Career Guidance
-
ప్రభుత్వ పాఠశాలల్లో మార్గనిర్దేశకులు
సాక్షి, అమరావతి: విద్యార్థులను ఉన్నత చదువులు, ఉత్తమ భవిష్యత్ వైపు ప్రోత్సహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ నిపుణులను అందుబాటులో ఉంచేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనుంది.యునిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా కెరీర్ గైడెన్స్ కంటెంట్ రూపకల్పనపై మొదటి విడత శిక్షణను సోమవారం నుంచి మూడు రోజులపాటు విజయవాడలో నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత తెలుగు వెర్షన్ శిక్షణ పూర్తయ్యాక, ఇంగ్లిష్ మీడియంలో కూడా అందిస్తామని, దీనిద్వారా ఉపాధ్యాయులు సమర్థంగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. -
Shradha Khapra: సలహాల అక్క
శ్రద్ధా కాప్రాను అందరూ ‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. శ్రద్ధ బంగారంలాంటి మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలేసింది. ‘యువత కెరీర్ కోసం గైడెన్స్ అవసరం’ అని ‘అప్నా కాలేజ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. రెండేళ్లలో 40 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ జీతం కన్నా ఎన్నో రెట్ల ఆదాయం శ్రద్ధకు వస్తోంది. ఏ కోర్సు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి లాంటి సలహాలు ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగినట్టు ఇవ్వడమే శ్రద్ధ సక్సెస్‌కు కారణం. ‘హరియాణలోని చిన్న పల్లెటూరు మాది. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగైనా నేను ఏం చదవాలో గైడ్ చేయడం ఆయనకు తెలియదు. టీచర్లు కూడా గైడ్ చేస్తారనుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇప్పటికీ కాలేజీ స్థాయి నుంచి యువతకు తమ కెరీర్ పట్ల ఎన్నో డౌట్లు ఉంటాయి. వారికి గైడెన్స్ అవసరం. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని గైడ్ చేయాలి. నేను కొద్దోగొప్పో చేయగలుగుతున్నాను కాబట్టే ఈ ఆదరణ’ అంటుంది శ్రద్ధా కాప్రా. ఈమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఈనాటి కాలేజీ విద్యార్థుల్లో. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌లో. వీరంతా శ్రద్ధను ‘శద్ధ్రా దీదీ’ అని,‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. ఆమె చేసే వీడియోలను వారు విపరీతంగా ఫాలో అవుతారు. ఆ వీడియోల్లో ఆమె చెప్పే సలహాలను వింటారు. డాక్టర్ కాబోయి... శ్రద్ధ తన బాల్యంలో టీవీలో ఒక షో చూసేది. అందులో డాక్టర్లు తాము ఎలా క్లిష్టమైన కేసులు పరిష్కరించారో చెప్పేవారు. ఆ షో చూసి తాను డాక్టర్ కావాలనుకుని ఇంటర్లో ‘పిసిఎంబి’ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, బయాలజీ) తీసుకుంది. కాని జూనియర్ ఇంటర్ పూర్తయ్యే సరికి డాక్టర్ కావడం చాలా కష్టమని అర్థమైంది. అందుకే మేథ్స్వైపు దృష్టి సారించింది. ‘చిన్నప్పటి నుంచి రకరకాల పోటీ పరీక్షలు ఎక్కడ జరిగినా రాసేదాన్ని. ఇంటర్ అయ్యాక ఎంట్రన్స్‌లు రాస్తే ర్యాంక్ వచ్చింది. కాని ఏ బ్రాంచ్ ఎన్నుకోవాలో తెలియలేదు. వరంగల్ ఎన్.ఐ.ఐ.టి.లో సివిల్‌కు అప్లై చేస్తే సీట్ వచ్చింది. సివిల్ ఎందుకు అప్లై చేశానో నాకే తెలియదు. అయితే దాంతో పాటు ఎన్.ఎస్.ఐ.టి. (నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ద్వారకా)లో కంప్యూటర్ సైన్స్ అప్లై చేస్తే ఆ సీటు కూడా వచ్చింది. దీనికంటే అదే మెరుగనిపించి కంప్యూటర్ సైన్స్ చదివాను’ అని తెలిపింది శ్రద్ధ. ఉద్యోగం, టీచింగ్ చదువు చివరలో ఉండగానే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్‌లో ఇన్టెర్న్ వచ్చింది శ్రద్ధకు. అది పూర్తయ్యాక ఉద్యోగమూ వచ్చింది. అయితే శ్రద్ధ ఇన్టెర్న్ చేస్తున్నప్పటి నుంచే గచ్చిబౌలిలో కంప్యూటర్ కోర్సులను బోధించసాగింది. ఉద్యోగం వచ్చాక కూడా కంప్యూటర్ కోర్సులకు ఫ్యాకల్టీగా పని చేసింది. ‘ఉద్యోగంలో కంటే ఎవరి జీవితాన్నయినా తీర్చిదిద్దే బోధనే నాకు సరైందనిపించింది. అదే సమయంలో యూట్యూబ్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పడం, కోర్సులు తెలియచేయడం, వారి స్కిల్స్ పెరిగేలా గైడ్ చేయడం అవసరం అనుకున్నాను. మైక్రోసాఫ్ట్‌లో నాది మంచి ఉద్యోగం. కాని ఏదైనా కొత్తగా చేయాలనుకోవడం కూడా మంచిదే అని జాబ్‌కు రిజైన్ చేశాను’ అంది శ్రద్ధ. అప్నా కాలేజ్ శ్రద్ధ ‘అప్నా కాలేజ్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది. ఇంటర్ స్థాయి నుంచి విద్యార్థులకు ఏయే కోర్సులు చదివితే ఏం ఉపయోగమో, ఏ ఉద్యోగాలకు ఇప్పుడు మార్కెట్ ఉందో, ఆ ఉద్యోగాలు రావాలంటే ఏ కోర్సులు చదవాలో తెలిపే వీడియోలు చేసి విడుదల చేయసాగింది. 2020లో ఈ చానల్ మొదలుపెడితే ఇప్పుడు 40 లక్షల మంది సబ్స్క్రయిబర్లు తయారయ్యారు. కోట్లాది వ్యూస్ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా లక్షల్లో శ్రద్ధ ఆదాయం ఉంది. ‘ముప్పై ఏళ్ల క్రితం డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేవారు. ఎందుకంటే డిగ్రీలు తక్కువ ఉండేవి. ఇవాళ డిగ్రీలు అందరి దగ్గరా ఉన్నాయి. కావాల్సింది స్కిల్స్. ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు ముందుకు దూసుకెళ్లవచ్చు. నా వీడియోలు ఆ మార్గంలో ఉంటాయి’ అని తెలిపింది శ్రద్ధ అలియాస్ సలహాల అక్క. -
క్యాడెట్ ఎంట్రీ స్కీమ్; సెలెక్ట్ అయితే చదువుతో పాటు జాబ్ పక్కా
త్రివిధ దళాల్లో కొలువు.. దేశంలో ఎంతోమంది యువత కల.ఎందుకంటే..సవాళ్లతోపాటు దేశ సేవలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగ భద్రత,ఆకర్షణీయ వేతనాలు, కెరీర్లో ఎదిగేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. అలాంటి చక్కటి కొలువును చిన్న వయసులోనే అందుకునే వీలు కల్పిస్తోంది.. ఇండియన్ నేవీ. ఇటీవల 2021 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సు 2022 జనవరిలో ప్రారంభమవుతుంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 35 (ఎడ్యుకేషన్ బ్రాంచ్–05, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్–30). అర్హతలు ► ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 70 శాతం మార్కులు సాధించాలి. దీంతోపాటు పదో తరగతి లేదా ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు స్కోర్ చేయాలి. ► వయసు: 02.07.2002 నుంచి 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. ► అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► వీటితోపాటు జేఈఈ మెయిన్–2021(బీఈ/బీటెక్)కు హాజరై ఉండాలి. ఇందులో సాధించిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపిక విధానం ► జేఈఈ మెయిన్–2021 ర్యాంకు ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ సమాచారాన్ని ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ► ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలను బెంగళూరు/భోపాల్/కోల్‌కతా/విశాఖపట్నంల్లో ఏదోఒకచోట నిర్వహిస్తారు. ► ఈ ఇంటర్వ్యూలు 2021 అక్టోబర్/నవంబర్‌ల్లో జరిగే అవకాశం ఉంది. ► ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ► తొలి రోజు స్టేజ్–1 ఉంటుంది. ఇందులో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. వీటిలో విజయం సాధించిన వారికే స్టేజ్ 2కు అనుమతిస్తారు. ► స్టేజ్ 2 నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఇందులో సైకలాజికల్ టెస్ట్‌లు, గ్రూప్ ఎక్సర్సైజ్లు, ముఖాముఖి పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్ 2లోనూ ప్రతిభ చూపిన వారికి మెడికల్ టెస్టులు ఉంటాయి. ఇందులోను గట్టెక్కితే తుది విజేతగా ప్రకటిస్తారు. శిక్షణ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ప్రక్రియలో విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులను ఇండియన్ నేవల్ అకాడెమీ, ఎజిమాల(కేరళ)లో బీటెక్ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ శిక్షణ సమయంలో చదువుతోపాటు భోజనం, వసతి, బుక్స్, యూనిఫారం మొత్తం ఉచితంగా అందిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి జేఎన్‌యూ బీటెక్ డిగ్రీ ప్రదానం చేస్తుంది. అనంతరం సబ్ లెఫ్ట్నెట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. కెరీర్ స్కోప్ ఎంచుకున్న కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ లేదా ఎడ్యుకేషన్ బ్రాంచ్ విధులు కేటాయిస్తారు. ఉద్యోగంలో చేరితే ప్రారంభంలో లెవెల్–10 మూల వేతనం అంటే రూ.56100 అందుతుంది. దీంతోపాటు మిలిటరీ సర్వీస్ పే కింద రూ.15000 ఇస్తారు. అలాగే డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఈ సమయంలో అన్ని కలిపి నెలకు రూ.లక్ష వరకూ వేతనం అందుకునే అవకాశ ఉంది. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021 వెబ్సైట్: www.joinindiannavy.gov.in -
NEET 2021: నీట్ రాసారా.. ఇది మీ కోసమే!
నీట్–యూజీ–2021. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల(సెప్టెంబర్) 12న జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్ష! ఇందులో ర్యాంకు ఆధారంగా.. మెరిట్ లిస్ట్, ఫైనల్ కటాఫ్‌లను నిర్ణయించి.. ఆల్ ఇండియా కోటా.. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో కన్వీనర్ కోటా విధానంలో సీట్లు భర్తీ చేస్తారు!! నీట్ యూజీ ఈసారి క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు..పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు లభించే అవకాశం ఉందని భావించే విద్యార్థులు! మరోవైపు.. పరీక్ష సరిగా రాయలేక పోయామని.. ఆశించిన ర్యాంకు రాకపోవచ్చని ఆవేదన చెందే విద్యార్థులు! ఫలితాలు వెలువడటానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. నీట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిపుణుల సలహాలు.. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ 2021కు దాదాపు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నీట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 59,951 మంది, తెలంగాణ నుంచి 59,069 మంది దరఖాస్తు చేసుకున్నారు. ‘గత ఏడాదితో పోల్చితే నీట్ ఈసారి క్లిష్టంగా ఉంది. 450 మార్కులకు పైగా వచ్చిన వారికి సీటు లభించే అవకాశం ఉంది’ అని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్) 450 కంటే ఎక్కువ నీట్‌ను మొత్తం 720 మార్కులకు నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరై.. 450 కంటే ఎక్కువ మార్కులు వస్తాయని భావిస్తున్న విద్యార్థులు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలోని మెడికల్, డెంటల్ కళాశాలల వివరాలు తెలుసుకోవడంపై దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ఫలితంగా కౌన్సెలింగ్ సమయంలో ప్రాథమ్యాలుగా పేర్కొనాల్సిన కాలేజీలపై స్పష్టత వస్తుంది. కౌన్సెలింగ్‌కు సన్నద్ధం నీట్లో మెరుగైన ప్రతిభ చూపామని, సీటు ఖాయమని భావించే విద్యార్థులు.. కౌన్సెలింగ్‌కు సన్నద్ధమవ్వాలి. కౌన్సెలింగ్ సమయంలో అవసరమయ్యే అన్ని రకాల ధ్రువ పత్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తదితర ధ్రువ పత్రాలను వీలైనంత ముందుగా ఫలితాలు వెలువడేలోపు పొందేందుకు కసరత్తు చేయాలి. (ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు...) ముందుగా ఆల్ ఇండియా కోటా ప్రస్తుతం నీట్–యూజీ ప్రవేశాలను ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అనే రెండు విధానాల్లో నిర్వహిస్తున్నారు. ముందుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాలో.. అన్ని రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. వీటికి స్థానికత, పుట్టిన రాష్ట్రం తదితర అంశాలతో సంబంధం లేకుండా.. ఏ రాష్ట్ర విద్యార్థులైనా దరఖాస్తు చేసుకొని..ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. గతేడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం–ఆల్ ఇండియా కోటాలో దాదాపు 6,700 ఎంబీబీఎస్ సీట్లు; నాలుగు వేల బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కౌన్సెలింగ్ సమయానికి ఈ సంఖ్యలో మార్పులు,చేర్పులు జరిగే అవకాశముంది. (చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!) రాష్ట్రాల స్థాయిలో కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ముగిశాక.. రాష్ట్రాల స్థాయిలో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల హెల్త్ యూనివర్సిటీలు వేర్వేరుగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. వీటికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు పేర్కొన్న కాలేజ్, సీటు ప్రాథమ్యాలు; వారు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తారు. కాలేజ్ ఎంపిక ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల విషయంలో ఏ కాలేజ్‌లో సీటు వచ్చినా ఓకే అనుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కారణం..సీట్ల పరిమితే! కానీ నీట్లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కళాశాలలో చేరేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు నాణ్యమైన ఇన్స్టిట్యూట్లో చేరేలా ప్రాథమ్యాలను ఇవ్వాలి. ప్రత్యామ్నాయ మార్గాలు నీట్ పరీక్షను ఆశించిన విధంగా రాయలేదని భావిస్తున్న విద్యార్థులు.. ప్రత్యామ్నాయ కోర్సులవైపు దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీరు వైద్య అనుబంధ కోర్సులుగా పేర్కొనే ఆయుష్‌తోపాటు మరెన్నో కోర్సులను ఎంచుకోవచ్చు. ఆయుష్ కోర్సులూ నీట్‌తోనే ► ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు దక్కని విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఆయుష్ కోర్సులు. బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, యునానీ(బీయూఎంఎస్), బీఎన్‌వైఎస్ వంటి కోర్సులను పూర్తి చేసుకుంటే.. డాక్టర్ కల సాకారం అవుతుంది. ► ఆయుష్ కోర్సుల సీట్లను కూడా నీట్ స్కోర్ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత.. ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తెలంగాణలో కేఎన్ఆర్యూహెచ్ఎస్, ఏపీలో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు ఈ ప్రక్రియను చేపడతాయి. బీహెచ్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్ఎంఎస్).గత కొన్నేళ్లుగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటున్న కోర్సు ఇది. బీహెచ్ఎంఎస్ పూర్తి చేసిన వారికి ప్రస్తుతం అవకాశాలకు కొదవ లేదు. రోగుల్లో ఈ వైద్య విధానంపై ఆసక్తి పెరగడం, పలు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏపీలో నాలుగు కళాశాలల్లో,తెలంగాణలో అయిదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఏఎంఎస్ మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కళాశాలల్లో, తెలంగాణలో రెండు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉన్నత విద్యపరంగా ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. యునానీ (బీయూఎంఎస్) ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో కోర్సు.. బీయూఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎన్‌వైఎస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్.. బీఎన్‌వైఎస్. బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక కళాశాలలో అందుబాటులో ఉంది. బీవీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ). ఈ కోర్సు ద్వారా.. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. పౌల్ట్రీ ఫారాలు, పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు,వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ బీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అవకాశాలు అందించే మరో కోర్సు.. అగ్రికల్చర్ బీఎస్సీ. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లుగా కొలువులు దక్కించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో.. ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ(ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. హార్టికల్చర్ సైన్స్ బైపీసీ విద్యార్థులు బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్‌ను ఎంచుకోవచ్చు. వీరికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ వంటి వాటిల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎఫ్ఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్.. సంక్షిప్తంగా బీఎఫ్ఎస్సీ. బైపీసీ విద్యార్థులు ఈ కోర్సు ద్వారా చేపల పెంపకంపై ప్రత్యేక నైపుణ్యాలు పొందొచ్చు. వీరికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు. తెలంగాణలో పి.వి. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇతర కోర్సులు కూడా బైపీసీ విద్యార్థులు ఆసక్తి ఉంటే.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ అనస్థీషియా టెక్నాలజీ వంటి కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత నీట్ కౌన్సెలింగ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఆన్లైన్ కౌన్సెలింగ్, ఛాయిస్ ఫిల్లింగ్ విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ముందస్తు కసరత్తు ప్రారంభించాలి. నిర్దిష్టంగా కాలేజీ, కోర్సు విషయంలో స్పష్టత వచ్చాక.. దానికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలు పేర్కొనాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ పత్రాలు దగ్గర ఉండేలా చూసుకోవాలి. – డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి, వైస్ ఛాన్స్లర్, కేఎన్ఆర్యూహెచ్ఎస్ నీట్–2021– ముఖ్యాంశాలు ► జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌కు దాదాపు 16 లక్షల మంది హాజరు. ► దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో 83 వేలు, బీడీఎస్‌లో 27 వేల సీట్లు. ► నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం–ఏపీలో 5,210 ఎంబీబీఎస్ సీట్లు, తెలంగాణలో 5,240 ఎంబీబీఎస్ సీట్లు. ► గత ఏడాది హెల్త్ యూనివర్సిటీల నోటిఫికేషన్ గణాంకాల ప్రకారం– ఏపీలో 1440 బీడీఎస్ సీట్లు , తెలంగాణలో 1140 బీడీఎస్ సీట్లు. ► 450పైగా స్కోర్ వస్తుందనుకునే విద్యార్థులు కౌన్సెలింగ్‌కు సన్నద్ధంగా ఉండాలి. ► కౌన్సెలింగ్‌కు అవసరమైన అన్ని ధ్రువ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ► ఎంబీబీఎస్, బీడీఎస్‌కు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న ఆయుష్, ఏజీ బీఎస్సీ, బీవీఎస్సీ, ఫిషరీస్ తదితరాలు. -
బీమా రంగంలో జాబ్ కావాలా.. ఇలా ట్రై చేయండి!
ఇన్సూరెన్స్.. బీమా.. ఒకప్పుడు బీమా అంటే జీవిత బీమానే! ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఆరోగ్య బీమా, వాహన బీమా, ప్రయాణ బీమా, గృహ బీమా.. ఇలా రకరకాల బీమా పాలసీలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇన్సూరెన్స్ కంపెనీలు.. విభిన్నమైన బీమా పాలసీలతో ముందుకు వస్తున్నాయి. కంపెనీల మధ్య పెరుగుతున్న పోటీ కారణంగా ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఇటీవల 300 ఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. బీమా రంగంలో కెరీర్ అవకాశాలు, ఆయా ఉద్యోగాలకు అర్హతలు, ఎంపిక విధానంపై ప్రత్యేక కథనం... దేశంలో బీమా రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలో అనేక సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఈ రంగంలో కార్యకలాపాల నిర్వహణ కొంత భిన్నంగా ఉంటుంది. దాంతో ఇన్సూరెన్స్ సంస్థలకు నిపుణుల కొరత ఎదురవుతోంది. తగిన అర్హతలు, నైపుణ్యాలుంటే.. బీమా రంగంలో ప్రారంభంలోనే రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వార్షిక వేతనంగా పొందవచ్చు. (మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కోర్సులు–అర్హతలు ► ఇంటర్మీయెట్/10+2 విద్యార్హతతో డిప్లొమా, డిగ్రీ స్థాయి ఇన్సూరెన్స్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఆ తర్వాత వీరు పీజీ కోర్సులను కూడా అభ్యసించవచ్చు. ► ఇన్సూరెన్స్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకోసం యాక్చూరియల్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) అందించే యాక్చూరియల్ సైన్స్ కోర్సుల్లో చేరొచ్చు. యాక్చూరియల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(అసెట్)లో అర్హత ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ► అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో.. బీబీఏ, బీకామ్, బీఏ ఇన్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. ► పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో.. ఎంబీఏ, ఎంఏ, ఎంకామ్ ఇన్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ కోర్సులను అభ్యసించొచ్చు. ► వీటితోపాటు ఎమ్మెస్సీ ఇన్ యాక్చురియల్ సైన్స్, పీజీ డిప్లొమా ఇన్ సర్టిఫైడ్ రిస్క్ అండ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కోర్సులను పలు ఇన్స్టిట్యూట్లు అందిస్తున్నాయి. నైపుణ్యాలు బీమా రంగంలో రాణించాలనుకునే వారికి గణితం, గణాంకాలపై పట్టు ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్, సమయస్పూర్తి, ఎదుటివారిని మెప్పించే ఒప్పించే నైపుణ్యాలు ఉండాలి. ఉపాధి అవకాశాలు బీమా రంగంలో నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదు. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సంస్థల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. వీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా, బీమా ఎగ్జిక్యూటివ్‌లుగా, ఇన్సూరెన్స్ సర్వేయర్లు, యాక్చువరీలు, మైక్రోఇన్సూరెన్స్ ఏజెంట్లు, అండర్ రైటర్లుగా ఉద్యోగాలు దక్కించుకునే వీలుంది. కొలువులిచ్చే సంస్థలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ ప్రుడ్‌న్షియల్, బిర్లా సన్ లైఫ్, టాటా, రిలయన్స్, బజాజ్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, మాక్స్లైఫ్ ఇన్సూరెన్స్.. ఇలా అనేక సంస్థలు నైపుణ్యాలు, అర్హతలు కలిగిన మానవ వనరులను నియమించుకుంటున్నాయి. 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భారత ప్రభుత్వానికి చెందిన బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. ఇటీవల 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఓ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. ఆసక్తి గల వారు సెప్టెంబర్ 21తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ఏఓ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం ఐబీపీఎస్ పీవో తరహాలో ఉంటుంది. బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష ► ఆన్లైన్ విధానంలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్–30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ–35 మార్కులకు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 15రెట్ల మందిని మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్ పరీక్ష ► ఈ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్.. రెండు విధానాల్లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పరీక్ష 200 మార్కులకు, డిస్క్రిప్టివ్ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. ఈ రెండు టెస్టులు కూడా ఆన్లైన్ విధానంలోనే జరుగుతాయి. ► మెయిన్ ఆబ్జెక్టివ్ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్–50 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఆబ్జెక్టివ్ తరహ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ పరీక్ష పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు. ► డిస్క్రిప్టివ్ పద్ధతిలో 30 మార్కులకు జరిగే పరీక్షలో ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరీక్షించేలా లెటర్ రైటింగ్ పది మార్కులకు, ఎస్సె 20 మార్కులకు ఉంటాయి. మెయిన్‌లో ప్రతిభ చూపిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ముఖ్యమైన తేదీలు ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2021. ► ప్రిలిమినరీ పరీక్ష తేదీ: అక్టోబర్ 2021 ► మెయిన్ పరీక్ష తేదీ: నవంబర్ 2021 ► వెబ్సైట్: www.newindia.co.in/portal -
HCL TECH Bee 2021: ఇంటర్‌తోనే ఐటీ జాబ్
సాఫ్ట్వేర్ జాబ్స్ అనగానే.. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులు పూర్తిచేసుకొని.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలుంటేనే సాధ్యమని భావిస్తారు. కాని ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు.. చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ ద్వారా.. ఎంట్రీ లెవెల్ ఐటీ జాబ్స్‌కు అవసరమైన శిక్షణను అందిస్తోంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో పూర్తి స్థాయి ఉద్యోగ నియామకం లభిస్తుంది. ఇటీవల హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, ఫీజులు, శిక్షణ, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం.. టెక్ బీకి అర్హతలు ► హెచ్‌సీఎల్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సును 2020,2021లో పూర్తిచేసి ఉండాలి. ► ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మ్యాథమెటిక్స్/బిజినెస్ మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ► ఇంటర్/10+2లో మార్కులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా నిర్దేశించారు. ఐటీ సర్వీసెస్‌కు దరఖాస్తుచేసుకునే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 85శాతానికిపైగా, సీబీఎస్సీ, ఐసీఎస్సీ అభ్యర్థులకు 80శాతానికిపైగా ఉండాలి. అసోసియేట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే..60 శాతానికి పైగా మార్కులు తప్పనిసరి. ఎంపిక విధానం ► దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్ కెరీర్ అప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి.. ఫైనల్ ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థి వ్యక్తిత్వం, ఇతర విద్యా ప్రమాణాలను పరిశీలిస్తారు. (యూజీసీ–నెట్ 2021: కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్.. ఇక్కడ క్లిక్ చేయండి) ఎంపికైతే శిక్షణ ► హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్‌ను ఇంటర్మీడియట్తోనే ఐటీ పరిశ్రమలో చేరేలా ప్రోత్సహించేందుకు రూపొందించారు. ఎంపికైన వారికి లక్నో, నోయిడా, మధురై, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, నాగపూర్‌ల్లో శిక్షణ కేంద్రాలున్నాయి. ► శిక్షణ ‘ఐటీ సర్వీసెస్, అసోసియేట్’ అని రెండు విభాగాలుగా ఉంటుంది. ► ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐటీ రంగంలో పూర్తిస్థాయి ఉద్యోగాలకు అవసరమైన శిక్షణనిస్తారు ► ఆన్లైన్/ఆఫ్‌లైన్ అసెస్మెంట్లు, చర్చలు, కేస్ బేస్డ్ సబ్మిషన్స్ వంటివి ఉంటాయి ► ట్రైనింగ్..ఫౌండేషన్,టెక్నాలజీ/డొమైన్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ అని మూడు దశల్లో ఉంటుంది ఫీజు మినహాయింపు ► టెక్ బీ–2021 ప్రోగ్రామ్‌లో ఐటీ సర్వీసెస్, అసోసియేట్ శిక్షణ ఏడాది కాలం పాటు ఉంటుంది. ఈ ఏడాది కాలానికి ఐటీ సర్వీసెస్‌కు రూ.2 లక్షలు, అసోసియేట్ ట్రైనింగ్‌కు రూ.లక్ష ఫీజుగా చెల్లించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువగా ఉంటే.. వారు బ్యాంక్ నుంచి సాయం పొందవచ్చు. ► శిక్షణలో 90 శాతం,అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన అభ్యర్థులకు నూరు శాతం ప్రోగ్రామ్ ఫీజు నుంచి మినహాయింపు; 85 శాతం నుంచి 90 శాతం స్కోరు చేసినవారికి 50 శాతం ఫీజు రాయితీ ఇస్తారు. (యూనియన్ బ్యాంకులో.. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు) ఉద్యోగం–ఉన్నత విద్య ► విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటారు. ► కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు అభ్యర్థికి నెలకు రూ.10 వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు. పూర్తిస్థాయి ఉద్యోగిగా ఎంపికైతే.. ప్రారంభ వార్షిక వేతనం 1.70 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు చెల్లిస్తారు. ► హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూనే.. బిట్స్ పిలానీ, శాస్త్ర యూనివర్సిటీలో ఉన్నత విద్య కోర్సులో చేరే అవకాశం కూడా ఉంది. ► పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్‌కు: https://registrations.hcltechbee.com -
ప్రత్యేకం: నిరుద్యోగుల కోసం ‘డీట్’ యాప్
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికత ఆధారంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాలకు చెందిన అన్నిరకాల సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసేందుకు ‘డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్) యాప్, పోర్టల్‌ను రూపొందించింది. ఉద్యోగాల వేటలో ఉన్నవారు తమ అర్హతలు, నైపుణ్యం, అనుభవం తదితరాలను ‘డీట్’లో నమోదు చేసుకుంటే వారికి ఉద్యోగ ఖాళీల సమాచారం అందుతుంది. అలాగే ఉద్యోగార్థుల అర్హత వివరాలను కూడా డీట్‌లో నమోదైన ఉద్యోగ కల్పన సంస్థలకు చేరవేస్తుంది. ఉద్యోగార్థులు, ఉద్యోగ కల్పన సంస్థలు అనుసంధానం అయ్యేందుకు ఇదో మంచి వేదిక అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఐటీ శాఖ అంచనా వేస్తోంది. కరోనా లాక్డౌన్ సమయంలో డీట్ యాప్ ద్వారా ఈ–కామర్స్, ఆరోగ్య రక్షణ, సేవా రంగాల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, టెలీకాలర్లు, హెల్త్‌కేర్ అసోసియేట్లు, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాల భర్తీ జరిగింది. డీట్ యాప్ ఉద్యోగాలను వెతికేందుకే పరిమితం కాకుండా ఆన్లైన్ వీడియో ఇంటర్వ్యూల షెడ్యూల్లోనూ సాయం చేస్తోంది. రెజ్యూమ్ రూపకల్పనలోనూ.. ఉద్యోగార్థులు రెజ్యూమ్ లేదా సీవీని సులభంగా తయారు చేసుకునేందుకు వీలుగా టెక్నాలజీని రూపొందించింది. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఉద్యోగార్థులతో కమ్యూనిటీ గ్రూపుల ఏర్పాటును డీట్ ప్రోత్సహిస్తోంది. ఈ తరహా గ్రూపుల్లో సుమారు 8,800కు పైగా నిరుద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు, డీట్ ప్రత్యేకతలు, వాక్–ఇన్ ఇంటర్వ్యూల షెడ్యూలు తదితరాలను తరచూ ఈ గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారు. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు డీట్ వేదికగా సుమారు 300కు పైగా నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ఐటీ శాఖ చేరవేసింది. ఉద్యోగాల వేటలో ఉన్న వారికి రెజ్యూమ్ తయారీలో మెళకువలను నేర్పించడంతో పాటు ఉద్యోగాలు వెతికేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై 20కి పైగా ఆన్లైన్ అవగాహన సదస్సులు నిర్వహించింది. ‘ఈక్విఫాక్స్’తో భాగస్వామ్యం.. డీట్ వేదిక ద్వారా షేర్ చేసే ఉద్యోగాల సమాచారంలో వాస్తవికతను నిర్ధారించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కన్జూమర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ‘ఈక్విఫాక్స్’తో ఐటీ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మొదలుకుని పెద్ద సంస్థల వరకు డీట్ ద్వారా ఉద్యోగాల భర్తీకి ఈక్విఫాక్స్ సాయం చేస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగార్థుల్లో ఉన్న నైపుణ్య లేమిని గుర్తించడం, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వివిధ విభాగాలు, సంస్థల వారీగా ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు చేరవేయడం దిశగా ‘డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్’ను అభివృద్ధి చేయాలని ఐటీ శాఖ భావిస్తోంది. -
ఫ్యాషన్ కెరీర్.. ఎలా చేస్తే బెటర్!
ఇంటర్మీడియెట్ తర్వాత ఫ్యాషన్, డిజైన్ రంగంలో కెరీర్ కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన కోర్సులు, అవకాశాల గురించి చెప్పండి? ప్రస్తుత ట్రెండీ కోర్సుల్లో చెప్పుకోదగ్గది ఫ్యాషన్ డిజైన్. ఇందులో దుస్తుల నుంచి పాదరక్షల వరకూ... వివిధ విభాగాల్లో స్పెషలైజేషన్స్ చేయవచ్చు. ఫ్యాషన్ డిజైన్ ప్రధానంగా కంటికి ఆహ్లాదకరంగా, ధరించడానికి ఆకర్షణీయంగా ఉండే వస్త్రాలను రూపొందించే విభాగంగా భావిస్తుంటారు. వాస్తవానికి ఇందులో మనిషి ధరించే అన్ని వస్తువుల డిజైనింగ్‌కు సంబంధించిన అంశాలు ఉంటాయి. అంటే కళ్లజోడు నుంచి పాదరక్షల వరకూ.. అన్నీ ఫ్యాషన్ రంగానికి చెందినవే. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ఇందులో ఆయా విభాగాలను ఎంచుకోవచ్చు. ఫ్యాషన్ డిజైన్‌లో.. ఫ్యాబ్రిక్ డిజైన్, డిజైన్ ప్రాసెస్ మేనేజ్మెంట్, కాన్సెప్ట్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ యాక్ససరీ డిజైన్, ప్రింటింగ్, క్వాలిటీ కంట్రోల్, టెక్స్టైల్ సైన్స్, ఫ్యాషన్ మర్కండైజింగ్, మార్కెటింగ్ అండ్ కలర్ మిక్సింగ్‌పై దృష్టి సారిస్తారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు ఆధునిక ఫ్యాషన్ ప్రపంచానికి అవసరమయ్యే నైపుణ్యాలను నేర్చుకుంటారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులు.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నిఫ్ట్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) క్యాంపస్‌ల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. అందుకోసం ఏటా నిర్వహించే నిఫ్ట్ ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణతతోపాటు సిట్యూయేషన్ టెస్ట్ తదితర ఎంపిక ప్రక్రియలోనూ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. నిఫ్ట్తోపాటు దేశంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ), ఐఐటీ బాంబే, హైదరాబాద్ తదితర ఐఐటీలు, ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఏఐఎఫ్‌డీ), ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) వంటి వాటిల్లో ఫ్యాషన్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. చదవండి: Stand Up Comedians: ఇదిగో నవ్వుల ఆక్సిజన్! మొటిమల కోసం క్రీమ్స్ వాడాను, కానీ: సాయిపల్లవి -
మై చాయిస్..మై ఫ్యూచర్ అంటున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసే కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. తొలుత రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలోని 18 వేల మంది విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రారంభించింది. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం ప్రారంభించింది. మై చాయిస్, మై ఫ్యూచర్ పేరుతో విద్యార్థుల ప్రతిభ, ఆసక్తులు, వారి భవిష్యత్తు అంచనాలపై నిర్వహించిన సైకోమెట్రిక్ టెస్టు ఫలితాల ఆధారంగా విద్యార్థులను సరైన దిశలో నడిపించే కార్యక్రమాన్ని గురువారం నుంచి అమల్లోకి తెచ్చినట్లు మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ సత్యనారా యణరెడ్డి వెల్లడించారు. ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్లు రూపొందించిన ఈ ప్రత్యేక కార్యాచరణను పైలట్ ప్రాజెక్టుగా 194 మోడల్ స్కూళ్లలోని 18 వేల మంది విద్యార్థులకు వారి భవిష్యత్తుపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అమల్లోకి తెచ్చిన విద్యాశాఖ, ఆయా పాఠశాలల్లోని మిగతా విద్యార్థులకు త్వరలోనే నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. అంతేకాదు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారి భవిష్యత్‌పై మార్గదర్శనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు మార్గదర్శిగా.. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందినవారే. వ్యవసాయ పనులు, రోజువారీ కూలి చేసుకొని బతికే కుటుంబాలకు చెందిన ఆయా విద్యార్థులు ఏ రంగంపై దృష్టి సారించాలో, దానికోసం ఎలాంటి కృషి చేయాలో, అందులో ఎలాంటి భవిష్యత్ ఉంటుందో తెలియదు. వారిని సరైన దిశలో వెళ్లేలా ప్రోత్సహించే వారు తక్కువ. అలాంటి వారెలా ముందుకెళ్లాలి.. తమకున్న ప్రతిభాపాటవాలేంటి? ఏ రంగంలో కృషి చేస్తే తొందరగా సక్సెస్ అవుతామన్న అంశాలపై అవగాహన కల్పించి, వారిని ఆ వైపు పోత్సహించేందుకు ‘మై చాయిస్.. మై ఫ్యూచర్’ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమల్లోకి తెచ్చింది. క్రమంగా దీనిని విద్యాశాఖ పరిధిలోని 26 వేల పాఠశాలల్లోని 29 లక్షల మంది విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో ఏం చేశారంటే.. వ్యక్తిత్వం, కెరీర్ సంబంధమైన 12 కేటగిరీల్లో 72 ప్రశ్నలతో విద్యార్థులందరికీ సైకోమెట్రిక్ టెస్టు (మై చాయిస్.. మై ఫ్యూచర్) నిర్వహిస్తారు. అందులో ఫలితాల ఆధారంగా ప్రతి విద్యార్థి ఆసక్తుల్ని తెలుసుకుంటారు. మోడల్ స్కూళ్లలో నిర్వహించిన ఈ టెస్టులో.. 27 శాతం మంది బాలురు పోలీసు కావాలని, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ రంగంలో స్థిరపడాలని 15 శాతం మంది ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. ఇక బాలికల్లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ రంగాల్లో స్థిరపడాలని 20 శాతం మంది, మెడిసిన్ అండ్ హెల్త్‌కేర్ వైపు వెళ్లాలని 17 శాతం మంది లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడైంది. ఇప్పుడేం చేస్తారంటే... ప్రతి విద్యార్థిపై చేసిన సైకోమెట్రిక్ టెస్టు ఆధారంగా ఆ విద్యార్థి ఎంచుకున్న కెరీర్‌కు సరిపడా సామర్థ్యాలుంటే అందుకోసం పాఠశాల స్థాయి నుంచే చేయాల్సిన కృషిని వివరించడం, ఆ రంగంలో పరిస్థితులను తెలపడం, వాటిని ఎదుర్కొని ముందుకుసాగేలా ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడతారు. కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్ వారికి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తుంటారు. అయితే ఆసక్తి ఉన్న రంగానికి సరిపడా సామర్థ్యాలు లేకపోతే వాటిని సాధించేలా విద్యార్థికి కౌన్సెలింగ్‌తోపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించి, అందుకు అనుగుణమైన పరిస్థితులను ఏర్పరచేలా కృషి చేస్తారు. ఇక విద్యార్థికి ప్రభుత్వోద్యోగంపై ఆసక్తి ఉన్నా అతనికి స్కిల్స్ మాత్రం ప్రైవేటు మార్కెటింగ్‌లో రాణించేలా ఉంటే.. వాటిని ఆ విద్యార్థికి వివరించి, ఆ స్కిల్స్, ప్రతిభ ఆధారంగా ఆ రంగంలోకి వెళ్లేలా ప్రోత్సహిస్తామని మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వివరించారు. -
కలాన్ని కదిలిస్తూ.. జనానికి గళమవుతూ..
జర్నలిస్టు పాత్రికేయం.. ప్రజా సమస్యలపై పోరాడే పాశుపతాస్త్రం. కలం కదిలించి, అక్షర అస్త్రాలను సంధించి.. ప్రజలకు తోడుగా, పచ్చని కెరీర్‌కు నీడగా నిలిచే ప్రొఫెషన్. చేపట్టిన వృత్తి.. వ్యక్తిగత వికాసానికే కాకుండా, పది మంది పురోగతికీ ఉపయోగపడాలన్న కోరిక ఉన్న వారికి సరైన కెరీర్ ఆప్షన్ జర్నలిజం. సామాజిక స్పృహ, సృజనాత్మకతకు భాషా సామర్థ్యం, కష్టపడి పనిచేసే తత్వం తోడైతే ఉన్నత అవకాశాలకు కొదవలేని జర్నలిజం కెరీర్‌పై స్పెషల్ ఫోకస్.. దేశంలో మీడియా రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతుండటంతో అనేక కొత్త సంస్థలు ప్రారంభమవుతున్నాయి. కొత్త పత్రికలు, చానళ్లు, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ వెలుస్తున్నాయి. ముఖ్యంగా 24 గంటల వార్తా చానళ్ల సంఖ్య అధికమవుతోంది. వీటికి తోడు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పీసీల వాడకం ఎక్కువ కావడంతో టైర్-2, టైర్-3 నగరాల్లో డిజిటల్ కంటెంట్ వినియోగం అధికమైంది. దీంతో ఆన్లైన్ జర్నలిజం సరికొత్త ఉద్యోగాలకు ద్వారాలు తెరుస్తోంది. జర్నలిజం ప్రొఫెషనల్స్‌కు తీవ్ర డిమాండ్ ఉండటంతో విశ్వవిద్యాలయాలు జర్నలిజంలో వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. నిత్యనూతనం.. కెరీర్లో అడుగుపెట్టింది మొదలు... ఎప్పుడూ నవ్యతకు అవకాశం ఉండటం, ఆకర్షణీయ పే ప్యాకేజీలతోపాటు సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుండటంతో జర్నలిజం కెరీర్ దిశగా అడుగులు వేసే వారి సంఖ్య అధికమవుతోంది. పరిశోధన వరకు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో దేశంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పరిశోధన స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. జర్నలిజం కోర్సునకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో గ్రూప్ సబ్జెక్ట్‌ల్లో జర్నలిజంను ఒక సబ్జెక్టుగా చేర్చి వివిధ కోర్సులను అందించే కళాశాలలూ ఉన్నాయి. అధిక శాతం మంది బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీసీజే), మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎంసీజే) కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వంటివి డిస్టెన్స్ విధానంలో జర్నలిజం కోర్సులను యువతకు అందుబాటులో ఉంచాయి. ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతలతో కోర్సుల్లో చేరొచ్చు. రాష్ట్రానికి బయట జర్నలిజం కోర్సులు అందిస్తున్న వాటిలో యూనివర్సిటీ ఆఫ్ లక్నో, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ వంటివి ఉన్నాయి. ఇంగ్లిష్, ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. జర్నలిజం- కరిక్యులం జర్నలిజం కోర్సు కరిక్యులంను తరగతి గది పాఠాలు, క్షేత్రస్థాయి ప్రాక్టికల్ వర్క్, గెస్ట్ లెక్చర్స్, ఇంటర్న్‌షిప్‌ల సమ్మేళనంగా రూపొందిస్తున్నారు. కరిక్యులంలోని కొన్ని అంశాలు: జర్నలిజం ప్రాథమిక భావనలు. ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ మీడియా. అడ్వర్టైజింగ్, మ్యాగజైన్ అండ్ ఫొటో జర్నలిజం. రిపోర్టింగ్ అండ్ ఎడిటింగ్. క్రియేటివ్ థింకింగ్ అండ్ రైటింగ్. కార్పొరేట్ అండ్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్. ట్రెండ్స్ ఇన్ కమ్యూనికేషన్. డెవలప్మెంట్ జర్నలిజం. మీడియా లాస్ అండ్ ఎథిక్స్. సొంతంగా జర్నలిజం కోర్సులు ప్రస్తుత సాంకేతిక ప్రపంచం ఒక గ్లోబల్ గ్రామంగా మారిన పరిస్థితుల్లో కచ్చితత్వంతో పాటు వేగం కూడా అత్యవసరమైంది. దీంతో మీడియా రంగంలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. సమర్థవంతమైన, సుశిక్షితులైన మానవ వనరుల కోసం పత్రికలు, చానళ్ల యాజమాన్యాలు సొంతంగా జర్నలిజం స్కూళ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పత్రికలన్నీ ఈ తరహా జర్నలిజం శిక్షణ కేంద్రాలను నడుపుతూ తమకు అవసరమైన సిబ్బందిని నియమించుకుంటున్నాయి. జాతీయస్థాయి సంస్థలైన ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ సొంతంగా జర్నలిజం శిక్షణ కేంద్రాలను నడుపుతున్నాయి. ఈ సంస్థలు తరచూ జర్నలిజం స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన వారికి జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. జర్నలిజం స్కూళ్లలో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో భాషా నైపుణ్యాలు, వర్తమాన వ్యవహారాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి అంశాలపై అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాలో విస్తృత ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభంలో పత్రికలు, చానళ్లలో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్/కాపీ ఎడిటర్‌గా ఉద్యోగాలు లభిస్తాయి. రిపోర్టర్.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పనిచేసే ప్రాంతంలో ప్రతిరోజూ జరిగే కీలక పరిణామాలను గమనిస్తూ కథనాలు, వార్తలను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సబ్ఎడిటర్ లేదా కాపీ ఎడిటర్.. రిపోర్టర్లు తీసుకొచ్చిన వార్తలను సమగ్రంగా తీర్చిదిద్దుతారు. వార్తా సంస్థలు అందించే ఇంగ్లిష్ వార్తలను స్థానిక భాషలోకి అనువదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం జరుగుతుంది. ప్రైవేటు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారిని అధిక వేతనాలతో పీఆర్వోలుగా నియమించుకుంటున్నాయి. బీసీజే అర్హత ఉన్నవారు ఎంసీజే, ఎంఫిల్, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యా కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి రీసెర్చ్ సంస్థల్లో చేరొచ్చు. యూజీసీ-నెట్లో అర్హత సాధించి విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో జర్నలిజం ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేయొచ్చు. సొంతంగా కన్సల్టెన్సీ సంస్థలను నెలకొల్పవచ్చు. అవసరమైన స్కిల్స్ సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, చొరవ, కష్టపడే తత్వం. రోజువారీ లక్ష్యాలు, వాటి సాధనకు వ్యూహ రచన సామర్థ్యం. కమ్యూనికేషన్ స్కిల్స్ (లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్..). ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం. భాష, స్వేచ్ఛానువాద నైపుణ్యం. వేగం (Speed) స్పష్టత (Clarity) కచ్చితత్వం (Accuracy). ఇవి జర్నలిజం కెరీర్లో రాణించేందుకు ముఖ్యమైనవి. రేపటి జర్నలిస్టులకు ఆహ్వానం జనజీవనానికి అద్దం పడుతూ.. జనం కోసం పనిచేసే కెరీర్‌ను కోరుకునే వారికి ‘సాక్షి’ సాదర స్వాగతం పలుకుతోంది. ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు, తదనంతరం ఉద్యోగానికి ఆహ్వానిస్తోంది. అర్హతలు: తెలుగు, ఇంగ్లిష్ భాషల మీద పట్టు. వర్తమాన అంశాల మీద అవగాహన. డిగ్రీ ఉత్తీర్ణత. 01.01.2014 నాటికి 30 ఏళ్లకు మించని వయసు. రెండు దశల్లో ఎంపిక: తొలిదశ: ఈ దశలో అభ్యర్థులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో తెలుగు, ఇంగ్లిష్ పరిజ్ఞానం, అనువాదం, వర్తమాన అంశాలపై ఆబ్జెక్టివ్, వ్యాసరూప ప్రశ్నలుంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్ష జరుగుతుంది. నమూనా ప్రశ్నపత్రాలు www.sakshischoolofjournalism.com వెబ్సైట్లో ఉంటాయి. రెండో దశ: మొదటి దశలో ఉత్తీర్ణులైన వారికి మౌఖిక పరీక్షలు ఉంటాయి. వర్తమాన అంశాలపై లోతైన అవగాహన, భాషా నైపుణ్యాలను పరీక్షించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ పరీక్షలో నెగ్గిన అభ్యర్థులను సంస్థ నియమావళికి అనుగుణంగా శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. శిక్షణ భృతి: శిక్షణ దశలో తొలి ఆరునెలలు రూ.8 వేల చొప్పున, తర్వాతి ఆరు నెలలు రూ.10 వేల నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం ఏడాది పాటు ట్రైనీగా పనిచేయాలి. ఆ సమయంలో నెలకు రూ.12 వేల వేతనం ఉంటుంది. ఆపై సబ్ఎడిటర్/ రిపోర్టర్, కాపీ ఎడిటర్, కంటెంట్ డెవలపర్‌గా నియమితులవుతారు. అప్పుడు ఆయా విభాగాల నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలుంటాయి. సాక్షి ప్రచురణ కేంద్రాల్లో, కార్యక్షేత్రాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నియమావళి: అభ్యర్థులు శిక్షణ కాలంతో పాటు సాక్షిలో కనీసం నాలుగేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం సమర్పించాలి. దరఖాస్తు విధానం: www.sakshieducation.com లేదా www.sakshischoolofjournalism.com వెబ్సైట్లో దరఖాస్తులుంటాయి. అందులోని సూచనలను క్షుణ్ణంగా చదివి దరఖాస్తులను ఆన్లైన్లోనే పూర్తిచేసి సబ్మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు ఫొటోను అప్లోడ్ చేయాలి. దరఖాస్తుకు గడువు:10.12.2013 రాత పరీక్ష: 22.12.2013 ఇంటర్వ్యూలు: 18.01.2014 నుంచి ప్రారంభం కోర్సు ప్రారంభం: 01.02.2014 చిరునామా: ప్రిన్సిపల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034. -
సమాజానికే కాదు.. కెరీర్‌కూ కొండంత అండగా...!
జాతి ఏదైనా.. సంస్కృతి మరేదైనా.. ప్రజల్ని పట్టిపీడించే సమస్యలు చాలానే! ఆ సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కడమెలాగో తెలియని వారు కోకొల్లలు.. ఇలాంటి నేపథ్యం ఉన్నవారు జన భారతంలో మరింత ఎక్కువ. ఇలాంటి వారికి ఆపన్నహస్తం అందించేందుకు అవకాశం కల్పించే కోర్సు.. సోషియాలజీ. సంప్రదాయ కోర్సుల్లో క్రేజీ కోర్సుగా నిలుస్తున్న ‘సోషియాలజీ’పై ఫోకస్.. ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. సోషియాలజీ! సోషియాలజీ.. సోషల్ వర్క్‌తో సమానంగా అవకాశాలు కల్పిస్తోంది. గత అయిదారేళ్ల కాలంలో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సామాజిక కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో నిపుణుల అవసరం పెరగడంతో యువత సోషియాలజీ వైపు అడుగులు వేస్తోంది.. -విద్యావేత్తలు, పరిశ్రమ వర్గాలు సోషియాలజీ- అకడెమిక్ కోర్సులు: మన రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంది. వివిధ విద్యా సంస్థలు సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ఉన్నత సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో సోషియాలజీని అందిస్తున్నాయి. ఉన్నత కెరీర్‌కు రాచ మార్గం: సోషియాలజీలో పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అవకాశాలున్నాయి. ఉమెన్ డవలప్మెంట్, రూరల్ డవలప్మెంట్, ట్రైబల్ డవలప్మెంట్ వంటి స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను అందుకోవచ్చు. ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల్లోని ఎన్నో పరిశోధన సంస్థలు పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నాయి. పీహెచ్డీ పూర్తిచేసి అకడమిక్‌తో పాటు వివిధ రంగాల్లో డేటా అనలిస్ట్, సర్వే రీసెర్చర్, ప్రాజెక్టు మేనేజర్ వంటి ఉన్నత ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు. ఐఐటీల్లోనూ.. ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు.. సాధారణంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులకు కేరాఫ్‌గా నిలిచే సంస్థలు. కానీ, ఇవి ఇప్పుడు సామాజిక బాధ్యతలో భాగంగా సోషల్ సెన్సైస్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. సోషియాలజీని కోర్ సబ్జెక్ట్‌గా లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా పలు స్థాయిల్లో (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) అందిస్తున్నాయి. అవి.. ఐఐటీ-కాన్పూర్; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ-ఢిల్లీ; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ- ఖరగ్‌పూర్; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ-గువహటి; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ-బాంబే; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. జాతీయ స్థాయిలో కోర్సులను అందించే సంస్థలు: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) యూనివర్సిటీ ఆఫ్ పుణె (ఎంఏ) యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) పుదుచ్చేరి యూనివర్సిటీ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) ఇగ్నో సహా మరెన్నో యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో సోషియాలజీలో బ్యాచిలర్ నుంచి పీహెచ్డీ వరకు పలు కోర్సులను అందిస్తున్నాయి. అవకాశాలు అపారం: ఒకప్పుడు సంప్రదాయ కోర్సుగా నిలిచిన సోషియాలజీ ఇప్పుడు కార్పొరేట్ రూపును సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో అవకాశాల పరంగా ఆందోళన అవసరం లేదన్నది నిపుణుల భరోసా! సోషియాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పిస్తున్న ప్రధాన వేదికలు.. అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో అధ్యాపకులుగా అవకాశాలు. స్వచ్ఛంద సంస్థల్లో అడుగు పెట్టడం. కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాలు. ప్రభుత్వ పథకాల్లో అవకాశాలు. చిన్న పరిశ్రమల్లో మానవ వనరుల విభాగాలు. వీటిలో ప్రధానమైనవి.. స్వచ్ఛంద సంస్థలు. ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధి కోణంలో విద్య, ఆహార భద్రత, ఆరోగ్యం వంటి విషయాల్లో వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సక్రమంగా అంది, సత్ఫలితాలు వచ్చేలా చేసే సుశిక్షితులైన నిపుణుల అవసరం ఉంది. ఈ క్రమంలో సోషియాలజీ చేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల్లో జండర్ ఈక్వాలిటీ, మహిళా సాధికారత, యూనివర్సల్ హెల్త్ వంటి అంశాలను చేర్చిన నేపథ్యంలో ఇవి సోషియాలజీ ఉత్తీర్ణులకు అవకాశాలు కల్పిస్తాయనడంలో సందేహం లేదు. స్వయం ఉపాధికి ఊతం: సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి దిశగా ఆలోచించవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా, కమ్యూనిటీ కౌన్సిలర్లుగా మారొచ్చు. ఇలా గంటకు రూ. వేయి నుంచి రూ.5 వేల వరకు ఫీజు పొందుతున్న వారూ ఉన్నారు. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఖాయం. కార్పొరేట్ సంస్థల్లో కనీసం రెండు లక్షల వార్షిక వేతనం ఉంటుంది. సివిల్ సర్వీస్‌లో అనుకూల ఆప్షనల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు వీలుకల్పించే పరీక్ష. సివిల్స్ మెయిన్స్ కోసం సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయన్నది నిపుణుల మాట. సిలబస్ పరిధి కాసింత తక్కువగా ఉండటం, సిలబస్‌లోని అంశాలన్నీ సమాజంతో ముడిపడి ఉండటం, సులభంగా అర్థమయ్యేలా ఉండటమే దీనికి కారణమంటున్నారు. అవసరమైన నైపుణ్యాలు: విభిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం కాగల నేర్పు. ఎదుటి వారి సమస్యలను వినే ఓర్పు. వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగలగడం. నిరంతర అవగాహన అవసరం సోషియాలజీ ఉత్తీర్ణులకు ఇప్పుడు కెరీర్ అవకాశాలు అద్భుతమని చెప్పొచ్చు. ఒకసారి కెరీర్ ప్రస్థానం ప్రారంభించాక నిరంతరం సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు; విభిన్న జాతులు, సంస్కృతుల్లో మార్పులు, సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. సామాజిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనే విధంగా అధ్యయనం సాగించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరిక్యులంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. సోషియాలజీ కెరీర్లో అడుగుపెట్టిన వారిలో తాము ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నామన్న నిబద్ధత ఉంటే ఈ రంగంలో సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది. -ప్రొఫెసర్ పుష్ప మేరి రాణి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సోషియాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ. సోషియాలజీ ఉపాధికి వేదిక సోషియాలజీ, సోషల్ వర్క్.. ఈ రెండూ సోషల్ సెన్సైస్ విభాగాలే. అయితే సోషియాలజీ సమాజ సంబంధిత అంశాలు, సమస్యలపై అవగాహన కల్పిస్తే.. సోషల్ వర్క్‌లో క్షేత్రస్థాయి అధ్యయనానికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక విధంగా ఈ రెండు కోర్సుల ఉద్దేశం ఒకటే. కాబట్టి సోషియాలజీ అభ్యర్థులు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో సోషల్ వర్క్‌పై కూడా అవగాహన పెంచుకుంటే మరిన్ని అవకాశాలు సొంతమవుతాయి. ప్రస్తుత అవసరాల రీత్యా ఈ రంగాల్లో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం వేలల్లో ఉంటుంది. కానీ, అందుకు తగిన స్థాయిలో విద్యార్థులు అందుబాటులో లేరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాలను కూడా చక్కటి ఉపాధి వేదికలుగా మార్చుకునేందుకు ఇదే సరైన సమయం. ఎం.వి. రామిరెడ్డి, హెడ్- ఆపరేషన్స్, రామ్కీ ఫౌండేషన్ -
పది కెరీర్లు.. అవకాశాలకు వారధులు...
జర్నలిజం ప్రసార మాధ్యమాలు.. ప్రజల వెన్నంటే ఉంటూ వారి రోజువారీ సమస్యలకు పరిష్కారాన్ని చూపే పదునైన ఆయుధాలు. కేవలం సమాచారాన్ని అందించడమే కాదు.. ప్రజా సమస్యలపై పోరాడటంలోనూ, చైతన్యవంతుల్ని చేయడంలోనూ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత ముందు జర్నలిజం ఉత్తమ కెరీర్ ఆప్షన్‌గా ఉంది. దేశంలోని మీడియా రంగంలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుండటంతో అనేక కొత్త సంస్థలు ప్రవేశిస్తున్నాయి. కొత్త పత్రికలు, చానళ్లు, మ్యాగజైన్లు, వెబ్ పోర్టల్స్ ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 24 గంటల న్యూస్ చానళ్ల సంఖ్య అధికమవుతోంది. దీంతో సుశిక్షితులైన మానవ వనరుల కోసం తీవ్ర డిమాండ్ ఏర్పడుతోంది. కోర్సులు మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ, డాక్టోరల్ స్థాయి కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. జర్నలిజానికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో గ్రూప్ సబ్జెక్ట్‌ల్లో జర్నలిజం ఒక సబ్జెక్టుగా ఆఫర్‌చేసే కళాశాలలూ ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీసీజే), మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎంసీజే) కోర్సులను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు. ఇగ్నో, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వంటివి దూరవిద్యలో జర్నలిజం కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో కోర్సుల్లో చేరొచ్చు. సొంతంగా శిక్షణ కేంద్రాలు: ప్రస్తుతం మీడియా రంగంలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొనడంతో అనేక పత్రికలు, చానళ్లు సొంతంగా జర్నలిజం శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసి, తమకు అవసరమైన సిబ్బందిని నియమించుకుంటున్నాయి. ఉద్యోగ అవకాశాలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభంలో పత్రికలు, చానళ్లలో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్/కాపీ ఎడిటర్‌గా ఉద్యోగాలు లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో) నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత కొలువులను సొంతం చేసుకోవచ్చు. ప్రైవేటు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారిని అధిక వేతనాలతో పీఆర్వోలుగా నియమించుకుంటున్నాయి. బీసీజే అర్హత ఉన్నవారు ఎంసీజే, ఎంఫిల్, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యా కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి రీసెర్చ్ సంస్థల్లో చేరొచ్చు. ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేయొచ్చు. సొంతంగా కన్సల్టెన్సీ సంస్థలను నెలకొల్పవచ్చు. వేతనాలు: ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వరకు వేతనం ఉంటుంది. తర్వాత విద్యార్హతలు, ప్రతిభ, పనితీరు ఆధారంగా నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పే ప్యాకేజీని అందుకోవచ్చు. హెచ్ఆర్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (హెచ్ఆర్) విభాగం.. ఒక సంస్థకు హృదయం లాంటిది. సంస్థ ప్రగతిని పరుగులు తీయించడంలో హెచ్ఆర్ మేనేజర్లు కీలకపాత్ర పోషిస్తారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిపుణులైన మానవ వనరుల కొరత తీవ్రంగా ఉండటం, ఆర్థిక సంక్షోభం తదితరాల నేపథ్యంలో సమర్థులైన హెచ్ఆర్ మేనేజర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఒక సంస్థ లేదా కంపెనీలో ఉద్యోగులను నియమించుకోవడం, వారి పనితీరును అంచనా వేయడం, అవసరమైన అంశాల్లో శిక్షణనివ్వడం, సంస్థ పనితీరును మెరుగుపరిచే వ్యూహాలు రూపొందించడం వంటి విధులను హెచ్ఆర్ మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ప్రవేశం ఎలా?: బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఎం)లో హెచ్ఆర్ సబ్జెక్టును బోధిస్తారు. అయితే హెచ్ఆర్ కెరీర్లో స్థిరపడేందుకు ఇది సరిపోదు. అందుకే విశ్వవిద్యాలయాలు అందిస్తున్న మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఎంబీఏ)లో భాగంగా హెచ్ఆర్ స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ స్పెషలైజేషన్‌లో స్టాఫింగ్, రిక్రూటింగ్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, పర్సనల్ మేనేజ్మెంట్, పెర్ఫామెన్స్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్ అండ్ లీడర్షిప్ డెవలప్మెంట్, లేబర్ లాస్ తదితర అంశాలను బోధిస్తారు. ఇగ్నో, సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ, సింబయోసిస్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ తదితర సంస్థలు దూరవిద్యలో ఎంబీఏ(హెచ్ఆర్) కోర్సులను అందిస్తున్నాయి. అవకాశాలు: ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ హౌసెస్, ఎంఎన్సీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయి. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా పదోన్నతులు, ఉన్నత వేతనాలను అందుకోవచ్చు. సంస్థ మేనేజ్మెంట్కు, ఉద్యోగులకు వారధిగా నిలిచే హెచ్ఆర్ మేనేజర్లకు సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకునే నేర్పు, నాయకత్వ లక్షణాలు, బృందస్ఫూర్తి అవసరం. యాక్టింగ్ Acting is everybody's second favourite job..అంటారు అమెరికాకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత జాక్ నికల్సన్.. అయితే యాక్టింగ్‌ను మొదటి ఇష్టమైన వృత్తిగా ఎంపిక చేసుకొని ‘గ్లామర్’ కెరీర్లో స్థిరపడాలని కోరుకునే కుర్రకారూ నేడు ఎక్కువమందే ఉన్నారు. వార్నర్ బ్రదర్స్, డిస్నీ, ఫాక్స్, డ్రీమ్‌వర్క్స్ వంటి అంతర్జాతీయ ఫిల్మ్ స్టూడియోలు.. ప్రస్తుతం భారత్ సినీ నిర్మాణ సంస్థలతో చేతులు కలుపుతుండటంతో భారీ సినిమాలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో మెగా సీరియళ్లు, రియాలిటీ షోలు సందడి చేస్తున్నాయి. దీంతో ఒకప్పటి కంటే ఇప్పుడు నటీనటులకు అవకాశాలు పెరిగాయని చెప్పొచ్చు. యాక్టింగ్ కెరీర్లోకి అడుగుపెట్టాలనుకునే వారు నటనా నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని చాలా విద్యాసంస్థలు యాక్టింగ్ అండ్ డ్రామాలో డిప్లొమా, డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులున్నాయి. ఉదాహరణకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (కోల్‌కతా).. యాక్టింగ్‌లో డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె).. పీజీ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. కెరీర్: యాక్టింగ్ నైపుణ్యాలను పెంపొందించుకున్న తర్వాత యాడ్స్, టీవీ సీరియళ్లు, రియాలిటీ షోలు, స్టేజ్ షోల్లో నటించడం ద్వారా నెమ్మదిగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఒక స్టేజ్ యాక్టర్ షోకు రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు అందుకోవచ్చు. ఈ మొత్తం ప్రొడక్షన్ హౌస్, పాత్ర ప్రాధాన్యం తదితరాల ఆధారంగా మారుతూ ఉంటుంది. టీవీ యాక్టర్ అయితే ఎపిసోడ్‌కు రూ.10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు సంపాదించే వీలుంది. ఫ్రెషర్స్‌కు అయితే ప్రారంభంలో రూ. 2 వేల వరకు అందుతుంది. అనుభవం, పాపులారిటీ ఆధారంగా అందుకునే మొత్తం పెరుగుతూ ఉంటుంది. యాక్టింగ్ కెరీర్లో రాణించాలంటే పోటీని తట్టుకొని నిలబడే సామర్థ్యం, ఓర్పు ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఉద్వేగాలను నియంత్రించుకునే నైపుణ్యాలు అవసరం. ఫ్యాక్ట్ ఫైల్: దేశంలో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ విలువ 2017 నాటికి దాదాపు రూ. 2 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నేటి టెక్ ప్రపంచంలో సాఫ్ట్వేర్ అనేది ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా ఉంటూ నవ తరానికి క్రేజీ కెరీర్‌గా నిలుస్తోంది. నాస్కామ్ అంచనాల ప్రకారం దేశంలో ఐటీ సేవల రంగం విలువ 2020 నాటికి 225 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఈ క్రమంలో భారీగా ‘సాఫ్ట్’ కొలువుల సృష్టి జరగనుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటకొస్తున్న యువతలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువులను చేజిక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కష్టానికి తగ్గ కాసుల వర్షం, సమాజంలో గుర్తింపు, సృజనకు అవకాశం ఉండటమే దీనికి కారణాలు. కెరీర్ అవకాశాలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కెరీర్లోకి ప్రవేశించాలంటే కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు జావా వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై పరిజ్ఞానం అవసరం. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టీసీఎస్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. క్యాంపస్ నియామకాలను అందుకోలేని వారు సబ్జెక్టును అభివృద్ధి చేసుకొని ఆఫ్ క్యాంపస్, వాక్ ఇన్ల ద్వారా ఉద్యోగాలు పొందొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వర్తించే విధుల్లో కోడింగ్, టెస్టింగ్, నెట్వర్కింగ్ వంటి విభాగాలుంటాయి. అభ్యర్థులు తమకిష్టమైన దానివైపు అడుగులు వేయొచ్చు. వేతనాలు: కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.25 వేలకు తక్కువ కాకుండా వేతనాలు అందుకోవచ్చు. ప్రతిభను బట్టి రూ.లక్ష వరకు వేతనం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా 3-5 ఏళ్ల అనుభవంతో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థాయికి చేరుకోవచ్చు. ఫ్యాక్ట్ ఫైల్: నాస్కామ్ అంచనాల ప్రకారం 2020 నాటికి భారతీయ సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు 3 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. డెంటిస్ట్రీ దంతసిరి బాగుంటే ముఖంపై విరిసే చిరునవ్వు చిరుముత్యమై మెరుస్తుంది.. మనిషి సౌందర్యంలో దంతసిరి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు దంత వైద్యమంటే కేవలం పళ్లకు పట్టిన గారను తొలగించడం, పుచ్చిన పళ్లను తొలగించడానికే పరిమితమైంది. అయితే ఇప్పుడిది లేజర్ సర్జరీలు, టిష్యూ గ్రాఫ్ట్స్, ఇంప్లాంట్స్ వంటి అధునాతన చికిత్సా విధానాలకు విస్తరించింది. మారిన ఆహారపు అలవాట్ల నేపథ్యంలో దంత క్షయం, ఎనామిల్ లాస్ వంటి సమస్యలు అధికమయ్యాయి. మరోవైపు దంత సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడంతో డెంటిస్టులకు డిమాండ్ పెరిగింది. కోర్సుల వివరాలు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ బైపీసీని 50 శాతం మార్కులతో పూర్తిచేసిన వారు ఎంసెట్‌లో ర్యాంకు సాధించి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్ (బీడీఎస్)లో చేరొచ్చు. ఉద్యోగావకాశాలు: బీడీఎస్ పూర్తిచేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంటిస్టులుగా ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు. నోటి సంరక్షణ ఉత్పత్తుల కంపెనీల్లోనూ డెంటిస్టులకు అవకాశాలు ఉంటున్నాయి. ప్రభుత్వ వైద్యులకు నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది. పేరున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక వేతనాలు లభిస్తాయి. సొంతంగా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తూ స్థిరపడొచ్చు. బీడీఎస్ కోర్సు పూర్తయిన తర్వాత గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. యుకే, యూఎస్ఏలో బీడీఎస్‌తోపాటు అక్కడ నిర్వహించే పార్టు-1, 2 పరీక్షలు అర్హత సాధిస్తే.. దంత వైద్యంలో ‘డాలర్’ అవకాశాలు సొంతమవుతాయి. ఉన్నత విద్య బీడీఎస్ తర్వాత మాస్టర్ ఆఫ్ డెంటల్ సైన్స్ (ఎండీఎస్) పూర్తిచేస్తే కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలు ఉంటాయి. ఎండీఎస్ తర్వాత బోధన, పరిశోధనలవైపు అడుగులు వేయొచ్చు. డెంటిస్ట్రీ కెరీర్లో రాణించాలంటే ఎప్పటికప్పుడు వైద్య రంగం, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను తెలుసుకోవాలి. హోటల్ మేనేజ్మెంట్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగం.. వేలాది అవకాశాల తరంగంగా వూరుతోంది.. పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో.. అదే స్థారుులో.. హాస్పిటాలిటీ రంగంలో వూనవ వనరులకు విపరీతమైన డివూండ్ ఏర్పడుతోంది.. దాంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రవేశం: హోటల్ మేనేజ్మెంట్కు సంబంధించి డిగ్రీ/డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఎంబీఏ (హాస్పిటాలిటీ మేనేజ్మెంట్) /ఎంఎస్సీ (హాస్పిటాలిటీ మేనేజ్మెంట్), స్పెషలైజ్డ్ పీజీ డిప్లొమా వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజీరియల్ నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. అవకాశాలు: ఆన్ బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్‌లో, ఇండియన్ నేవీ, క్రూరుుజర్లు, హాస్పిటాలిటీస్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్ , బ్యాంకులు, హాస్పిటల్స్, బీపీవో కంపెనీలు కూడా హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. సొంతంగా సంస్థలను స్థాపించడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా స్థిరపడొచ్చు. హోటల్‌మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు విదేశాల్లోనూ అవకాశాలు అనేకం. కెరీర్ ప్రారంభంలోనే ట్రైనీగా రూ. 15 నుంచి రూ. 18 వేల వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. ఫ్యాక్ట్ ఫైల్: ఏప్రిల్, 2000- ఏప్రిల్, 2013 మధ్య దేశ హోటల్ అండ్ టూరిజం రంగంలోకి 6,664 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) ప్రస్తుతం దేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ల కొరత ఎక్కువగా ఉంది. వీరికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు ప్రవేశ అర్హతలు, ఇతర అంశాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) చాలా మార్పులు చేసింది. 21 ఏళ్లు నిండేసరికి పూర్తిచేయొచ్చు: సీఏ అనగానే కొరుకుడుపడని కోర్సు అనే అభిప్రాయముంది. అయితే ఇష్టపడి చదివితే సీఏ పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. పట్టుదలతో ప్రణాళిక ప్రకారం కృషిచేస్తే 21 ఏళ్లు నిండేసరికి కోర్సు పూర్తిచేసి సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. మూడు దశలు: సీఏ కోర్సును ఐసీఏఐ నిర్వహిస్తుంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. సీపీటీ: పదో తరగతి ఉత్తీర్ణులు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ పరీక్ష ఏటా జూన్, డిసెంబర్లో ఉంటుంది. ఈ పరీక్ష రాయడానికి సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసి ఉన్నవారు లేదా ఇంటర్, డిగ్రీ.. ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. ఐపీసీసీ సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. డిగ్రీతో నేరుగా గతంలో సీఏలో చేరాలంటే.. ప్రతి ఒక్కరూ సీపీటీ తప్పనిసరిగా రాయాల్సిందే. ఇది పూర్తయితేనే రెండో దశ ఐపీసీసీలో ప్రవేశించడానికి వీలయ్యేది. కానీ, ఇటీవల సడలించిన నిబంధనల ప్రకారం 55 శాతం మార్కులతో కామర్స గ్రాడ్యుయేట్స్/ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పూర్తిచేసిన వారు, 60 శాతం మార్కులతో ఏదైనా ఇతర గ్రాడ్యుయేషన్/ పీజీ పూర్తిచేసిన, ఐసీడబ్ల్యూఏఐ లేదా సీఎస్‌లో ఇంటర్ పూర్తిచేసిన వారు సీపీటీకు హాజరు కావల్సిన అవసరం లేదు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు. ఆర్టికల్స్ ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్ కూడా సంపాదించుకోవచ్చు. ఫైనల్ ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఫైనల్ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి. అవకాశాలు: సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి వివిధ సంస్థలు అద్భుత అవకాశాలు కల్పిస్తున్నాయి. అవి: సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఆడిటింగ్ ఫర్మ్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ హౌసెస్, పేటెంట్ ఫర్మ్స్, లీగల్ హౌసెస్. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్‌గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. వేతనాలు: సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు కనీసం రూ. 35 వేల వేతనం లభిస్తుంది.తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు రూ.10 లక్షల వరకు వార్షిక వేతనం అందుకోవచ్చు. ఫ్యాక్ట్ ఫైల్: 2013లో ఐసీఏఐ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో కొత్తగా సీఏ కోర్సు పూర్తిచేసిన 902 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు. దేశీయంగా ఉద్యోగం లభించిన అభ్యర్థుల గరిష్ట వేతనం రూ.16.55 లక్షలు. లా (LAW) ఒకప్పుడు సివిల్ లేదంటే క్రిమినల్ లా కే పరిమితమైన ‘లా’.. ఇప్పుడు మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త స్పెషలైజేషన్లతో కళకళలాడుతోంది. యువత ముందు ఉత్తమ కెరీర్ ఆప్షన్‌గా ఉంటోంది. ఇప్పుడు లా వివిధ రంగాలకు విస్తరించింది. బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, ఐటీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ అవసరమే అనేక కొత్త కొలువులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది. ప్రవేశం ఇలా: విద్యా సంస్థల్లో అందుబాటులో ఉండే ‘లా’ కోర్సులో చేరేందుకు రెండు మార్గాలున్నాయి. అవి: 1. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తర్వాత ఐదేళ్ల ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సు. 2. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక మూడేళ్ల వ్యవధి గల ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సు. రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశానికి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయొచ్చు. ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి లా కళాశాలల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాల్సి ఉంటుంది. న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ.. ఐదేళ్ల వ్యవధిగల బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహిస్తోంది. అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్.. ‘ఎల్‌శాట్’ను నిర్వహిస్తోంది. దీంట్లో స్కోర్ ఆధారంగా దేశంలోని సుమారు 40కిపైగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బీ కోర్సులో సీటు సంపాదించొచ్చు. కెరీర్ అవకాశాలు ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తయిన తర్వాత న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి, లాయర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే ఆలిండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్ష ఏటా రెండుసార్లు జరుగుతుంది. {పభుత్వ రంగంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌స, మేజిస్ట్రేట్స్, సబ్ మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. పరిపాలన ట్రైబ్యునల్స్, లేబర్ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల్లోనూ పలు హోదాల్లో అడుగుపెట్టొచ్చు. వీటికోసం ఆయా రాష్ర్ట ప్ర భుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది. ప్రైవేటు రంగంలో కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలకు అవసరమైన న్యాయ సేవలు పొందేందుకు లా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. ఆర్థిక సంస్థలు; సాఫ్ట్వేర్ కంపెనీలు; పేటెంట్ హక్కుల పర్యవేక్షణ సంస్థలు; కాపీరైట్ సంస్థలు; పబ్లిషింగ్ సంస్థలు; ఎన్జీవోలు; నేషనల్, ఇంటర్నేషనల్ లా ఫర్మ్స్ లా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. సొంతంగా లీగల్ కన్సల్టెన్సీ సంస్థలు, కౌన్సెలింగ్ కేంద్రాలను నెలకొల్పవచ్చు. లా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఎల్ఎల్ఎం (మాస్టర్ ఆఫ్ లా) చేయొచ్చు. నెట్, సెట్ల్లో అర్హత సాధించి, లా కళాశాలల్లో ఫ్యాకల్టీగా అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. వేతనాలు: లా కోర్సులు పూర్తిచేసిన వారికి తాము ఎంపిక చేసుకున్న రంగం ఆధారంగా వేతనాలు లభిస్తాయి. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో అడుగుపెట్టిన వారికి హోదా, ఉద్యోగం స్వభావాన్ని బట్టి నెలకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి. ఫ్యాక్ట్ ఫైల్: ఏటా దేశంలో 60 వేల నుంచి 70 వేల మంది లా గ్రాడ్యుయేట్లు న్యాయ సంబంధ వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు. బ్యాంకింగ్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి. ఈ విస్తరణ నవతరం కుర్రకారుకు సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు ద్వారాలు తెరుస్తోంది.. దేశంలో పెద్ద కార్పొరేట్లు(రిలయన్స్, టాటా వంటివి) కొత్త బ్యాంకులు ప్రారంభించేందు కు రిజర్వ్ బ్యాంక్ అనుమతి కోసం చేసిన దరఖాస్తులపై మూడు, నాలుగు నెలల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి కొత్త బ్యాం కుల ఏర్పాటుకు అనుమతులు మంజూరైతే చాలా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ముఖ్యమైనవి. నియామక ప్రక్రియ అన్ని రకాల బ్యాంకుల్లోనూ ప్యూన్ స్థాయి ఉద్యోగాల్లో స్థానికులకు మాత్రమే అవకాశం లభిస్తుంది. సాధారణంగా ఉపాధికల్పన కార్యాలయాల ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. క్లరికల్, ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీ సాధారణంగా రాత పరీక్షల ద్వారా జరుగుతుంది. ఐబీపీఎస్ ఉమ్మడి రాత పరీక్ష ద్వారా ప్రభుత్వ రంగ, కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిర్వహిస్తోంది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), దాని అనుబంధ బ్యాంకుల్లో భర్తీకి ఎస్బీఐ ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తోంది. విదేశీ బ్యాంకులు మాత్రం పేరొందిన విద్యా సంస్థల (ఐఐఎంలు వంటివి) లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహించి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అనుభవం ఉన్న వారికి అధిక వేతనాలు ఇవ్వడం ద్వారా ఆకర్షిస్తున్నాయి. డెరైక్ట్ రిక్రూట్మెంట్ కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా అనుభవం ఉన్న ఉద్యోగులు అవసరమైతే ఆయా బ్యాంక్ లు ఉన్నతస్థాయిలో డెరైక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఉద్యోగులను భర్తీ చేసుకుంటాయి. వేతనాలు: క్లరికల్ స్థాయి వేతన స్కేలు రూ. 6,200 నుంచి రూ. 19,100 వరకు ఉంటుంది. ప్రస్తుతం అన్ని రకాల అలవెన్సులు కలిపి ప్రారంభంలో నెలకు రూ. 10 వేల (ఉద్యోగం చేసే ప్రాంతాన్ని బట్టి మారుతుంది.) వరకు ఉంటుంది. పీవోగా బ్యాంకింగ్ రంగంలో బేసిక్ పే నెలకు రూ. 14,500. విధులు నిర్వహించే ప్రదేశం ఆధారంగా ప్రారంభంలో కనీసం రూ. 21,000 వరకు వేతనం లభిస్తుంది. పదోన్నతులు: క్లర్క్‌గా ఐదేళ్ల అనుభం ఉంటే ఆఫీసర్‌గా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవం ఆధారంగా ఐదేళ్లలో జూనియర్ మేనేజ్మెంట్, ఆ తర్వాత జనరల్ మేనేజర్ హోదాను పొందొచ్చు. బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్లో చేరిన వారు పదోన్నతుల ద్వారా జూనియర్ మేనేజ్మెంట్ స్థాయి నుంచి మిడిల్ మేనేజ్మెంట్, ఆపైన సీనియర్ మేనేజ్మెంట్ స్థాయికి చేరొచ్చు. దీని తర్వాత టాప్ ఎగ్జిక్యూటివ్ కేడర్లకు సంబంధించిన ఉద్యోగాలను కైవసం చేసుకోవచ్చు. ఒకటో స్కేల్ నుంచి ఏడో స్కేల్ వరకు పదోన్నతులు ఉంటాయి. ఫ్యాక్ట్ ఫైల్: అసోచామ్ తాజా అధ్యయనం ప్రకారం దేశంలో వచ్చే ఆరేళ్లలో భారత బ్యాంకింగ్ రంగం ఎనిమిది లక్షల కొత్త ఉద్యోగాలను అందించనుంది. యోగా ఆధునికత వెంటబెట్టుకొస్తున్న జీవనశైలిలో మార్పులు.. నేడు రకరకాల మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ సమస్యలకు ఆధునిక వైద్య విధానం పూర్తి పరిష్కారాలను చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలో భారతీయ సంస్కృతిలో భాగమైన పతంజలి యోగ సూత్రాలు.. పండంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృత గుళికలుగా నేడు భావిస్తున్నారు. దీంతో యోగా గురు, ఇన్స్ట్రక్టర్లకు డిమాండ్ పెరగడంతో ఇది ఉన్నత కెరీర్ అవకాశాల జాబితాలో చోటు సంపాదించింది. కోర్సుల వివరాలు పదో తరగతి లేదా ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులు యోగా కోర్సుల్లో చేరవచ్చు. యోగాలో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరుకు సమీపంలో యూజీసీ గుర్తింపు పొందిన -S-VYASA యోగా యూనివర్సిటీ.. డిగ్రీతో పాటు పీజీ, పరిశోధన స్థాయి కోర్సులనూ ఆఫర్ చేస్తోంది. రాష్ట్రంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆర్నెల్ల యోగా డిప్లొమాను, ఎంఏ- యోగా అండ్ కాన్షియష్నెస్ను అందిస్తోంది. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (న్యూఢిల్లీ).. యోగా కోర్సులను ఆఫర్ చేస్తోంది. కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం యోగా థెరఫీకి డిమాండ్ పెరుగుతుండటంతో యోగా శిక్షణ పూర్తిచేసిన వారు యోగా ఇన్స్ట్రక్టర్లుగా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. పట్టణాల్లో యోగా ట్రైనింగ్ సెంటర్లకు ఆదరణ లభిస్తోంది. ఇలాంటి చోట ట్రైనర్లు నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆర్జింజవచ్చు. ఉన్నత విద్యా అర్హతలు ఉన్నవారు విశ్వవిద్యాలయాల్లో, ప్రైవేటు యోగా శిక్షణ సంస్థల్లో ఫ్యాకల్టీగా అవకాశాలు పొందొచ్చు. యోగా శిక్షకులకు వృత్తి పట్ల నిబద్ధత, సహనం అవసరం. యోగా శిక్షణలో ఏ మాత్రం తప్పు దొర్లినా అది నేర్చుకునే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్యాక్ట్ ఫైల్: యోగాను ప్రస్తుతం ఫిట్‌నెస్‌లో భాగంగా పరిగణిస్తున్నారు. దేశంలో హెల్త్ అండ్ ఫిట్నెస్ మార్కెట్ ఏటా 15 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. -
సాక్షి భవిత 14th July 2013
-
సాక్షి భవిత 26th June 2013