
హెచ్‌సీఎల్ టెక్ లాభం హైజంప్
►54% వృద్ధితో రూ. 1,834 కోట్లు
►షేరుకి రూ. 12 డివిడెండ్
సాక్షి, న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గడిచిన ఏడాది(2013 జూలై-2014 జూన్) క్యూ4(ఏప్రిల్-జూన్)లో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 54% ఎగసి రూ. 1,834 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2012 జూలై- 2013 జూన్) ఇదే కాలంలో(క్యూ4) రూ.1,193 కోట్లను మాత్రమే ఆర్జించింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.
అప్లికేషన్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసుల విభాగాల్లో నమోదైన వృద్ధి ఇందుకు దోహదపడినట్లు కంపెనీ సీఈవో అనంత్ గుప్తా పేర్కొన్నారు. గడిచిన ఏడాది పటిష్ట వృద్ధిని సాధించామని, తొలిసారి 5 బిలియన్ డాలర్ల(రూ. 30,000 కోట్లు) ఆదాయాన్ని అందుకున్నట్లు గుప్తా తెలిపారు. ప్రస్తుత సమీక్షా కాలంలో ఆదాయం కూడా 21% పుంజుకుని రూ. 8,424 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. ఆన్‌సైట్ ఉద్యోగులకు 3%, ఆఫ్‌షోర్ సిబ్బందికి 7% చొప్పున వేతన పెంపును అమలుచేయనున్నట్లు గుప్తా చెప్పారు.