హెచ్‌సీఎల్‌ చేతికి ఐబీఎం ఉత్పత్తులు! | HCL Technologies-IBM deal fails to enthuse investors | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఎల్‌ చేతికి ఐబీఎం ఉత్పత్తులు!

Published Sat, Dec 8 2018 1:26 AM | Last Updated on Sat, Dec 8 2018 11:20 AM

HCL Technologies-IBM deal fails to enthuse investors - Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌... తాజాగా ఐటీ ఉత్పత్తుల దిగ్గజం ఐబీఎంకి చెందిన ఏడు సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం సుమారు 1.8 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.12,700 కోట్లు) వెచ్చించనుంది. పూర్తిగా నగదు రూపంలో ఉండే ఈ డీల్‌... నియంత్రణ సంస్థల అనుమతులన్నీ లభించాక...  2019 మధ్య నాటికి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒప్పందం ప్రకారం సెక్యూరిటీ, మార్కెటింగ్‌ వంటి విభాగాలకు సంబంధించిన ఏడు సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను ఐబీఎం నుంచి హెచ్‌సీఎల్‌ కొనుగోలు చేస్తోంది. వీటి మార్కెట్‌ దాదాపు 50 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటుందని హెచ్‌సీఎల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ‘ఐబీఎంకి చెందిన నిర్దిష్ట సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను 1.8 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం‘ అని పేర్కొంది. ఈ డీల్‌తో వివిధ దేశాల మార్కెట్లలోని పలు పరిశ్రమలకు సంబంధించి సుమారు 5,000 పైచిలుకు క్లయింట్స్‌ తమకు దఖలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఒప్పందంలో భాగంగా కొందరు ఐబీఎం ఉద్యోగులు కూడా తమ సంస్థకు బదిలీ అవుతారని హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఎఫ్‌వో ప్రతీక్‌ అగర్వాల్‌ చెప్పారు. అయితే, సంఖ్య మాత్రం వెల్లడించలేదు. కొనుగోలుకు అవసరమైన నిధుల్లో సింహభాగాన్ని అంతర్గతంగా సమకూర్చుకుంటామని, 300 మిలియన్‌ డాలర్ల మేర రుణం తీసుకుంటామని వెల్లడించారు.  ఐబీఎం సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసిన రెండో ఏడాది నుంచి అదనంగా 650 మిలియన్‌ డాలర్ల మేర ఆదాయం సమకూరవచ్చని ఇన్వెస్టర్లు, అనలిస్టులకు కంపెనీ వివరించింది.   

హెచ్‌సీఎల్‌కు భారీ కొనుగోలు.. 
హెచ్‌సీఎల్‌ టెక్‌ ఇప్పటిదాకా చేసిన కొనుగోళ్లలో ఇదే అతి పెద్ద డీల్‌ కానుంది. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల వ్యాపారంలో విస్తరించాలన్న హెచ్‌సీఎల్‌ వ్యూహానికి ఇది తోడ్పడనుంది. ‘సెక్యూరిటీ, మార్కెటింగ్, కామర్స్‌ వంటి వ్యూహాత్మక విభాగాలకు సంబంధించిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం. వీటిలో పలు ఉత్పత్తులు ఆయా విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి’ అని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈవో సి. విజయకుమార్‌ తెలియజేశారు. ఆయా ఉత్పత్తులు హెచ్‌సీఎల్‌ వ్యూహానికి అనుగుణంగా ఉంటాయని, వ్యాపార అభివృద్ధికి దోహదపడగలవని ఐబీఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ కెల్లీ వివరించారు.  

ఉత్పత్తులు ఇవీ.. 
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల్లో సురక్షితమైన యాప్‌ను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడే ‘యాప్‌ స్కాన్‌’, డివైజ్‌ నిర్వహణకు సంబంధించిన ‘బిగ్‌ ఫిక్స్‌’, మార్కెటింగ్‌ విభాగం ఆటోమేషన్‌కి ఉపయోగించే ’యూనికా’, ఈ– కామర్స్‌ సంబంధిత ’కామర్స్‌’ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. మిగతా వాటిలో ’కనెక్షన్స్‌’, డిజిటల్‌ మాధ్యమానికి సంబంధించిన ’పోర్టల్‌’, ఈ మెయిల్స్‌ సంబంధిత ’నోట్స్‌ అండ్‌ డొమినో’ ఉన్నాయి. 

షేరు 5 శాతం డౌన్‌.. 
ఐబీఎంతో డీల్‌ వార్తల నేపథ్యంలో శుక్రవారం హెచ్‌సీఎల్‌ షేరు దాదాపు 5 శాతం క్షీణించింది. బీఎస్‌ఈలో 4.98 శాతం క్షీణించి రూ. 961.55 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 7.6 శాతం పతనమై రూ. 935కి కూడా పడిపోయింది. అటు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం తగ్గి రూ. 961.9 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 934.45–రూ.1,000 శ్రేణిలో తిరుగాడింది. రెండు ఎక్సే్ఛంజీల్లో మొత్తం 1.10 కోట్ల షేర్లు చేతులు మారాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement