HCL TECH Bee 2021: Registration Date, Selection Process, Career Opportunities In Telugu - Sakshi
Sakshi News home page

HCL TECH Bee 2021: ఇంటర్‌తోనే ఐటీ జాబ్‌

Published Tue, Aug 24 2021 7:42 PM | Last Updated on Wed, Aug 25 2021 9:14 AM

HCL TECH Bee 2021: Registration Date, Selection Process, Career Opportunities - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌ అనగానే.. కంప్యూటర్‌ సైన్స్, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులు పూర్తిచేసుకొని.. కోడింగ్, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలుంటేనే సాధ్యమని భావిస్తారు. కాని ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌.. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు.. చిన్న వయసులోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ ప్రోగ్రామ్‌ ద్వారా.. ఎంట్రీ లెవెల్‌ ఐటీ జాబ్స్‌కు అవసరమైన శిక్షణను అందిస్తోంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో పూర్తి స్థాయి ఉద్యోగ నియామకం లభిస్తుంది. ఇటీవల హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, ఫీజులు, శిక్షణ, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం.. 


టెక్‌ బీకి అర్హతలు

► హెచ్‌సీఎల్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సును 2020,2021లో పూర్తిచేసి ఉండాలి.

► ఇంటర్‌ స్థాయిలో మ్యాథమెటిక్స్‌ లేదా బిజినెస్‌ మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మ్యాథమెటిక్స్‌/బిజినెస్‌ మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.

► ఇంటర్‌/10+2లో మార్కులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా నిర్దేశించారు. ఐటీ సర్వీసెస్‌కు దరఖాస్తుచేసుకునే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 85శాతానికిపైగా, సీబీఎస్‌సీ, ఐసీఎస్‌సీ అభ్యర్థులకు 80శాతానికిపైగా ఉండాలి. అసోసియేట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే..60 శాతానికి పైగా మార్కులు తప్పనిసరి. 

ఎంపిక విధానం 
► దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌ కెరీర్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి.. ఫైనల్‌ ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థి వ్యక్తిత్వం, ఇతర విద్యా ప్రమాణాలను పరిశీలిస్తారు. (యూజీసీ–నెట్‌ 2021: కంప్లీట్‌ ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. ఇక్కడ క్లిక్‌ చేయండి)


ఎంపికైతే శిక్షణ

► హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ ప్రోగ్రామ్‌ను ఇంటర్మీడియట్‌తోనే ఐటీ పరిశ్రమలో చేరేలా ప్రోత్సహించేందుకు రూపొందించారు. ఎంపికైన వారికి లక్నో, నోయిడా, మధురై, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, నాగపూర్‌ల్లో శిక్షణ కేంద్రాలున్నాయి. 

► శిక్షణ ‘ఐటీ సర్వీసెస్, అసోసియేట్‌’ అని రెండు విభాగాలుగా ఉంటుంది. 

► ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఐటీ రంగంలో పూర్తిస్థాయి ఉద్యోగాలకు అవసరమైన శిక్షణనిస్తారు 

► ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ అసెస్‌మెంట్లు, చర్చలు, కేస్‌ బేస్డ్‌ సబ్మిషన్స్‌ వంటివి ఉంటాయి 

► ట్రైనింగ్‌..ఫౌండేషన్,టెక్నాలజీ/డొమైన్‌ ట్రైనింగ్, ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌ ట్రైనింగ్‌ అని మూడు దశల్లో ఉంటుంది


ఫీజు మినహాయింపు

► టెక్‌ బీ–2021 ప్రోగ్రామ్‌లో ఐటీ సర్వీసెస్, అసోసియేట్‌ శిక్షణ ఏడాది కాలం పాటు ఉంటుంది. ఈ ఏడాది కాలానికి ఐటీ సర్వీసెస్‌కు రూ.2 లక్షలు, అసోసియేట్‌ ట్రైనింగ్‌కు రూ.లక్ష ఫీజుగా చెల్లించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువగా ఉంటే.. వారు బ్యాంక్‌ నుంచి సాయం పొందవచ్చు. 

► శిక్షణలో 90 శాతం,అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన అభ్యర్థులకు నూరు శాతం ప్రోగ్రామ్‌ ఫీజు నుంచి మినహాయింపు; 85 శాతం నుంచి 90 శాతం స్కోరు చేసినవారికి 50 శాతం ఫీజు రాయితీ ఇస్తారు. (యూనియన్‌ బ్యాంకులో.. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు)


ఉద్యోగం–ఉన్నత విద్య

► విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటారు.

► కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్‌ చేసేటప్పుడు అభ్యర్థికి నెలకు రూ.10 వేల చొప్పున స్టయిఫండ్‌ చెల్లిస్తారు. పూర్తిస్థాయి ఉద్యోగిగా ఎంపికైతే.. ప్రారంభ వార్షిక వేతనం 1.70 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు చెల్లిస్తారు. 

► హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూనే.. బిట్స్‌ పిలానీ, శాస్త్ర యూనివర్సిటీలో ఉన్నత విద్య కోర్సులో చేరే అవకాశం కూడా ఉంది. 

► పూర్తి వివరాలు, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్స్‌కు: https://registrations.hcltechbee.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement