం పెరిగింది. వడ్డీ పన్నులకు ముందు ఆదాయాలు (ఇబిఐటి) 3,881 కోట్ల రూపాయలుగా ఉండగా, అంతకుముందు ఏడాది త్రైమాసికంతో పోలిస్తే ఇది 5.8 శాతం పెరిగింది, ఈ త్రైమాసికంలో ఇబిఐటి మార్జిన్ 20.9 శాతంగా ఉంది. అలాగే 19.6 శాతంగా ఉన్న ఇబిఐటి మార్జిన్ గైడెడ్ పరిధి 19.0 శాతం నుంచి 19.5 శాతానికి పెరిగింది. దీంతొపాటు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేరుకు రూ .2 చొప్పున తుది డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. డివిడెండ్ చెల్లింపులో ఇది వరుసగా 69వ త్రైమాసికమని కంపెనీ పేర్కొంది. నాల్గవ త్రైమాసికంలో హెచ్‌సిఎల్ 1,250 మంది ఉద్యోగులను చేర్చకోగా, మొత్తం పూర్తికాల ఉద్యోగుల సంఖ్య 1,50,423 కు చేరింది. (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ) హెచ్‌సీఎల్ టెక్ లాభం, ఆదాయం విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నికర అమ్మకాలు సంవత్సరానికి 16 శాతం పెరిగి రూ. 18,553 కోట్లగాను నికర లాభం (పన్ను తరువాత లాభం) రూ .1931 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఎడెల్వీస్ సెక్యూరిటీస్ రూపాయి పరంగా ఆదాయం రూ .18,557 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. వార్షిక ప్రాతికపదికన 8 శాతం వృద్ధితో నికర లాభం రూ .2,784 కోట్లుగా అంచనా వేసింది. 2020 ఆర్థిక సంవత్సరం తమకొక ఒక మైలురాయి లాంటిదని ఫలితాల సందర్భంగా సంస్థ ప్రకటించింది. ఇటీవలి సంవత్సరాలలో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక వృద్ధిని సాధించింది. అలాగే వరుసగా నాలుగవ సంవత్సరం మెరుగైన పనితీరును కనబర్చినట్టు చెప్పింది. మార్జిన్ గైడెన్స్ టాప్-ఎండ్‌ను మించిపోయిందని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీ విజయకుమార్ ప్రకటించారు. (కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత) -
వచ్చే ఏడాదికి 15వేల ఐటీ ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఐటీ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. నోయిడాకి చెందిన ఐటి సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 2021 ఆర్థిక సంవత్సరంలో తన నియామకాలను రెట్టింపు చేయాలని భావిస్తోంది. రానున్న కాలంలో రెట్టింపు సంఖ్యలో దాదాపు 15 వేల ఉద్యోగాలను కల్పించనున్నామని కంపెనీ హెచ్ఆర్ ముఖ్య అధికారి వీవీ అప్పారావుతెలిపారు. అంతేకాదు గతం కంటే మెరుగైన ప్యాకేజీ ఇవ్వనున్నామని చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 15,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది. గతేడాది ఈ సంఖ్య కేవలం 8,600 మాత్రమే కావటం గమనార్హం. అటు ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, మానేజ్మెంట్ కోర్సులు చేసిన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వనుంది. మొత్తం 15,000 ఫ్రెషర్స్ లో ఒక 500 మందిని టాప్ బిజినెస్ స్కూల్స్ నుంచి నియమించుకోనుంది. ఆన్లైన్ జాబ్ సెర్చ్ పోర్టల్ అయిన గ్లాస్‌డోర్ అందించిన సమాచారం ప్రకారం తాజా నియామకాలకు, వార్షిక పే ప్యాకేజీ రూ .3.5 లక్షల నుండి రూ .3.8 లక్షల మధ్య ఉంటుంది. మరోవైపు మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు కంపెనీ గ్లోబల్ ఎంగేజ్మెంట్ మేనేజర్ స్థాయి వారికి రూ.13 లక్షల నుండి రూ. 17 లక్షల వరకు ఉండనున్నాయి. 12వ తరగతి తర్వాత విద్యార్థులను కూడా నియమించుకుంటుంది. దీని కోసం, హెచ్‌సీఎల్ టీఎస్ఎస్ (హెచ్‌సీఎల్ ట్రైనింగ్ & స్టాఫింగ్ సర్వీసెస్), తద్వారా నైపుణ్యాలు లేకపోవడం వల్ల పూరించడం కష్టంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల మధ్య చాలా అవసరమైన అంతరాన్ని తగ్గించాలని భావిస్తోంది. -
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్... ఆదాయం 18,135 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 13 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,605 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.2,944 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.15,699 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.18,135 కోట్లకు పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయకుమార్ పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 17 శాతం వృద్ధితో 43 కోట్ల డాలర్లకు, ఆదాయం 16 శాతం వృద్ధితో 250 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనాలను సవరిస్తున్నామని విజయకుమార్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 16.5–17 శాతం రేంజ్లో పెరగగలదని గతంలో అంచనా వేశామని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ అంచనాలను 15–17 శాతంగా సవరిస్తున్నామని వివరించారు. ఈ క్యూ3లో స్థూలంగా 11,502 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.49,173కు పెరిగిందని విజయకుమార్ చెప్పా రు. ఆట్రీషన్ రేటు (ఉద్యోగుల వలస) 16.8%గా ఉందని వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలతో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ స్వల్పంగా లాభపడి రూ.599 వద్ద ముగిసింది. పటిష్ట పనితీరు... గత కొన్నేళ్లుగా మంచి పనితీరు సాధించడాన్ని కొనసాగిస్తున్నాం. ఈ క్వార్టర్లో 1,000 కోట్ల డాలర్ల ఆదాయ మైలురాయిని దాటేశాం. ఆదాయం 16 శాతం వృద్ధి సాధించగా, ఎబిట్ 20 శాతం మేర పెరిగింది. లాభదాయకత, వృద్ధి, ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు పటిష్టంగా ఉన్నాయనే విషయాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. –సి. విజయకుమార్, సీఈఓ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ -
హెచ్‌సీఎల్ చేతికి ఐబీఎం ఉత్పత్తులు!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్... తాజాగా ఐటీ ఉత్పత్తుల దిగ్గజం ఐబీఎంకి చెందిన ఏడు సాఫ్ట్వేర్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం సుమారు 1.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12,700 కోట్లు) వెచ్చించనుంది. పూర్తిగా నగదు రూపంలో ఉండే ఈ డీల్... నియంత్రణ సంస్థల అనుమతులన్నీ లభించాక... 2019 మధ్య నాటికి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒప్పందం ప్రకారం సెక్యూరిటీ, మార్కెటింగ్ వంటి విభాగాలకు సంబంధించిన ఏడు సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఐబీఎం నుంచి హెచ్‌సీఎల్ కొనుగోలు చేస్తోంది. వీటి మార్కెట్ దాదాపు 50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని హెచ్‌సీఎల్ స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ‘ఐబీఎంకి చెందిన నిర్దిష్ట సాఫ్ట్వేర్ ఉత్పత్తులను 1.8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం‘ అని పేర్కొంది. ఈ డీల్‌తో వివిధ దేశాల మార్కెట్లలోని పలు పరిశ్రమలకు సంబంధించి సుమారు 5,000 పైచిలుకు క్లయింట్స్ తమకు దఖలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఒప్పందంలో భాగంగా కొందరు ఐబీఎం ఉద్యోగులు కూడా తమ సంస్థకు బదిలీ అవుతారని హెచ్‌సీఎల్ టెక్ సీఎఫ్‌వో ప్రతీక్ అగర్వాల్ చెప్పారు. అయితే, సంఖ్య మాత్రం వెల్లడించలేదు. కొనుగోలుకు అవసరమైన నిధుల్లో సింహభాగాన్ని అంతర్గతంగా సమకూర్చుకుంటామని, 300 మిలియన్ డాలర్ల మేర రుణం తీసుకుంటామని వెల్లడించారు. ఐబీఎం సాఫ్ట్వేర్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన రెండో ఏడాది నుంచి అదనంగా 650 మిలియన్ డాలర్ల మేర ఆదాయం సమకూరవచ్చని ఇన్వెస్టర్లు, అనలిస్టులకు కంపెనీ వివరించింది. హెచ్‌సీఎల్‌కు భారీ కొనుగోలు.. హెచ్‌సీఎల్ టెక్ ఇప్పటిదాకా చేసిన కొనుగోళ్లలో ఇదే అతి పెద్ద డీల్ కానుంది. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వ్యాపారంలో విస్తరించాలన్న హెచ్‌సీఎల్ వ్యూహానికి ఇది తోడ్పడనుంది. ‘సెక్యూరిటీ, మార్కెటింగ్, కామర్స్ వంటి వ్యూహాత్మక విభాగాలకు సంబంధించిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం. వీటిలో పలు ఉత్పత్తులు ఆయా విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి’ అని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సి. విజయకుమార్ తెలియజేశారు. ఆయా ఉత్పత్తులు హెచ్‌సీఎల్ వ్యూహానికి అనుగుణంగా ఉంటాయని, వ్యాపార అభివృద్ధికి దోహదపడగలవని ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ కెల్లీ వివరించారు. ఉత్పత్తులు ఇవీ.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల్లో సురక్షితమైన యాప్‌ను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడే ‘యాప్ స్కాన్’, డివైజ్ నిర్వహణకు సంబంధించిన ‘బిగ్ ఫిక్స్’, మార్కెటింగ్ విభాగం ఆటోమేషన్‌కి ఉపయోగించే ’యూనికా’, ఈ– కామర్స్ సంబంధిత ’కామర్స్’ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. మిగతా వాటిలో ’కనెక్షన్స్’, డిజిటల్ మాధ్యమానికి సంబంధించిన ’పోర్టల్’, ఈ మెయిల్స్ సంబంధిత ’నోట్స్ అండ్ డొమినో’ ఉన్నాయి. షేరు 5 శాతం డౌన్.. ఐబీఎంతో డీల్ వార్తల నేపథ్యంలో శుక్రవారం హెచ్‌సీఎల్ షేరు దాదాపు 5 శాతం క్షీణించింది. బీఎస్ఈలో 4.98 శాతం క్షీణించి రూ. 961.55 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 7.6 శాతం పతనమై రూ. 935కి కూడా పడిపోయింది. అటు ఎన్ఎస్ఈలో 5 శాతం తగ్గి రూ. 961.9 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 934.45–రూ.1,000 శ్రేణిలో తిరుగాడింది. రెండు ఎక్సే్ఛంజీల్లో మొత్తం 1.10 కోట్ల షేర్లు చేతులు మారాయి. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.2,431 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,431 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం, రూ.2,210 కోట్లతో పోల్చితే 10 శాతం వృద్ధి సాధించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. గత క్యూ1లో రూ.12,149 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో రూ.13,878 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయకుమార్ చెప్పారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 6 శాతం పెరిగి 35.6 కోట్ల డాలర్లకు, ఆదాయం 9 శాతం వృద్ధితో 205 కోట్ల డాలర్లకు పెరిగిందని వివరించారు. ఈ క్యూ1లో నిర్వహణ మార్జిన్ 19.7 శాతంగా నమోదైందని, అంతకు ముందటి క్వార్టర్లో కూడా ఇదే స్థాయిలో ఉందని వివరించారు. కాగా ఈ కంపెనీ ఫలితాలు అంచనాలను అందుకున్నాయి. ఈ కంపెనీ రూ.2,319 కోట్ల నికర లాభం, రూ.13,936 కోట్ల ఆదాయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 8%, ఆదాయం 5 శాతం చొప్పున పెరిగాయి. వరుసగా 62వ క్వార్టర్లోనూ డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని విజయకుమార్ తెలిపారు. వరుసగా 62వ క్వార్టర్ లోనూ డివిడెండ్‌ను ఇస్తున్నామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్ల మేర షేర్ల బైబ్యాక్ చేయనున్నామని, ఒక్కో షేర్‌ను రూ.1,100 ధరకు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 9.5–11.5% మేర వృద్ధి (స్థిర కరెన్సీ పరంగా) చెందగలదని అంచనాలున్నాయని వివరించారు. అన్ని విభాగాల్లో మంచి వృద్ధి... ఎన్నడూ లేనన్ని ఆర్డర్లను ఈ క్యూ1లో సాధించామని విజయకుమార్ చెప్పారు. వాణిజ్య సంస్థల డిజిటల్ భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పాటునందించే నెక్ట్స్ జనరేషన్ పోర్ట్‌ఫోలియో సేవల కోసం పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో మంచి వృద్ధి సాధించామని వివరించారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,24,121గా ఉందని, ఆట్రిషన్ రేటు 16.3 శాతంగా ఉందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 1.1 శాతం లాభంతో రూ.964 వద్ద ముగిసింది. విప్రోను దాటేసిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆదాయం పరంగా భారత మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అవతరించింది. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న విప్రోను తోసిరాజని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ స్థానంలోకి దూసుకు వచ్చింది. ఈ క్యూ1లో విప్రో ఆదాయం 202 కోట్ల డాలర్లుండగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆదాయం 205 కోట్ల డాలర్లకు చేరింది. -
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చేతికి సీ3ఐ సొల్యూషన్స్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. సీ3ఐ సొల్యూషన్లను చేజిక్కించుకుంది. మెర్క్ అండ్ కోకు పూర్తి అనుబంధంగా ఉంటూ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహించే అనుబంధ సంస్థ, సీ3ఐ సొల్యూషన్లను 6 కోట్ల డాలర్లకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. జీవ, వినియోగ శాస్త్రాల్లో వృద్ధి జోరు పెంచుకునే వ్యూహంలో భాగంగా ఈ కంపెనీని హెచ్‌సీఎల్ టెక్ చేజిక్కించుకుంది. ఈ కంపెనీ కొనుగోలుతో తమ ఐటీ, వ్యాపార సేవలు మరింత విస్తరిస్తాయని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయకుమార్ తెలిపారు. ఈ కొనుగోలులో భాగంగా సీ3ఐ సొల్యూషన్లను నిర్వహించే టెలెరెక్స్ మార్కెటింగ్ కంపెనీలో 100% వాటాను తమ అనుబంధ సంస్థ, హెచ్‌సీఎల్ అమెరికా ఇన్‌కార్పొ కొనుగోలు చేస్తుందని తెలిపారు. -
హెచ్‌సీఎల్ బైబ్యాక్ ఆఫర్... ధరెంతో తెలుసా?
న్యూఢిల్లీ : దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సర్వీసుల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తను ప్రకటించిన 3,500 కోట్ల బైబ్యాక్ ప్లాన్ లో ఒక్కో షేరుకు 1000 రూపాయలను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. అంటే ప్రస్తుత ట్రేడింగ్ ధరకు ఇది 17 శాతం ప్రీమియం. దామాషా ప్రాతిపదికన టెండర్ ప్రక్రియలో ఒక్కో ఈక్విటీ షేరుకు 1000 రూపాయల క్యాష్ ను ఆఫర్ చేయనున్నట్టు బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చెప్పింది. ప్రస్తుతం ఒక్కో షేరు 852.35 రూపాయల వద్ద ట్రేడవుతుందని, ఈ ప్రస్తుత ట్రేడింగ్ ధరకు 17 శాతం ఎక్కువగా బైబ్యాక్ ఆఫర్ ధర ఉన్నట్టు తెలిపింది. పూర్తిగా చెల్లించే ఈక్విటీ షేరు క్యాపిటల్ మొత్తంలో ఈ 3,500 కోట్ల రూపాయల బైబ్యాక్ సైజు 16.39 శాతం, 13.62 శాతంగా ఉన్నట్టు తెలిసింది. మే 25వ తేదీన కంపెనీ తన ఈక్విటీ షేర్ హోల్డర్స్ కు లెటర్ ద్వారా వీటిని ఆఫర్ చేస్తోంది. ఐటీ కంపెనీల్లో నగదు నిల్వలు ఎక్కువగా ఉండటంతో బైబ్యాక్స్ లేదా డివిడెండ్స్ ఆఫర్ చేయాలని ఒత్తిడి నెలకొంది. దీంతో గత నెలే టీసీఎస్ 16వేల కోట్ల రూపాయల బైబ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రస్తుతం ఇది కొనసాగింపు దశలో ఉంది. టీసీఎస్ ప్రత్యర్థి ఇన్ఫోసిస్ కూడా ఈ ఏడాదిలో రూ.13వేల కోట్ల రూపాయలను డివిడెండ్ లేదా బైబ్యాక్ రూపంలో ఇన్వెస్టర్లకు రిటర్న్ ఇవ్వనున్నట్టు తెలిపింది. కాగా, 2016 డిసెంబర్ 31 వరకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వద్ద నగదు, నగదుతో సమానమైన నిల్వలు రూ.2,214.5 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10,506.9 కోట్లున్నాయి. -
స్టాక్స్ వ్యూ
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బ్రోకరేజ్ సంస్థ: ఐడీబీఐ క్యాపిటల్ ప్రస్తుత ధర: రూ.847 ; టార్గెట్ ధర: రూ.1,027 ఎందుకంటే: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది. ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ3 కంటే 4% పెరిగింది. బట్లర్ అమెరికా ఏరోస్పేస్, జియోమెట్రిక్ కంపెనీల విలీనం, ఐబీఎం నుంచి లభించిన కొన్ని భాగస్వామ్య ఒప్పందాల కారణంగా ఆదాయం ఈ స్థాయిలో పెరిగింది. ఇబిటా మార్జిన్ 34 బేసిస్ పాయింట్ల వృద్ధితో 20 శాతానికి(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన పోల్చితే 12 శాతం వృద్ది నమోదైంది) పెరిగింది. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 21 శాతం వృద్ధితో రూ.16.5కు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10.5–12.5 శాతం రేంజ్లో పెరగగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఇబిటా మార్జిన్ 19.5–20.5% రేంజ్లో సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 19గా ఉన్న 5 కోట్ల డాలర్లకు మించిన ఆదాయాన్నిచ్చే క్లయింట్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 25కి పెరిగింది. గతంలోలాగానే ఇతర కంపెనీలు కొనుగోలు చేయడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. డాలర్‌తో రూపాయి మారకం బలపడడడం, వివిధ కంపెనీల కొనుగోళ్లకు నగదు నిల్వలు ఖర్చవడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, నిర్వహణ సామర్థ్యం పెంపుదలతో ఈ సమస్యల నుంచి కొంత మేరకు గట్టెక్కగలిగింది. రూ.300 కోట్ల పన్ను కేటాయింపుల రివర్సల్ కారణంగా ఈపీఎస్... అంచనాలను మించి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ 1% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఇక రెండేళ్లలో ఆదాయం 12%, ఈపీఎస్ 10.5% చొప్పున పెరగగలవని భావిస్తున్నాం. అలాగే ఇబిటా మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20.1 శాతంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీల్లో దీనికే అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎల్ అండ్ టీ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,740 ; టార్గెట్ ధర: రూ.1,970 ఎందుకంటే: లార్సెన్ అండ్ టుబ్రో.. భారత్‌లో ఇంజినీరింగ్ అండ్ కన్స్ఠ్రక్షన్(ఈ అండ్ సీ) రంగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల్లో ఒకటి. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దశలో అధికంగా ప్రయోజనం పొందగలిగే కంపెనీల్లో ఇది కూడా ఒకటి.2015–16లో 12 శాతంగా ఉన్న రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ)ని 18 శాతానికి పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. షిప్‌యార్డ్, పవర్ బీటీజీ, ఫోర్జింగ్స్ వంటి తయారీరంగ వ్యాపారాల్లో దీర్ఘకాలంలో మంచి వృద్ధిని సాధించగలిగే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్లుగా ఉన్న ఆర్డర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. ఫలితంగా కన్సాలిడేటెడ్ ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.65గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.76గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. మౌలిక, హైడ్రోకార్బన్స్, రక్షణ రంగాల నుంచి జోరుగా ఆర్డర్లను ఈ కంపెనీ సాధించగలదని భావిస్తున్నాం. ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈ అండ్ సీ) రంగంలో ప్రాజెక్ట్‌ల అమలు గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో మందకొడిగా ఉంది. ఈ రంగంలో ప్రాజెక్టుల అమలు పుంజుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ఆదాయం 15 శాతం వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ఆస్తుల విక్రయం ద్వారా రిటర్న్ ఆన్ ఈక్విటీ మెరుగుపరచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఏడాదికి రూ.1,000 కోట్ల వరకూ నష్టాలు వస్తున్న కట్టుపల్లి పోర్ట్‌తో పాటు కొన్ని రోడ్డు ప్రాజెక్ట్‌లను కూడా విక్రయించాలని యోచిస్తోంది. ఫలితంగా ఆర్ఓఈ 2 శాతం పెరుగుతుందని అంచనా. సమ్ ఆఫ్ ద పార్ట్స్(ఎస్ఓటీపీ) ప్రాతిపదికన టార్గెట్ ధరను నిర్ణయించాం. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం జూమ్
-
హెచ్‌సీఎల్ టెక్ లాభం జూమ్
క్యూ4లో 27 శాతం వృద్ధి; రూ.2,475 కోట్లు ► ఒక్కో షేర్ కు రూ.6 డివిడెండ్ ► ఆశావహంగా రెవెన్యూ గైడెన్స్ న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2016–17, క్యూ4)లో 27 శాతం పెరిగింది. 2015–16 క్యూ4లో రూ.1,939 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.2,475 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూస్తే నికర లాభం 12 శాతం పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.10,925 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.13,183 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆదాయం–రూపాయల్లో 13 శాతం, డాలర్లలో 15 శాతం చొప్పున వృద్ధి చెందిందని వివరించారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ డివిడెండ్‌కు ఈ నెల 25 రికార్డ్ డేట్అని, వచ్చే నెల 2న చెల్లింపులు జరుపుతామని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 53 శాతం వృద్ధితో రూ.8,606 కోట్లకు, మొత్తం ఆదాయం 52 శాతం వృద్ధితో రూ.48,641 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆశావహ అంచనాలు మంచి ఆర్థిక ఫలితాలు సాధించామని విజయ్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. అధిక వృద్ధి అవకాశాలున్న విభాగాలపై పెట్టుబడుల జోరు పెంచుతామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10.5–12.5 శాతం వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నామన్నారు. నిర్వహణ లాభం 19.5–20.5 శాతం రేంజ్లో ఉండగలదని పేర్కొన్నారు. అంచనాలను మించి... కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయని నిపుణులంటున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పోల్చితే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మంచి వృద్ధి సాధించిందని తెలిపారు. నికర లాభంలో టీసీఎస్ 4.2 శాతం, ఇన్ఫోసిస్ 3.4 శాతం చొప్పున వృద్ధి సాధించగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 27 శాతం వృద్ధి సాధించడం విశేషం. పన్ను రివర్సల్ కారణంగా నికర లాభం పెరిగిందని. ప్రముఖంగా ప్రస్తావించదగ్గ విషయం కంపెనీ రెవెన్యూ గైడెన్స్ అని షేర్‌ఖాన్ బ్రోకరేజ్ సంస్థ వ్యాఖ్యానించింది. ఐటీ రంగంలో కొనుగోలు రేటింగ్‌ను ఇచ్చింది. ఐటీ కంపెనీలకు ఆటోమేషన్, డిజిటలైజేషన్ వంటి కొత్త అవకాశాలు లభిస్తుండగా, వీసా నిబంధనలు కఠినతరం కావడం వంటి సమస్యలు తప్పట్లేదు. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 0.4 శాతం నష్టపోయి రూ.839 వద్ద ముగిసింది. వీసా సమస్యల్లేవ్ వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడం తమపై పెద్దగా ప్రభావం చూపబోదని విజయకుమార్ వివరించారు. తమ ఉద్యోగుల్లో 55 శాతం మంది స్థానికులే ఉంటారని పేర్కొన్నారు. అమెరికాలో తమకు 12 సెంటర్లున్నాయని, వీటిల్లో 12,000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరిలో సగానికి పైగా అమెరికన్లేనని తెలిపారు. తమ కంపెనీ మొత్తం ఆదాయంలో 63 శాతం వరకూ అమెరికా మార్కెట్ నుంచే వస్తోందని విజయ్‌కుమార్ వివరించారు. ఈ ఏడాది మార్చినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,15,973గా ఉందని, సమీక్షా క్వార్టర్లో కొత్తగా 10,605 మందికి ఉద్యోగాలిచ్చామని వివరించారు. కాగా రూ.3,500 కోట్ల షేర్ల బైబ్యాక్ మరో రెండు నెలల్లో ముగియగలదని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఎఫ్ఓ అనిల్ చనానా పేర్కొన్నారు. ఈ ఏడాది రిటర్న్స్ ఆన్ ఈక్విటీ (ఆర్ఓఈ) 27 శాతంగా ఉండగలదని తెలిపారు. -
అంచనాలను అధిగమించిన టెక్ దిగ్గజం
దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సర్వీసుల సంస్థ హెచ్‌సీఎల్ అంచనాలను అధిగమించింది. అంచనావేసిన దానికంటే మెరుగ్గా నాలుగో క్వార్టర్ కన్సాలిడేటెడ్ లాభాల్లో 28 శాతం పైకి ఎగిసింది. మార్చితో ముగిసిన క్వార్టర్ లో రూ.2,475 కోట్ల లాభాలను నమోదుచేసింది. ముందటి ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్ లో ఈ లాభాలు రూ.1,939 కోట్లగా ఉన్నాయి. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారం ఈ టెక్ దిగ్గజం రూ.2,091 కోట్ల లాభాలను నమోదుచేస్తుందని అనాలిస్టులు అంచనావేశారు. లాభాలు ఆశించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో కంపెనీ మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది. 2017-18 సంవత్సరానికి గాను రెండు రూపాయలు కలిగి ఉన్న ఒక్కో ఈక్విటీ షేరుకు ఆరు రూపాయల మధ్యంతర డివిడెండ్ ను బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించినట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా 20 శాతం పైగా పెరిగి, రూ.13,183 కోట్లగా రికార్డైనట్టు క్వార్టర్ రివ్యూలో తెలిసింది. ముందటి ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.10,925 కోట్లగా ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను, కంపెనీ నికర లాభాలు 53 శాతం పైగా పెరిగి రూ.8606.47 కోట్లగా, మొత్తం ఆదాయం 52 శాతం పెరిగి రూ.48,640.85 కోట్లగా రికార్డయ్యాయి. స్థిరమైన కరెన్సీ విలువల్లో 2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూలు 10.5-12.5 శాతం పెరుగుతుందని కంపెనీ అంచనావేస్తోంది. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా 19.5-20.5 శాతం రేంజ్ లో ఉంటాయని పేర్కొంది. 2017 మార్చి క్వార్టర్ ముగింపుకు కంపెనీలో 1,15,973 ఉద్యోగులున్నారు. తమ ఐటీ సర్వీసుల అట్రిక్షన్ 12 నెలల కాలంలో 16.9 శాతంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఇది ముందటి ఏడాది కంటే తక్కువనేని పేర్కొంది. -
టీసీఎస్ తర్వాత హెచ్‌సీఎల్ టెక్ కూడా..
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ తర్వాత మరో దేశీయ అగ్రగామి హెచ్‌సీఎల్ టెక్ కూడా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. షేర్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించేందుకు సిద్ధమైంది. షేర్ బైబ్యాక్ ప్రకటించాలని కంపెనీ యోచిస్తోందని, ఈ విషయాన్ని బోర్డు ముందుకు తీసుకురాబోతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. రెండు రోజుల క్రితమే టీసీఎస్ రూ.16వేల కోట్ల మెగా షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనున్నట్టు ప్రకటించి, ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది. ప్రస్తుతం తాము కూడా ఇన్వెస్టర్ల వాల్యు పెంచేందుకు చూస్తున్నామని, షేర్ బైబ్యాకుకు పిలుపునివ్వబోతున్నామని ఓ అధికారి చెప్పారు. ఒక్కసారి ఈ విషయంపై తాము ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక, బోర్డు ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు. బోర్డు ముందుకు వెళ్లిన తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ హోల్డర్స్ దీన్ని ఆమోదించాల్సి ఉంది. డిసెంబర్ 31 వరకు కంపెనీ వద్ద నగదు, నగదుతో సమానమైన నిల్వలు రూ.2,214.5 కోట్లు ఉన్నాయి. అంతేకాక ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10,506.9 కోట్లున్నాయి. టీసీఎస్ తరహాలో మెగా బైబ్యాక్ ఆఫర్ చేయకపోయినా.. బైబ్యాక్ మాత్రం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 14% అప్
• ఆదాయం 14 శాతం అప్ • ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్ న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.2,070 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.1,920 కోట్ల నికర లాభం వచ్చిందని, 8 శాతం వృద్ధి సాధించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలి పింది. గత క్యూ3లో రూ.10,341 కోట్లుగా ఉన్న ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.11,814 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్ చెప్పారు. డాలర్ల పరంగా చూస్తే నికర లాభం 5 శాతం వృద్ధితో 31 కోట్ల డాలర్లకు, ఆదాయం 11 శాతం వృద్ధితో 174 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. జోరు కొనసాగింది... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–14 శాతం(డాలర్ టెర్మ్‌ల్లో అయితే 10–12 శాతం)వృద్ధి చెందగలదన్న అంచనా వేస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 30 తర్వాత కుదుర్చుకున్న భాగస్వామ్యాలు, తాము కొనుగోలు చేసిన సంస్థల కారణంగా తమ ఆదాయం 1 శాతం వరకూ అదనంగా పెరిగే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. ఈ క్వార్టర్లో కూడా తమ ఆర్థిక పనితీరు జోరుగా కొనసాగిందని ఆదాయాల్లో 14 శాతం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా 3 శాతం వృద్ధిని (నిలకడ రూపీ టర్మ్‌ల్లో)సాధించామని తెలిపారు. గత క్యూ3లో 61 శాతంగా ఉన్న స్థిర ధరల నిర్వహణ సేవల కాంట్రాక్టుల ఆదాయం ఈ క్వార్టర్లో 63 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ఉద్యోగాలు తగ్గుతాయ్.. ఈ క్యూ3లో కొత్తగా 8,467 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య గత ఏడాది చివరి నాటికి 1.11 లక్షలకు పెరిగిందని విజయ్ కుమార్ వివరించారు. ఉద్యోగుల వలస(ఆట్రీషన్ రేటు) 18 శాతంగా ఉందని తెలిపారు. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్వంటి కొత్త టెక్నాలజీల కారణంగా ఉద్యోగుల నియామకం తగ్గుతుందని ఆయన అంగీకరించారు. సిబ్బంది సంఖ్య 5–6 శాతమే పెరుగుతుందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో తమ ఆదాయాలు 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయని, సిబ్బంది సంఖ్య 6–7% చొప్పున మాత్రమే పెరిగిందని వివరించారు. ⇔ గత ఏడాది డిసెంబర్ 31 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.2,214 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. ఈ క్యూ3లో మొత్తం తొమ్మిది డీల్స్ కుదుర్చుకున్నామని తెలిపారు. ⇔ ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 1% తగ్గి రూ.849 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 2,014 కోట్లు
• 17% వృద్ధి... సీక్వెన్షియల్‌గా 2% డౌన్ • 14% వృద్ధితో రూ.11,519 కోట్లకు ఆదాయం న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.2,014 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ2లో సాధించిన నికర లాభం రూ.1,726 కోట్లతో పోలిస్తే 17% వృద్ధి సాధించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే మాత్రం నికర లాభం 2% తగ్గింది. వేతనాలు పెరగడమే దీనికి కారణమని, ఈ క్యూ2లో ఆదాయం 14%వృద్ధితో రూ.11,519 కోట్లకు (అమెరికా గ్యాప్ అకౌంటింగ్ నిబంధనల ప్రకారం) పెరిగిందని కంపెనీ వివరించింది. ఇక నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 13% పెరిగిందని పేర్కొంది.డాలర్ పరంగా చూస్తే నికర లాభం 14% వృద్ధితో 30 కోట్ల డాలర్లకు, ఆదాయం 12% వృద్ధితో 172 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ప్రకటించింది. 12-14 శాతం రేంజ్లో ఆదాయ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 12-14 శాతం రేంజ్లో (నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన) ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ బీఎస్ఈలో 2% లాభంతో రూ.831 వద్ద ముగిసింది. అనంత్ గుప్తా టెక్సెలెక్స్ నిధి ఇన్ఫోసిస్ నందన్ నీలేకని, విప్రో ప్రేమ్‌జీల బాటలోనే... హెచ్‌సీఎల్ సీఈఓగా పదవీ విరమణ చేయనున్న అనంత్ గుప్తా కూడా ఇన్వెస్టర్ అవతారం ఎత్తుతున్నారు. కొత్త వెంచర్ల కోసం రూ.100 కోట్ల నిధిని టెక్సెలెక్స్ పేరుతో ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులు తయారు చేసే సంస్థలకు తోడ్పాటునందించేందుకు ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనలిటిక్స్, డేటా సైన్స్, ఆటోమేషన్ రంగాలకు సంబంధించిన వెంచర్లకు తోడ్పాటునందిస్తామని తెలియజేశారు. ఈ టెక్నాలజీ వెంచర్లలో రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్లు లేదా వాటాల పరంగా చూస్తే 15 శాతం నుంచి 51 శాతం వరకూ పెట్టుబడులు పెడతామని చెప్పారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.2,047 కోట్లు
న్యూఢిల్లీ : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. కంపెనీ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ.2,047 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.1,783 కోట్ల నికర లాభం సాధించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. అన్ని రంగాలు, సర్వీస్ కేటగిరిల్లో మంచి వృద్ధి, కొత్త టెక్నాలజీలపై దృష్టి సారించడం తదితర అంశాల కారణంగా ఈ స్థాయి నికర లాభం సాధించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ అనంత్ గుప్తా తెలిపారు. గత క్యూ1లో రూ.9,777 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.11,336 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన ఆదాయం 11 శాతం వృద్ధి చెందిందని వివరించారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే ఆదాయం 6 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. డాలర్ల పరంగా చూస్తే నికర లాభం 10 శాతం వృద్ధితో 30.5 కోట్ల డాలర్లకు, ఆదాయం 10 శాతం వృద్ధితో 169 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఫలితాల పరంగా ఇది మంచి త్రైమాసిక కాలమని అనంత్ గుప్తా చెప్పారు. ఓల్వొ ఐటీ సేవల విభాగంతో డీల్ కారణంగా కంపెనీ ఆదాయం 4 కోట్ల డాలర్లు పెరిగాయని, అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే ఆదాయం 6.5 శాతం వృద్ధి చెందడానికి ఈ డీల్ తోడ్పడిందని వివరించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,240 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. 12-14 శాతం ఆదాయ వృద్ధి అంచనా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో 12-14% వృద్ధి సాధించగలమని కంపెనీ అంచనా వేస్తోంది. నాస్కామ్ ఆదాయ అంచనాలు(12-14%) కంటే ఇది అధికం. ఆదాయ అంచనాలను వెల్లడించడం దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కంపెనీ మళ్లీ మొదలు పెట్టింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు 3% లాభంతో రూ.826 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 14% అప్
♦ మార్చి క్వార్టర్లో రూ.1,926 కోట్లు... ♦ ఆదాయం రూ.10,698 కోట్లు; 15 శాతం వృద్ధి ♦ సీక్వెన్షియల్‌గా మాత్రం లాభంలో వృద్ధి 0.3 శాతమే ♦ షేరుకి రూ.6 చొప్పున డివిడెండ్ న్యూఢిల్లీ: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురిచేశాయి. జనవరి-మార్చి త్రైమాసికానికి(2015-16) కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.1,926 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.1,683 కోట్లతో పోలిస్తే 14.4 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా లైఫ్‌సెన్సైస్, ప్రజా సేవలు, టెలికం విభాగాల ఆదాయం పుంజుకోవడం లాభాలు పెరిగేందుకు దోహదం చేసింది. ఇక మొత్తం ఆదాయం కూడా మార్చి క్వార్టర్లో 15.4 శాతం వృద్ధి చెంది రూ.9,267 కోట్ల నుంచి రూ.10,698 కోట్లకు ఎగబాకింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణనలోకి తీసుకుంటూవస్తోంది. అయితే, కంపెనీల చట్టం-2013 నిబంధనల మేరకు ఇకపై ఇతర కంపెనీల మాదిరిగానే ఏప్రిల్-మార్చి కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించనుంది. సీక్వెన్షియల్‌గా చూస్తే... డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో లాభం రూ.1,920 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) మార్చి త్రైమాసికంలో వృద్ధి 0.3 శాతం మాత్రమే నమోదైంది. ఆదాయం సైతం 3.4 శాతం మాత్రమే(డిసెంబర్ క్వార్టర్లో రూ.10,341 కోట్లు) పెరిగింది. పరిశ్రమ విశ్లేషకులు హెచ్‌సీఎల్ టెక్ సగటున రూ.1,963 కోట్ల నికర లాభాన్ని(సీక్వెన్షియల్‌గా 2.2 శాతం వృద్ధి), రూ.10,805 కోట్ల ఆదాయాన్ని(4.5 శాతం వృద్ధి) ఆర్జించవచ్చని అంచనా వేశారు. అయితే, కంపెనీ ఫలితాలు ఈ అంచనాలను అందుకోలేకపోయాయి. మార్చితో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కంపెనీ కొత్తగా 25 కాంట్రాక్టులను చేజిక్కించుకుంది. వీటి మొత్తం విలువ 4 బిలియన్ డాలర్లకుపైనే ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ ప్రెసిడెంట్, సీఈఓ అనంత్ గుప్తా పేర్కొన్నారు. ఒక్క మార్చి క్వార్టర్‌లోనే 2 బిలియన్ డాలర్ల విలువైన 7 కాంట్రాక్టులు లభించినట్లు ఆయన వెల్లడించారు. బియాండ్ డిజిటల్, ఐఓటీ, నెక్స్ట్ జెన్ ఐటీఓ వంటి పరిజ్ఞానాలపై తాము పెడుతున్న పెట్టుబడులు ఆదాయాల జోరుకు చేదోడుగా నిలుస్తున్నాయని ఆయన చెప్పారు. కాగా, మార్చి క్వార్టర్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆదాయం 1.3 శాతం తగ్గగా.. లైఫ్‌సెన్సైస్, హెల్త్‌కేర్ విభాగాల నుంచి ఆదాయం 6.4 శాతం, 7.1 శాతం చొప్పున వృద్ధి చెందిందని గుప్తా వెల్లడించారు. టెక్సాస్‌లో డిజైన్ థింకింగ్, ప్రాసెస్ డిజిటైజేషన్ ల్యాబ్‌ను నెలకొల్పుతున్నామని.. అదేవిధంగా మధురై, లక్నోలలో డెలివరీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా తెలిపారు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుకి కంపెనీ రూ. 6 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. ♦ డాలర్ల రూపంలో చూస్తే నికర లాభం మార్చి క్వార్టర్లో 5.5 శాతం ఎగబాకి 285.1 మిలియన్లుగా నమోదైంది. ఆదాయం కూడా 6.5 శాతం వృద్ధి చెంది 1.58 బిలియన్ డాలర్లకు చేరింది. ♦ 2015-16 పూర్తి ఏడాదికి లాభం 0.7 శాతం పెరిగి రూ.7,354 కోట్లుగా నమోదైంది. ఆదాయం 14.6 శాతం ఎగసి రూ.40,914 కోట్లకు చేరింది. ♦ మార్చి క్వార్టర్లో స్థూలంగా 9,280 మంది సిబ్బందిని హెచ్‌సీఎల్ టెక్ నియమించుకుంది. అయితే, 8,080 మంది వలసపోవడంతో నికరంగా 1,200 మంది జతయ్యారు. దీంతో మార్చి 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,04,896కు చేరింది. ♦ ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 17.3 శాతానికి చేరింది(డిసెంబర్ క్వార్టర్లో 16.7 శాతం). ♦ కంపెనీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 4.51 శాతం క్షీణించి రూ.800 వద్ద స్థిరపడింది. -
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభం స్వల్పవృద్ధి
కొత్త టెక్నాలజీలపై పెట్టుబడుల వల్లే: కంపెనీ సీఈఓ న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ నికర లాభం తాజా డిసెంబర్ త్రైమాసికంలో స్వల్పంగా పెరిగింది. 2014 సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.1,915 కోట్లుగా ఉన్న నికర లాభం 2015 డిసెంబర్ క్వార్టర్లో 0.2 శాతం వృద్ధితో రూ.1,920 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. కొత్త తరం టెక్నాలజీలపై పెట్టుబడుల కారణంగా నికర లాభం స్వల్పంగానే వృద్ధి సాధించిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ అనంత్ గుప్తా చెప్పారు. ఆదాయం రూ.9,283 కోట్ల నుంచి రూ.10,341 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక డాలర్ టర్మ్‌ల్లో... నికర లాభం 5.4 శాతం క్షీణించి 29 కోట్ల డాలర్లకు తగ్గగా, ఆదాయం 5 శాతం వృద్ధితో 156 కోట్ల డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ కంపెనీ జూలై-జూన్ ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తోంది. వీసా ‘సమస్య’ కాదు..: వివిధ విభాగాల్లో మంచి వృద్ధిని సాధించామని బియాండిజిటల్, నెక్స్ట్‌జెన్ ఐటీఓ, ఐఓటీవర్క్స్ వంటి టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నామని, పెట్టుబడులు పెడుతున్నామని అనంత్ గుప్తా పేర్కొన్నారు. తాజా డిసెంబర్ క్వార్టర్లో వంద కోట్ల డాలర్ల మొత్తం కాంట్రాక్ట్ వేల్యూ(టీసీవీ) ఉన్న ఎనిమిది ఒప్పందాలను కుదుర్చుకున్నామని వివరించారు. అమెరికా వీసా వ్యయాలు పెంచడం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని గుప్తా పేర్కొన్నారు. హెచ్1బీ వీసా ఉద్యోగులు స్వల్పమేనని, అమెరికాలో స్థానికులకే అధికంగా ఉద్యోగాలిచ్చామని, ఈ సమస్య తమను పెద్దగా బాధించదని వివరించారు. తాజా డిసెంబర్ క్వార్టర్ చివరి నాటికి రూ.1,762 కోట్ల విలువైన నగదు, నగదు సమానమైన నిల్వలున్నాయని తెలిపారు. చైనాలో విస్తరణ గత ఏడాది రిటర్న్ ఆన్ ఈక్విటీ 29 శాతం సాధించామని, ఇది ఐటీ పరిశ్రమలో ఉత్తమమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఎఫ్ఓ అనిల్ చనన తెలిపారు. చైనాలో తయారీ కార్యకలాపాలున్న క్లయింట్ల కోసం ఆ దేశంలో విస్తరిస్తున్నామని వివరించారు. ఆర్థిక ఫలితాల అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ షేర్ 0.5 శాతం క్షీణించి రూ.839 వద్ద ముగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 1,920 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ లో నాలుగు అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ అయిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. 2015, డిసెంబర్ 31తో ముగిసిన రెండో క్వార్టర్ లో రూ.1,920 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఏడాది ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.1,915 కోట్లు)తో పోల్చితే 0.2 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్- డిసెంబర్ క్వార్టర్ లో ఆదాయం(కన్సాలిడేటెడ్) 11.4 శాతం పెరిగి రూ.10,341 కోట్లుకు చేరుకుందని తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్ లో ఆదాయం(కన్సాలిడేటెడ్) రూ.9,283గా ఉంది. జూలై-సెప్టెండర్ క్వార్టర్ లో నికర లాభం రూ.1,726 కోట్లు, ఆదాయం రూ. 10,097 కోట్లుగా ప్రకటించింది. డాలర్లలో చూసుకుంటే హెచ్ సీఎల్ నికర లాభం 5.4 శాతం తగ్గి 290.8 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆదాయభివృద్ధి 5.1 శాతం పెరిగి 1.56 బలియన్ డాలర్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. -
హెచ్‌సీఎల్ చేతికి వోల్వో ఐటీ వ్యాపారం
డీల్ విలువ రూ.895 కోట్లు న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన వాణిజ్య వాహనాల దిగ్గజం వోల్వో గ్రూప్‌కు చెందిన ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేయనున్నది. వోల్వో ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీ సంస్థ రూ.895 కోట్లకు కొనుగోలు చేస్తోందని, దీనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నామని వోల్వో గ్రూప్ తెలిపింది. ఈ డీల్ అంతా నగదు రూపేణా జరుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా వోల్వో గ్రూప్ ఐటీ ఇన్ఫ్రా కార్యకలాపాలను ఐదేళ్లపాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు అవుట్సోర్సింగ్కు ఇచ్చామని తెలిపింది. దీనికి సంబంధించిన అర్థిక వివరాలను మాత్రం వొల్వో గ్రూప్ వెల్లడించలేదు. ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్‌కు విక్రయించడం వల్ల 2,600 మంది ఐటీ సిబ్బందిపై ప్రభావం పడుతుందని, హెచ్‌సీఎల్‌లో పనిచేసే అవకాశాన్ని వారికి కల్పించామని వివరించింది. ఐటీ వ్యాపార విక్రయం వొల్వో గ్రూప్‌కు ప్రయోజనకరమేనని వోల్వో సీఎఫ్ఓ, తాత్కాలిక ప్రెసిడెంట్ జాన్ గారండర్ పేర్కొన్నారు. వోల్వో సంస్థతో జట్టు కట్టడం అదనపు విలువను సృష్టించడానికి తమకు దక్కిన ఒక మంచి అవకాశమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ అనంత గుప్తా చెప్పారు. ఈ డీల్ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 0.7 శాతం వృద్దితో రూ.864 వద్ద ముగిసింది. -
ఐటీ కంపెనీల కొనుగోలు కోసం ఎస్‌ఎన్‌ఎస్‌కే
న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీ చైర్మన్, వ్యవస్థాపకుల్లో ఒకరైన శివ్‌నాడార్, టెక్నాలజీ రంగంలో ప్రసిద్ధ నిపుణుడు సంజయ్ కల్రాతో కలిసి ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ను కంపెనీను ప్రారంభించనున్నారు. శివ్ నాడార్ అండ్ సంజయ్ కల్రా (ఎస్‌ఎన్‌ఎస్‌కే) అసోసియేట్స్ ఎల్ఎల్పీ పేరుతో ఏర్పాటైన ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో వీరిరువురు 50 కోట్ల డాలర్లు(రూ.3,316 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నారు.ఈ సంస్థ అమెరికా, భారత్‌కు చెందిన ఐటీ ప్రొడక్ట్, ప్లాట్‌ఫామ్ కంపెనీలను కొనుగోలు చేయనున్నది. -
హెచ్‌సీఎల్ టెక్.. ప్చ్
* మార్చి క్వార్టర్ నికర లాభం రూ.1,683 కోట్లు; వృద్ధి 3.6 % * కరెన్సీ ఒడిదుడుకులతో మార్జిన్లపై ప్రభావం * సీక్వెన్షియల్‌గా లాభం 12.2% డౌన్ షేరుకి రూ.4 డివిడెండ్... న్యూఢిల్లీ: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.1,683 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,623 కోట్లతో పోలిస్తే లాభం 3.6 శాతం మాత్రమే వృద్ధి చెందింది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా మార్జిన్లు దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. హెచ్‌సీఎల్ టెక్ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కాగా, క్యూ3లో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 11 శాతం పెరిగి రూ.8,349 కోట్ల నుంచి రూ.9,267 కోట్లకు ఎగబాకింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ3లో కంపెనీ నికర లాభం సగటున రూ.1,797 కోట్లు, ఆదాయం రూ.9,312 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. ఫలితాల్లో ఇతర ప్రధానాంశాలు... - రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుపై కంపెనీ రూ.4 డివిడెండ్‌ను ప్రకటించింది. - మార్చి చివరి నాటికి కంపెనీ వద్ద రూ.838 కోట్ల విలువైన నగదు నిల్వలు ఉన్నాయి. - క్యూ3లో స్థూలంగా 11,041 మంది ఉద్యోగులను, నికరంగా 3,944 మందిని కంపెనీ జత చేసుకుంది. దీంతో మార్చి చివరినాటికి హెచ్‌సీఎల్ టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,04,184కు చేరింది. - కంపెనీకి 4 కొత్త కాంట్రాక్టులు దక్కాయి. భారీగా పడిన షేరు... అంచనాలకంటే తక్కువగా నిరాశాజనకమైన ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర భారీగా పడి ంది. మంగళవారం బీఎస్ఈలో ఒకానొకదశలో క్రితం ముగింపు రూ.923తో పోలిస్తే 8.8%(రూ.82) మేర క్షీణించింది. అయితే, ఆ తర్వాత కాస్త కోలుకొని 3.4 శాతం నష్టంతో రూ.891 వద్ద స్థిరపడింది. క్యూ2తో పోలిస్తే లాభంలో భారీ క్షీణత... త్రైమాసిక ప్రాతిపదికన(సీక్వెన్షియల్‌గా) కంపెనీ నికర లాభం క్యూ3లో 12.2 శాతం పడిపోయింది. డిసెంబర్ క్వార్టర్(క్యూ2)లో లాభం రూ.1,915 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం కూడా క్యూ2లో రూ.9,283 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా 0.2 శాతం తగ్గిపోయింది. వివిధ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం విలువ భారీగా పుంజుకోవడంతో కంపెనీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడింది. క్యూ3లో కంపెనీ రూ.142 కోట్ల ఫారెక్స్ నష్టాలను ప్రకటించింది. క్యూ2లో ఈ మొత్తం రూ.15 కోట్లు మాత్రమే. ఇది కూడా నికర లాభాలను దెబ్బతీసింది. ఆదాయాలపై కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావం 2.7 శాతం మేర ఉందని కంపెనీ తెలిపింది. ‘అన్ని ప్రాంతాలు, వ్యాపార విభాగాల నుంచి విస్తృత స్థాయిలో వృద్ధిని కొనసాగించాం. బిలియన్ డాలర్లకుపైగా డీల్స్‌ను సాధించగలిగాం. ముఖ్యంగా కన్సూమర్ సేవలు, తయారీ, పబ్లిక్ సర్వీసుల్లో, యూరప్ ప్రాంతం నుంచి అధికంగా డీల్స్ లభించాయి’ అని ఫలితాలపై హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ అనంత్ గుప్తా వ్యాఖ్యానించారు. కొత్త తరం ఐటీ అవుట్సోర్సింగ్, డిజిటలైజేషన్లలో అద్భుతమైన వృద్ధి అవకాశాలున్నాయన్నారు. విదేశీ విస్తరణ కోసం గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నట్లు కూడా గుప్తా తెలిపారు. -
హెచ్‌సీఎల్‌లో శివ్ నాడార్ ఫౌండేషన్ షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: శివ్ నాడార్ ఫౌండేషన్ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో తనకున్న మొత్తం వాటాను విక్రయించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో తనకున్న 0.79 శాతం వాటా(56 లక్షల షేర్ల)ను సోమవారం ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించడంతో రూ. 1,108.9 కోట్లు వచ్చినట్లు ఫౌండేషన్ తెలిపింది. ఒక్కో షేర్‌ను రూ.1,980.18 ధర చొప్పున విక్రయించినట్లు వివరించింది. ఈ వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులతో వివిధ సామాజిక సేవా కార్యకలాపాలు నిర్వహిస్తామని వివరించింది. టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శివ్ నాడార్ ఈ ఫౌండేషన్‌ను 1994లో స్థాపించారు. విద్య, కళలకు తగిన తోడ్పాటు నందించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు.హెచ్‌సీఎల్ కార్పొరేషన్, అనుబంధ సంస్థల ద్వారా ఈ వాటా షేర్లు విరాళాలుగా ఈ ఫౌండేషన్‌కు లభించాయి. కాగా ఎన్ఎస్ఈలో సోమవారం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 0.03 శాతం వృద్ధితో రూ.2,066 వద్ద ముగిసింది. -
టెక్ కుబేరుల్లో మనోళ్లు ముగ్గురు
సింగపూర్: ఆసియా అగ్రశ్రేణి పది టెక్నాలజీ కుబేరుల్లో ముగ్గురు భారతీయులకు స్థానం దక్కింది. పరిశ్రమ వర్గాలు, ఇటీవల మార్కెట్ డేటా ప్రకారం... విప్రో అజిమ్ ప్రేమ్‌జీ 1,600 కోట్ల డాలర్ల సంపదతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. సింగపూర్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సింగపూర్ ఇన్నోవేషన్ లీగ్ అధినేత నీరజ్ గోయల్ 1,295 కోట్ల డాలర్ల సంపదతో ఆరో స్థానంలో ఉన్నారు. 45 ఏళ్ల వయసున్న నీరజ్ ఈ జాబితాలోని అత్యంత పిన్నవయస్కుడు. 2000 సంవత్సరాల నుంచి ఈయన సింగపూర్‌లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చెందిన శివ్ నాడార్ 1,170 కోట్ల డాలర్లతో ఏడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలోని ముగ్గురు భారతీయుల మొత్తం సంపద 4,065 కోట్ల డాలర్లుగా ఉంది. -
ఉద్యోగుల ఐడియాలతో 50 కోట్ల డాలర్లు!
న్యూఢిల్లీ: ఉద్యోగుల నుంచి వినూత్న ఐడియాలను ఆహ్వానించడం ద్వారా తమ కస్టమర్లకు సుమారు 50 కోట్ల డాలర్ల (రూ. 3000 కోట్లు) విలువైన సొల్యూషన్లను అందించగలిగామని ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ పేర్కొంది. ఐడియాప్రెన్యూర్‌షిప్‌పై దృష్టిసారించిన హెచ్‌సీఎల్ టెక్ 2008 నుంచి సుమారు 32 వేలకు పైగా వినూత్న ఐడియాలను తమ సిబ్బంది నుంచి వెలికితీయడం గమనార్హం. ‘ఒక నిర్మాణాత్మక పద్దతిలో మా ఉద్యోగులు తమ ఆలోచనలను పంచుకోవడానికి, మరింత పదును పెట్టడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశాం. కింది స్థాయి నుంచీ వినూత్న ఐడియాలను ఆకర్షించడం అనేది సరికొత్త విప్లవం. మా కంపెనీ వ్యూహంలో చాలా కీలకంగా మారింది’ అని హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పృథ్వి షెర్గిల్ పేర్కొన్నారు. 2005లో ప్రవేశపెట్టిన ఎంప్లాయీస్ ఫస్ట్.. కస్టమర్స్ సెంకండ్(ఈఎఫ్‌సీఎస్) అనే కొత్త మేనేజ్మెంట్ విధానంతో ఉద్యోగుల్లో దాగి న వినూత్న ఆలోచనలను సరిగ్గా వినియోగించుకోగలుగుతున్నామన్నారు. ఈ విధానం ఇప్పటికే విద్యా సంస్థలు(హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కేస్ స్టడీ చేస్తోంది), విశ్లేషకులను ఆకర్షించిందని షెర్గిల్ చెప్పారు. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం హైజంప్
►54% వృద్ధితో రూ. 1,834 కోట్లు ►షేరుకి రూ. 12 డివిడెండ్ సాక్షి, న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గడిచిన ఏడాది(2013 జూలై-2014 జూన్) క్యూ4(ఏప్రిల్-జూన్)లో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 54% ఎగసి రూ. 1,834 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2012 జూలై- 2013 జూన్) ఇదే కాలంలో(క్యూ4) రూ.1,193 కోట్లను మాత్రమే ఆర్జించింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. అప్లికేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసుల విభాగాల్లో నమోదైన వృద్ధి ఇందుకు దోహదపడినట్లు కంపెనీ సీఈవో అనంత్ గుప్తా పేర్కొన్నారు. గడిచిన ఏడాది పటిష్ట వృద్ధిని సాధించామని, తొలిసారి 5 బిలియన్ డాలర్ల(రూ. 30,000 కోట్లు) ఆదాయాన్ని అందుకున్నట్లు గుప్తా తెలిపారు. ప్రస్తుత సమీక్షా కాలంలో ఆదాయం కూడా 21% పుంజుకుని రూ. 8,424 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. ఆన్సైట్ ఉద్యోగులకు 3%, ఆఫ్‌షోర్ సిబ్బందికి 7% చొప్పున వేతన పెంపును అమలుచేయనున్నట్లు గుప్తా చెప్పారు. -
విరబూసిన విప్రో.. !
బెంగళూరు: దేశీ ఐటీ దిగ్గజాల్లో మూడోస్థానంలో ఉన్న విప్రో... అంచనాలను మించిన మెరుగైన ఫలితాలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14; క్యూ2)లో రూ.1,932 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,611 కోట్లతో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం కూడా 19 శాతం పెరిగి రూ.9,528 కోట్ల నుంచి రూ.11,332 కోట్లకు ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణత(క్యూ2లో 11 శాతం పైగా పతనమైంది), అంతర్జాతీయంగా ఐటీపై క్లయింట్ల వ్యయాలు జోరందుకోవడం వంటివి ఇందుకు దోహదం చేశాయి. బ్రోకరేజీ కంపెనీల విశ్లేషకులు విప్రో లాభం క్యూ2లో సగటున రూ.1,860 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. త్రైమాసికంగానూ జోరు... ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1)తో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన కూడా క్యూ2లో విప్రో లాభం(కన్సాలిడేటెడ్) జోరందుకుంది. క్యూ1లో రూ.1,623 కోట్లతో పోలిస్తే 19 శాతం దూసుకెళ్లింది. కాగా, అన్ని వ్యాపార విభాగాల నుంచి విస్తృత స్థాయిలో ఆదాయ వృద్ధిని తాము సాధించగలిగామ విప్రో సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజు కుంటున్నట్లు సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఐటీ క్లయింట్లలో విశ్వాసం కూడా పెరుగుతోంది. వ్యయాలు జోరందుకుంటున్నాయి. ఇవన్నీ మా క్యూ2 ఆర్థిక ఫలితాల్లో ప్రతిఫలించింది’ అని విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ పేర్కొన్నారు. గెడైన్స్ పెంపు...: ఐటీ సేవల ఆదాయం(డాలరు రూపంలో) క్యూ2లో వార్షిక ప్రాతిపదికన 5.9 శాతం ఎగబాకి 163 కోట్ల డాలర్లుగా నమోదైంది. త్రైమాసికంగా 2.7% పెరిగింది. రూపాయల్లో ఈ ఆదాయం రూ.10,068 కోట్లు. కాగా, క్యూ2 ఆదాయం 162-165 కోట్ల డాలర్లుగా ఉండొచ్చని విప్రో గతంలో అంచనా వేసింది. ఇక ప్రస్తుత క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో ఐటీ సేవల ఆదాయ అంచనా(గెడైన్స్)ను 166-169 కోట్ల డాలర్లుగా కంపెనీ సీఎఫ్ఓ సురేశ్ సేనాపతి ప్రకటించారు. ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ2లో45 మంది కొత్త క్లయింట్లు జతయ్యారు. సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య(ఐటీ సేవలు) 1,47,216 మంది. జూన్ చివరికి ఈ సంఖ్య 1,47,281గా ఉంది. కంపెనీ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 1.67 శాతం లాభపడి రూ.515 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 64% అప్
న్యూఢిల్లీ: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆకర్షణీయమైన ఫలితాలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్(క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 63.8 శాతం ఎగబాకి రూ.1,416 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.864 కోట్లు మాత్రమే. డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడం, అంతర్జాతీయంగా మెరుగుపడుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులతో ఐటీకి డిమాండ్ పుంజుకోవడం వంటివి ఇతర ఐటీ కంపెనీల మాదిరిగానే హెచ్‌సీఎల్ టెక్కు కూడా కలిసొచ్చాయి. ఇక సెప్టెంబర్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.6,069 కోట్ల నుంచి రూ.7,961 కోట్లకు వృద్ధి చెందింది. 31.2 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ ఆర్థిక ఫలితాలకు జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణనలోకి తీసుకుంటుంది.త్రైమాసిక ప్రాతిపదికన(ఏప్రిల్-జూన్ క్వార్టర్‌తో పోలిస్తే) హెచ్‌సీఎల్ టెక్ ఆదాయం(డాలర్ల రూపంలో) 3.5 శాతమే వృద్ధి చెందింది. టీసీఎస్ 5.4 శాతం, ఇన్ఫోసిస్ 3.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పోటీ కంపెనీలతో చూస్తే సీక్వెన్షియల్ ఆదాయ పెరుగుదల విషయంలో హెచ్‌సీఎల్ టెక్ నిరాశపరిచిందని మార్కెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. డాలరు రూపంలో కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్ నికర లాభం 42.8 శాతం వృద్ధితో 22.56 కోట్ల డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం 15.8 కోట్ల డాలర్లు. కాగా, ఆదాయం 111 కోట్ల డాలర్ల నుంచి 14.1 శాతం వృద్ధితో 127 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇతర ముఖ్యాంశాలివీ... కంపెనీ వాటాదారులకు రూ. 2 ముఖవిలువగల ఒక్కో షేరుపై రూ.2 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్‌కు రికార్డు తేదీ ఈ నెల 31. క్యూ1లో 11 కొత్త క్లయింట్లు జతయ్యారు. ఇందులో 6 కాంట్రాక్టులు 2 కోట్ల డాలర్ల విలువైనవి కాగా.. 4 కోట్ల డాలర్లు, 10 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు చెరొకటి ఉన్నాయి. సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ వద్ద 9.68 కోట్ల డాలర్ల విలువైన నగదు తత్సబంధ నిల్వలు ఉన్నాయి. జూన్ క్వార్టర్ అంతానికి ఈ నిధుల విలువ 12.33 కోట్ల డాలర్లు. విస్తరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 16-17 సెంటర్లను(31 వేల కొత్త సీట్ల సామర్థ్యం) ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ సీఎఫ్ఓ అనిల్ చనానా చెప్పారు. వీటిలో మూడు ప్రధాన క్యాంపస్‌లు భారత్‌లో(నోయిడా, బెంగళూరు, చెన్నై) నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. క్యూ1లో నికరంగా 1,691 మంది సిబ్బందిని కంపెనీ నియమించుకుంది. దీంతో మొత్తం హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగుల సంఖ్య సెప్టెంబర్ చివరికి 87,196కు చేరింది. కంపెనీ షేరు ధర బీఎస్ఈలో గురువారం 6.6 శాతం(రూ. 77.25) క్షీణించింది. చివరకు రూ. 1,083 వద్ద స్థిరపడింది.