బీమా రంగంలో జాబ్‌ కావాలా.. ఇలా ట్రై చేయండి! | New India Assurance Recruitment 2021: Insurance Jobs, Career Guidance | Sakshi
Sakshi News home page

బీమా రంగంలో జాబ్‌ కావాలా.. ఇలా ట్రై చేయండి!

Published Sat, Sep 11 2021 5:20 PM | Last Updated on Sat, Sep 11 2021 8:21 PM

New India Assurance Recruitment 2021: Insurance Jobs, Career Guidance - Sakshi

ఇన్సూరెన్స్‌.. బీమా.. ఒకప్పుడు బీమా అంటే జీవిత బీమానే! ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఆరోగ్య బీమా, వాహన బీమా, ప్రయాణ బీమా, గృహ బీమా.. ఇలా రకరకాల బీమా పాలసీలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇన్సూరెన్స్‌ కంపెనీలు.. విభిన్నమైన బీమా పాలసీలతో ముందుకు వస్తున్నాయి. కంపెనీల మధ్య పెరుగుతున్న పోటీ కారణంగా ఈ రంగంలో నిపుణులకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ ఇటీవల 300 ఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. బీమా రంగంలో  కెరీర్‌ అవకాశాలు, ఆయా ఉద్యోగాలకు అర్హతలు, ఎంపిక విధానంపై ప్రత్యేక కథనం... 

దేశంలో బీమా రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగంలో అనేక సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఈ రంగంలో కార్యకలాపాల నిర్వహణ కొంత భిన్నంగా ఉంటుంది. దాంతో ఇన్సూరెన్స్‌ సంస్థలకు నిపుణుల కొరత ఎదురవుతోంది. తగిన అర్హతలు, నైపుణ్యాలుంటే.. బీమా రంగంలో ప్రారంభంలోనే రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వార్షిక వేతనంగా పొందవచ్చు. (మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)


కోర్సులు–అర్హతలు

► ఇంటర్మీయెట్‌/10+2 విద్యార్హతతో డిప్లొమా, డిగ్రీ స్థాయి ఇన్సూరెన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఆ తర్వాత వీరు పీజీ కోర్సులను కూడా అభ్యసించవచ్చు. 

► ఇన్సూరెన్స్‌ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకోసం యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణులు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐఏఐ) అందించే యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సుల్లో చేరొచ్చు. యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(అసెట్‌)లో అర్హత ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. 

► అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో.. బీబీఏ, బీకామ్, బీఏ ఇన్‌ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. 

► పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో.. ఎంబీఏ, ఎంఏ, ఎంకామ్‌ ఇన్‌ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అభ్యసించొచ్చు. 

► వీటితోపాటు ఎమ్మెస్సీ ఇన్‌ యాక్చురియల్‌ సైన్స్, పీజీ డిప్లొమా ఇన్‌ సర్టిఫైడ్‌ రిస్క్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వంటి కోర్సులను పలు ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. 

నైపుణ్యాలు
బీమా రంగంలో రాణించాలనుకునే వారికి గణితం, గణాంకాలపై పట్టు ఉండాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, టీమ్‌ వర్క్, సమయస్పూర్తి, ఎదుటివారిని మెప్పించే ఒప్పించే నైపుణ్యాలు ఉండాలి.

ఉపాధి అవకాశాలు
బీమా రంగంలో నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదు. లైఫ్‌ ఇన్సూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి సంస్థల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. వీరు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లుగా, బీమా ఎగ్జిక్యూటివ్‌లుగా, ఇన్సూరెన్స్‌ సర్వేయర్లు, యాక్చువరీలు, మైక్రోఇన్సూరెన్స్‌ ఏజెంట్లు, అండర్‌ రైటర్లుగా ఉద్యోగాలు దక్కించుకునే వీలుంది. 

కొలువులిచ్చే సంస్థలు
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ), జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్, కోటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ ప్రుడ్‌న్షియల్, బిర్లా సన్‌ లైఫ్, టాటా, రిలయన్స్, బజాజ్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, మాక్స్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. ఇలా అనేక సంస్థలు నైపుణ్యాలు, అర్హతలు కలిగిన మానవ వనరులను నియమించుకుంటున్నాయి.


300 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు 

భారత ప్రభుత్వానికి చెందిన బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌.. ఇటీవల 300 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(ఏఓ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. ఆసక్తి గల వారు సెప్టెంబర్‌ 21తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం
ఏఓ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం ఐబీపీఎస్‌ పీవో తరహాలో ఉంటుంది. బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

ప్రిలిమినరీ పరీక్ష
► ఆన్‌లైన్‌ విధానంలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌–30 మార్కులకు, రీజనింగ్‌ ఎబిలిటీ–35 మార్కులకు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 35 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 15రెట్ల మందిని మెయిన్‌కు అనుమతిస్తారు.


మెయిన్‌ పరీక్ష

► ఈ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌.. రెండు విధానాల్లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ పరీక్ష 200 మార్కులకు, డిస్క్రిప్టివ్‌ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. ఈ రెండు టెస్టులు కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతాయి. 

► మెయిన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌–50 మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌–50 మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌–50 మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌–50 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఆబ్జెక్టివ్‌ తరహ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్‌ పరీక్ష పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు.

► డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో 30 మార్కులకు జరిగే పరీక్షలో ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని పరీక్షించేలా లెటర్‌ రైటింగ్‌ పది మార్కులకు, ఎస్సె 20 మార్కులకు ఉంటాయి. మెయిన్‌లో ప్రతిభ చూపిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ముఖ్యమైన తేదీలు
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 21, 2021.
► ప్రిలిమినరీ పరీక్ష తేదీ: అక్టోబర్‌ 2021
► మెయిన్‌ పరీక్ష తేదీ: నవంబర్‌ 2021
► వెబ్‌సైట్‌: www.newindia.co.in/portal

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement