
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ కంపెనీ ఎస్‌ఆర్ టెక్నిక్స్ నుంచి కొన్నేళ్లపాటు అమల్లో ఉండే(మల్టీ ఇయర్) కాంట్రాక్టును కుదుర్చుకున్నట్లు దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ తాజాగా పేర్కొంది. ఆర్డర్‌లో భాగంగా టెక్నిక్స్ కార్యకలాపాలను డిజిటల్ రూపేణా మార్పు చేసేందుకు అనుగుణమైన సర్వీసులు అందించనున్నట్లు తెలియజేసింది. వైమానిక నిర్వహణ, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్‌వో) సర్వీసులందించే టెక్నిక్స్ కొన్ని భాగస్వామ్య సంస్థలతో కలసి పనిచేస్తోంది.
యూరప్, అమెరికా, ఆసియా, మధ్యప్రాచ్యంలో బిజినెస్ డెవలప్‌మెంట్ కార్యలయాలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 500 కస్టమర్లకు విమానాల ఇంజిన్లు, ఎయిర్‌ఫ్రేమ్, విడిభాగాలు, సాంకేతిక మద్దతుసహా అవసరమైన(కస్టమైజ్‌డ్) సేవలు సమకూరుస్తోంది. కాగా.. హెచ్‌సీఎల్ టెక్ డీల్ విలువను వెల్లడించలేదు.