జర్నలిజం
ప్రసార మాధ్యమాలు.. ప్రజల వెన్నంటే ఉంటూ వారి రోజువారీ సమస్యలకు పరిష్కారాన్ని చూపే పదునైన ఆయుధాలు. కేవలం సమాచారాన్ని అందించడమే కాదు.. ప్రజా సమస్యలపై పోరాడటంలోనూ, చైతన్యవంతుల్ని చేయడంలోనూ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత ముందు జర్నలిజం ఉత్తమ కెరీర్ ఆప్షన్‌గా ఉంది.
దేశంలోని మీడియా రంగంలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుండటంతో అనేక కొత్త సంస్థలు ప్రవేశిస్తున్నాయి. కొత్త పత్రికలు, చానళ్లు, మ్యాగజైన్లు, వెబ్ పోర్టల్స్ ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 24 గంటల న్యూస్ చానళ్ల సంఖ్య అధికమవుతోంది. దీంతో సుశిక్షితులైన మానవ వనరుల కోసం తీవ్ర డిమాండ్ ఏర్పడుతోంది.
కోర్సులు
మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ, డాక్టోరల్ స్థాయి కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. జర్నలిజానికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో గ్రూప్ సబ్జెక్ట్‌ల్లో జర్నలిజం ఒక సబ్జెక్టుగా ఆఫర్‌చేసే కళాశాలలూ ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీసీజే), మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎంసీజే) కోర్సులను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు. ఇగ్నో, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వంటివి దూరవిద్యలో జర్నలిజం కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో కోర్సుల్లో చేరొచ్చు.
సొంతంగా శిక్షణ కేంద్రాలు: ప్రస్తుతం మీడియా రంగంలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొనడంతో అనేక పత్రికలు, చానళ్లు సొంతంగా జర్నలిజం శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసి, తమకు అవసరమైన సిబ్బందిని నియమించుకుంటున్నాయి.
ఉద్యోగ అవకాశాలు
జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభంలో పత్రికలు, చానళ్లలో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్/కాపీ ఎడిటర్‌గా ఉద్యోగాలు లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్‌వో) నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత కొలువులను సొంతం చేసుకోవచ్చు.
ప్రైవేటు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారిని అధిక వేతనాలతో పీఆర్‌వోలుగా నియమించుకుంటున్నాయి.
బీసీజే అర్హత ఉన్నవారు ఎంసీజే, ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి రీసెర్చ్ సంస్థల్లో చేరొచ్చు. ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు.
ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేయొచ్చు. సొంతంగా కన్సల్టెన్సీ సంస్థలను నెలకొల్పవచ్చు.
వేతనాలు: ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వరకు వేతనం ఉంటుంది. తర్వాత విద్యార్హతలు, ప్రతిభ, పనితీరు ఆధారంగా నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పే ప్యాకేజీని అందుకోవచ్చు.
హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (హెచ్‌ఆర్) విభాగం.. ఒక సంస్థకు హృదయం లాంటిది. సంస్థ ప్రగతిని పరుగులు తీయించడంలో హెచ్‌ఆర్ మేనేజర్లు కీలకపాత్ర పోషిస్తారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిపుణులైన మానవ వనరుల కొరత తీవ్రంగా ఉండటం, ఆర్థిక సంక్షోభం తదితరాల నేపథ్యంలో సమర్థులైన హెచ్‌ఆర్ మేనేజర్లకు డిమాండ్ పెరుగుతోంది.
ఒక సంస్థ లేదా కంపెనీలో ఉద్యోగులను నియమించుకోవడం, వారి పనితీరును అంచనా వేయడం, అవసరమైన అంశాల్లో శిక్షణనివ్వడం, సంస్థ పనితీరును మెరుగుపరిచే వ్యూహాలు రూపొందించడం వంటి విధులను హెచ్‌ఆర్ మేనేజర్లు నిర్వహిస్తుంటారు.
ప్రవేశం ఎలా?:
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (బీబీఎం)లో హెచ్‌ఆర్ సబ్జెక్టును బోధిస్తారు. అయితే హెచ్‌ఆర్ కెరీర్‌లో స్థిరపడేందుకు ఇది సరిపోదు. అందుకే విశ్వవిద్యాలయాలు అందిస్తున్న మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఎంబీఏ)లో భాగంగా హెచ్‌ఆర్ స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ స్పెషలైజేషన్‌లో స్టాఫింగ్, రిక్రూటింగ్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, పర్సనల్ మేనేజ్‌మెంట్, పెర్ఫామెన్స్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్ అండ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్, లేబర్ లాస్ తదితర అంశాలను బోధిస్తారు.
ఇగ్నో, సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ, సింబయోసిస్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ తదితర సంస్థలు దూరవిద్యలో ఎంబీఏ(హెచ్‌ఆర్) కోర్సులను అందిస్తున్నాయి.
అవకాశాలు: ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, కార్పొరేట్ హౌసెస్, ఎంఎన్‌సీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయి. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా పదోన్నతులు, ఉన్నత వేతనాలను అందుకోవచ్చు.
సంస్థ మేనేజ్‌మెంట్‌కు, ఉద్యోగులకు వారధిగా నిలిచే హెచ్‌ఆర్ మేనేజర్లకు సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకునే నేర్పు, నాయకత్వ లక్షణాలు, బృందస్ఫూర్తి అవసరం.
యాక్టింగ్
Acting is everybody's second favourite job..అంటారు అమెరికాకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత జాక్ నికల్సన్.. అయితే యాక్టింగ్‌ను మొదటి ఇష్టమైన వృత్తిగా ఎంపిక చేసుకొని ‘గ్లామర్’ కెరీర్‌లో స్థిరపడాలని కోరుకునే కుర్రకారూ నేడు ఎక్కువమందే ఉన్నారు.
వార్నర్ బ్రదర్స్, డిస్నీ, ఫాక్స్, డ్రీమ్‌వర్క్స్ వంటి అంతర్జాతీయ ఫిల్మ్ స్టూడియోలు.. ప్రస్తుతం భారత్ సినీ నిర్మాణ సంస్థలతో చేతులు కలుపుతుండటంతో భారీ సినిమాలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో మెగా సీరియళ్లు, రియాలిటీ షోలు సందడి చేస్తున్నాయి. దీంతో ఒకప్పటి కంటే ఇప్పుడు నటీనటులకు అవకాశాలు పెరిగాయని చెప్పొచ్చు.
యాక్టింగ్ కెరీర్‌లోకి అడుగుపెట్టాలనుకునే వారు నటనా నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని చాలా విద్యాసంస్థలు యాక్టింగ్ అండ్ డ్రామాలో డిప్లొమా, డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులున్నాయి. ఉదాహరణకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (కోల్‌కతా).. యాక్టింగ్‌లో డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె).. పీజీ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది.
కెరీర్: యాక్టింగ్ నైపుణ్యాలను పెంపొందించుకున్న తర్వాత యాడ్స్, టీవీ సీరియళ్లు, రియాలిటీ షోలు, స్టేజ్ షోల్లో నటించడం ద్వారా నెమ్మదిగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఒక స్టేజ్ యాక్టర్ షోకు రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు అందుకోవచ్చు. ఈ మొత్తం ప్రొడక్షన్ హౌస్, పాత్ర ప్రాధాన్యం తదితరాల ఆధారంగా మారుతూ ఉంటుంది. టీవీ యాక్టర్ అయితే ఎపిసోడ్‌కు రూ.10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు సంపాదించే వీలుంది. ఫ్రెషర్స్‌కు అయితే ప్రారంభంలో రూ. 2 వేల వరకు అందుతుంది. అనుభవం, పాపులారిటీ ఆధారంగా అందుకునే మొత్తం పెరుగుతూ ఉంటుంది.
యాక్టింగ్ కెరీర్‌లో రాణించాలంటే పోటీని తట్టుకొని నిలబడే సామర్థ్యం, ఓర్పు ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఉద్వేగాలను నియంత్రించుకునే నైపుణ్యాలు అవసరం.
ఫ్యాక్ట్ ఫైల్: దేశంలో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ విలువ 2017 నాటికి దాదాపు రూ. 2 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా.
సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్
నేటి టెక్ ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ అనేది ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా ఉంటూ నవ తరానికి క్రేజీ కెరీర్‌గా నిలుస్తోంది. నాస్కామ్ అంచనాల ప్రకారం దేశంలో ఐటీ సేవల రంగం విలువ 2020 నాటికి 225 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఈ క్రమంలో భారీగా ‘సాఫ్ట్’ కొలువుల సృష్టి జరగనుంది.
ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటకొస్తున్న యువతలో చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొలువులను చేజిక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కష్టానికి తగ్గ కాసుల వర్షం, సమాజంలో గుర్తింపు, సృజనకు అవకాశం ఉండటమే దీనికి కారణాలు.
కెరీర్ అవకాశాలు
సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ కెరీర్‌లోకి ప్రవేశించాలంటే కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు జావా వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై పరిజ్ఞానం అవసరం.
ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టీసీఎస్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. క్యాంపస్ నియామకాలను అందుకోలేని వారు సబ్జెక్టును అభివృద్ధి చేసుకొని ఆఫ్ క్యాంపస్, వాక్ ఇన్‌ల ద్వారా ఉద్యోగాలు పొందొచ్చు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిర్వర్తించే విధుల్లో కోడింగ్, టెస్టింగ్, నెట్‌వర్కింగ్ వంటి విభాగాలుంటాయి. అభ్యర్థులు తమకిష్టమైన దానివైపు అడుగులు వేయొచ్చు.
వేతనాలు: కెరీర్ ప్రారంభంలో నెలకు రూ.25 వేలకు తక్కువ కాకుండా వేతనాలు అందుకోవచ్చు. ప్రతిభను బట్టి రూ.లక్ష వరకు వేతనం ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా 3-5 ఏళ్ల అనుభవంతో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్థాయికి చేరుకోవచ్చు.
ఫ్యాక్ట్ ఫైల్: నాస్కామ్ అంచనాల ప్రకారం 2020 నాటికి భారతీయ సాఫ్ట్‌వేర్ రంగంలో దాదాపు 3 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
డెంటిస్ట్రీ
దంతసిరి బాగుంటే ముఖంపై విరిసే చిరునవ్వు చిరుముత్యమై మెరుస్తుంది.. మనిషి సౌందర్యంలో దంతసిరి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు దంత వైద్యమంటే కేవలం పళ్లకు పట్టిన గారను తొలగించడం, పుచ్చిన పళ్లను తొలగించడానికే పరిమితమైంది. అయితే ఇప్పుడిది లేజర్ సర్జరీలు, టిష్యూ గ్రాఫ్ట్స్, ఇంప్లాంట్స్ వంటి అధునాతన చికిత్సా విధానాలకు విస్తరించింది. మారిన ఆహారపు అలవాట్ల నేపథ్యంలో దంత క్షయం, ఎనామిల్ లాస్ వంటి సమస్యలు అధికమయ్యాయి. మరోవైపు దంత సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడంతో డెంటిస్టులకు డిమాండ్ పెరిగింది.
కోర్సుల వివరాలు:
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ బైపీసీని 50 శాతం మార్కులతో పూర్తిచేసిన వారు ఎంసెట్‌లో ర్యాంకు సాధించి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్ (బీడీఎస్)లో చేరొచ్చు.
ఉద్యోగావకాశాలు:
బీడీఎస్ పూర్తిచేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంటిస్టులుగా ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు. నోటి సంరక్షణ ఉత్పత్తుల కంపెనీల్లోనూ డెంటిస్టులకు అవకాశాలు ఉంటున్నాయి. ప్రభుత్వ వైద్యులకు నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది. పేరున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక వేతనాలు లభిస్తాయి.
సొంతంగా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తూ స్థిరపడొచ్చు.
బీడీఎస్ కోర్సు పూర్తయిన తర్వాత గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. యుకే, యూఎస్‌ఏలో బీడీఎస్‌తోపాటు అక్కడ నిర్వహించే పార్టు-1, 2 పరీక్షలు అర్హత సాధిస్తే.. దంత వైద్యంలో ‘డాలర్’ అవకాశాలు సొంతమవుతాయి.
ఉన్నత విద్య
బీడీఎస్ తర్వాత మాస్టర్ ఆఫ్ డెంటల్ సైన్స్ (ఎండీఎస్) పూర్తిచేస్తే కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలు ఉంటాయి. ఎండీఎస్ తర్వాత బోధన, పరిశోధనలవైపు అడుగులు వేయొచ్చు.
డెంటిస్ట్రీ కెరీర్‌లో రాణించాలంటే ఎప్పటికప్పుడు వైద్య రంగం, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను తెలుసుకోవాలి.
హోటల్ మేనేజ్‌మెంట్
దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగం.. వేలాది అవకాశాల తరంగంగా వూరుతోంది.. పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో.. అదే స్థారుులో.. హాస్పిటాలిటీ రంగంలో వూనవ వనరులకు విపరీతమైన డివూండ్ ఏర్పడుతోంది.. దాంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య కూడా అధికమవుతోంది.
ప్రవేశం: హోటల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి డిగ్రీ/డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఎంబీఏ (హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్) /ఎంఎస్సీ (హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్), స్పెషలైజ్డ్ పీజీ డిప్లొమా వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజీరియల్ నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి.
అవకాశాలు: ఆన్ బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్‌లో, ఇండియన్ నేవీ, క్రూరుుజర్లు, హాస్పిటాలిటీస్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్ , బ్యాంకులు, హాస్పిటల్స్, బీపీవో కంపెనీలు కూడా హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. సొంతంగా సంస్థలను స్థాపించడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా స్థిరపడొచ్చు. హోటల్‌మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు విదేశాల్లోనూ అవకాశాలు అనేకం. కెరీర్ ప్రారంభంలోనే ట్రైనీగా రూ. 15 నుంచి రూ. 18 వేల వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ. 30,000 నుంచి రూ. లక్ష వరకు సంపాదించవచ్చు.
ఫ్యాక్ట్ ఫైల్: ఏప్రిల్, 2000- ఏప్రిల్, 2013 మధ్య దేశ హోటల్ అండ్ టూరిజం రంగంలోకి 6,664 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)
ప్రస్తుతం దేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ల కొరత ఎక్కువగా ఉంది. వీరికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు ప్రవేశ అర్హతలు, ఇతర అంశాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) చాలా మార్పులు చేసింది.
21 ఏళ్లు నిండేసరికి పూర్తిచేయొచ్చు: సీఏ అనగానే కొరుకుడుపడని కోర్సు అనే అభిప్రాయముంది. అయితే ఇష్టపడి చదివితే సీఏ పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. పట్టుదలతో ప్రణాళిక ప్రకారం కృషిచేస్తే 21 ఏళ్లు నిండేసరికి కోర్సు పూర్తిచేసి సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.
మూడు దశలు: సీఏ కోర్సును ఐసీఏఐ నిర్వహిస్తుంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి.
సీపీటీ: పదో తరగతి ఉత్తీర్ణులు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ పరీక్ష ఏటా జూన్, డిసెంబర్‌లో ఉంటుంది. ఈ పరీక్ష రాయడానికి సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసి ఉన్నవారు లేదా ఇంటర్, డిగ్రీ.. ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు.
ఐపీసీసీ
సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి.
డిగ్రీతో నేరుగా
గతంలో సీఏలో చేరాలంటే.. ప్రతి ఒక్కరూ సీపీటీ తప్పనిసరిగా రాయాల్సిందే. ఇది పూర్తయితేనే రెండో దశ ఐపీసీసీలో ప్రవేశించడానికి వీలయ్యేది. కానీ, ఇటీవల సడలించిన నిబంధనల ప్రకారం 55 శాతం మార్కులతో కామర్‌స గ్రాడ్యుయేట్స్/ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పూర్తిచేసిన వారు, 60 శాతం మార్కులతో ఏదైనా ఇతర గ్రాడ్యుయేషన్/ పీజీ పూర్తిచేసిన, ఐసీడబ్ల్యూఏఐ లేదా సీఎస్‌లో ఇంటర్ పూర్తిచేసిన వారు సీపీటీకు హాజరు కావల్సిన అవసరం లేదు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు.
ఆర్టికల్స్
ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్ కూడా సంపాదించుకోవచ్చు.
ఫైనల్
ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఫైనల్ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి.
అవకాశాలు: సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి వివిధ సంస్థలు అద్భుత అవకాశాలు కల్పిస్తున్నాయి. అవి: సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్‌వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఆడిటింగ్ ఫర్మ్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ హౌసెస్, పేటెంట్ ఫర్మ్స్, లీగల్ హౌసెస్.
స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్‌గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు.
వేతనాలు: సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు కనీసం రూ. 35 వేల వేతనం లభిస్తుంది.తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు రూ.10 లక్షల వరకు వార్షిక వేతనం అందుకోవచ్చు.
ఫ్యాక్ట్ ఫైల్: 2013లో ఐసీఏఐ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో కొత్తగా సీఏ కోర్సు పూర్తిచేసిన 902 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు. దేశీయంగా ఉద్యోగం లభించిన అభ్యర్థుల గరిష్ట వేతనం రూ.16.55 లక్షలు.
లా (LAW)
ఒకప్పుడు సివిల్ లేదంటే క్రిమినల్ లా కే పరిమితమైన ‘లా’.. ఇప్పుడు మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త స్పెషలైజేషన్లతో కళకళలాడుతోంది. యువత ముందు ఉత్తమ కెరీర్ ఆప్షన్‌గా ఉంటోంది.
ఇప్పుడు లా వివిధ రంగాలకు విస్తరించింది. బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, ఐటీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ అవసరమే అనేక కొత్త కొలువులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది.
ప్రవేశం ఇలా:
విద్యా సంస్థల్లో అందుబాటులో ఉండే ‘లా’ కోర్సులో చేరేందుకు రెండు మార్గాలున్నాయి. అవి: 1. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తర్వాత ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సు. 2. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక మూడేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సు.
రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశానికి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయొచ్చు. ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి లా కళాశాలల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ.. ఐదేళ్ల వ్యవధిగల బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహిస్తోంది.
అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్.. ‘ఎల్‌శాట్’ను నిర్వహిస్తోంది. దీంట్లో స్కోర్ ఆధారంగా దేశంలోని సుమారు 40కిపైగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో సీటు సంపాదించొచ్చు.
కెరీర్ అవకాశాలు
ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తయిన తర్వాత న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి, లాయర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే ఆలిండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్ష ఏటా రెండుసార్లు జరుగుతుంది.
{పభుత్వ రంగంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌స, మేజిస్ట్రేట్స్, సబ్ మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. పరిపాలన ట్రైబ్యునల్స్, లేబర్ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల్లోనూ పలు హోదాల్లో అడుగుపెట్టొచ్చు. వీటికోసం ఆయా రాష్ర్ట ప్ర భుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది.
ప్రైవేటు రంగంలో కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలకు అవసరమైన న్యాయ సేవలు పొందేందుకు లా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి.
ఆర్థిక సంస్థలు; సాఫ్ట్‌వేర్ కంపెనీలు; పేటెంట్ హక్కుల పర్యవేక్షణ సంస్థలు; కాపీరైట్ సంస్థలు; పబ్లిషింగ్ సంస్థలు; ఎన్‌జీవోలు; నేషనల్, ఇంటర్నేషనల్ లా ఫర్మ్స్ లా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి.
సొంతంగా లీగల్ కన్సల్టెన్సీ సంస్థలు, కౌన్సెలింగ్ కేంద్రాలను నెలకొల్పవచ్చు.
లా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఎల్‌ఎల్‌ఎం (మాస్టర్ ఆఫ్ లా) చేయొచ్చు. నెట్, సెట్‌ల్లో అర్హత సాధించి, లా కళాశాలల్లో ఫ్యాకల్టీగా అవకాశాలను చేజిక్కించుకోవచ్చు.
వేతనాలు: లా కోర్సులు పూర్తిచేసిన వారికి తాము ఎంపిక చేసుకున్న రంగం ఆధారంగా వేతనాలు లభిస్తాయి. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో అడుగుపెట్టిన వారికి హోదా, ఉద్యోగం స్వభావాన్ని బట్టి నెలకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి.
ఫ్యాక్ట్ ఫైల్: ఏటా దేశంలో 60 వేల నుంచి 70 వేల మంది లా గ్రాడ్యుయేట్లు న్యాయ సంబంధ వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు.
బ్యాంకింగ్
దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి. ఈ విస్తరణ నవతరం కుర్రకారుకు సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు ద్వారాలు తెరుస్తోంది..
దేశంలో పెద్ద కార్పొరేట్లు(రిలయన్స్, టాటా వంటివి) కొత్త బ్యాంకులు ప్రారంభించేందు కు రిజర్వ్ బ్యాంక్ అనుమతి కోసం చేసిన దరఖాస్తులపై మూడు, నాలుగు నెలల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి కొత్త బ్యాం కుల ఏర్పాటుకు అనుమతులు మంజూరైతే చాలా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.
దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ముఖ్యమైనవి.
నియామక ప్రక్రియ
అన్ని రకాల బ్యాంకుల్లోనూ ప్యూన్ స్థాయి ఉద్యోగాల్లో స్థానికులకు మాత్రమే అవకాశం లభిస్తుంది. సాధారణంగా ఉపాధికల్పన కార్యాలయాల ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
క్లరికల్, ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీ సాధారణంగా రాత పరీక్షల ద్వారా జరుగుతుంది. ఐబీపీఎస్ ఉమ్మడి రాత పరీక్ష ద్వారా ప్రభుత్వ రంగ, కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకులకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిర్వహిస్తోంది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), దాని అనుబంధ బ్యాంకుల్లో భర్తీకి ఎస్‌బీఐ ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తోంది.
విదేశీ బ్యాంకులు మాత్రం పేరొందిన విద్యా సంస్థల (ఐఐఎంలు వంటివి) లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అనుభవం ఉన్న వారికి అధిక వేతనాలు ఇవ్వడం ద్వారా ఆకర్షిస్తున్నాయి.
డెరైక్ట్ రిక్రూట్‌మెంట్
కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా అనుభవం ఉన్న ఉద్యోగులు అవసరమైతే ఆయా బ్యాంక్ లు ఉన్నతస్థాయిలో డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఉద్యోగులను భర్తీ చేసుకుంటాయి.
వేతనాలు: క్లరికల్ స్థాయి వేతన స్కేలు రూ. 6,200 నుంచి రూ. 19,100 వరకు ఉంటుంది. ప్రస్తుతం అన్ని రకాల అలవెన్సులు కలిపి ప్రారంభంలో నెలకు రూ. 10 వేల (ఉద్యోగం చేసే ప్రాంతాన్ని బట్టి మారుతుంది.) వరకు ఉంటుంది. పీవోగా బ్యాంకింగ్ రంగంలో బేసిక్ పే నెలకు రూ. 14,500. విధులు నిర్వహించే ప్రదేశం ఆధారంగా ప్రారంభంలో కనీసం రూ. 21,000 వరకు వేతనం లభిస్తుంది.
పదోన్నతులు: క్లర్క్‌గా ఐదేళ్ల అనుభం ఉంటే ఆఫీసర్‌గా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవం ఆధారంగా ఐదేళ్లలో జూనియర్ మేనేజ్‌మెంట్, ఆ తర్వాత జనరల్ మేనేజర్ హోదాను పొందొచ్చు. బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్లో చేరిన వారు పదోన్నతుల ద్వారా జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి నుంచి మిడిల్ మేనేజ్‌మెంట్, ఆపైన సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి చేరొచ్చు. దీని తర్వాత టాప్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లకు సంబంధించిన ఉద్యోగాలను కైవసం చేసుకోవచ్చు. ఒకటో స్కేల్ నుంచి ఏడో స్కేల్ వరకు పదోన్నతులు ఉంటాయి.
ఫ్యాక్ట్ ఫైల్: అసోచామ్ తాజా అధ్యయనం ప్రకారం దేశంలో వచ్చే ఆరేళ్లలో భారత బ్యాంకింగ్ రంగం ఎనిమిది లక్షల కొత్త ఉద్యోగాలను అందించనుంది.
యోగా
ఆధునికత వెంటబెట్టుకొస్తున్న జీవనశైలిలో మార్పులు.. నేడు రకరకాల మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ సమస్యలకు ఆధునిక వైద్య విధానం పూర్తి పరిష్కారాలను చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలో భారతీయ సంస్కృతిలో భాగమైన పతంజలి యోగ సూత్రాలు.. పండంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృత గుళికలుగా నేడు భావిస్తున్నారు. దీంతో యోగా గురు, ఇన్‌స్ట్రక్టర్లకు డిమాండ్ పెరగడంతో ఇది ఉన్నత కెరీర్ అవకాశాల జాబితాలో చోటు సంపాదించింది.
కోర్సుల వివరాలు
పదో తరగతి లేదా ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులు యోగా కోర్సుల్లో చేరవచ్చు. యోగాలో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరుకు సమీపంలో యూజీసీ గుర్తింపు పొందిన -S-VYASA యోగా యూనివర్సిటీ.. డిగ్రీతో పాటు పీజీ, పరిశోధన స్థాయి కోర్సులనూ ఆఫర్ చేస్తోంది. రాష్ట్రంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆర్నెల్ల యోగా డిప్లొమాను, ఎంఏ- యోగా అండ్ కాన్షియష్‌నెస్‌ను అందిస్తోంది. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా (న్యూఢిల్లీ).. యోగా కోర్సులను ఆఫర్ చేస్తోంది.
కెరీర్ గ్రాఫ్
ప్రస్తుతం యోగా థెరఫీకి డిమాండ్ పెరుగుతుండటంతో యోగా శిక్షణ పూర్తిచేసిన వారు యోగా ఇన్‌స్ట్రక్టర్లుగా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. పట్టణాల్లో యోగా ట్రైనింగ్ సెంటర్లకు ఆదరణ లభిస్తోంది. ఇలాంటి చోట ట్రైనర్లు నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆర్జింజవచ్చు.
ఉన్నత విద్యా అర్హతలు ఉన్నవారు విశ్వవిద్యాలయాల్లో, ప్రైవేటు యోగా శిక్షణ సంస్థల్లో ఫ్యాకల్టీగా అవకాశాలు పొందొచ్చు.
యోగా శిక్షకులకు వృత్తి పట్ల నిబద్ధత, సహనం అవసరం. యోగా శిక్షణలో ఏ మాత్రం తప్పు దొర్లినా అది నేర్చుకునే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఫ్యాక్ట్ ఫైల్: యోగాను ప్రస్తుతం ఫిట్‌నెస్‌లో భాగంగా పరిగణిస్తున్నారు. దేశంలో హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మార్కెట్ ఏటా 15 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది.