సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికత ఆధారంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాలకు చెందిన అన్నిరకాల సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసేందుకు ‘డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్) యాప్, పోర్టల్‌ను రూపొందించింది. ఉద్యోగాల వేటలో ఉన్నవారు తమ అర్హతలు, నైపుణ్యం, అనుభవం తదితరాలను ‘డీట్’లో నమోదు చేసుకుంటే వారికి ఉద్యోగ ఖాళీల సమాచారం అందుతుంది. అలాగే ఉద్యోగార్థుల అర్హత వివరాలను కూడా డీట్‌లో నమోదైన ఉద్యోగ కల్పన సంస్థలకు చేరవేస్తుంది. ఉద్యోగార్థులు, ఉద్యోగ కల్పన సంస్థలు అనుసంధానం అయ్యేందుకు ఇదో మంచి వేదిక అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఐటీ శాఖ అంచనా వేస్తోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో డీట్ యాప్ ద్వారా ఈ–కామర్స్, ఆరోగ్య రక్షణ, సేవా రంగాల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, టెలీకాలర్లు, హెల్త్‌కేర్ అసోసియేట్లు, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాల భర్తీ జరిగింది. డీట్ యాప్ ఉద్యోగాలను వెతికేందుకే పరిమితం కాకుండా ఆన్‌లైన్ వీడియో ఇంటర్వ్యూల షెడ్యూల్‌లోనూ సాయం చేస్తోంది.
రెజ్యూమ్ రూపకల్పనలోనూ..
ఉద్యోగార్థులు రెజ్యూమ్ లేదా సీవీని సులభంగా తయారు చేసుకునేందుకు వీలుగా టెక్నాలజీని రూపొందించింది. ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఉద్యోగార్థులతో కమ్యూనిటీ గ్రూపుల ఏర్పాటును డీట్ ప్రోత్సహిస్తోంది. ఈ తరహా గ్రూపుల్లో సుమారు 8,800కు పైగా నిరుద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు, డీట్ ప్రత్యేకతలు, వాక్–ఇన్ ఇంటర్వ్యూల షెడ్యూలు తదితరాలను తరచూ ఈ గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారు. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు డీట్ వేదికగా సుమారు 300కు పైగా నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ఐటీ శాఖ చేరవేసింది. ఉద్యోగాల వేటలో ఉన్న వారికి రెజ్యూమ్ తయారీలో మెళకువలను నేర్పించడంతో పాటు ఉద్యోగాలు వెతికేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై 20కి పైగా ఆన్‌లైన్ అవగాహన సదస్సులు నిర్వహించింది.
‘ఈక్విఫాక్స్’తో భాగస్వామ్యం..
డీట్ వేదిక ద్వారా షేర్ చేసే ఉద్యోగాల సమాచారంలో వాస్తవికతను నిర్ధారించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కన్జూమర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ‘ఈక్విఫాక్స్’తో ఐటీ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) మొదలుకుని పెద్ద సంస్థల వరకు డీట్ ద్వారా ఉద్యోగాల భర్తీకి ఈక్విఫాక్స్ సాయం చేస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగార్థుల్లో ఉన్న నైపుణ్య లేమిని గుర్తించడం, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వివిధ విభాగాలు, సంస్థల వారీగా ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు చేరవేయడం దిశగా ‘డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సే్చంజ్’ను అభివృద్ధి చేయాలని ఐటీ శాఖ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment