
ప్రతీకాత్మక చిత్రం
ఇంటర్మీడియెట్ తర్వాత ఫ్యాషన్, డిజైన్ రంగంలో కెరీర్ కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన కోర్సులు, అవకాశాల గురించి చెప్పండి?
ప్రస్తుత ట్రెండీ కోర్సుల్లో చెప్పుకోదగ్గది ఫ్యాషన్ డిజైన్. ఇందులో దుస్తుల నుంచి పాదరక్షల వరకూ... వివిధ విభాగాల్లో స్పెషలైజేషన్స్ చేయవచ్చు. ఫ్యాషన్ డిజైన్ ప్రధానంగా కంటికి ఆహ్లాదకరంగా, ధరించడానికి ఆకర్షణీయంగా ఉండే వస్త్రాలను రూపొందించే విభాగంగా భావిస్తుంటారు. వాస్తవానికి ఇందులో మనిషి ధరించే అన్ని వస్తువుల డిజైనింగ్‌కు సంబంధించిన అంశాలు ఉంటాయి. అంటే కళ్లజోడు నుంచి పాదరక్షల వరకూ.. అన్నీ ఫ్యాషన్ రంగానికి చెందినవే. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ఇందులో ఆయా విభాగాలను ఎంచుకోవచ్చు.
ఫ్యాషన్ డిజైన్‌లో.. ఫ్యాబ్రిక్ డిజైన్, డిజైన్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, కాన్సెప్ట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ యాక్ససరీ డిజైన్, ప్రింటింగ్, క్వాలిటీ కంట్రోల్, టెక్స్‌టైల్ సైన్స్, ఫ్యాషన్ మర్కండైజింగ్, మార్కెటింగ్ అండ్ కలర్ మిక్సింగ్‌పై దృష్టి సారిస్తారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు ఆధునిక ఫ్యాషన్ ప్రపంచానికి అవసరమయ్యే నైపుణ్యాలను నేర్చుకుంటారు.
ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులు.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నిఫ్ట్(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) క్యాంపస్‌ల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. అందుకోసం ఏటా నిర్వహించే నిఫ్ట్ ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణతతోపాటు సిట్యూయేషన్ టెస్ట్ తదితర ఎంపిక ప్రక్రియలోనూ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. నిఫ్ట్‌తోపాటు దేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ), ఐఐటీ బాంబే, హైదరాబాద్ తదితర ఐఐటీలు, ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఏఐఎఫ్‌డీ), ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) వంటి వాటిల్లో ఫ్యాషన్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment