స్టాక్స్ వ్యూ
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
బ్రోకరేజ్ సంస్థ: ఐడీబీఐ క్యాపిటల్
ప్రస్తుత ధర: రూ.847 ; టార్గెట్ ధర: రూ.1,027
ఎందుకంటే: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది. ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ3 కంటే 4% పెరిగింది. బట్లర్ అమెరికా ఏరోస్పేస్, జియోమెట్రిక్ కంపెనీల విలీనం, ఐబీఎం నుంచి లభించిన కొన్ని భాగస్వామ్య ఒప్పందాల కారణంగా ఆదాయం ఈ స్థాయిలో పెరిగింది. ఇబిటా మార్జిన్ 34 బేసిస్ పాయింట్ల వృద్ధితో 20 శాతానికి(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన పోల్చితే 12 శాతం వృద్ది నమోదైంది) పెరిగింది. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 21 శాతం వృద్ధితో రూ.16.5కు పెరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10.5–12.5 శాతం రేంజ్‌లో పెరగగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఇబిటా మార్జిన్ 19.5–20.5% రేంజ్‌లో సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 19గా ఉన్న 5 కోట్ల డాలర్లకు మించిన ఆదాయాన్నిచ్చే క్లయింట్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 25కి పెరిగింది. గతంలోలాగానే ఇతర కంపెనీలు కొనుగోలు చేయడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. డాలర్‌తో రూపాయి మారకం బలపడడడం, వివిధ కంపెనీల కొనుగోళ్లకు నగదు నిల్వలు ఖర్చవడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, నిర్వహణ సామర్థ్యం పెంపుదలతో ఈ సమస్యల నుంచి కొంత మేరకు గట్టెక్కగలిగింది.
రూ.300 కోట్ల పన్ను కేటాయింపుల రివర్సల్ కారణంగా ఈపీఎస్... అంచనాలను మించి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ 1% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఇక రెండేళ్లలో ఆదాయం 12%, ఈపీఎస్ 10.5% చొప్పున పెరగగలవని భావిస్తున్నాం. అలాగే ఇబిటా మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20.1 శాతంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీల్లో దీనికే అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నాం.
ఎల్ అండ్ టీ
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.1,740 ; టార్గెట్ ధర: రూ.1,970
ఎందుకంటే: లార్సెన్ అండ్ టుబ్రో.. భారత్‌లో ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ఠ్రక్షన్(ఈ అండ్ సీ) రంగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల్లో ఒకటి. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దశలో అధికంగా ప్రయోజనం పొందగలిగే కంపెనీల్లో ఇది కూడా ఒకటి.2015–16లో 12 శాతంగా ఉన్న రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్‌ఓఈ)ని 18 శాతానికి పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. షిప్‌యార్డ్, పవర్ బీటీజీ, ఫోర్జింగ్స్ వంటి తయారీరంగ వ్యాపారాల్లో దీర్ఘకాలంలో మంచి వృద్ధిని సాధించగలిగే అవకాశాలున్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్లుగా ఉన్న ఆర్డర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. ఫలితంగా కన్సాలిడేటెడ్ ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.65గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.76గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. మౌలిక, హైడ్రోకార్బన్స్, రక్షణ రంగాల నుంచి జోరుగా ఆర్డర్లను ఈ కంపెనీ సాధించగలదని భావిస్తున్నాం.
ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈ అండ్ సీ) రంగంలో ప్రాజెక్ట్‌ల అమలు గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో మందకొడిగా ఉంది. ఈ రంగంలో ప్రాజెక్టుల అమలు పుంజుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ఆదాయం 15 శాతం వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ఆస్తుల విక్రయం ద్వారా రిటర్న్ ఆన్ ఈక్విటీ మెరుగుపరచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఏడాదికి రూ.1,000 కోట్ల వరకూ నష్టాలు వస్తున్న కట్టుపల్లి పోర్ట్‌తో పాటు కొన్ని రోడ్డు ప్రాజెక్ట్‌లను కూడా విక్రయించాలని యోచిస్తోంది. ఫలితంగా ఆర్‌ఓఈ 2 శాతం పెరుగుతుందని అంచనా. సమ్ ఆఫ్ ద పార్ట్స్(ఎస్‌ఓటీపీ) ప్రాతిపదికన టార్గెట్ ధరను నిర్ణయించాం.