క్యూ3లో రూ. 4,591 కోట్లు
4.5–5 శాతానికి గైడెన్స్ పెంపు
షేరుకి రూ. 18 డివిడెండ్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్‌లో నికర లాభం 5.5 శాతం బలపడి రూ. 4,591 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 4,350 కోట్లు ఆర్జించింది. పూర్తి ఏడాదికి ఆదాయ ఆర్జన అంచనా(గైడెన్స్)ను తాజాగా 4.5–5 శాతానికి సవరించింది.
ఇంతక్రితం 3.5–5 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. డిమాండ్ వాతావరణంతోపాటు విచక్షణా వ్యయాలు పెరుగుతున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ పేర్కొన్నారు. దీంతో గైడెన్స్‌ను మెరుగుపరచినట్లు తెలియజేశారు. తాము అందిస్తున్న డిజిటల్, ఏఐ సేవలపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. మొత్తం ఆదాయం సైతం 5 శాతం పుంజుకుని రూ. 28,446 కోట్లకు చేరింది. త్రైమాసికవారీగా ఆదాయం 8.4 శాతం, నికర లాభం 3.6 శాతం చొప్పున వృద్ధి చూపాయి. వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ.6 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది.
ఆర్డర్లు ఓకే
క్యూ3లో హెచ్‌సీఎల్ టెక్ 2.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. క్యూ3లో 2,134 మంది ఉద్యోగులను జత చేసుకోగా.. మొత్తం సిబ్బంది సంఖ్య 2,20,755కు చేరింది. జనవరి–మార్చి(క్యూ4)లో 1,000 మందికి కొత్తగా ఉపాధి కల్పించనున్నట్లు హెచ్‌ఆర్ అధికారి ఆర్ సుందరరాజన్ తెలియజేశారు. వచ్చే ఏడాది(2025–26) ఉద్యోగులను తీసుకోవడంకంటే స్పెషలైజేషన్‌పై అధిక దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. యూఎస్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పందిస్తూ అక్కడి తమ ఉద్యోగుల్లో 80 శాతం స్థానికులేనని విజయకుమార్ వెల్లడించారు. దీంతో హెచ్1బీ వీసాలపై అతితక్కువగానే ఆధారపడుతున్నట్లు తెలియజేశారు. ఇవి ఏడాదికి 500–1,000వరకూ మాత్రమే ఉంటాయని తెలియజేశారు. వెరసి తమ బిజినెస్‌పై ఇలాంటి అంశాలు ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు.
ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు బీఎస్‌ఈలో 0.5 శాతం నష్టంతో రూ. 1,985 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment